March 29, 2024

బందీలైన బాంధవ్యాలు

రచన: డా. కె. మీరాబాయి

కూరగాయలు, ఇంటికి కావలసిన సరుకులు కొనుక్కుని ఇంటి దారి పట్టిన రమణకు పిచ్చికోపం వచ్చింది.
రెండు చేతుల్లో నిండుగా ఉన్న సంచీలు మోస్తూ నడవడం వలన ఆయాసం వస్తోంది. వూపిరి ఆడకుండా చేస్తూ ముక్కును నోటిని కప్పిన మాస్క్ ఒకటి. చెమటకో ఏమో ముక్కు మీద దురద పెడుతోంది. మాస్క్ పీకి పారేసి గోక్కొవాలని వుంది. కానీ భయం. చుట్టూ జనం వున్నారు. ఎక్కడినుండి వచ్చి మీద పడుతుందో కరోనా భూతం అని భయం. అసలే చేతులు కడుక్కోకండా ముక్కు, కళ్ళు ముట్టుకోవద్దని పదే పదే చెబుతున్నారు కూడా.
“ చీ! ఏం బ్రతుకు ఇది? ఒకే శరీరంలోని చేతిని చూసి మూతి భయపడే రోజులు. ఇరుగు పొరుగుతో మాట్లాడాలంటే భయం. పనిమనిషిని ఇంట్లోకి రానివ్వాలంటే భయం. గుమ్మం ముందుకు వచ్చిన సహోద్యోగిని లోపలికి పిలిచి, కూర్చోబెట్టి, కప్పు కాఫీ ఇవ్వలేని పరిస్థితి.
పిల్లలను స్కూలుకు పంపడానికి లేదు. చదివి వూళ్ళేలక పోయినా, బతికి బాగుంటే చాలు అనుకోవాల్సి వస్తోంది. వాళ్ళకు ఆన్ లైన్ పాఠాల కోసం స్మ్మార్ట్ ఫోను ఒక అనవసర ఖర్చు. గంటలు గంటలు దానిముందు కూర్చుని శారీరక శ్రమ లేకపోవడం వలన పిల్లలు బరువు పెరుగుతున్నారు. వాళ్ళకు గంట గంటకూ తినడానికి చేసి పెట్టలేక వాళ్ళ అమ్మ, తన ఇల్లాలు అయిన సరోజ అలసిపోతోంది. దానికన్న భయపెడుతున్న విషయం పాఠాలతో బాటు పిల్లలకు బూతుపాఠాలు ఎక్కడినుండో వస్తున్నాయన్న వార్తలు బెంబేలెత్తిస్తున్నాయి. వాళ్ళమీద ఒక కన్నేసి వుంచాలిట.
ఒక పండుగ లేదు సంబరం లేదు. ఎవరు నోరు విప్పినా ‘ఫలానా వాళ్ళకు కోవిడ్ అట. అయిదు లక్షలు కడితే గానీ హాస్పిటల్లో అసలు చేర్చుకోమన్నారట. ‘ అనో, ‘పాపం ఇంకా అరవై నిండ లేదు. రెండు రోజుల్లో అంతా అయిపోయింది. కడసారి చూపులు కూడా లేవుట. అటునుండి అటే. ‘ లాటి మాటలు తప్ప మరొక విషయం లేదు. నలుగురితో మంచిగా వుండండి అని పెద్దవాళ్ళు ఎందుకు అంటారో ఆ నలుగురి చేతులమీద పోయే అదృష్టం కూడా లేకుండా చేస్తోంది ఈ రోగం.
మనసులో గుబులు రేపుతున్న ఆలోచనలతో ముక్కు మీది దురద సంగతి మరిచిపోయి ఇంటికి చేరాడు రమణ.
” ఆ సంచీలు అక్కడ పెట్టి వచ్చి చేతులు సబ్బుతో కడుక్కోండి. ” మామూలుగా అయితే గుమ్మంలోకి వచ్చి బరువు అందుకునే భార్య దూరంగా నిలబడి అంది.
ఇప్పుడు అసలు చాకిరీ ఆవిడది. కూరగాయలు వుప్పునీటిలో వేసి కడగడం, సరుకుల పొట్లాలు శానిటైసర్ వేసి తుడవడం, ఆయనగారు విడిచిన బట్టలు సబ్బు నీటిలో వేసి వుతకడం అయ్యేసరికి నడుము నొప్పి వచ్చి నొప్పి మందు రాసుకోవడం.
ఈ కరోనా భయం మొదలయినప్పటినుండీ పనిమనిషిని, చాకలిని రావొద్దని చెప్పేసారు. అన్ని పనులూ సరోజ మీదనే పడ్డాయి. పని మానిపిస్తే వాళ్ళెలాగ బ్రతకడం అని వాళ్ళకు జీతమైతే ఇస్తూనే ఉన్నారు. ఇంట్లో వున్నప్పుడు తనకు చేతనైనంత సహాయం చేస్తాడు రమణ.
ఐ టి వుద్యోగాల్లో వున్న అదృష్టవంతులు ఇళ్ళ నుండే పని చేస్తున్నారు గానీ బ్యాంకులు, ఆఫీసుల్లో చేసేవాళ్ళు భయంగానే వెళ్ళాల్సి వస్తోంది. ఆ రోజు ఆదివారం గనుక భోజనం చేసి విశ్రాంతిగా పడుకున్నాడు రమణ.
వంటింట్లో పని ముగించుకుని సరోజ వచ్చింది.
“ పొద్దున్న మీ అమ్మగారు ఫోన్ చెసారు. బజారుకు వెళ్ళినప్పుడు మీరు ఫోను తీసుకు వెళ్ళడం మరచిపోయారు”.
చటుక్కున లేచి కూర్చున్నాడు రమణ.
” అమ్మకు ఆరోగ్యం బాగానే వుంది కదా?” ఆతృతగా అడిగాడు.
” ఆ. ఆవిడ బాగానే వుంది. ” సరోజ ముఖం ముడుచుకుని అంది.
” అన్నయ్య వాళ్ళు అంతా కులాసానే కదా?”
రమణ అన్న పాండురంగ అతనికన్న పదేళ్ళు పెద్దవాడు. బెంగుళూరులో వుద్యోగంలో వున్నాడు. రమణ తండ్రి బ్రతికి వున్నప్పుడు అమ్మా, నాన్నా రమణ దగ్గర కొన్నాళ్ళు, పాండురంగ దగ్గర కొన్నాళ్ళు వుండేవాళ్ళు. తండ్రి కాలం చేసాక తల్లి పెద్దకొడుకు దగ్గరే వుంటూంది. పాండురంగ కూతురు భర్తతో పూనాలో ఉంటుంది. కొడుకు హాసన్లో పనిచేస్తున్నాడు.
” ఆయనకే కోవిడ్ పాజిటివ్ అన్నారుట. ” సరోజ నెమ్మదిగా చెప్పింది.
ఒక్క వుదుటున లేచి కూర్చున్నాడు రమణ ” అయ్యో! ఎంత పని జరిగింది? ఇప్పుడా చెప్పడం? అన్నాడు కోపంగా.
” ఆయాసపడుతూ ఇంటికి రాగానే చెప్పమంటారా? ఏం చేస్తారు? పరిగెత్తుకుని వెడతారా? వెళ్ళాలని వున్నా మీ ఆరోగ్యం ఫణంగా పెట్టి పోలేరు కదా. ఆయనకు లక్షణాలు ఏమీ లేవుట. ఇంట్లోనే రెండువారాలు క్వారెంటైన్లో వుండమన్నారట. ఏవో మందులు వేసుకోమన్నారట. ఆయనను గది దాటి బయటకు రాకుండా వుంచారు. కాఫీ, టిఫిను, భొజనం అన్నీ అక్కగారు ఆ గది ముందు వుంచున్నారట. ముగ్గురూ ఇంట్లో కూడా మాస్కులు వేసుకునే వుంటున్నారట. ” అన్నది సరోజ.
“ముందా ఫోను అందుకో. మాట్లాడుతాను. ” తొందరపెట్టాడు రమణ.
“ దేవుడి దయవలన అన్నయ్యకు ఇంట్లో వుండి మందులు వేసుకోవడంతో తగ్గిపోతే ఫరవాలేదు. హాస్పిటల్ అన్నారంటే మాత్రం నేను వెళ్ళాల్సివస్తుందేమో.. ఖర్చులూ అవీ… ” రమణ కంగారు పడుతూ అన్నాడు.
“చెప్పేది నిదానంగా వినండి. ఇంతకీ మీ అమ్మ గారు ఫోన్ చేసింది ఎందుకని అడగరేం?”
” కొడుకుకు కోవిడ్ అంటే ముసలావిడ బెంగ, భయం తట్టుకోలేక మనసులో దిగులు దింపుకోడానికి చేసి వుంటుది. సహజం కదా. ” రమణ తల్లిమీద జాలితో కరిగిపోతూ అన్నాడు.
“అదికాదు. అక్కడ ఉండడానికి ఆవిడకు భయంగా వుందిట. ఆ ఇంట్లో వుంటే తనకూ సోకుతుందేమో అని భయపడుతున్నారు. మన దగ్గరకు వచ్చేస్తాను అంటున్నారు. ” సరోజ గొంతులో అయిష్టత స్పష్టంగా ధ్వనించింది.
ఒక పక్కన కొడుకుకు ఈ ప్రాణాంతకమైన జబ్బు అంటుకుని అవస్థ పడుతుంటే, కోడలికి ధైర్యం చెప్పి సాయంగా వుండాల్సిన మనిషి అత్తగారు. డెబ్భై ఏళ్ళవయసులో ముందు తన ప్రాణం కాపాడుకోవాలని ఇక్కడికి వస్తానని అనడం సరోజకు అస్సలు నచ్చలేదు. ఆ వైరస్ తనకు ఎక్కడ సోకుతుందో అని భయపడిన ఆవిడ, ఇక్కడ పసివాళ్ళు అయిన ఇద్దరు మనవళ్ళ క్షేమం గురించి ఆలోచించక పోవడం చికాకు కలిగిస్తూంది.
“ఇక్కడికా?” ఎటూ చెప్పలేనట్టు అన్నాడు రమణ.
“ఇప్పుడు కాలం ఎలా వుంది? బంధువులను, కావలసిన వాళ్ళను ఇంటికి రమ్మని ఆదరించే పరిస్థితి వుందా?భార్య భర్త, తల్లి బిడ్డ కూడా దూరంగా ఒకరి ఊపిరి ఒకరికి తగలకండ ఉండాల్సిన విపరీత కాలం. ” సరోజ మాటలకు చివ్వున తలెత్తి చూసాడు రమణ.
” అమ్మ అంటే బంధువు, కావలసిన మనిషి కాదు. ” రమణ అడ్డుకున్నాడు.
“ బావగారికి కరోనా అని తెలిసాక కొడుకు, కూతురు కూడా రిస్క్ అని చూడడానికి కూడా రాలేదు. ఫోనులోనే ధైర్యం చెబుతున్నారుట. మన పిల్లలు ఇద్దరూ చిన్నవాళ్ళు. అక్కడ వాళ్ళది రెండు పడక గదుల ఇల్లు. ఈవిడకే ఒక గది ఇచ్చేసారు. మనం వుంటున్నది ఒక్క పడకగది ఇంట్లో. అక్కడ బావగారితో దగ్గరగా మసలిన ఆవిడ ఇక్కడకు వస్తే పిల్లలకు ఏమైనా.. ”
” ఆపు. అపశకునం మాటలు పలకకు. అమ్మను కొన్నాళ్ళు ఆగమంటాను. తరువాత ఆవిడకూ కోవిడ్ పరీక్ష చేసి నెగెటివ్ వస్తే అప్పుడు రావొచ్చునని చెప్తాను. ” లోగొంతుకతో అన్నాడు రమణ.
“ఆవిడ వినేలా లేరు. ‘పెద్దవాళ్ళకు కరోనా అంటుకుంటే బ్రతకడం కష్టం అంటున్నారు జనం. నేను ఇక్కడ ఒకరోజు కూడా వుండను. వొచ్చి పిలుచుకు పొమ్మని వాడికి చెప్పు. ‘ అన్నారు. సరోజ నిలబడలేనట్టు మంచం చివర కూలబడింది.
“నాన్నా! మా హోంవర్క్ అయిపోయింది కాసేపు బయట ఆడుకుంటాం. ” రమణ కొడుకులు పదేళ్ళ వాసు, పన్నెండేళ్ళ సాయి గదిలోకి దూసుకు వచ్చి ఇద్దరూ ముక్తకంఠంతో అడిగారు.
“బయట వొద్దులే. ఇంట్లోనే కేరంస్ ఆడుకోండి. నాన్నను విసిగించకండి. వెళ్ళండి. ” గద్దించింది సరోజ.
“పాపం అమ్మ! వస్తాను తీసుకువెళ్ళరా అని నోరువిడిచి అడుగుతుంటే కాదనేది ఎలా? కానీ తండ్రిగా ఈ పసివాళ్ళను కాపాడుకోవాల్సిన బాధ్యత నాదే. “రమణ రెండుచేతులతో నుదురు నొక్కుకుంటూ హీనస్వరంతో అన్నాడు.
“ ఆవిడ వస్తానని అనడం బాగానే వుంది గానీ అసలు బెంగుళూరికి అనంతపురానికి బస్సులు తిరిగితే కద? కారులో తీసుకురావడం కష్టమే. పైగా అంత ఖర్చు భరించలేము కూడా. ఇక్కడికి వచ్చాక ఆవిడనూ క్వారెంటైన్ లో వుండమంటారేమో చూడండి. అంతకన్నా ఆమె అక్కడ ఉండడమే మేలు కదా. ఇక్కడ పిల్లలకూ, మనకూ క్షేమం. ” సరోజ నచ్చచెబుతున్నట్టు అంది.
“నేను ఆఫీసు పనిమీద వూరు వెడుతున్నాననీ, నువూ, పిల్లలు మీ నాన్న గారిని చూసి రావడానికి కర్నూలు వెళ్లుతున్నారని, వారం తరువాత వచ్చి తీసుకు వెడతానని చెప్తాను” నీరసంగా అన్నాడు రమణ.
“ఆ పని చేయండి. అత్తయ్యగారిని అక్కగారికి కూడా దూరంగా మసలమని చెప్పండి. తరచుగా చేతులు కడుక్కుంటూ వుండమనండి. అల్లం, మిరియాల పొడి, తులసి ఆకులు టీ చేసుకుని, తేనె కలుపుకు తాగమనండి. జాగ్రత్తగా ఉంటే ఏమీ భయపడాల్సిన పని లేదని నచ్చ చెప్పండి. ఏం చేయగలం? ఆవిడ ఎంత ముఖ్యమో మన పిల్లలను కాపాడు కోవడం మనకు అంతే ముఖ్యం కదా. కరోనా భూతం భయంతొ బాంధవ్యాలు బందీలైపోయాయి. పరిస్థితులకు తలవంచక ఏంచేయగలం?. ” సరోజ భర్తకు ఫోను అందించింది.
ప్రస్థుతానికి గండం గడిచినందుకు ఆమె మనసు తేలిక పడింది.

———. ———— ———— ————

1 thought on “బందీలైన బాంధవ్యాలు

  1. ఇటువంటి క్లిష్టమైన సమస్యలు ఎదుర్కడం
    చాలా కష్టం. ఆపధర్మంగా ఆయనతీసుకొన్న
    నిర్నయం తప్ప పరిష్కార మార్గాలుండవు.
    ప్రస్తుత పరిస్తితికి అద్దం పట్టినట్టుంది కధ.
    రచయతకి అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *