April 19, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 55

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

కీర్తన:
పల్లవి: పాపపుణ్యముల రూపము దేహ మిది దీని-
దీపనం బణఁగింపఁ దెరు వెందు లేదు ॥పల్లవి॥
చ.1 అతిశయంబైన దేహభిమానము దీర
గతిఁగాని పుణ్యసంగతిఁ బొందరాదు
మతిలోనిదేహభిమానంబు విడుచుటకు
రతి పరాజ్ముఖుఁడు గాక రపణంబు లేదు ॥పాప॥
చ.2 సరిలేనిమమకారజలధి దాఁటిఁనఁగాని
అరుదైన నిజసౌఖ్య మది వొందరాదు
తిరువేంకటాచలాధిపునిఁ గొలిచినఁగాని
పరగుబ్రహ్మనందపరుఁడుఁ దాఁగాఁడు ॥పాప॥
(రాగం: పాడి; సం: 1- 28 – రాగిరేకు –4-8)

విశ్లేషణ:
పల్లవి: పాపపుణ్యముల రూపము దేహ మిది దీని-
దీపనం బణఁగింపఁ దెరు వెందు లేదు
తేజోవృద్ధి కలిగించే పనుల వల్ల పొందే ఫలమే’- పుణ్యం. తేజోహీనత కలిగించే పనుల వల్ల పొందే ఫలమే-పాపం. అలాగే ఇష్ట ఫలితాన్ని అనుభవించడమే-సుఖం అనిష్ట ఫలితాన్ని అనుభవించడమే-దుఃఖం. ఈ సుఖదుఃఖాలు ఏర్పడడానికి కారణం ఏమిటి?. ఏ జీవుడు గతంలో ఏయే పనులను ఏ రకంగా చేసి ఉన్నాడో ఆ యా కర్మల ఫలితాన్ని అదే విధంగా అనుభవిస్తాడు అని అనుభవిస్తాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పాపపుణ్యాల ఫలితం అనుభవించక తప్పదు. దాటడానికి వేరేమార్గమేమీ గోచరించదు. ఆవిషయాన్నే అన్నమయ్య ఈ కీర్తనలో మనకు ప్రబోధిస్తున్నాడు.

చ.1 అతిశయంబైన దేహభిమానము దీర
గతిఁగాని పుణ్యసంగతిఁ బొందరాదు
మతిలోనిదేహభిమానంబు విడుచుటకు
రతి పరాజ్ముఖుఁడు గాక రపణంబు లేదు
దేహాభిమానులకు అవ్యక్తపరబ్రహ్మప్రాప్తి కష్టసాధ్యమే. నిర్గుణోపాసనామార్గము దేహాభిమానము గలవారికి చాల కష్టమని చెప్తున్నాడు.అనగా దేహాహంభావము లేక, ఇంద్రియనిగ్రహము గలిగి, నిష్కామకర్మానుష్ఠానము చేతను, ఈశ్వరోపాసన చేతను చిత్తశుధ్ధిని బడసినవారికి నిర్గుణోపాసన యందేమియు కష్టముండదని చెప్తున్నాడు అన్నమయ్య. సదా రతియందాసక్తి చూపక పరాఙ్ముఖుఁడైతే గాని గొప్పదనము సిద్ధించదు.

చ.2 సరిలేని మమకారజలధి దాఁటిఁనఁగాని
అరుదైన నిజసౌఖ్య మది వొందరాదు
తిరువేంకటాచలాధిపునిఁ గొలిచినఁగాని
పరగుబ్రహ్మనందపరుఁడుఁ దాఁగాఁడు
సమస్త మమకార ఆసక్తులు త్యజించి, భగవంతునికే తమ అన్ని కర్మలు అంకితం చేసేవారు, తామరాకు నీటిచే తడి అవ్వనట్టు, పాపముచే తాకబడరని భగద్గీత లో చెప్పినవిధంగా అన్నమయ్య మమకారమనే సాగరాన్ని దాటితే కానీ మోక్షం లభించదు. తిరువేంకటాద్రి పై వెలసిన బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వరుని కొలిచితే గాని బ్రహ్మానందపరుడు కాజాలడు అని నొక్కి చెప్తున్నాడు.
ఆదిశంకర భగవత్పాదులంతటి వారు, సాక్షాత్ కైలాస శంకరుడే ఆదిశంకరుడిగా వచ్చినా, వారు స్వయంగా ఎప్పుడూ బ్రహ్మానంద స్థితిలో ఉండే మహాపురుషుడే అయినా, కర్మకాండతో పాటు జ్ఞాన మార్గము కూడా అవసరం అని చెప్పినా….. శంకరులే మనసు+క్రియ కలిపి చేయవలసిన భగవంతుడి పూజ, వైదిక కర్మలను కూడా సమ్మతించారు. జగద్గురువులైన శ్రీఆదిశంకర భగవత్పాదులు, జ్ఞాన మార్గముతో పాటు, వైదిక కర్మలను చేయడం, భగవంతుడిని పూజ చేయడం వంటి కూడా తప్పనిసరి అని సూచించారు… పాపములు రెండు రకములు. ఒకటి కాయకముగా చేసిన పాపములు, రెండు మానసికముగా చేసిన పాపములు. కాయకముగా చేసిన పాపములు పరిహారం అవ్వాలి అంటే, కాయకముగా పుణ్య కార్యములు చెయ్యాలి. అలాగే మానసికముగా చేసిన పాపములు పరిహారం అవ్వాలి అంటే, పుణ్యప్రదమైన ఆలోచనలు/సత్సంకల్పాలు చేస్తూ ఉండాలి అని బోధిస్తున్నాడు అన్నమయ్య.
ముఖ్యమైన అర్ధములు:
దీపనము = జీర్ణశక్తి, తీరని ఆకలి; అణగింప = తగ్గించ; తెరువు = మార్గము; అతిశయంబైన = ఎక్కువైన, అధికమైన; పుణ్యసంగతి = పుణ్యము పొందే మార్గము; పరాజ్ముఖుఁడు = పెడమొగముపెట్టినవాడు, అనాసక్తిపరుడు; రపణము = గరిమ, గారవము, ఘనత, దొడ్డతనము; నిజసౌఖ్యము = అసలైన సుఖము; బ్రహ్మనందపరుఁడు = యుక్తాయుక్త విచక్షణ తెలిసి సర్వము బ్రహ్మని నమ్మే వ్యక్తి; తాగాడు = తానవడు.
-0o0-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *