March 29, 2024

కానుక

రచన: ప్రభావతి పూసపాటి

“లంచ్ అయ్యిందా?” అంటూ చొరవగా తలుపు తీసుకొని రాఘవరావు గారి రూమ్ లోకి ప్రవేశించారు ప్రకాష్ రావు. రాఘవరావుగారు కుర్చీలో వెనక్కివాలి కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నారు.
ప్రకాశరావు ,  రాఘవరావు ఇద్దరు చిన్నప్పటినుంచి మంచి స్నేహితులు . ఒకే గవర్నమెంట్ ఆఫీస్ లో చాలా కాలంగా కలిసి పని చేస్తున్నారు. రాఘవరావు గారు చాలా కష్టపడి , నిజాయతి తో పని చేసి ప్రమోషన్స్ తో త్వర త్వరగా పైకి  వచ్చి పెద్ద పోజిషన్ లో వున్నారు. ప్రకాశరావు ఉద్యోగరీత్యా నలుగురిలోవున్నప్పుడు రాఘవరావుగారిని గౌరవించి మాట్లాడిన ఎవరు లేని సమయంలో మాత్రం చనువుగా ఏకవచనంలో సంభోదిస్తూ వుంటారు.
రాఘవరావు గారికి ప్రమీల తో పెళ్లి అయ్యాకా ఉద్యోగ భాద్యతలు తప్పించి పెద్దగా ఏ బాదరా బందీ లేని జీవితం .  అందుకని రాఘవ రావు గారికి ఆఫీస్ ఒక లోకం అయిపోయింది.  పిల్లల చదువులు . ఉద్యోగాలు వాళ్ళ బాగోగులు అన్ని ఎక్కువ శాతం ప్రమీలే చూసుకునేది, కేవలం వుద్యోగం , ఆర్ధిక విషయాలు మాత్రమే రాఘవరావుగారు చూసుకునే వారు.
పిల్లల పెళ్లిళ్లు కూడా కిందటి ఏడాది చేసేసారు.  కూతురి పెళ్లి ప్రమీల కి మేనల్లుడు వరస ఐన మురళి తో , కొడుకు చైతన్య పెళ్లి డాక్టర్ శ్రావణి తో అయిపోయాక ఇద్దరికీ ముందే ఏర్పాటు చేసిన ఇళ్లల్లో కాపురాలు పెట్టించేసారు.
అన్ని సజావుగా జరుగుతున్న సమయం లో రాఘవ రావు గారి తండ్రి కాలం చేశారు, అనుకోకుండా జరిగిన ఈ ఘటన రాఘవరావు గారికి పెద్ద సమస్య తీసుకు వచ్చింది.
రాఘవరావు ఒక్కడే కొడుకు, వున్న ఊళ్ళోనే డిగ్రీ చదువు అయిపోయాక పై చదువుల నిమిత్తం పట్నం వెళ్ళిపోయాక , సెలవులకి రెండు మూడు రోజులు ఇంటికి రావడం తప్పఎక్కువ రోజులు తల్లితండ్రులతో కలిసి గడిపింది లేదు.  ప్రమీల తో పెళ్లి అయ్యాక కూడా ప్రమీల బలవంతం చేయటంవల్ల అప్పడప్పుడు పండగలకి రెండు లేదా మూడు రోజులు వుంది రావటం తప్పఎన్నడూ తల్లి తండ్రుల తో కలిసి వున్నది లేదు. తన అదృష్టం బాగుండి పట్నం లో పెరిగిన పిల్ల ఐన ప్రమీల తనని బాగా అర్థం చేసుకొని , తన తల్లితండ్రుల మనస్థితి తెలుసుకొని తానే ఉత్సాహంగా పిల్లలిని వూరు బయలుదేరదీసేది , అక్కడ సదుపాయాలు వున్నలేకున్నా వున్నన్ని రోజులు హాయిగా గడిపి వస్తూండేది.
ప్రమీల బాగా చదువు కొన్నది,  తెలివైనది, చురుకైనది కూడా, తాను కూడా ఒక్కతే కూతురు.  పుట్టింటి వైపు నుంచి పెద్దగా ప్రేమ,  ఆప్యాయతలు పొందలేదు అయినా కూతురుగా గాని, కోడలిగ గాని, తన ధర్మం పాటించటం లో ఎన్నడూ వెనుకంజ వేసేది కాదు ఎప్పుడూ ముందు ఉండేది.
రాఘవరావు గారి తల్లి తండ్రులు, సనాతన సాంప్రదాయాలు పాటిస్తూ, ఆధునిక జీవన విధానానికి దూరం గా వుంటూ , ఉన్న ఊరికే పరిమితం అయిపోయారు. కొడుకు ఇంట ఏ శుభకార్యనికి రాలేదు, వచ్చిన అంటీముట్టనట్టు, తమ ప్రమేయం ఏమి లేదన్నట్టు చుట్టపు చూపుగా వచ్చి వెళ్ళిపోయేవారు. ఎన్నడూ ప్రమీలకి మేమున్నాము అన్న భరోసా కలిగేలా ప్రవర్తించలేదు. ప్రమీల మాత్రం తన వలన జరగవలసిన ఏ సహాయం అయినా ముందుండి చేసేది. అందుకేనేమో ఇప్పటివరకు ఎన్నడూ కుటుంబ భాద్యతలు, పరిస్థితులు గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం రాలేదు.
ఇప్పుడు తన తల్లి వూరిలో ఒక్కత్తి ఉండలేని స్థితి, అలాగని వదిలి రాలేని పరిస్థితి , ఏమి చెయ్యాలో అన్న ఆలోచనలతో మునిగి ఉండగా ప్రకాశం”అమ్మ సంగతి ఏమాలోచించావు ?ప్రమీల ఏమన్నది ?” అన్న పలకరింపుతో ఈ లోకంలోకి వచ్చాడు.
ప్రకాశం పేరుకి సహఉద్యోగే అయినా తన గురించి, తన కుటుంబ పరిస్థితుల గురించి పూర్తిగా తెలిసినవాడు, ఆప్తుడు “. ప్రమీల తో మాట్లాడావా “అని స్నేహపూర్వకంగా అడిగాడు.
రాఘవరావు ర్రాత్రి తనకి ప్రమీలకి జరిగిన సంభాషణ మొత్తం పూర్తిగా వినిపించాడు.  ప్రమీల తన అత్తగారిని ఊరి లోనే అన్ని సదుపాయాలూ సమకూర్చి, ఇంటి లోని సగ భాగం అద్దెకి ఇచ్చి , అక్కడే ఆవిడ దూరపు చుట్టం పర్యవేక్షణలో ఉంచమంటోంది, లేదా ఇక్కడికి తీసుకొని వస్తే తమ ఇంటి దగ్గరగా వేరే ఇల్లు తీసుకొని , అన్ని సదుపాయాలు సమకూర్చి , తమ సంరక్షణలో ఉండేలా చూడమంటోంది కానీ తమ ఇంటి లో ఒకే చూరు కింద వద్దు అని ఖరాఖంఢిగా చెపుతోంది.
అందరికి ప్రేమాభిమానాలు పంచుతూ, అందరితో నవ్వుతు కలగొలుపుగా వుండే ప్రమీల అత్తగారి విషయం లో ఇంత నిక్కచిగా ఎందుకు మాట్లాడుతోందో రాఘవరావుగారికి అర్థంకావటం లేదు.
విషయము విన్న ప్రకాశం నవ్వుతు “నాకు చెల్లెమ్మ అన్నదాంట్లో తప్పుఏమి కనపడటం లేదు “అన్నాడు
“అదేమిటి నువ్వు కూడా ఆలా అంటావు . అమ్మకి నేనొక్కడినే కొడుకుని , ఇప్పుడు నేను నా ధర్మం పాటించక పొతె ఎలా ?”అన్నారు రాఘవరావు ఆశ్చర్యంగా !
అమ్మ మీద బెంగ వలన ప్రమీల మాట , మనసు నీకు సరిగా అర్థం కాలేదు, ప్రమీల నిన్ను కొడుకుగా నీ ధర్మం చేయవద్దు అనటం లేదు తనని, మీ అమ్మగారిని హాయిగా జీవితం గడిపేలా చేయమని అడుగుతోంది.
మీ అమ్మ గారి గురించే ఆలోచించు, మీ నాన్నగారు ఇంకో కొన్నేళ్లు బ్రతికి ఉంటె, నువ్వు ఇద్దరినీ తీసుకువద్దాము అని ఎప్పుడైనా అనుకున్నావా?లేదా మీకోసం మీ అవసరాలకైనా ఎప్పుడైనా రావాలని వాళ్ళు అనుకున్నారా??ఎప్పుడు మీరు వెళ్ళటం తప్ప వాళ్ళు ఎప్పుడైనా మీ అవసరాలు గుర్తించి మీకు సహాయార్థం ఎన్నడైనా వచ్చారా??ఇప్పుడు ఆవిడా అక్కడ ఉండలేని పరిస్థితి వచ్చింది కాబట్టి వస్తున్నారు . అందుకే ప్రమీల మీ అమ్మగారిని మీతోపాటు ఒకే ఇంట్లో వద్దు , ఆవిడని విడిగా వేరే ఇల్లు ఏర్పాటు చేసి ఉంచుదాము అని అంటోంది.  ఆవిడ ఆరోగ్యంగా వున్నారు, అన్ని పనులుసొంతంగా చేసుకోగలుగు తున్నారు, ఆవిడకి కావలిసింది కేవలం అండ మాత్రమే. . అది కొడుకే అవ్వాల్సిన రూలేమీలేదు. ఆవిడ భాద్యత నీదే కానీ అది మీకు బరువు గా కాకూడదు అనేది తన అభిప్రాయం .
నేను ఒక మాట అడుగుతాను చెప్పు, నువ్వు నీ కొడుకు పెళ్లి ఐన వెంటనే వేరే కాపురం పెట్టించాలి అని వాడి పెళ్ళికి ముందే అనుకున్నావు . ఎందుకు?మీ కోడలు కూడా మీ ఇంట్లోనే వుండి వయసు వస్తున్న నీ భార్యకి సహాయంగా ఉండమని అడగవచ్చు కదా!కానీ అది సాధ్యపడదు అని నీకు తెలుసు. కోడలు డాక్టర్ అందుకు తగ్గట్టు ఉండటానికి వాళ్ళు వేరే ఉంటేనే వాళ్ళకి సోకార్యంగా ఉంటుంది , వాళ్ళు మీతో కలసి ఉంటె జీవితం నువ్వు అనుకున్నంత సజావుగా జరగదని తెలిసి ముందుగానే వాళ్ళని వేరే ఉండమని చెప్పేసావు . అదే నీ తల్లి విషయము వచ్చేసరికి ఆవిడని వేరే ఉంచటం నేరం గా బావిస్తున్నావు.
పూర్వకాలం లో అంటెపెళ్లి అయ్యాక కోడలు వుమ్మడి కుటుంబం నుంచే తన సంసార ప్రయాణం సాగించేది. కానీ ప్రమీల విషయము ఆలా కాదు కదా . . . నువ్వు ఇన్నేళ్ల కాలం లో పెళ్ళాం పిల్లలతో కలసి మీ వూరు వెళ్ళింది ఎన్నిసార్లు? మీ అమ్మానాన్నలతో కలిసి వున్నది ఎన్నాళ్ళు?
అసలు ప్రమీల నాకు పల్లెటూళ్ళు పడవు, అక్కడ సదుపాయాలు లేవు కనుక నేను రాను అంటె నీవు ఏమి చేసేవాడివి?నీ తల్లితండ్రులు ఇక్కడ కు రారు, మీరు అక్కడికి వెళ్ళలేరు అవునా!కానీ ప్రమీల ఆలా అనలేదు,  తన వంతు ధర్మం ఇన్నాళ్లు పాటించింది కదా. . . ఇప్పుడు తాను కూడా వయసులో పెద్దది అవుతోంది,  తల్లి గా తన భాద్యతలు కూడా నిర్వర్తించింది, తనకి కూడా విశ్రమించే సమయం కావలి కదా, నువ్వే ఆలోచించు మన మగవాళ్లందరికి రిటైర్మెంట్ అని అనేది ఒకటి వుంది , ఇన్నాళ్లు నువ్వు చేసిన వుద్యోగంఎంత అలవాటు అయినదే అయినా నువ్వు పెద్దవాడివి అయ్యావు , ఇక విశ్రాంతి తీసుకోమని గవర్నమెంట్ వాళ్ళు అంటె మన విషయములో తప్పు కానిది. ప్రమీల అల్లాంటి విశ్రాంతి కావాలని అడిగితె తప్పు ఏమిటయ్యా???
మీ అమ్మగారి విషయానికే వద్దాము, ఆవిడ ఒక్కరు ఉండలేరు, ఆవిడకి ఏమి చేతకాదు అని నువ్వంటె,  మీ నాన్నగారు , నువ్వు చేసిన తప్పుకి భాద్యత ప్రమీల ఎందుకు తీసుకోవాలి?మీరెప్పుడైనా ప్రస్తుత కాలమాన పరిస్థితి కి అనుగుణంగా ఆవిడని సంసిద్ధురాలిని చేసారా??ఆధునిక జీవన శైలికి అనుగుణంగా ఆవిడని తీర్చిదిద్దరా??ఆవిడ నీ తల్లి కాబట్టి ఆవిడని సర్దుకోమని అనలేక ప్రమీల నీ భార్య కనుక భాద్యత అనే బరువు ని భరించాలి అని నువ్వు అంటున్నావు. అంతేనా. . . . . నీకో న్యాయం. . నీ కొడుకోక న్యాయమా ????
ప్రమీల అన్నదాంట్లో నాకు తప్పుఏమి కనపడటం లేదు, ప్రతి మనిషి బ్రతికేందుకు ఎదో ఒక విషయము మీద కానీ , వస్తువు మీద కానీ, లేదా మనిషి మీద కానీ అనుబంధం తో ఉంటేనే జీవితం సారవంతం గా సాగుతుంది . మీ అమ్మగారికి మనుషు ల మీద  అనుబంధం కన్నా వస్తువుల మీద  అనుబంధం ఎక్కువ అని కదా ప్రమీల భావన . . . . అలాంటప్పుడు ఆవిడని బలవంతంగా ప్రమీల సంసారం లో దింపే బదులు ఆవిడకి వీలు అనుకొన్నచోటె ఆవిడకి వేరే చక్కటి జీవన యానాం కల్పించవచ్చుకదా. . . ఆవిడకి తనకంటూ ఒక దినచర్య , తనదైన జీవన శైలి ఉండటం చాల అవసరం. ప్రమీల తన ముప్పయ్ ఏళ్ళ కాపురం లో తాను స్వతంత్రంగా, ఎవరి సహాయ సహకారాలు లేకుండానే గడిపిందికదా. . . ఇన్నాళ్లు తన ఇల్లు అనుకొన్నది పంచుకొని , సర్దుకొని, గడపటం కష్టం. . . ఒకటి , రెండు నెలలు ఐతె సర్దుకో అని చెప్పవచ్చు , కానీ అంతే తెలియని ప్రయాణం లో అది సాధ్యం కాదు కదా. . . .
నువ్వు ప్రమీలని సరిగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు . తను చెప్పింది సానుకూలం గా పరిశీలించు, వాళ్ళిద్దరిని సంతోషపెట్టగలిగే సామర్ధ్యం నీకే వుంది . లోకం గురించి ఆలోచించకు, మీ అమ్మగారికి ఒక మంచి ఇంటిని ఇవ్వు, నువ్వు రోజు కలిసిరా ఆవిడా మంచి చెడ్డలు చూడు, కొడుకు గా అన్ని అవసరాలు తీర్చు.  ఆవిడ చేసుకోలేని పరిస్థితి వచ్చినపుడు ప్రమీల సహాయం తో ఆవిడని కడతేర్చు . ఇన్నాళ్లు ప్రమీలని కేవలం భార్య గానే చూసావు, తన ఆంతర్యం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అప్పుడు నీకు ఉత్తమ గృహిణిగా కనిపిస్తుంది . . అంటూ గడియారం చూచి కబుర్లలో టైం తెలియలేదు అనుకోని తన సీటుకి వెళ్ళిపోయాడు.
ప్రకాశం మాటలు విన్న రాఘవరావుగారి మనసు ఆలోచనలో పడింది . నిజమే ఇన్నేళ్ల తమ కాపురంలో తనని నోరు తెరిచి ఏమి అడగలేదు.  తన మనసులోని మాట మొదటిసారిగా తెలియపరిచింది ప్రమీల . ఈ వయసులో తనకి నేను ఇవ్వగలిగిన” కానుక” కేవలం మానసిక విశ్రాంతి .  చిన్న సర్దుబాటు తమ అందరి జీవితాల్లో ప్రశాంతత తీసుకు వస్తుందన్న ప్రమీల సూచన సబబే అనిపించి తమ లొకాలిటీ లో మంచి సదుపాయాలూ ఉన్న ఇల్లు చూడమని ప్రమీలకి ఫోన్ చేసి చెప్పి తేలిక పడ్డ మనసుతో ఆఫీస్ పని లో పడిపోయారు రాఘవరావుగారు.

1 thought on “కానుక

Leave a Reply to మాలిక పత్రిక డిసెంబర్ 2020 సంచికకు స్వాగతం – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *