April 25, 2024

కంభంపాటి కథలు – ‘మొహమా’ ట్టం

రచన: రవీంద్ర కంభంపాటి

సర్వేశ్వరరావుదంతా అదో తరహా.. వాడు నాలుగో క్లాసులో ఉన్నప్పుడు అనుకుంటా.. క్లాసులో నాలుగు లెక్కలు బోర్డు మీద రాసి, వాటిని చెయ్యమని కుర్చీలో చిన్న కునుకు తీసిన కమలా టీచర్ గారికి ‘టీచర్ ‘ అంటూ ఎవరో పిలిచినట్టు అనిపించి మెల్లగా కళ్ళు తెరిచి ఒక్కసారి అదిరిపడిందావిడ!
ఎదురుగా మొహం మీద మొహం పెట్టి, ‘నా పెన్సిల్ ఇరిగిపోయిందండి.. చెక్కుదామంటే ఎవరి దెగ్గిరా బ్లేడు లేదంటున్నారండి’ అంటున్న సర్వేశ్వర్రావుని చూసి కోపంతో ఊగిపోయిందావిడ ‘ఆ విషయం మొహం మీద మొహం పెట్టి చెప్పాలా? బెదిరి చచ్చాను కదరా వెధవకాన ‘ అంటూ స్కేలు పుచ్చుకుని నాలుగు వాయించేసిందాడిని.
ఇదిగో ఇదే వింత అలవాటు వాడికి. ఏదైనా మాట్లాడాలంటే ఎదురుగా నిలబడి బాగానే మాట్లాడతాడు.. కానీ ఏదైనా ప్రత్యేకంగా చెప్పాలంటే మటుకు మొహం మీద మొహం పెట్టేసి మరీ చెబుతాడు. చిన్న పిల్లాడప్పుడు ఇవన్నీ చెల్లిపోయాయిగానీ పెద్దయ్యాకే ఇబ్బందులు మొదలయ్యేయి. చుట్టాల్లో, స్నేహితుల్లో మగాళ్ళు సర్దుకుపోయేవారు .. ఆడాళ్ళు మటుకు మహా ఎబ్బెట్టుగా ఫీలయ్యి.. ‘ఇదే ముక్క కొంచెం దూరంగా నిలబడి చెప్పచ్చు కదరా వెదవకానా ‘ అంటూ విసుక్కునేవారు!
ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా.. ఏదైనా పర్సనల్ విషయం చెప్పాలంటే చాలు.. వాడి ఫేసు వాడి స్వాధీనంలో ఉండేది కాదు.. మాగ్నెట్ లాగ ఎదుటి వాళ్ళ మొహం మీదకి దూసుకుపోయేది. తన వీక్నెస్సు తనకి తెలుసు కాబట్టి, ఎందుకొచ్చిన రిస్కని ఎప్పుడూ అమ్మాయిలతో మాటాడేవాడు కాదు. అన్నట్టు చెప్పడం మర్చేపోయేను..ఇదే విషయమై..వీడు కాలేజీలో చదివే రోజుల్లో రెండు మూడు సార్లు దెబ్బలు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి.
అన్ని సందర్భాలూ చెప్పుకోనక్కరలేదు గానీ.. ఈ ఒక్కటీ మటుకు చెప్పి తీరాలి.. డిగ్రీ మొదటేడాది.. వాడు రోజూ పదిహేడో నెంబరు బస్సెక్కి కాలేజీకి వెళ్ళే రోజులు.. రష్షుగా నున్న బస్సులో నుంచునున్న సర్వేశ్వర్రావుకి ఎదర కూరగాయల తట్టెట్టుకుని మొదటి సీటులో కూచున్న డెబ్బయ్యేళ్ళ ముసలావిణ్ణి చూడగానే తటాలున జనాల్ని దాటుకుంటూ వెళ్ళి ఆ ముసలావిడ మొహం మీద మొహమెట్టేసి విషయం చెప్పబోయేంతలో ఆవిడ ఫెడీల్మని వీడి చెంప మీద ఒకటిచ్చుకోవడమూ, జనాలందరూ వీడి మీద తలో చెయ్యీ వెయ్యడమూ జరిగిపోయేయి.
‘ఆవిడి చేతి సంచీ కిందడిపోయుంది.. ఆ విషయం చెబుదామని వెళ్ళేను ‘ అని చెబుతున్నా మొత్తుకుంటున్నా, ‘హన్నా..డెబ్భై ఏళ్ళ ముసిల్దాన్ని ముద్దెట్టుకుందామనుకుంటావా’ అంటూ జనాలంతా తలో నాలుగూ మొట్టేసేరు.. అఫ్కోర్సు… ఆ గొడవలో ముసలావిడ చేతి సంచీ ఎవడో చులాగ్గా కొట్టేసేడు..అది వేరే సంగతనుకోండి.
డిగ్రీ అయ్యాక ఏదో ఐటీ కంపెనీలో చేరిన సర్వేశ్వర్రావుకి.. అమెరికా వీసా కూడా రావడంతో తెగ సంబంధాలొచ్చేసేయి. వీడు ఆ అమెరికా వెళ్ళేక ఏ తెల్లతోలు పిల్లతోనో.. నల్ల తోలు పిల్లతోనో..వీడి తరహాలో మాట్లాడేడంటే అక్కడి వాళ్ళు వీడ్ని తన్ని తగలేస్తారని భయపడి, పెళ్లి చేసి అమెరికా పంపేయడవే మంచిది అని నిర్ణయించేసిన వాళ్ళ నాన్న బులుసు సోమశేఖరం గారు సంబంధాలు వెతికితే, వాళ్ళూరు పక్కనే ఉన్న మేడపాడులో ఉండే పోపూరి శివరావు గారమ్మాయి సంబంధం దొరికింది. కుర్రాడి జాతకం కుదరడంతో పెళ్ళి చూపులకి మేడపాడు పిలిచేరు
‘అక్కడికి వెళ్ళేక ఎవరి దగ్గరికీ వెళ్ళకు.. పెళ్ళి కూతురితో ప్రత్యేకంగా మాట్లాడతాను లాంటి మాటలు అసలే ఆడకు… మళ్ళీ ఆ అమ్మాయి మోహంలో మొహం పెట్టేసేవంటే పెళ్ళి చూపులమాట అటుంచు.. మనందరినీ మెడ పెట్టి గెంటేస్తారు ‘ అంటూ సోమశేఖరం గారు సర్వేశ్వర్రావుకి చెవులు తుప్పొదిలిపోయేలాగ చెప్పేరు !
‘తప్పకుండా..నాన్నగారండి.. అక్కడ అందరికీ వీలైనంత దూరంగా ఉంటాను ‘అంటూ చాలా నమ్మకంగా చెప్పేడు సర్వేశ్వర్రావు.
ఆ రోజు ఉదయాన్నే ఇంట్లో పెసరట్టుప్మా తిని, రెండు క్వాలిస్ కార్ల నిండా చుట్టాలతో మేడపాడు బయల్దేరేరు. అక్కడ పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళగానే, ఎదురొచ్చిన పిన మాంగార్ని ‘అంకుల్… ఓసారి ఇలా రండని ‘ సర్వేశ్వర్రావు పిలిస్తే, దగ్గరకొచ్చిన ఆయన మొహంలో మొహం పెట్టేసి ఏదో అడగబోతూంటే ‘ఛీ.ఛీ.. ఇలా మొహం మీదికొచ్చేస్తావేంటీ ?.. నేనలాంటి వాణ్ణి కాదు’ అంటూ సర్వేశ్వర్రావుని దూరంగా తోసేసేడు. సోమశేఖరం గారికి విషయం అర్ధమై, ఆడపెళ్ళి వారింటి నుంచి మెల్లగా బయటకి నడిచేరు ! ఉదయాన్నే పెసరట్టు తిని ప్రయాణం చేసేను కదా.. కొంచెం కడుపులో తేడా చేసి టాయిలెట్ గురించి అడుగుదామని ఆ పినామాంగారి దగ్గిరకి వెళ్ళేను తప్ప.. వేరే ఉద్దేశం ఏమీ లేదని తిరుగు ప్రయాణం లో దారంతా సోమేశ్వర్రావు మొత్తుకుంటూనే ఉన్నాడు.
అదృష్టం ఎలా తన్నుకొస్తుందో .. దురదృష్టం ఎలా తన్నవతల పడేస్తుందో ఎవరూ చెప్పలేరు. వీళ్ళు ఇలా మేడపాడు నుంచి ఇంటికి రాగానే ఓ నిడదవోలు సంబంధం సర్వేశ్వర్రావు కోసం కాచుక్కూచునుంది. ఆ ఊళ్ళోని సిద్ధాంతి వాడ్రేవు సత్యం గారమ్మాయి సుమ అని.. ఇంజినీరింగ్ చదివి..ఎప్పుడెప్పుడు అమెరికా వెళదామా అని కాసుక్కూచునుంది.
జాతకాలూ అన్నీ కుదిరేయి, సోమశేఖరం గారు సర్వేశ్వర్రావు విషయంలో జాగ్రత్త తీసుకుని, ఎప్పుడూ పక్కనే ఓ మనిషుండేలా చూసుకోవడం తో పెళ్లి తంతు శుభంగా ముగిసింది.
పెళ్ళికి ముందే తనకున్న వీక్నెస్ గురించి సుమ కి ఫోన్ చేసి మరీ చెప్పేసేడు సర్వేశ్వర్రావు.. ఆ పిల్ల..ఆఁ..ఇదీ పెద్ద విషయమేనా అనుకుంటూ పెద్దగా పట్టించుకోలేదు. ఓ నెల తర్వాత సుమకి కూడా వీసా వచ్చేక అమెరికా ప్రయాణం కట్టేరిద్దరూ !
మొదటి ఆరు నెలలు సాఫీగా గడిచిపోయేయి. ఆ రోజు సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికొచ్చిన సర్వేశ్వర్రావు హుషారుగా సుమకి ‘ ఈవేళ మా క్లయింట్ స్టెఫనీ అని ఉంది…ఆవిడ నా పని మెచ్చుకుంటూ మా మేనేజర్ కి ఈమెయిలు రాసింది.. మా మేనేజర్ కూడా చాలా సంతోషపడిపోయి.. “వచ్చేసారి ప్రమోషన్ నీకే” అంటూ ఫోన్ చేసేడు ‘ చెబితే, సుమ ‘మరి.. మీ గురించి ఇంత మంచిగా చెప్పిన ఆ స్టెఫనీ గారికి థ్యాంక్సు చెప్పేరా ?’ అని అడిగితే, నాలిక కొరుక్కున్న సర్వేశ్వర్రావు ‘హర్రె.. మర్చిపోయెనే.. రేపు తప్పకుండా చెబుతాను ‘ అని, మర్నాడు సీరియస్ గా పని చేసుకుంటున్న ఆ స్టెఫనీ దగ్గిరకి వెళ్ళి తన తరహాలో థాంక్సు చెప్పేసరికి, హడిలిపోయిన ఆవిడ గెట్టిగా గావుకేకలు పెట్టేసింది.
దిద్దుబాటు చర్యలు కింద సర్వేశ్వర్రావు కంపెనీ అతన్ని ప్రాజెక్టు లోనుంచి పీకేసి, వెంటనే ఇండియా కి పంపేసింది.
అక్కడికెళ్ళి సెటిలైపోవాలనుకుంటే.. ఏదో టూరిస్టు లాగా ఆర్నెల్లకే తిరిగొచ్చేయడం సుమ కి అస్సలు నచ్చలేదు. ఇండియా కి రాగానే ఎలాగోలా సర్వేశ్వర్రావుకున్న ఈ వీక్నెస్ పోగొట్టి, మళ్ళీ వేరే ప్రాజెక్టు ద్వారా అమెరికా తిరిగెళ్ళి పోవాలని ఒట్టెట్టుకుంది.
హైదరాబాదులో ఉన్న న్యూరాలజిస్టులని కలిస్తే.. ఇది న్యూరల్ ప్రాబ్లెమ్ కాదు. ఎవరైనా మంచి సైకాలజిస్టుకి చూపించండి అన్నారు. ‘మన కాకినాడావిడే.. బండారు శ్రీదేవిగారని సిఖ్ విలేజీలో ఉంటారు.. చాలా పేరున్న సైకాలజిస్టు’ అని తెలిసున్నవాళ్ళు చెబితే ఆవిడ దగ్గిరకి తీసుకెళ్ళింది సర్వేశ్వర్రావుని. అతన్ని పరిశీలించి.. ‘వారానికి రెండు సిట్టింగుల చొప్పున… పదహారు సిట్టింగులవుతాయి.. పూర్తిగా నయమవుతుంది…. మొత్తం సిట్టింగుల ఖర్చు ఒకేసారి కట్టేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ‘ అని ఆ శ్రీదేవిగారు చెబితే, ‘చాలా థాంక్సు డాక్టర్..ఇప్పుడే కట్టేస్తాను.. ఇవేళే ట్రీట్మెంట్ మొదలెట్టండి ‘ అని సుమ ఉత్సహంగా అంది !
ఎనిమిది వారాలు గడిచేయి.. ఆఖరి రోజున సుమ ని సర్వేశ్వర్రావుకెదురుగా కూచోబెట్టి.. ‘ఆమెకి ప్రత్యేకంగా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా?’ అని శ్రీదేవి గారడిగితే కూచున్న చోటు నుంచే ‘నా జీవితానికే స్పెషల్ నువ్వు.. నువ్వు నా భార్య కావడం నా అదృష్టం ‘ అంటూ చెప్పేసరికి, సుమ ఉత్సాహంగా చప్పట్లు కొట్టేసి, ‘థాంక్యూ మేడం.. ఇంతకు ముందు ఇదే మాట మొహం మీదికొచ్చేసి చెప్పేవారు ‘ అంటే, శ్రీదేవి గారు గర్వంగా చూసేరు.
‘అవును మేడం…,మీ ట్రీట్మెంట్ మూలాన్నే ఇదంతా.. ఇదేంటీ.. సుమ కైతే దూరం నుంచి చెప్పగలిగేను..మీతో చెప్పలేకపోతున్నానేంటీ ?’ అంటూ మొహం మీద మొహం పెట్టేస్తున్న సర్వేశ్వర్రావుని చూసి కుర్చీలోంచి వెనక్కి పడిపోయింది శ్రేదేవి డాక్టర్ గారు !

1 thought on “కంభంపాటి కథలు – ‘మొహమా’ ట్టం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *