May 26, 2024

చెరగని బాల్యపు పద చిహ్నాలివి

సమీక్ష: క్రాంతి శివరాత్రి

పుట్టినూరు కన్నతల్లితో సమానమంటారు. పుట్టినూరును వదిలేసిన జీవితం తెగిన గాలిపటమైపోతుందంటారు. ఊరు మారినవాడి పేరూ, గీరు అన్నీ మారిపోతాయంటారు. ఇవన్నీ ఏమో గానీ, ‘సొంతూరి’ పేరు వినగానే మాత్రం ఓ కెరటమేదో మనసుని చల్లగా తాకుతుంది. అది, వెంటనే మన మధురమైన బాల్యాన్ని గుర్తుకు తెప్పిస్తుంది. మన మీద ఏ బరువులు మోపని ఆ చిన్నతనాన్ని తలచుకొని ఆనందపడేలా చేస్తుంది. ఒకప్పటి ఇరుకు ఇల్లే గానీ, కడు పేదరికం తో బతికిన రోజులే గానీ.. ఇప్పటికీ మనకేదైన బాధనిపిస్తే, బాల్యపు జ్ఞాపకాలను గుర్తు చేసుకొని కాసేపు సంతోషపడతాం. అలా సొంతూరితో, పుట్టీ పెరిగిన ఇంటితో, అక్కడి మనుషులతో ముడిపడిన తియ్యని బాల్య జ్ఞాపకాలను మరోసారి గుర్తుకు తెచ్చేవే ఈ ‘నల్లగొండ కథలు’.

మొత్తం 21 కథలున్న ఈ పుస్తకం లో మొదటి రెండు, మూడు కథలతోనే.. రచయిత మన చేతుల్ని గట్టిగా పట్టుకొని బాల్యానికి లాక్కెళ్తారు. అక్కడే బలంగా పట్టేసుకొని, మన పక్కనే కూర్చొని ఒక్కో కథను ఆగకుండా.. పుస్తకమంతా చదివిస్తారు. సొంతూరు మట్టి వాసనను గుర్తు చేస్తారు. ఇరుకిరుకుగా కట్టుకునే ఇళ్ళు, ఆ పక్కనే ఉండే పశువుల పాకలను మన కళ్లముందు కట్టినట్లు చూపిస్తారు. అలాగే నాన్న తెచ్చినా కొత్త షూస్ ను చూసి సంతోషంతో ఎగిరి గంతేసిన రోజులు, రెండు రూపాయలకు గంట సేపు రెంటుకి తీసుకొని తొక్కిన సైకిలు, దసరా సెలవుల్లో ఆడిన ఆటలు, పసితనపు అమాయకత్వం తో చేసిన పనులు, రాత్రుళ్లు ఆరుబయట పడుకొని వెన్నెల్లో చుక్కల్ని చూస్తూ..కథల్ని చెప్పుకున్న రోజుల జ్ఞాపకాలను మన కళ్ళల్లో మెరిసేలా చేస్తారు. రెక్కలుంటే బాగుండు, ఇప్పటికిప్పుడు పుట్టినూరుకి వేగంగా వెళ్ళీ, ఒకప్పటి జ్ఞాపకాలన్నింటినీ వెతుక్కోవాలనిపించేలా చేసే ఈ కథల గురించి ఇంకెంత చెప్పినా తక్కువే! వీటిని చదువుతున్నంతసేపు మనమూ వాటిల్లో పూర్తిగా లీనమైపోతాం. ఆ కథల్లో మనమొక పాత్రవుతాం. ఇదంతా మన కథే కదా అని అనుకుంటాం.

అలా వాటిని చదువుతున్నంతసేపూ, మనల్ని మనం మళ్లీ దోలాడుకుంటున్నట్టు, మనకి మనం మళ్లీ దొరుకుతున్నట్టు అనిపిస్తుంది. నల్లగొండ కథలను చదవడం పూర్తైన చాలా రోజుల వరకూ కూడా ఆ కథలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

బాల్యం గురించి ఎందరు ఎంత రాసినా, చెప్పినా, ఇంకా ఏదో మిగిలే ఉంటుంది. అందుకే బాల్యం, అందరికి మధురం. పిల్లల్నీ, వారి అమాయకమైన బాల్యాన్నీ నిండు మనస్సుతో ప్రేమించే వాళ్ళే, ఇలాంటి కథలను ఇంత అందంగా రాస్తారు. చివరగా.. ఈ ఉరుకుల, పరుగుల జీవితంలో.. మధురమైన బాల్యం ఎవరికీ తప్పిపోకూడదనే తపన తో, ఇంత మంచి కథలను మనకందించిన రచయిత మల్లికార్జున్ నుంచి మరిన్ని మంచి కథలను ఆశిస్తూ.. మనసారా అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *