March 29, 2024

మేటి ఆచారం

రచన: ఎ.బి.వి. నాగేశ్వరరావు

దురాచారాల దురాగతాలు, సాంప్రదాయాల సంకెళ్ళు,
కట్టుబాట్లు, వివక్షలు, ఆంక్షలు, అణచివేతలు, –
వెరసి… యుగాలుగ నియంత్రిస్తున్నాయి నాతిని-
ఒడిదుడుకుల ఒడిలో, సర్దుబాటు ధోరణిలో-
పసి ప్రాయము నుండి పాడె ఎక్కేదాకా…
మజిలి మజిలిలుగ, మూగ జీవిగ, పరాధీనమున …
నిరంతరం, జీవితాంతం, జీవచ్ఛవంగా బ్రతుకీడ్చమని !
అభిరుచులు, ఆకాంక్షలు …
అతివకు సొంతము, వ్యక్తిగతము- ఉండవు, ఉండకూడదని !!

అందుకే, మరి అందుకే- నాడూ, నేడూ…
యుగాలుగ, నిజానికి మూగదే మగువ –
ఏ ఆచార ఉపద్రవం ఎప్పుడు అరుదెంచునో,
విషాదమే ఊపిరిగ- జీవితం ఎప్పుడు, ఏ మలుపుకో? ఎఱుగక !
ఒంటరితనము, విభేదించగలేని విధము,
వ్యవస్థ తనకు ఆపాదించిన చట్ర బంధనముగ –
తన జీవితం తనకన్నది, తన అభీష్టానికి- లేనేలేక !!

కాలము పుటలు తిరగేసి చూడు,
తరతరాలుగా తరుణి శోకము తర్కించి చూడు,
సంకుచితము, సెంటిమెంట్ల సర్కిల్ వదలి వచ్చి చూడు,
బ్రాంతి, భ్రమల మైకం మరి, దరిజేరనివ్వక చూడు,
శాస్త్రీయము, సహేతుకము అలవరచుకొని, ఆనక చూడు-
సంసిద్ధ స్థితిలో, సమభావ దృష్టితో.

ఆచారాల మాటున అనాదిగ, సాంప్రదాయాల చాటున స్థిరముగ,
ఆడది అబలగ ఇల మలచిన వైచిత్రి- పరికించి చూడు.
కరిగే హృదయం జాతిన కొరవడిన వైనం తరచి తరచి చూడు.
కలకాలమూ కలకలంతో కలకంఠి జీవితం-
యుగాలుగా వ్యథాభరితం, ఎందుకో- వివేచించి చూడు.
మహిళ మనిషన్నదటుంచి, ప్రాణియన్న స్పృహే –
నిజానికి, ఇగిరిపోయె ఇలలో, స్పందించి చూడు.

అందుకే, మరి అందుకే…
జీవకోటిలో ఎక్కడా లేని ఈ వివక్ష మహిళపై ఎందుకని,
పురుషునికి వర్తించుకొన్న కట్టుబాటదొక్కటీ లేదు, ఇదేమిటని,
అతివ అంతరంగ ఆర్తి, ఆక్రందనలకు ఒకింతయు
హృది కరుగని కరుడుగట్టిన జీవి ఈ మానవుడనీ,
ప్రతి ప్రాణి జీవన శైలీ-
మానవజాతిని చీత్కరించి హేళనచేస్తున్నది చూడు !
జీవకోటికి మానవుడు గొప్ప అని- ఏ జీవి ఒప్పుకొన్నదని
నిలదీస్తున్నది జీవకోటి శైలి- నిశితముగ చూడు !!

మన సంస్కృతిలో ఉందీ, ఉందని మురిపించే స్త్రీ స్వాతంత్ర్యం,
స్లోగన్లు గుప్పించి ఒప్పించబూనే స్త్రీ గౌరవం,
నిజ జీవితంలో నాతికి- ఏదీ, ఏదన్నది…
కట్టుబానిసగ వనితను కట్టిపడవేయడమేగా-
ఈ సంస్కృతి, సాంప్రదాయాలు చేస్తున్న నిర్వాకమన్నది !
‘ఆడదై పుట్టే బదులు అడవిలో మానై పుట్టడం మేల’న్న నానుడి
నిష్ఠురంగ, నిక్కచ్చిగ, నిర్ద్వంద్వంగ నిర్వచిస్తున్నది-
దిగజారిన ఈ తీరుల నిగూఢ దాష్టీకాన్ని తెగేసి తూర్పారబట్టడమేనన్నది…
నిజంగ, నికరంగ నీ మంచి మనసును కలిచి వేస్తుంది చూడూ, చూడు !!

ఆపాటి సంవేదన చాలు- అంతరంగాన అలజడి రగిలేందుకు,
నగ్న సత్యాలు హృదయ నేత్రం వీక్షించగలిగేందుకు,
మది పరిఢవించి పెనుమార్పుకై పరితపించేందుకు…
దురాచారాల దురాగతాలకు- దుస్సంప్రదాయాల కుసంస్కృతికి,
ఇక- ఔను, ఇక మీదట కాలముచెల్లిందేననీ,
రుగ్మతలు లేనిదే జాతి జీవనముగ ఉండాలని-
తరతరాల తమస్సుల తీరుల పాలిటి అసితార్చివై,
అశాస్త్రీయ ఆలోచనలు, ఎడద ఎడబాయు పెడధోరణులను కసితీరా కాలరాసి,
పరిష్కార మార్గాన మది స్థిమితపడేందుకు !
మహిళకు మనసున్నదన్న మన్నికైన సంస్కృతి మహిలో వికసించేందుకు,
మమతల లోగిల్లలో, మారిన విలువల వెల్లువల్లో-
అతివ జీవనం ఆసాంతమూ ఆనందభరితం అవగలిగేందుకు !!

జీవకోటికి ధీటుగా –
మనిషి తీరుతెన్నులు ఎదిగి నిలబడగలిగేందుకు !
పరిశీలించి, సరిచెప్పు ఇప్పుడని-
ఇతర ప్రాణికి చిన్న విన్నపం చేయగలిగేందుకు !!.

అప్పుడు, ఆ మాదిరి, మారిన మానవ జీవన సరళిన-
కరువైపోతే హృదయాలు- కానేకాదది ఆచారం,
ఔతుందది నరుడు తలవంచుకొనే అపచారం !
సమభావం, సౌహార్దం, మమతల వలయం అనునిత్యం
ఇమిడుంటేనే మెండుగ, ఇకమీదట ఆచరణకు స్వీకారం.
స్త్రీ, పురుషులకిరువురికీ కాకుంటే- లేనేలేదికా దుష్టాచారం.
మహిళ మనిషనీ, మనసెరింగి మెలుగుటయే జాతి మేటి ఆచారం
సమ దీక్షే మనిషికి సరి సంస్కారం, సంకుచితమునకు ఉండదు ఇక ఏ ఆస్కారం !!

—<<>>—

2 thoughts on “మేటి ఆచారం

  1. Thought of the writer is good and emotional a good vocabulary is used creative thinking with constructive ending. Convey my wishes to the writer.

Leave a Reply to M.Ranga Swamy Cancel reply

Your email address will not be published. Required fields are marked *