March 29, 2024

ప్రేమ సంస్థానం .. మధూలిక

సమీక్ష: శ్రీ సత్యగౌతమి

 

ప్రియుని ధ్యానంలో అంతర్ముఖురాలైన ప్రేయసి మధూలిక

‘నేనంటూ కదులుతున్నప్పుడు

నీ అడుగులనే అనుసరిస్తున్నట్లూ

నాలో మౌనం తెరవేసినప్పుడు

నీ ధ్యాసలో ఎద రమిస్తున్నట్లు’ ….

ఈ నాలుగు వాక్యాల్లో అంతర్లీనంగా అథ్భుతంగా మధూలిక తన ప్రణయ కోరికను ఆవిష్కరించింది .

 

అంతేకాదు,

‘చిరుముద్దుతో రెప్పల కదలికలు

అలలలైనప్పుడు

మనమో దీవికి వలసపోయినట్లు ….

 

ప్రియునితో దీవి ప్రాంతాన అచటి సముద్రతీరపు అలలలో మమేకమైన మధూలిక,

‘తన కనురెప్పలపై ప్రియుని చిరుముద్దుకు తన రెప్పలు కూడా అలలుగా మారినవి’ అంటున్నది.

అక్కడితో ఆగలేదు ప్రియుని ఆటపట్టిస్తోంది మధూలిక .

 

‘ఆకాశమంత నువ్వు నాపై ఆర్తితో

దూకాలని చూసినప్పుడు

నా పూసల దండలోని పూల పరిమళం

నాకిట్టే చెప్పేస్తుంది అది ‘నీకు తెలుసా’?….” అని అంటూనే

 

నేనో సుస్వరాన్ని, ప్రబంథాన్ని, నవ్వుల్లో వెన్నెలున్నదాన్నని నీకు మాత్రంతెలీదా ‘నేను’ ఏంటో అంటూ మథూలిక ప్రియునికీ,

ప్రేమరసరాగవర్షిణి లక్ష్మీరాధిక గారు మనకు తన “మథూలిక” ప్రణయకావ్యం గురించి కవి(తా) హృదయాలకి మెత్తగా విరచించారు

 

అంతలోనే మళ్ళీ విరహము-

‘అడ్డుకోలేని’ నీ జ్ఞాపకాల మరకలు

వర్తమానానికి అతీతంగా ఉసిగొల్పుతున్నాయి,

‘చెప్పు … ఎప్పుడొస్తావ్, నీగుసగుసల సంగీతంవినా’ లంటూ మారాంచేస్తూ గారాలుపోతోంది మధూలిక!

కనురెప్పలపై రాసుకున్న ప్రియుని కావ్యాలు రెప్పల మడత విప్పితే ఎక్కడకందిపోతాయో అని మనసుతోనే మధుమాలికలను చదివిందిట.

ఒకసారి ‘నీ కోసము’ ఏమేమి చేస్తున్నానో చూడు అని ప్రియునికి చెప్పుకుంటుంది మధూలిక. మరోసారి
‘నువ్వెక్కడ సంచరిస్తున్నావో’ అని మదిని చిక్కబెట్టుకొని ప్రశ్నిస్తూ…జాడతెలియని ప్రియునికోసము కాలాలు కాలాలు నిరీక్షిస్తూ నీలోనే చేరి నిన్నే అనుసరిస్తున్నానుగా అని సమాధానపరుచుకుంటుంది చివరికి ‘నీ నేను’ అని పేరు మార్చుకొని మధూలిక.

………
లక్షీ రాధిక గారి పదాల కూర్పు మల్లెలతో మాలకట్టినట్లున్నది కదూ…, మళ్ళీ ఇది చూడండి.

‘అప్పటిదాకా నిద్రించిన స్వరాలు

ఒక్కోటీ నిశీథిని చీల్చుకు బయటపడ్డట్టు ‘ – ‘నిదురమబ్బు కోసం’ అనే కావ్యంలో ఒక తునక.

‘ఈ రోజుకి సూర్యోదయముందోలేదో తెలియదుగానీ,

తన తలపుకతో నాకైతే రసోదయమయింది’ అంటూ మథూలిక తనలో వెలసిన ప్రేమను ధ్యానిస్తోంది. తన ప్రేమకు కాలంతో పనిలేదంటోంది.

మధూలిక ప్రేమ, ప్రియునికి మాత్రమే సొంతంకాదు, ఆమె ప్రకృతి ఆరాధకురాలు అందుకే ప్రియుని అంతగా ప్రేమించగలుగుతోంది .

లక్ష్మీరాథిక కవిత్వంలో వర్షం పడేముందు ఆకాశం, సూర్యకిరణాల రంగులతో కొత్త చీరలు నేసుకొని కట్టుకుంటుంది ఆచీరలరంగుల వైనాలకు మథూలిక ఏమి చెప్తోందంటే … ‘మంకెన పువ్వులు, పగడపువ్వులు, కుంకుంపువ్వులు ఎర్రనై పుట్టించిన సెగలన్నీ కడిగేస్తూ సంపెంగల చలికి చల్లగాలి పాటపాడింది’ అని. ‘వానొచ్చిన ప్రతిసారీ ‘ ఓపక్క తడిచిన పూల బరువెక్కువయ్యి ఆవహించిందీ విరహం, విరహాన్నిమించిన వేదనేదో ఎదలో తొలిముద్దు హాయిని తోసుకొస్తోందీ” … అని మధూలిక అంటుంటే ఆమాటలకి వానలో తడిసిన చినుకులన్నీ వయ్యారులైనట్లినిపించింది నాకు . 🙂 ‘మౌనానికి ఊహలూగడంతెలిసినట్లుందీ’ అన్న మధూలిక మాట అక్షరాలా నాలో నిజమయ్యింది.

ప్రేమసాగరాన్ని తవ్వి చూసిన అనుభవంతో తన వేదాంతసారాన్ని ఇలా చెప్తోంది … ‘ఏకాంత పరిష్వంగంలో నిన్నూనన్నూ కలిపిన శూన్యమీపాటికి తీరందాటేసిందీ, జీవితంతప్పిపోయి చాన్నాళ్ళయిన జ్ఞాపకాలతో’ .. అని

ప్రేమ సంస్థానాదీశురాలు మధూలిక? లక్ష్మీరాధిక?

………….

ప్రేమ అనేది ఒక సిద్ధత్వం. ఈ సిద్ధిని పొందినవారు అరుదుగా మనకు తెలుసు. గోదాదేవి శ్రీరంగనాధునికోసం, రాధ శ్రీకృష్ణునికోసం చేసిన ప్రణయారాధనలు, శ్రీవేంకటేశ్వరుడు, శ్రీదేవి భూదేవిలపై అన్నమయ్య విరచించిన ప్రణయ కావ్యాలు మనకు జ్ఞప్తికొస్తాయి. అంతేకాదు మీనాక్షీ, సుందరేశ్వరుల ప్రేమారాధన కూడా ఒక అపురూప రససిద్ధి. ప్రేమ దైవాంశం. అందుకే వెన్నెలలా ప్రేమ చల్లనైనది. ప్రేమలో వున్న మనసుకూడా ఆ చల్లదనాన్నే కలిగి వుంటుంది. అందుకే యోగులు కూడా ప్రపంచము యందు ప్రేమను కలిగి వుండ మంటున్నారు.  ప్రేమలో వెలుగుంటుంది ఆ వెలుగులో నీ ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది, ప్రేమ చిహ్నమైన దేవుడ్నీ చూడగలవు.

ఇట్టి దైవదత్తమైన సంపదను కలిగివున్న సిరి (లక్ష్మీరాధిక) కి నా మన:పూర్వకాభినందనలు. మధూలికను చదువుతున్నప్పుడు జాబిలికి ఉయ్యాలకట్టుకొని ఊగుతూ ఒక్కొక్క కావ్యాన్ని ఆశ్వాదిస్తున్నాను. మరి మీరూ ????

 

kinge.com లో ఈ ప్రబంధాన్ని ఆస్వాదించవచ్చు

 

 

 

1 thought on “ప్రేమ సంస్థానం .. మధూలిక

Leave a Reply to మాలిక పత్రిక డిసెంబర్ 2020 సంచికకు స్వాగతం – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *