April 20, 2024

నిశా సుందరి ….. నా ప్రియ సఖి ….

రచన: భావన పాంచజన్య

నీడైనా నన్ను వీడిపోతుంది కానీ…
నా ఈ ప్రియ సఖి నన్ను ఎన్నటికీ వీడిపోదు.. వీడిపోలేదు

డస్సిన మేనికి శీతల వింజామరలతో
ఒడిన సేద దీర్చేను ఈ నిశా మాత ….

ప్రియుని రాకకై చుక్కల చీర కట్టి చలి వెన్నెల తడిసి
విరహాగ్నితో నిరీక్షించే విరహిణి ఈ ఇందుకాంత

శశాంకుని తన వాలుజడన తురిమి
వయ్యారామొలికించు ఈ చంద్ర కాంత

చుక్కల హారాలు గళసీమ కైసేయు
సింగారాల బంగారి ఈ తారాభూషిణి

జగమున అలమిన చీకటిని అంజనముగా జేసి
జ్ఞాన చక్షువుల వెలుగొందించు ఈ శతాక్షి

పుష్ప పరిమళాల పన్నీటి గంధాల విరజిల్లే
కుసుమ కోమలాంగీ ఈ శ్యామలాంగీ

విరిగిన మనసున చెదిరిన ఆశల అలమిన అంధకారాన్ని
కలలుగా కంటిన నింపే కలల రాణి ఈ తమస్విని

చెక్కిళ్ళ జారు నీలాలను తనలో కలుపుకుని
వెచ్చని ఓదార్పునిచ్చేను ఈ కృష్ణ సఖి

దుష్టుల దునుమాడి శిష్టుల బ్రోవు
ఆదిశక్తి మేని ఛాయ అయినది ఈ కాళి

అనంత కోటి బ్రహ్మాండాన్ని తనలో పొదవుకుని
ఏమీ ఎరుగని నంగనాచివోలె నటనమాడు ఈ నీల మేఘ వికసిత

ఉషోదయ మయూఖాలను స్వాగతిస్తూ
విశాల వీథిలో కరిగి కలిసిపోయే చక్రబేధిని

ఇన్ని సౌశీల్య సౌగంధ పరిమళాలు కల్గిన నలుపుని చూసి ..

నలుపు నలుపనుచూ భేదించదవేలనోయీ??
సప్తవర్ణాల పుట్టినిల్లు కాదా ఈ నలుపు ..!!

రాతిరన్న ఈ చిన్నచూపు ఏలనోయి …??
నెలరేడి అందాలు చూపినది కాదా ఈ రేయి !!

చీకటన్న గుబులు ఏలనోయి ..??
ఆ ఆదిదేవతల నెలవు కాదా ఈ తమస్సు …!!

నలుపు నారాయణుడు మెచ్చునన్న నానుడి నీ చెవిన పడలేదా ….???? !!!!!

నలుపన్నది అనంతానికి,
అంతులేని అందానికీ నెలవని,
ఓ మనిషీ తెలుసుకో ..
ఇకనైనా నీ భావన మార్చుకో …

1 thought on “నిశా సుందరి ….. నా ప్రియ సఖి ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *