December 6, 2023

బామ్మకి ఇచ్చిన మాట

రచన: ప్రభావతి పూసపాటి

“అమ్మ! తలనొప్పిగా వుంది, కొంచెం సేపు పడుకొంటాను”.. అంటూ విసురుగా క్రికెట్ బాట్ పడేసి గదిలోకి వెళ్ళిపోయాడు వాసు. ఈ రోజు మ్యాచ్ వుంది సాయంత్రం వరకు రాను అన్న కొడుకు గంటకే ఇలా వచ్చేయటం కలవరపరిచింది. కాఫీ కలుపుకొని వాడి గదిలోకి వెళ్ళాను.. పడుకోకుండా అసహనంగా కదులుతున్నాడు. పక్కన కూర్చొని “ఏమైంది నాన్న ? ఎందుకు డిస్టర్బెడగా వున్నావు ?” అని లాలనగా అడిగాను..
అంతా ఆ ప్రవీణ్ గాడి వల్లేనమ్మ, కొంచెంసేపు నన్ను ఒంటరిగా వదిలేయి అమ్మ ” అని అటు తిరిగి పడుకొన్నాడు. తలుపు దగ్గరికి వేసి హాల్ లోకి వచ్చి కూర్చున్నాను,. ఎదురుగ వున్న మా ఫ్యామిలి ఫోటోలో బుంగమూతితో వున్న వాసుని చూస్తుంటే మనిషి ఎదిగాడు గాని ఇంకా ఆ ఫోటోలో వున్న 8 ఏళ్ళ కుర్రాడి లాగే అనిపిస్తున్నాడు. ఆ ఫోటో అమెరికా వచ్చిన కొత్తల్లో తీయించుకున్నది. అప్పుడే 20 ఏళ్ళు అయిపోయాయి..
అమెరికా వచ్చిన కొత్తల్లో వాసు ఇక్కడ స్కూల్ కి, ఇక్కడ వాతావరణానికి, భాషతో అడ్జస్ట్ అవడానికి చాలా కష్టపడ్డాడు. వాడి ఏకైక ఫ్రెండ్ వాడి బామ్మ మాత్రమే. ఆవిడ పోయాక పెద్దగా ఎవ్వరితోను కలిసేవాడు కాదు., కానీ ఈ మధ్య యూనివర్సిటీ చేరినప్పటినుంచి కొత్తగా ప్రవీణ్ పరిచయమైనప్పటి నుంచి చాలా ఉత్సహంగా ఉంటున్నాడు. ప్రతి విషయము ప్రవీణతో కలిసి చేయడానికే ఇష్టపడుతున్నాడు. ఈ మధ్య కాలంలో ఓ సాయంత్రం ప్రవీణ్ ని ఇంటికి కూడా తీసుకొని వచ్చాడు. ప్రవీణ్ ని చూడటం మొదటిసారైనా కూడా ఎన్నో ఏళ్ళు పరిచయమున్న వాడిలా అనిపించాడు. ఇంతలో ఏమైందో..
ఆలోచనలో ఉండగానే శ్రీధర్ కూడా “వాసుకి ఏమైంది శారదా ? ఎందుకలా వున్నాడు ?”అంటూ హాల్లోకి వచ్చాడు. తండ్రి గొంతు విని గదిలోంచి బయటికి వచ్చాడు వాసు.
వాట్ హప్పెనెడ్? ఎనీ థింగ్ రాంగ్ ? పక్కనే కూర్చున్న కొడుకు భుజాలమీద చెయ్యి వేసి అనునయంగా అడిగాడు, “ఎస్ డాడీ. ప్రవీణ్ నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, వాడికి ఎదో నాలో నచ్చలేదు అనుకొంటా.. అది స్ట్రెయిటుగా నాతోనే చెప్పవచ్చుగా, నాతో మాట్లాడకుండా ఈ రోజు గ్రౌండ్ లో నన్ను అవమానించాడు. ఇన్నాళ్లు ఇంత క్లోజగా వున్నాము కదా. సడెన్గా ఏమైనట్టు. ఏమున్నా మాటల్లో చెప్పాలిగాని ఆలా ఆలా సైలంట్ గా ఉంటే ఏమిటని అర్థం. మా ఫ్రెండ్స్ మధ్య నన్నో విలన్లా ట్రీట్ చేసాడు. నో ఐ కాంట్ టేక్ ఇట్,,.. ఇంక అక్కడ ఉండలేక వచ్చేసాను”… కోపంతో వాడి మొహం ఎర్రగా అయిపోయింది.
ఓకే.. ఓకే.. రిలాక్స్ వాసు. శారద లంచ్ రెడీ చెయ్యి. నేను వెళ్లి ప్రవీణ్ ని కూడా తీసుకొని వస్త్తాను.. కలిసి లంచ్ చేద్దాము.. అంటూ వాసు జవాబు కోసం కూడా ఎదురు చూడకుండా కీస్ తీసుకొని వెళ్ళిపోయాడు.
నేను కూడా ఇంక అక్కడ కూర్చోలేను అన్నట్టు వంట చేసే మిషతో లేచి కిచెన్ లోకి వచ్చేసాను. వాసు మాటలు వింటుంటే గతంలో ఇవే మాటలు శ్రీధర్ నోటినుండి వచ్చిన మాటలు గుర్తుకు వచ్చాయి. తమని అందరికి దూరం అయ్యేలా ఇంత దూరం వచ్చేలా చేసిన ఆ మాటలు ఎలా మర్చిపోగలదు. మనసు గతంలోకి పరుగులు తీసింది………..
శ్ర్రేధర్, శరత్ మంచి ప్రాణస్నేహితుల్లా ఉండేవారు. శరత్ కి శ్రీధర్ ఎంత ఇష్టమో అంటే తమ మధ్య వున్నస్నేహ బంధాన్ని తన చెల్లెలు అయిన శారద ని అంటే నన్ను శ్రీధర్ కి ఇచ్చి పెళ్లిచేసి బావగారిగా విడదీయలేనంత అనుబంధం గా మార్చేసుకొన్నాడు. చాలా రోజులవరకు ఆ అనుబంధం ఆప్యాయత అల్లాగే వున్నాయి,, కానీ కాలం అన్ని సార్లు ఒకేలా వుండదన్నట్టు, మనుషుల ప్రవర్తన కూడా అన్ని వేళల ఒకేలా ఉండదు కదా. కొత్త, కొత్త మనుష్యుల రాకతో, వున్నవారు పోవడంతో శరత్ లో మార్పు అతి సహజంగా వచ్చేసింది. శ్రీధర్ చాలాసార్లు తనవంతు ప్రయత్నంగా తమ మధ్య వస్తున్న దూరాన్ని తగ్గించడానికి అనేక విధాలా కృషి చేసేవాడు. తనకి రక్తం పంచుకొని పుట్టిన తోబుట్టువు అన్నయ్య అయినా శరత్ తో మనసు విప్పి చెప్పేటంత చనువు నాకు లేదు. ఆ రోజు ఇంకా తనకి గుర్తు వుంది. తమతో చదువుకొన్న స్నేహితుడి పెళ్లి అని వెళ్లిన శ్రీధర్ పెళ్లి అయ్యేంతవరకు ఉండ కుండా ముందే వచ్చేసాడు. కారణం అక్కడ తారసపడిన శరత్ (అన్నయ్య) శ్రీధర్ ని పలకరించలేదుట. శ్రీధర్ ఉనికి భరించలేను అన్నట్టు ప్రవర్తించాడుట.. అంతలా కోపం రావడానికి తాను చేసిన తప్పేంటో ఎంత ఆలోచించినా శ్రీధర్ కి బోధపడలేదు. సిగ్గువిడిచి ఇంటికి వెళ్లి కారణం తెలపమని అడిగినా కూడా శరత్ మౌనమే సమాధానమయ్యింది.
ఉరిశిక్ష వేసిన ఖైదీకి కూడా చివరిసారిగా తమ మాట తెలుపుకొనే అవకాశం ఇస్తారు, కనీసం బంధం తెంపే ముందు అయినా దానికి తగిన కారణం తెలపాలన్న ఇంగితం కూడా కోల్పోయాడు మీ అన్నయ్య. అసలు బంధం నిలబెట్టుకోవాలన్న తపన కన్నా తన పంతమే ముఖ్యం అని అనుకొంటున్న శరత్ కి అనుబంధాల విలువ తెలిసొచ్చేంత వరకు మనం కూడా వాళ్ళకి దూరంగానే ఉందాము అన్న శ్రీధర్ మాటలు ఇంకా చెవిలో వినపడుతున్నట్టేవుంటాయి.
ఇంక ఇల్లాంటి వాతావరణం లో మనసులని కష్ట పెడుతూ ఉండటం కన్నా, ఏ అమెరికా జాబ్ ఇన్నాళ్లు వద్దనుకొన్నాడో, అక్కడికి కొంత కాలం వెళ్లి ఉంటే మనుషుల్లో కలిగిన మనస్పర్థలు తొలగి మనసులు కలుస్తాయని ఆశ పడి ఇక్కడికి వచ్చేశాడు. కొన్నాళ్ళు ఇక్కడినుంచి కూడా సంబంధాలు మెరుగుపడాలని తాపత్రయపడ్డాడు. కానీ, ఇంక అవి కూడా అడియాసలు అవుతుండటం తో నన్ను, తల్లిని, వాసుని తీసుకొని శాశ్వతంగా ఇక్కడ కి వచ్చి స్థిరపడిపోయారు.
మళ్ళీ ఇన్నాళ్ళకి అల్లాంటి తపనే వాసులో చూస్తోంది. ఈ సారి మాత్రం తాను చూస్తూ ఊరకుండ కూడదు. అప్పుడు శ్రీధర్, శరత్ విషయంలో తను ఎంత ప్రయత్నించినా తన ఫలితం సఫలీకృతం కాలేదు. దాని పర్యవసానం శ్రీధర్, తను ఎంత మానసిక క్షోభని అనుభవించారో అయినవాళ్ళు ఉండి కూడా పరాయివాళ్ళల్లా ప్రవర్తించటం ఎంత నరకమో తనకి బాగా తెలుసు. ఇప్పుడు ప్రవీణ్ వాసుతో మాట్లాడకపోయినా కనీసం ఎందుకు ఇలా ప్రవరిస్తున్నాడో తెలుసుకోవటం కనీస భాద్యత. శ్రీధర్ కూడా నాలాగే ఆలోచించి నట్టు వున్నాడు అందుకే ప్రవీణ్ ని తీసుకు రావడానికి వెళ్ళాడు. మంచిది రాని ఎదురుగ కూర్చొని మాట్లాడితే ఎటువంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. “ఏమి చేస్తున్నారు ఆంటీ ? ఓహ్ !నాకిష్టమైన గుత్తివంకాయ కూర చేశారే” అంటూ చనువుగా కిచెన్ ఐలాండ్ వరకు వచ్చి అడుగుతున్నాడు ప్రవీణ్.
ప్రవీణ్ చాలా ప్రశాంతంగా అసలు ఏమి జరగనట్టే మాట్లాడుతున్నాడు. ఎప్పటిలాగానే ప్రవీణ్ ని చూస్తుంటే బాగా ఆత్మీయుణ్ణి చూసిన భావం కలుగుతోంది.
“కమాన్ యంగ్ మాన్, హవ్ యువర్ సీట్ ” శ్రీధర్ డైనింగ్ టేబుల్ దగ్గర అన్ని సర్దుతూ పిలిచాడు. వాసు కూడా ఫ్రెషప్ అయ్యి వచ్చి కూర్చున్నాడు. శ్రీధర్ తన కబుర్లతో వాతావరణాన్ని తేలికపరిచాడు.
వాసు, ప్రవీణ్ కూడా నవ్వుతు భోజనం ముగించి హాల్ లోకి ఫ్రూట్ ట్రే పట్టుకొని వచ్చి కూర్చున్నారు. శ్రీధర్ పెద్ద ఉపోద్ఘాతం లేకుండా తనకి శరత్ కి జరిగిన విషయం చెప్పాడు. ఇద్దరి మనుషుల మధ్య బంధం అనుబంధంగా మారడానికి తమ తమ పాత్ర ఎంత ముఖ్యమో, బంధం తెంపే ముందు కూడా దానికి తగిన కారణం తెలపటం కూడా అంతే ముఖ్యం అని నా అభిప్రాయం. ఇప్పటికి శరత్ ఆంటే నాకు అభిమానమే. శరత్ మాట్లాడి ఉంటే పరిస్థితి ఇంత దూరము వచ్చేది కాదు.. నీకు వాసుకి ఏదైనా అభిప్రాయ బేధాలు వస్తే కూర్చుని మాట్లాడుకుంటే మంచిది అని ప్రవీణ్ ని ఉద్దేశిస్తూ “నీకు వాసు విషయములో ఏదైనా క్లారిటీ కావాలంటే ఎదురుగ ఉన్నాడుగా ఇప్పుడే అడుగు ” అన్నాడు.
” క్లారిటీ రావలిసింది వాసు విషయములో కాదు అంకుల్, మీ మనసులో ఏముందో తెలుసు కోవడానికి నేను వాసు కలిసి ఆడిన చిన్న నాటకం. ఇప్పటికి కూడా మీరు శరత్ గారిని ఎంత అభిమానిస్తున్నారో, మీకు ఆయన మీద ఎటువంటి అభిప్రాయం ఉందొ తెలుసుకోవాలని చేసిన చిన్న సాహసం ఇది.”గుక్కతిప్పుకోకుండా చెప్పాడు ప్రవీణ్.
శ్రీధర్, నేను ఒక్కసారి ఉలిక్కిపడ్డాము. వాసు, ప్రవీణ్ చిన్నగా సర్దుకొని కూర్చున్నారు. “అవును డాడీ.. బామ్మ బ్రతికున్నన్నాళ్లు నువ్వు సొంత మనుషులని, సొంత దేశాన్ని విడిచి వచ్చేసావు అని ఎన్నోసార్లు నాతో అని కుమిలిపోతూ ఉండేది. ఏమైనా చేసి వాడిని, నా కోడలిని వాళ్ళ అన్నగారితో కలపరా.. అదే నేను కోరుకునేది, ఇంత విజ్ఞానం పెరిగింది కదా మనుష్యల మధ్య దూరం తగ్గించే మార్గం ఎదో ఒకటి చూపించమని రోజు కనపడని ఆ దేవుడిని అడుగుతూనే వున్నానురా, నేను బ్రతికి ఉండగా వాళ్ళనందరిని ఒకటిగా చూస్తానో లేదో అని.. ఆలా చూడటమే తన ఆఖరి కోరిక అని ఎన్నోసార్లు నాతొ అంటూ ఉండేది. కానీ ఆ వయసుకి తను పడే ఆవేదన ఏంటో అర్థం అయ్యేది కాదు, అమ్మ ఎందుకు దిగులుగా ఉంటుందో అర్థం చేసుకొనే సమయానికి బామ్మ మనల్ని వదిలి వెళ్ళిపోయింది, కానీ బామ్మ మాటలు ఆలోచించేలా చేసాయి. గూగుల్, ఫేస్బుక్ సహాయం తో శరత్ మావయ్య కొడుకైన ప్రవీణ్ ని పట్టుకోగలిగాను, వాడు నేను చదివే యూనివర్సిటీ లోనే జాయిన్ అయ్యేలా ప్లాన్ చేశాను.. అంటూ నా భుజాల చుట్టూ చెయ్యి వేసి నన్ను దగ్గరికి తీసుకొన్నాడు.
ప్రవీణ్ కూడా లేచి వచ్చి నా కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. అనుకోకుండానే నా చెయ్యి వాడి తల నిమురుతోంది. నా చెయ్యే గట్టిగ పట్టుకొని “అవును అత్తయ్య వాసు ఎవరో తెలిసాక మిమ్మలన్దరిని కలవాలని పించింది. నాన్న మీరు కలవాలని వచ్చినన్నాళ్లు చాల బెట్టుగా వుండే వారని, అది భరించలేకే మీరు దూరంగా వెళ్లిపోయారని అమ్మ మాటల్లో తెలిసింది. నేను చెల్లి ఎప్పుడైనా సరదాకు దెబ్బలాడుకొన్న, మాట్లాడకుండా వున్న నాన్న చాల తల్లడిల్లిపోయేవారు, బహుశా అప్పుడు ఆయనకీ ఆయన చేసిన తప్పు తెలిసిందేమో, వయసు తో పాటు బింకం కూడా చాలా తగ్గింది, కానీ మిమ్మల్ని కలవాలంటే ఎక్కడ వున్నారో తెలియదు. ఇంతలో చెల్లి పెళ్లి చెయ్యాలని మాట్రిమోనీ లో చూస్తుంటే వాసు విషయాలు, మీ వివరాలు చదివి చాలా సంబరపడిపోయారు, ఆ వివరాలన్నీ నాకు చెప్పి ఎలాగైనా మిమ్మలిని కలవాలని తొందరపడ్డారు. కానీ మావయ్య మనసు తెలుసుకోకుండా ఎలా కలపడమా అనుకొంటున్న తరుణం లో వాసు నుండి ఫోన్ వచ్చింది.. ఇక మిగిలిన సంగతులు మీకు తెలిసినవే. అని లాప్ టాప్ ఓపెన్ చేసి అందరి ఫోటోలు చూపించాడు.
సంతోషం తో నాకు, శ్రీధర్ కి మాట రాలేదు. జరిగింది అర్థం అవ్వటానికి కూడా చాలా సేపు పట్టింది. ప్రవీణ్ “అత్తయ్య, మావయ్య వాసుకి మా చెల్లెలు నచ్చింది కానీ మీకు కూడా నచ్చి, మీకు మాతో వియ్యం పొందటం అంగీకారమే ఐతే, మనం కూడా కొంచెం బెట్టు చూపించి నాన్నకి అంగీకారం తెలుపుదాము..
ఈ రోజు మళ్ళీ వస్తుందని నేను అనుకోలేదు అన్నయ్యని, వదినని కలవడం అదీ ఇలాగ మళ్ళీ పిల్లల వలన వియ్యమందడం కలలా అనిపిస్తోంది. ఇప్పటికి ఇప్పుడే వాళ్లతో మాట్లాడాలని మనసు ఉవ్విళూరుతోంది. నా మనసు తెలిసినట్టు వుంది “నాన్న కూడా ఖచ్చితంగా సంతోషిస్తారు అత్తయ్య. నువ్వు, మావయ్య తనని క్షమించారు అని తెలిసి.. ఇప్పుడు వాళ్ళకి ఇండియాలో రాత్రి కదా అత్తయ్య. తెల్లవారుతూనే కాల్ చేద్దాము “.
వాసు, ప్రవీణ్ తాము అనుకొన్నది ఇంత తేలికగా అయ్యిందని తెలిసి సంతోషం తో ఒకరిని ఒకరు కౌగిలించుకున్నారు. ఫొటోలో వున్న బామ్మకి కూడా సంతోషం కలిగిందన్నట్టు ఫోటోకి వున్న దండ ఊగిసలాడుతోంది. ” ఇన్నాళ్ళకి బామ్మకి ఇచ్చిన మాట నిలబెట్టడంలో నీ వంతు సహకారం కూడా మర్చిపోలేనిది ప్రవీణ్. పద ఇండియా ప్రయాణానికి ఏర్పాట్లు చూద్దాము”. అంటూ సంతోషం నిండిన మనసుతో బామ్మకి మనసులోనే కృతజ్ఞతలు తెలిపాడు.

2 thoughts on “బామ్మకి ఇచ్చిన మాట

  1. Nice narration.. Chala chinna vishayale tedaloste peddavai bandhalu tegipotayi.. Nijame kurchoni matladukunte chala sulabhanga manspardhalu tolagipotayi. Pillalu kalipina Bandham. Chala bagundi katha.. Congratulations Prabha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

January 2021
M T W T F S S
« Dec   Feb »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031