May 19, 2024

చంద్రోదయం – 11

రచన: మన్నెం శారద

“నువ్వేలేరా బాబూ! ఎలాగూ ఆ అమ్మాయి నిన్నే చేస్కోబోతుంది కదా.. నువ్వు ఒప్పుకున్నావు. ఇంకా ఈ తతంగం దేనికి?”
“జస్ట్ ఫర్ థ్రిల్!”
“ఏం థ్రిల్లో. నా ప్రాణం తీస్తున్నావు” అన్నాడు సారథి నవ్వుతూ. శేఖర్ సీరియస్‌గా “చూడు సారథి! మనిషి బ్రతుకులో ఎన్నో లింకులు తెలీకుండానే ఏర్పడుతుంటాయి. నీ స్నేహం నాకు అలాంటిదే. ఈ రోజు మాస్టారి ఆనందం కోసం ఆయన ఆల్లుడిగా జీవితంలోకి ప్రవేశించబోతున్నాను. ఇదీ కొత్త లింకే. కాని ఎటొచ్చే నాన్నగారి యిష్టం లేదే అన్న బాధ నన్ను బాగా పీడిస్తోందిరా బ్రదర్!”
సారథి తమాషాగా మాట మారుస్తూ అన్నాడు.
“ఈ డైలాగులెందుకు గానీ నీకా అమ్మాయిని చూడాలని వుందని చెప్ప్పొచ్చుగా?”
శేఖర్ మనోహరంగా నవ్వేడు.
“ఎంత కట్నకానుకలు లేకుండా నేను సిద్ధపడినా కనీసం ఆ అమ్మాయికైనా చేసుకునేవాడిని చూడాలని వుండదంటావా?”
“నువ్వెప్పుడూ చూడలేదా ఆ అమ్మాయిని?”
“ఎప్పుడో చిన్నప్పుడు చూశేను. సరే పద. అవతల టైం అయిపోతోంది. మాస్టారు ఎదురు చూస్తుంటారు” అన్నాడు శేఖర్.
“ఇంకా మాస్టారేమిట్రా! రేపు పెళ్లయ్యాక కూడా మాస్టారనే పిలుస్తావా? మామయ్యా అని చెప్పలేవూ?” సారథి.
గది తాళం వేసి యిద్దరూ బయటకొచ్చి బైక్ ఎక్కేరు.
మాస్టారింటి ముందు బైక్ దిగేసరికి ఆయన వీళ్ల కోసమే ఎదురుచూస్తూ నిలబడ్డారప్పటికే.
“రండి బాబూ! మీకోసమే ఎదురుచూస్తున్నా” అన్నారు శంకరంగారు.
“ఇద్గో, వీడి మేకప్ అయ్యేసరికి ఈ టైమయింది సర్!” అన్నాడు శేఖర్.
“పెళ్లికొడుకు నువ్వయితే, మధ్య నాకెందుకురా వేషం?”
వాళ్ల మాటలకి మాస్టారు నిండుగా నవ్వేరు.
సారథి ఆ యింటికేసి పరీక్షగా చూసేడు.
చాలా పాత పెంకుటిల్లు. గటిగా ఏదన్నా గాలివాన వస్తే కూలిపోవటానికి సిద్ధంగా వున్నది. ఎన్ని సంవత్సరాల క్రితం వేసిన సున్నమో పెళ్లలుగా రాలిపోయింది.
లోపలికి అడుగుపెట్టారు ముగ్గురూ.
ఇంట్లో సామాను కూదా అంతగా లేదు. మూలగా గోడకి ఎత్తిపెట్టిన రెండు నవ్వారు మంచాలు.. పాత టేబుల్, రెండు చెక్క కుర్చీలు.. అదే గదిలో ఓ మూలగా మూడు ట్రంకు పెట్టెలు వున్నాయి. ఒక పాత బల్ల ఆ కుర్చీలకు కాస్తంతా దగ్గరలో వేసి వుంది.
ఆ యింట్లో సామానుని బట్టి మాస్టారి ఆర్ధిక పరిస్థితి చెప్పకుండానే తెలుస్తోంది.
గోడల దౌర్భాగ్యాన్ని కప్పిపుచ్చటానికి తగిలించి వున్న కేలండర్లని చూస్తూ నిలబడ్డాడు సారథి.
“కూర్చోండి బాబూ” అన్నారు శంకరంగారు.
ఆయన మెల్లిగా నవ్వి, “ఇప్పుడు నువ్వు నా స్టూడెంటువి కాదు నాక్కాబోయే అల్లుడివి. నిన్ను మర్యాద చేయాల్సిన బాధ్యత నాకుంది కదూ” అన్నాడు.
శేఖర్‌తో పాటు సారథి కూడా కూర్చున్నాడు.
సారథి కూర్చున్నాడేగాని అతనికి అక్కడ వాతావరణం కలవరపాటుని కల్గిస్తోంది. చాలా బాధగా వుంది. నిజానికి ఒకప్పుడు తన యింటికన్నా హీనస్థితిలో వుంది మాస్టారి ఇంటి పరిస్థితి. శేఖర్లాంటి ఆగర్భ శ్రీమంతుదు ఆ యింటి అల్లుడు కావడం సారథికే సహించరానిదిగా వుంది. నిజానికి అతనికలాంటి అవసరం లేదు. అవకాశం వుంది గనుక ఏ చిన్న సంబంధమో చూసి కట్నకానుకలు, పెళ్లి ఖర్చులు భరించి మాస్టారి కూతురి పెళ్లి అయిందనిపించడం ధర్మమని తోస్తోంది. తను తొందరపడి “నువ్వే ఎందుకు చేసుకోకూడదు?” అని ప్రశ్న వేయడం దీనికి కారణమని అతను కలవరపడుతున్నాడు.
కాని శేఖర్‌లో ఏ విధమైన దిగులూ కన్పడలేదు. అతను చిరునవ్వుతో ఎదురు చూస్తున్నాడు.
అక్కడి స్థితిగతుల్ని పరిశీలించిన తర్వాత కూడ శేఖర్ స్థిరచిత్తంతో కూర్చోవడం చూసి సారథి ఆశ్చర్యపడ్డాడు.
విథి!.. విథి రాతనెవ్వరూ తప్పించలేరనన్నది నిర్వివాదాంశం.
శేఖర్‌లోని దృఢ సంకల్పం, పట్టుదల చూసి మనసులోనే అతన్ని అభినందించకుండా వుండలేకపోయేడు సారథి.
కాని సారథి ఒక్క విషయాన్ని మరచిపోయేడు.
ఆనాడు లేమిని భరించలేని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడిన తనని కాపాడి, తన జీవితాన్ని, కుటుంబాన్ని నిలబెట్టిన వ్యక్తి శేఖర్! ఆ రోజు శేఖర్ తనలాంటి భయాలతో తనని పట్టించుకోకపోతే ఈ పాటికి తన కుటుంబం మొత్తం మరుభూమిలో మట్టిగా కలిసిపోయేది.
అయితే శేఖర్ మానవతా దృష్టితో తనపట్ల వ్యవహరించిన తీరువల్ల, వ్యక్తిగతంగా నష్టం వాటిల్లలేదు.
కానీ ఇక్కడ శేఖర్ జీవితమే చీకటిలో అడుగుపెడుతోందన్న భయం సారథిని బాగా పీడిస్తోంది.
ఓ లంగా, ఓణీ వేసుకున్న పద్నాలుగేళ్ల అమ్మాయి రెండు ప్లేట్లలో ఫలహారాలు తీసుకొచ్చి టేబుల్ పైన పెట్టింది.
“ఇవన్నీ ఎందుకండీ?” అన్నాడు సారథి, ఆ మాత్రం ఖర్చు కూడా తమకోసం మాస్టారు చేయటం ఇష్టం లేనట్టుగా.
ఒక విధంగా ఆలోచిస్తే ఆ ఖర్చుతో మాస్టారి కుటుంబానికి ఒక పూట గడిచిపోతుంది.
“ఏదో మా ఆనందం కోసం బాబూ!”
మాస్టారు నిలబడే వున్నారు. అది కాస్త ఇబ్బందిగా అనిపిస్తోంది స్నేహితులిద్దరికీనూ.
ఎవరో ముత్తయిదువ గుమ్మంలోంచి తొంగి చూసింది.
“అమ్మాయిని తీసుకురామ్మా” అన్నారు మాస్టారు.
ఆవిడ లోపలి కెళ్లిపోయింది.
“తల్లిలేని పిల్ల నా బిడ్డ. ఈ సమయంలో ఇరుగుపొరుగు వారి సాయం అర్ధించక తప్పదు కదా!” అన్నారు వ్యధగా.
అంతలోనే ఆవిడ పెళ్లికూతుర్ని తీసుకొచ్చి చాపమీద కూర్చోబెట్టింది.
శేఖర్ మెల్లిగా తలెత్తి పెళ్లి కూతుర్ని చూసేడు.
తన కళ్లనే తనే నమ్మలేకపోయేడు. మాస్టారమ్మాయి అంటే ఏదో అనుకున్నాడు. కానీ అంతటి సౌందర్యవతి అని ఊహించలేకపోయేడు. చూడకుండానే మాటిచ్చినందువల్ల తనేం నష్టపోలేదు.
ఆనందంతో శేఖర్ సారథిని చూడమన్నట్లుగా చేత్తో పొడిచేడు.
శేఖర్ని నవ్వుతూ చూసి సారథి ఆమెకేసి చూసేడు.
అంతే!
అతనికి మతిపోయింది.
ఆశ్చర్యంతో కళ్లు పెద్దవయినాయి. గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్లయింది,. కాళ్ల క్రింద భూమి కదులుతున్నట్టుగా కంపించిపోయేడు. సన్నగా చిరు చెమటలు పడుతున్నాయి.
సరిగ్గా అదే సమయంలో ఆమె తలెత్తి చూసింది.

ఇంకా వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *