August 11, 2022

అదండీ సంగతి

రచన: గిరిజరాణి కలవల

“ఇదిగో, ఇప్పుడే చెపుతున్నా! నా వంతు గుత్తొంకాయ్ కూరమ్మాయ్… ఇంకెవరూ పోటీకి రాకండి.. మెంతికారం పెట్టి.. లేలేత మువ్వొంకాయలు.. అలవోకగా.. అలాఅలా నూనెలో తేలాడుతూ చేసాననుకో… ఒకొక్క వంకాయీ ముచిక దగ్గర పట్టుకుని ‘ కచక్’ అని కొరికితే… బెత్తెడు దూరమే.. ఏదీ… ఆ స్వర్గానికి… మీ అందరికీ తెలిసిందేగా.. నా వంకాయ కూర రుచి ” అంటూ వనభోజనాల వాట్స్ ఆప్ గ్రూపులో మెసేజ్ పెట్టింది వంకాయల వనజాక్షి.
“సరే.. వంకాయ నీ వంతు… మరి రెండో కూరగా .. నన్ను ఆవ పెట్టి పనసపొట్టు చేయమంటారా? ” అంటూ నస నీరజాక్షి పెట్టిన మెసేజ్ చూసి…
“ఓకే.. రెండు కూరలూ వచ్చేసాయి…. రెండు పచ్చళ్ళు ..దోస, గోంగూర.. నేను చేస్తాను లెండి” గోరోజనాల గోమతి వెంటనే మెసేజ్ చేసేసింది.
ఇకపోతే తర్వాత వరసగా పులిహోర చేయడం పుల్లాభొట్ల పున్నమ్మ, సాంబారేమో పచ్చిపులుసు పంకజాక్షి, బొబ్బట్లు.. బొద్దు అఖిలాండేశ్వరి, మిర్చీబజ్జీ వాటా బుజ్జికి… ఇలా తలా ఒకరు వాటాలు వేసుకుని… రాబోయే ఆదివారం నాడు, కలుసుకుని వన భోజనాలు చేయాలని.. ఈ అపార్ట్ మెంట్ వనభోజనాల గ్రూపులో మెసేజ్ లు చేసుకున్నారు.
“ఆదివారం నాడు మనం అందరం అనుకున్న టైము కి, మీరు చేసిన వంటలతో కరెక్ట్ గా వచ్చేయండి. ఎవరి తులసిమొక్క. పూజకి కావలసిన సామాగ్రి ఎవరిది వారు రెడీ చేసుకోండి. కార్తీక దామోదరుడి పూజ చేసుకుందాం” అంటూ అపార్ట్ మెంట్ సెక్రెటరీ సోమిదేవమ్మ మెసేజ్ పెట్టింది.
వెంటనే అందరూ టపటపా బొటనవేలు పైకెత్తినట్లు ఎమోజీ పెట్టారు..
“అంతా బానే ఉంది… మరి డ్రస్ కోడ్ కూడా పెట్టుకుందాం. అందరూ రెడ్ కలర్ పట్టు చీరలు కట్టుకోవాలి. మేచింగ్ నగలు కూడా వేసుకుందాం.. సరేనా?” అంది మేచింగ్ మాలతి.
వెంటనే మాలతి లేని మరో గ్రూపులో మిగతా వాళ్ళందరూ, “ఈవిడ మొన్న ఆన్ లైన్ లో… రెడ్ కలర్ కంచి పట్టుచీర తెప్పించుకుంది కదూ! అది మనకి చూపించాలని రెడ్ కలర్ కోడ్ పెట్టినట్టుంది. ” అంటూ ఒకరు మెసేజ్ పెట్టానే, మరొకరు” ఔనౌను… వాళ్ళాయన కొత్తగా కెంపుల సెట్ కొన్నాడట… అవన్నీ మనకి చూపించడానికే ఈ మేచింగ్ మాలతి పాట్లు” అన్నారు.
మళ్లీ వనభోజనాల గ్రూప్ లోకి వచ్చి, “ఏమోనమ్మా! నా దగ్గర రెడ్ శారీ లేదు…మీకు ఉన్నంత మాత్రాన అందరికీ ఉండాలని రూలేం లేదు కదా? ఇంకో రంగేదైనా పెట్టండి ” అంటూ పేచీల ప్రేమకుమారి మెసేజ్ చేసింది.
ఎందుకులే ఈ గోలంతా అనుకుందో ఏమో… మేచింగ్ మాలతి, ” సరే.. పోనీ.. మీ దగ్గర చీరలలో.. ఒక్కపోగైనా రెడ్ కలర్ కలిసున్నాసరే.. కట్టుకోండి ” అంటూ మధ్యే మార్గంగా చెప్పేసరికి… గ్రూప్ లో అందరూ సరే సరే అన్నారు.

* * *

ఎదురు చూస్తున్న వనభోజనాల రోజు రానే వచ్చింది. అందరూ ముందు అనుకున్నట్లే… ఎరుపు రంగు చీరలున్నవారు, చీరలో కొంచెమైనా ఎరుపు కలిసినవారు ఆయా చీరలు కట్టి, మేచింగ్ నగలేసుకుని, ఎవరెవరు ఏదేది ఐటమ్ చేయాలనుకుని నిర్ణయించుకున్నారో ఆ ఐటమ్స్… గుత్తొంకాయ్ కూరా, పనసపొట్టు కూరా, దోసావకాయ్, గోంగూర పచ్చడీ.. పంచభక్ష్య పరవాన్నాలూ,పులిహోర దద్దోజనాలు, ఎవరి గిన్నెల నిండుగా వారు సర్దుకుని…. కంప్యూటర్, లాప్ టాపుల ముందు సిద్ధమయారు. జూమ్ మీటింగ్ పెట్టుకుని… ముందుగా ఎవరి తులసి మొక్కకి వారు పూజ చేసి.. హారతులిచ్చి ఆ హారతి పళ్లెం స్క్రీన్ చూపించి కళ్ళకద్దుకోవడం అయ్యాక..
పెళ్లి పుస్తకం సినిమాలో వనభోజనాల పాట… అందరూ కలిసి గొంతు కలిపారు. అంత్యాక్షరి.. అచ్చిబుచ్చికలు అయాక..
ఒకొక్కరూ చేసిన ఐటమ్స్… మరొకరికి వడ్డిస్తున్నట్లు అభినయిస్తూ… తింటున్నట్లు.. నములుతూ…. ఆహా.. ఓహో.. అంటూ ఆస్వాదిస్తూండగా..
“సోమీ! ఇంకా ఎంతసేపే నీ జూమ్ వనభోజనాలు… ఇక్కడ నా సుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి… వండినవేవో నిండుగా చూపించాలని గిన్నెలన్నీ కంప్యూటర్ ముందు పెట్టుకుని కూర్చున్నావు. నా మొహానికి ఈ పూట ఇంత తిండి పడేస్తావా? పడెయ్యవా?” అపార్ట్ మెంట్ సెక్రటరీ సోమిదేవమ్మ వాళ్ళాయన సోమలింగం.. నీరసంతో సోలి పోతూ అన్నాడు.
“అబ్బబ్బబ్బబ్బా!కాసేపు ఆగలేకపోతున్నారు… మీకన్నా.. ఆ నస నీరజాక్షి మొగుడు నయం… తిండికోసం నస పెట్టకుండా… ఫ్రిజ్ లో రాత్రి మిగిలినవేవో తినేసారట.. మీరూ వెళ్లి ఫ్రిజ్ లో బ్రెడ్ ఉంది ఈ పూటకి లాగించండి.” సోమిదేవమ్మ విసుక్కుంటూ అంది.
“నా వల్ల కాదే ఆ ఎండిపోయిన ముక్కలు పీక్కుని లాక్కోవడం… వచ్చి వడ్డించవే… శోషొచ్చ్చేలా ఉంది ” అన్నాడు.
“మీకు శోషొచ్చినా, ఘోష పెట్టినా… ఈ వనభోజనాల జూమ్ అయేదాకా కదలను గాక కదలను..” గట్టిగా చెప్పింది సోమిదేవమ్మ.
“అమ్మా! ఆకలే… అన్నం ఎప్పుడు పెడతావూ? ” వంకాయల వనజాక్షి కూతురు
” అబ్బబ్బ.. ఉండవే.. నువ్వూ.. నీ ఆకలిగోలా? వంటింట్లో డబ్బాలు వెతుక్కుని ఏదోటి మింగు.. నన్ను డిస్ట్రబ్ చేయకు ” అంది వం. వ..
ఇదిగో ఇలాంటి ఆకలిగోలలే ఈ జూమ్ మీటింగుని ఎంతగా డిస్ట్రబ్ చేస్తున్నా…. పట్టించుకోకుండానే… నిర్విఘ్నంగా సాగిపోతోంది.
ఇంతలో ఉన్నట్టుండి… అపార్ట్ మెంట్ లో పవర్ కట్.. ఒకొక్క ఇంట్లోనుండీ.. ‘ అయ్యో’, అంటూ ఒకరూ.. ‘అరెరే ఇప్పుడే కరెంట్ పోవాలా? ఇంకా బొబ్బట్లు రానేలేదు..’ అనుకుంటూ మరొకరూ… ‘,’ జలజాక్షి పాయసంలో ఎన్ని జీడిపప్పులు వేసిందో లెక్క పెడదామనుకుంటే… కరెంట్ కాస్తా పోయి.. జూమ్ మీటింగ్ ఆగిపోయింది
పూర్తిగా ఆగిపోయిన ‘ఆన్ లైన్ వన భోజనాలని ‘ తిట్టుకుంటూ . నిట్టూరుస్తూ, వచ్చే ఏడు ఈ మహమ్మారి పారిపోగానే, ఎప్పుడూ వెళ్లే తోటలో గాడిపొయ్యి తవ్వించి… అందరూ తలో చేయీ వేసి.. వంటలు చేసుకుని.. ఆటపాటలతో, పిల్లాపాపలతో, పతిదేవుళ్ళతో.. షడ్రసోపోతమైన విందు భోజనాలు చేయాలని అనుకుంటూ కంప్యూటర్ల ముందు నుంచి అసంతృప్తిగా లేచారు అపార్ట్ మెంట్ వనభోజన మిత్ర బృందం.
వెంటనే అపార్ట్ మెంట్… మగపుంగవుల వాట్స్ఆప్ గ్రూపు లో… మెసేజులు టపటపా వరదలా… రావడం మొదలయ్యాయి.
“హమ్మయ్య.. మన పాచిక పారింది.. గోరోజనాల గోవర్ధనరావు చెప్పిన ఐడియా బ్రహ్మాండం…” అంటూ నస నీరజాక్షి పతిదేవుడు అనగానే… ” అదిరిందయ్యా! గోవర్దనం.. నీ మేలు మర్చిపోలేను” అంటూ సోమలింగం మెసేజ్.
అపార్ట్ మెంట్ వాచ్ మేన్ చేతిలో.. ఐదొందలు పెట్టి.. సాయంత్రం వరకూ ఆన్ చేయొద్దని.. మెయిన్ స్విచ్ ఆపించిన గోరోజనాల గోవర్ధనం… ఈ విజయాన్ని మనం వచ్చేవారం వనభోజనాల విందుతో సెలబ్రేట్ చేసుకుందామని అందరికీ జవాబు ఇచ్చాడు.

సమాప్తం

1 thought on “అదండీ సంగతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *