March 29, 2024

మలేషియ విహారయాత్రలు ( పెనాంగ్)

రచన: నాగలక్ష్మీ కర్రా

ఈ సంచికలో “పెనాంగ్” లో కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

పెనాంగ్ కి దగ్గర గా చాలా చిన్న చిన్న అంటే మహ అయితే ఓ ఎకరం విస్తీర్ణం ఉన్న ద్వీపాలు కూడా ఉన్నాయి. కొన్నిటికి పేర్లు ఉన్నాయి, పేరులేని ద్వీపాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని ప్రతీ నెలా వచ్చే ఆటూపోట్లకి మునిగి తేలుతూ ఉంటాయి. మా నివాసానికి ఎదురుగా అలాంటి ద్వీపం ఉండేది. ఓ నాలుగు వృక్షాలు చిన్న ఇల్లు ఉండేవి, ప్రతీ నెలా నాలుగు రోజులు నీటిలో ఉండేవి. ఆ ఇంట్లో మనుష్యులు ఎలా ఉంటున్నారో నాకైతే అర్ధమయేదికాదు. అప్పుడప్పుడు మనుషులు ఆ ద్వీపంలో కనిపించేవారు.
అలాంటిదే మరో ద్వీపం మా బాల్కనీలోంచి కనిపిస్తూ ఉండేది. ఓ మోస్తరుగా ఉండేది. సుమారు ఓ నాలుగైదు యెకరాలు వుంటుందేమో?, పచ్చగా బాగా దట్టమైన అడవిలాఉండేది. “పెంతయి జెరజాక్” అనేవారు. జెరజాక్ అంటే జైలు, ఆంగ్లేయుల కాలంలో మన అండమాన్ జైలులా దీనిని వాడేవారుట. దాని తరువాత అలాగే పాడు పెట్టేరు. పెనాంగ్ ద్వీపం నుంచి అక్కడకి వెళ్లడానికి ప్రయాణ సాధనాలు లేక వెళ్లలేక పోయేం. కాని అక్కడి అడవి, అందులోంచి రాత్రి పగలు వినిపించే పక్షి, జంతువుల కూతలు మమ్మల్ని ఆకట్టుకొనేవి. రోజూ మా బాల్కనీలోంచి చూస్తూ అక్కడకి వెళ్లగలిగితే బాగుణ్ణు అని అనుకుంటూ వుండేవాళ్లం.
ఓ రెండేళ్ల తరువాత ఓ రోజు లాంచి ఆ ద్వీపం చేరడం చూసేం. మనుషులు ప్రయాణిస్తూ కనిపించేరు. మేము మా ఫ్రెండ్స్ ( మన దేశస్థులే, మావారు పనిచేస్తున్న కంపెనీలోనే పనిచేసేవారు ) వారితో కలిసి అక్కడకి వెళ్లేం. ఆ ద్వీపానికి ప్రతీ గంట గంటకీ లాంచీ సర్వీస్ ఉంది. ఏవేవో హోటల్స్ వచ్చేయి. మసాజ్ పార్లర్లు ఏర్పాటు అవుతున్నాయి. ద్వీపం లోపల తిరగడానికి ప్రయాణ సాధనాలు లేవు, కొందురు చైనీయులు సైకిళ్లు తెచ్చుకొని తిరుగు తున్నారు. ఎంతైనా మనకన్నా తెలివైన వారు కదా?, మేము నడవగలిగినంత దూరం నడిచి ప్రకృతిని అనుభవించి బీచ్ లో కూర్చున్నాం, సైకిళ్ల మీద వెళ్లిన చైనా వాళ్లుకూడా ఓ గంట తరువాత బీచ్ కి వచ్చేరు. మాకు ఎక్కడా జైలు లాంటిది కనబడలేదు, వారు ద్వీపం మొత్తం తిరిగారు కాబట్టి వారిని అడిగేం జైలులాంటి కట్టడం ఏమైనా చూసేరా? అని, అలాంటి కట్టడాలు ఏమీలేవట, మరి ఖైదీలను ఈద్వీపం మీద వదిలేసేవారో లేక కట్టడాలు సముద్ర అలల తాకిడికి నేలమట్టం అయిపోయేయో మరి. మా చైనీయులు అందించి సమాచారం మరో ఆరునెలలు మాత్రమే ఈ ద్వీపానికి రాగలమని, తరువాత ఓ రోజు గడపాలంటే ముందుగా అంటే బోటు టికెట్స్ తో పాటు ఆ ద్వీపంలో గడపడానికి ముందుగానే డబ్బులు చెల్లించాలని, పిక్నిక్ లా మన భోజనం తీసుకొని రావడానికి కుదరదని, కాబట్టి ఈ ఆరు నెలలలో వీలైనన్ని సార్లు వచ్చి ఇక్కడ గడపాలని వారి ఆలోచన. వీరు ప్రతీ వీకెండుకీ ఎక్కడకైనా వెళ్లే అలవాటు వారికి, ఎక్కడకీ వెళ్లలేక పోతే ఇంటి ఎదురుగా ఉండే పార్కుకి వెళ్లి సాయంత్రం దాక గడిపిఇంటికి వెళ్లిపోయేవారు. నిజంగానే వారు చెప్పినట్లుగానే “పెంతై జెరజాక్ “ ఓ మంచి ఔటింగ్ స్పాటుగా తీర్చి దిద్దబడింది, అలాగే అందులోకి వెళ్లడానికి మూడువేల రూపాయలు ప్రవేశ రసుముగా పెట్టేరు. ఆ ద్వీపంలో అంతకన్నా చూడ్డానికి ఏమీలేదు

మలేషియన్ కరెన్సీని ‘ రింగెట్ ‘ అంటారు అప్పట్లో మన పదకొండు రూపాయలు ఒక రింగెట్ తో సమానం. ఒకటి, రెండు, ఐదు, పది, ఇరవై, యాభై, వంద రింగెట్ల నోటు మాత్రమే ఉండేవి. స్థానిక తమిళులు ‘ విల్లి ‘ అనేవారు. నెలసరి సరుకులు ఓ యాభై అరవై రింగెట్స్ లో అయిపోయేవి. కూరలు మాత్రం నెలకు ఓ వంద రింగెట్లు అయేవి. పెనాంగ్ లో లిటిల్ ఇండియాలాగే చైనీస్ మార్కెట్ వుండేది. అక్కడో సెల్ ఫోను టివి ప్రోగ్రామ్స్ కేచ్ చేసేది కొన్నాను. ఇది 2003 నాటి మాట. మనకి మామూలు ఫోను నంబరు కన్పించే సెల్ ఫోన్స్ కాలంలో అన్నమాట. 3000 రూపాయలకు కొన్నాను. 2010 వరకు దానిని వాడేను. మన దేశంలో కూడా టివి ప్రోగ్రామ్స్ కేచ్ చేసేది. చిన్న స్క్రీను మీద బొమ్మలు చూడ్డం తమాషాగా ఉండేది.
పినాంగ్లో అతి యెత్తైన కట్టడం “కోమ్ తార్ “, దీనిని కట్టినప్పుడు ఇది మలేషియాలోనే కాక మొత్తం ఆసియా దేశాలలోనే అతి ఎత్తైన కట్టడంగా ఉండేది. తర్వాత తర్వాత నిర్మించబడ్డ కట్టడాలు ఇంకా ఎత్తుగా కట్టడంతో ప్రస్తుతం ఆసియాలో పదవ స్థానాన్ని, మలేషియాలో ఆరవ స్థానాన్ని దక్కించుకుంది. స్వతంత్ర మలేషియ రెండవ ప్రధానమంత్రి “తున్ అబ్ధుల్ రజాక్ “ చే 1974 లో శంకుస్థాపన జరిగి అతని గౌరవార్దం నిర్మింపబడ్డ కట్టడం. దీని ఎత్తు సుమారు 248.7 మీటర్ల, 68 అంతస్థలలో నిర్మించబడింది. ఈ కట్టడంలో జిల్లా పరిపాలనా కార్యాలయాలతో పాటు, నిజ వాణిజ్య కార్యాలయాలు, షాపులు మాల్స్, నివాసాలు ఉన్నాయి.
దీని నిర్మాణానికి గాను కావలసిన 11 హెక్టార్ల చదరపు నేలను కేటాయించినపుడు చాలా నివాసాలు, మందిరాలు నేలమట్టం గావించబడ్డాయి. దీని పై అంతస్థులో “రైన్బొ స్కై వాక్ “ నడపబడుతోంది. ఈ ప్రాంతం ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. దీనిని ఆనుకొని ఉన్న బహుళ అంతస్థుల పార్కింగ్ మరో ఆకర్షణగా ఉండేది. గుండ్రంగా కారులో తిరుగుతూ పార్కింగ్లో కి వెళ్లి కారు పార్క్ చెయ్యడం అప్పట్లో అదో అనుభవం.

కిక్ – లాక్ -సి ( రామ vi )—–
ఇది మలేషియాలో వున్న పెద్ద బౌద్దమందిరం. ఈ మందిర నిర్మాణానికి కావలసిన ధనసహాయం మలేషియాలోని 5గురు చైనీ వ్యాపారవేత్తలు అందించేరు. ఈ మందిరం సముద్రానికి ఎదురుగా ఉన్న ఓ గుట్టమీద కట్టబడింది. ఎయిర్ – ఇతేమ్ కి పక్కగా ఉంటుంది. ఎయిర్ ఇతేమ్ కి వెళ్లినపుడు చూసి దేవుడి మందిరమా? కాదా? తెలుసుకొని వెళ్లేం. చాలా మంది బౌద్ధ బిక్షువులు అటూ యిటూ తిరుగుతూ కనిపించేరు. చైనా, థైవాన్, హాంగ్ కాంగ్, ఫిలిపైన్స్, థాయ్ లాండ్ వారికి యిది పవిత్ర స్థలం.
బయట పెద్దపెద్ద మూడు విగ్రహాలు కిరీటాలతో ఉన్నవి పిశాచాల రాజు అతని అనుచరులవి. బయట తీర్చి దిద్ది నట్లున్న ఉద్యానవనం చాలా బాగుంది. ప్రతీ చెట్టుకొమ్మకి, లోపల ప్రతీ స్థంబానికి కట్టిన ఎర్రని లాంతర్లు ఎంత ముచ్చటగా వున్నాయో. 7 అంతస్థులలో వున్న పగోడా, మొదటి రెండతస్థులో చైనా శిల్పకళ, దానిపైన మూడంతస్థులు థాయి, ఆపైన బర్మీస్ శిల్పకళను చూడొచ్చు. ఈ మందిరం మహాయాన బౌద్ధమత తెగకు చెందినది.
లోపల మందిరంలోకి అడుగుపెట్టానే ఎన్నో విగ్రహాలు, కంచువి వున్నాయి. పదివేల బుద్ధ విగ్రహాలేకాక బోధిసత్వుని విగ్రహాలు, బౌద్ధ బిక్షువుల విగ్రహాలు ఉన్నాయు. గర్భగుడిలో వున్న పెద్ద బుద్ద విగ్రహాన్ని అప్పటి థాయ్ ల్యాండ్ రాజైన “ భూమి భోల్ “ ఈ మందిరానికి కానుకగా ఇచ్చేడు. 2002 లో ఇంతకు ముందు వున్న “ కాన్ ఇన్ “ దేవత ప్లాష్టర్ ఆఫ్ పేరిస్ విగ్రహం ఈ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పాడయిపోగా దాని స్థానంలో 30.2 మీటర్ల ఎత్తైన కంచు విగ్రహాన్ని ప్రతిష్టించేరు. కిందన సుమారు రెండు మీటర్ల ఎత్తున్న కంచు “కాన్ యిన్ “ దేవతల విగ్రహాలున్నాయి. ఈ మందిరాన్ని పదివేల బుద్ద విగ్రహాల మందిరం అని కూడా అంటారు. మనకి కోటి లింగేశ్వర మందిరంలాగా వీరికి పదివేల బుద్ద మందిరం అయివుంటుంది. చైనా జాతకం ప్రకారం వారికి ఉన్న పన్నెండు రాశులకు సంభందించిన జంతువుల కంచువిగ్రహాలు కూడా ఉన్నాయి. థాయ్ లాండ్ రాజైన రామ -6 ఈ మందిర శంకుస్థాపన చెయ్యడం వల్ల దీనిని రామ -6 మందిరం అనికూడా అంటారు. థాయ్ లాండికి చెందిన బౌధ్ద భిక్షువులు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తారు.
ప్రతీ ఏడాది వందలాది థాయి బౌద్దులు ఇక్కడకి వస్తారు. చైనా సంవత్సరాదికి ఈ మందిరంలో 30 రోజులు దీపాలంకరణ చేస్తారు. దీనిని దీప సముద్రంగా వ్యవహరిస్తారు. ఆ 30 రోజులు దీపాలంకరణ చూడ ముచ్చటగా వుంటుంది.
ఇక్కడ థాయ్ లాండు, మలేషియ బౌద్దులు గురించి కాస్త తెలుసుకుందాం. ప్రతీ బౌద్ధమతానికి చెందిన మగవారు వివాహానికి ముందు కనీసం 45 రోజులు బౌద్దభిక్షువుగా జీవించాలనే నియమం వుంది, వయసు నియమంలేదు. 45 రోజులు బౌద్దభిక్షువుగా దీక్ష తీసుకోని వ్యక్తి కి వివాహ అర్హత ఉండదు.
అందువల్ల బౌద్దులకి స్కూలు లో, కాలేజీలలో, ఉద్యోగ సంస్థలలో యీ దీక్షకు గాను కావలసిన శలవులు యివ్వాలనే నిబంధన వుంది. ఇది కనీసం అన్నమాట, కొందురు యిలాంటి దీక్ష ప్రతీ సంవత్సరం కూడా పాఠించవచ్చు. మన అయ్యప్పమాల వేసుకున్నట్లన్నమాట. పెళ్లైన వాళ్లు దీక్ష తీసుకోవచ్చో లేదో మాత్రం తెలీదు. అక్కడి వారు పెళ్లైన వాళ్లకి ఆ అర్హత వుండదు అన్నారు.
అక్కడి మాల్స్ లో ఈ దీక్షకు కావలసిన వస్తువులు ఓ పేక్ లో లభిస్తాయి. అందులో భిక్షా పాత్ర, ఊదొత్తులు పెట్టుకొనే స్టాండు, ఓ విగ్రహం పూజకు ప్లాస్టిక్ పూలనుంచి ముత్యాల వరకు ఖరీదును బట్టి ఉంటాయి. అలాగే భిక్షాపాత్ర ఖరీదుని బట్టి ఉంటాయి. కాషాయ రంగు పంచలు అవీ ఉంటాయి. దీక్ష తీసుకున్న అబ్బాయి దగ్గరగా ఉన్న బౌద్ద మందిరానికి వెళ్లి, కాషాయం ధరించి, జుత్తుపూర్తిగా తీసివేసి, రోజూరెండుపూటలా స్నానం చేసి, రోజూ బుద్దుని విగ్రహానికి సేవలుచేసి, మధ్యాహ్నం రాత్రి భిక్షాటన చేసి ఆ భిక్షనే తిని, నేలపైనే పడుక్కొని గడుపుతారు. 45 రోజుల తరువాత తిరిగి ఇళ్లకు వచ్చెస్తారు.
ఇలాంటి భిక్షువులు వందలలో ఈ మందిరంలో కనిపిస్తార

“ కాన్ యిన్ “దేవి అంటే కరుణా దేవి అని అర్దం. భూదేవి, సంతాన దేవి, స్వర్గపురాణి ఇంకా చాలా దేవతా విగ్రహాలు వున్నాయి.
ఈ ప్రదేశాన్ని చూస్తూ ఉంటే అధ్బుతాన్ని చూస్తున్నట్లే అనిపించింది.
చైనా సముద్రం లో వున్న “పొటలాక్ “ ద్వీపంలో వున్న “కాన్ యిన్ “ దేవి మందిరం ప్రధమస్థానంలో ఉండగా ఈ మందిరం ఆమందిర నమూనా అని అంటారు.
“కాన్ యిన్ “ దేవి విగ్రహం ఎత్తుని పెనాంగ్ స్టేట్ మసీదు మీద ఈ విగ్రహం నీడ పడకుండా ఉండేలా నియంత్రించేరు.
పెనాంగ్ లో “బొటానికల్ గార్డెన్, బటర్ ఫ్లై గార్డెన్, ఫ్రూటు గార్డెన్, స్పైస్ గార్డెన్ ఉన్నాయి. ఇవి కూడా చూసేం కాని నాకేమీ గొప్పగా అని పించలేదు. ఇంతకంటె మన దేశంలో ఇంకా బావుంటాయి. చుట్టారా కొండలు అడవులు కాబట్టి తిరగడానికి బాగానే వుంటాయి. మన దేశంలో అక్కడ కన్నా ఎక్కువ జాతులు ఉన్నాయి. ఇక్కడ ఈ దేశం నేషనల్ ఫ్రూటు గురించి చెప్పుకోవాలి. మలేషియ దేశం పండు “డూరియన్ “ చూడ్డానికి మన పనసపండు లాగే ఉంటుంది. పనసపండుకన్నా చాలా గుండ్రంగా తీర్చి దిద్దినట్లు ఉంటుంది. లోపల తొనలు ఉంటాయి. పండిన డూరియన్ పండు వాసన ( కంపు అనాలో వాసన అనాలో తెలీక ) కొన్ని మీటర్ల దూరం వరకు వేస్తూ ఉంటుంది. ఆ వాసన భరించడం కష్టం. పచ్చగా వుండే తొనలు ముట్టుకోడానికి చాలా అసహ్యం గా ఉంటుంది. తినడం వరకు వెళ్లలేక పోయేను. కొన్ని హోటల్స్ లో డూరియన్ తొనలు లోపలికి తెస్తే ఫైన్ కట్టాలనే బోర్డులు కూడా ఉంటాయి. అలాంటి డూరియన్ చెట్లు కొన్ని వేలల్లో ఉన్నాయి పెనాంగ్ లో. ఇక్కడ ఉండే ప్రతీ గుట్ట మీద పామ్ చెట్లు పెంచుతున్నారు. దాంతో ఆ ప్రదేశాలు అందంగా ఉండడమే కాక వాణిజ్యపరంగా విదేశీమారకాన్ని తెచ్చిపెడుతున్నాయి.

కారన్ వాలిస్ కోట —- 18 వ శతాబ్దం లో ఈస్ట్ యిండియా కంపెనీ వారు నిర్మించిన కోట. మలేషియాలో ఇప్పటికీ చెక్కుచెదరక ఉన్న కోట ఇదే. దీని గేటుకు ఎదురుగా చేతిలో లాంతరు పట్టుకొని ఉన్న ఫ్రాన్సిస్ లైటు విగ్రహం ఉంది.
ఈ కోటలో పురాతనమైన ఫిరంగులు ఉన్నాయి అందులో పెద్ద ఫిరంగిని 1606 లో అప్పటి జోహార్ బారును పరిపాలించిన సుల్తానుకి కానుకగా డచ్చ్ వారు ఇచ్చినది వుంది. దీనిని “సేరి రామ్ భాయి “ అంటారు. ఈ కోట వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించేరు.
ఈ కోటలో ఆంగ్లేయుల సమాధులు ఉన్నాయి.
ఆంగ్లేయులను వీరు “ఫిరంగి “ లని అంటారు. పెనాంగ్ లో పేరు పొందిన బీచ్ “బతు ఫిరంగి “. ఇక్కడ విదేశీ పర్యాటకులు ఎక్కువగా ఉంటారు. స్టార్ హోటల్స్, విదేశీయులకు కావలసిన అన్ని హంగులు ఈ బీచ్ పరిసరప్రాంతాలలో లభిస్తాయి. పూర్వం ఆంగ్లేయుల కాలంలో ఆఫీసర్లు ఈ ప్రాంతంలో నివసించే వారట, అప్పటి బంగళాలు అవీ చూడొచ్చు.

మహాత్మగాంధి ఆశ్రమం ( దేవాన్ మహాత్మ ) —–
1935 లో వలస కూలీల సంక్షేమంకొరకు నిర్మించుకున్న ఆశ్రమం, కొత్తగా వచ్చిన కూలీల నివాసం, కూలీల బాగోగులు చర్చించుకోవడం కోసం నిర్మించుకున్న భవనం. “హిందూ బహుజన సంఘం” వలస కూలీల కష్టాలను యజమానుల వరకు తీసుకు వెళ్లడానికి ఏర్పడ్డ సంఘం. మహాత్మా గాంధీ హత్యానంతరం దీనికి మహాత్మాగాంధీ ఆశ్రమం గా పిలువసాగేరు. 2006 లో నిలువెత్తు గాంధీ విగ్రహాన్ని నిర్మించేరు. పెనాంగ్ గుట్టమీద బాల దండాయుధపాణి కోవెల పక్కగా వుందీ భవనం. ఇప్పుడు థైపూసం కొరకు దూరప్రాంతాలనుంచి వచ్చే భక్తులకు బసగా ఉపయోగిస్తున్నారు.
మలేషియన్ల భాష నేర్చుకుంటున్నప్పుడు నాకు అనిపించిందేమిటంటే వీరి భాష సంస్కృత, ఉర్దూ, తమిళ, పాళీ భాషల మిశ్రమం అని. 50 శాతం భాష ఒకటిరెండుసార్లు వినగానే అర్దమయేది. మిగతా 50 శాతం మలయ ఆంగ్ల నిఘంటువు తిరగవెయ్యవలసి వచ్చేది.

వచ్చే సంచికలో మరికొన్ని విశేషాలతో మీ ముందుంటాను, అంతవరకు శలవు.

1 thought on “మలేషియ విహారయాత్రలు ( పెనాంగ్)

Leave a Reply to మాలిక పత్రిక డిసెంబర్ 2020 సంచికకు స్వాగతం – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *