February 23, 2024

కంభంపాటి కథలు – పోస్టు

రచన: కంభంపాటి రవీంద్ర

పద్మకి భలే చిరాగ్గా ఉంది. ఉదయాన్నే తన ఫ్రెండు వసుధ ఫోన్జేసి, ‘ఏమిటే.. నిన్న నీ పుట్టిన్రోజా?.. ఏదో అనాధాశ్రమంకి వెళ్ళి సెలెబ్రేట్ చేసుకున్నారటగా..ఫేస్బుక్ లో చూసేను.. ఎనీవే…. నువ్వు సూపెరేహే.. ఆఁ అన్నట్టు చెప్పడం మర్చిపోయేను.. లేటుగానైనా లేటెస్టుగా చెప్పేస్తున్నాను.. హ్యాపీ బర్త్డే ‘ అని ఫోనెట్టేసింది.
అసలు తనకి చిన్నప్పటినుంచీ పెద్దగా పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకునే అలవాటు లేదు కానీ తన భర్త కిరణ్..’మన పెళ్ళయ్యేక ఇది నీ మొదటి పుట్టినరోజు..గ్రాండుగా సెలెబ్రేట్ చేసుకోకపోతే ఎలా?’ అని ఉదయాన్నే ఓ అనాధాశ్రమానికి తీసుకెళ్ళి, అక్కడో కేక్ కోయించి, అట్నుంచి ఏదో స్టార్ హోటల్ కి లంచ్ కి తీసుకెళ్ళేడు. అప్పటికీ తను చెబుతూనే ఉంది.. ‘మనం వెళ్ళి అనాథాశ్రమంలో పుట్టినరోజు జరుపుకునే బదులు.. మనమే నెలకోసారి వెళ్ళి.. అక్కడున్న పిల్లలకి పుట్టినరోజు సెలబ్రేషన్ చేయించొచ్చు కదా ‘ అని, నువ్వు మరీ టూమచ్చి అన్నట్టు ఓ లుక్కు పడేసేడు కిరణ్ !
గబగబా భర్త ఫోన్ తీసుకుని ఫేస్బుక్ ఓపెన్ చేసి చూసింది.. ఆ అనాథాశ్రమంలో పిల్లలందరూ వెర్రి మొహాలేసు కుని ఉంటే, తను కేక్ కోస్తున్న ఫోటోలు.. పైగా ‘మై వైఫ్ సెలెబ్రేటింగ్ హర్ బర్త్ డే ఇన్ ఆన్ ఆర్ఫనేజ్..షీ ఈజ్ సో కైండ్ హార్టెడ్ ‘ అంటూ క్యాప్షనొకటి !
దానికో మూడొందల లైకులు, ‘అన్నయ్యా.. వదినది చల్లనైన చూపు.. జాలి కలిగిన హృదయం ‘.. ‘చెల్లాయ్ కళ్ళల్లో కరుణరసం ఒలికిపడుతూంది ‘.. ‘ఇదిగో అమ్మాయ్.. నీ పుట్టినరోజు వేడుకలు దగ్గరనుంచి చూడ్డానికైనా వచ్చే జన్మలో అనాధగా పుట్టాలనుంది ‘ లాంటి కామెంట్లు !
అవన్నీ చదివేసరికి విపరీతమైన తలనొప్పొచ్చి, ఓ స్ట్రాంగ్ కాఫీ తాగి, కిరణ్ కి చెప్పింది ‘కొన్ని కొన్ని విషయాలు ప్రయివేట్ గా ఉంచుకుంటేనే మంచిదేమో?.. అన్నీ అందరికీ చెప్పక్కర్లేదేమో ‘ అని. ‘చెబితే తప్పేముంది?. వాళ్ళందరూ అంత ఆప్యాయంగా కామెంట్లు పెడితే.. నీకు నచ్చకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది.. మన సొంత ఫ్యామిలీ వాళ్లైతే కనీసం ఓ కామెంట్ కాదు కదా.. ఓ లైకు కూడా పెట్టరు.. కానీ వీళ్ళందరికీ నేనంటే ఎంత అభిమానమో చూడు.అసలు నీక్కూడా ఓ ఫేస్బుక్ ఎకౌంట్ ఉంటే అర్ధమయ్యేది ఈ అభిమానాలూ, ఆప్యాయతలూ ‘ అంటూ చెప్పిన కిరణ్ తో ఇంకేం చెప్పలేక ఓ దణ్ణం పెట్టి లోపలికెళ్ళిపోయింది పద్మ.
ఆఖరికి వాళ్ళ పక్కింటాయనకి షష్టిపూర్తి చేస్తే విష్ చేయడానికెళ్లి ‘మా పక్కింటి వారి షష్టి పూర్తి మహోత్సవ వేడుకలు.. పెద్దల దగ్గిర ఆశీర్వాదం తీసుకుంటూ ‘ అంటూ ఆ పెద్దవాళ్ళ కాళ్ళకి దణ్ణం పెడుతూ, కెమెరా వేపు చూస్తున్న ఫోటో కూడా ఫేస్బుక్ లో పెట్టేసేడు. అందరూ తెగ లైకులెట్టేసేరు.. ‘మీలాగా పెద్దలని గౌరవించే వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టే, ప్రతి ఏటా వర్షాలు కురుస్తున్నాయి, పంటలు పండుతున్నాయి ‘, ‘ఆ పెద్దావిడ కాళ్ళ పట్టీలు ఎంత బావున్నాయో ‘, పెద్దల్ని గౌరవిస్తే మనల్ని మనం గౌరవించుకున్నట్టే ‘ లాంటి కామెంట్లు బోనస్ !
మర్నాడు ఉదయాన్నే తలుపు దబదబా బాదుతున్న సౌండు వినిపిస్తే, పరుగునెళ్ళి తలుపు తీసిన పద్మ కి ఆ షష్టి పూర్తి చేసుకున్నాయన కొడుకులూ, కూతుళ్ళూ కనిపించేరు
అందరి మొహాలూ కోపంగా ఉన్నాయి.. ‘మీ ఆయనున్నారా అమ్మా?’ అడిగేడు పక్కింటాయన పెద్ద కొడుకు.. ‘ఉన్నారు.. ఏవయ్యిందండీ?’ ఆత్రంగా అడిగింది పద్మ
‘ఏవయిందా?.. ఇవాళ ఉదయం ఆయన మార్నింగ్ వాక్ కి వెళ్తే.. ఎవరెవరో “ఏం గురువు గారూ.. సిక్స్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అటగా.. కంగ్రాట్యులేషన్స్ అనేసి వెళ్ళిపోతున్నారట..వీళ్ళెవరా అని రోడ్డు మీద నుంచుని ఆలోచిస్తూంటే , వెనక నుంచి ఓ బైకు వాడు ఆయన్ని గుద్దేసేడు.. పది కుట్లేసేరు.. ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నాం ‘ అన్నాడతను
‘అయ్యయ్యో.. పాపం ప్రాణానికేం డేంజర్ లేదు కదండీ?.. ఉండండి.. ఇప్పుడే ఆయన్ని పిలుస్తా.. ఏవండీ ‘ అని పద్మ అంటూండగానే, లోపల్నుంచి ఫోన్ లో ఏదో టైపు చేస్తూ బయటికొచ్చిన కిరణ్, ‘లోపల్నుంచంతా విన్నాను..ఇదిగో.. ఇప్పుడే మీ నాన్నగారికి జరిగిన ప్రమాదం విషయం ఫేస్బుక్ లో పెట్టి, నా ఫ్రెండ్సు అందరినీ ఆయన కోసం ప్రార్థించమని ఓ పోస్టు పెట్టేను ‘ అంటూ చెప్పేసరికి, ‘ ఆ ఫోన్ ఓసారి ఇలా ఇస్తారా? ‘ అని ఆ పక్కింటాయన రెండో కొడుకు తీసుకుని, ‘అసలు మా నాన్నగారి గురించి పోస్టులు పెట్టడానికి మీరెవరు? మీరా పోస్టు పెట్టడం మూలాన్నే, మా నాన్నగారు రోడ్డు మీద ఆలోచిస్తూ నిలబడిపోయేరు ‘ అంటూ ఫోను నేలకేసి కొడితే, పెద్ద కొడుకు కిరణ్ గూబ పగలగొట్టేసేడు.
ఆ వచ్చినవాళ్ళందరూ నానా తిట్లూ తిట్టేసి వెళ్ళిపోతే, కిరణ్ పద్మ వేపు తిరిగి, కొంచెం ఆ ఫోను పన్జేస్తూందో లేదో ఓసారి చూడు.. ‘మైనర్ దెబ్బలు తగిలేయి..బట్ ఐ యామ్ సేఫ్’ అనో పోస్టు పెట్టాలి అన్నాడు !

1 thought on “కంభంపాటి కథలు – పోస్టు

  1. అతనిలో ఆ వ్యసనం జీర్నించుకు పోయింది వెనఖటికి ఓ రాజుగారి విదుృషకునికి సమయం సందర్బం లేడా సామేతలు చూప్పెస్తున్నాడని ఉరిశిక్షవేసారట. దయదలచి సామేతలు చెప్పకుండా ఉంటే క్షమిస్తానన్నాడట రాజు “అలాగె ప్రభు ఊరుకోన్నంత ఉత్తమం బోడిగుండంత సుఖం లేదన్నాడట” విడిలో సామేతలు జీర్నించుకుపోయాయి ఉరి తీసేయండన్నాడట అలావుంది ఫేస్ బుక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *