June 25, 2024

రాజీపడిన బంధం – 11

రచన: ఉమాభారతి కోసూరి

ఉన్నట్టుండి అర్ధమయింది. నాకు ఇలా సీమంతం కూడా ప్లాన్ చేసింది చిత్ర అని. చిత్ర, రమణిల వంక చూసాను. చిరునవ్వులే జవాబుగా నన్ను నడిపించుకుని లోపలి వరకు తీసుకువెళ్ళారు.
శ్యాం, ఆనంద్, నాన్నగారు, మామయ్య కూడా కాస్త ఎడంగా నిలబడి ఉన్నారు. దూరం నుండే వారికి రమణి నమస్కారాలు తెలిపింది….
**
అంతా కలిసి నా ‘సీమంతం’ నిర్వహించారు. పద్ధతిగా, గాజులు వేయించారు. అమ్మ, అత్తయ్య, మిగతా పెద్దవాళ్ళ నుండి ఆశీర్వాదాలు కూడా అందాయి.
అతిముఖ్యమైన అంశం అంటూ, శ్యాం చేత అక్షతలతో పాటు మెడలో నల్లపూసలు, పూలుదండ వేయించారు.
ఎంతో శ్రావ్యంగా సాగిపోతున్న మధురాలాపనలో ‘ఈ అతిముఖ్యమైన అంశం’ మాత్రమే ఓ అపశ్రుతి దొర్లినట్టుగా అనిపించింది. ‘పెళ్ళైన రోజు నుంచి నా జీవితంలో అశాంతి నింపి, నాకు, నా బిడ్డలకి అపాయాలు కల్పిస్తూ, పైశాచికంగా నాపై అత్యాచారం చేసే ఈ పెద్దమనిషి శ్యాంకి, కనువిప్పు కలిగేలా దేవుడే బుద్ధి చెప్పాలి’ అనుకుంటూ కోపంతో మౌనంగా అయిపోయాను.
**
సందీప్ పుట్టినరోజు వేడుకలయ్యాక అలసిపోయి ఇల్లు చేరాము.
ఆ రాత్రి చిత్ర దగ్గరే ఉండి, మరునాడు ఇంటికి వచ్చింది రమణి. రమణి ఢిల్లీ రాక పట్ల అందరూ సంతోషం వెలిబుచ్చారు.
సందీప్ ని దగ్గరికి పిలిచి, “అరేయ్ హీరో, నీ బర్తడే పార్టీ కోసమే హైదరాబాద్ నుండి వచ్చాను. నాతో మాట్లాడకుండా తిరుగుతున్నావే! ఇలా వచ్చి కూర్చుని నాకు కబుర్లు చెప్పు” అంటూ మొహాన పడుతున్న వాడి జుట్టు పైకి తీసింది రమణి.
“మొత్తానికి, మీ ముగ్గురు తరుచుగా ఇలా కలవడం బాగుందమ్మా” అన్నారు నాన్న.
రెండురోజులు మా ఇంట గడిపాక, మూడోరోజు అమ్మావాళ్ళతో పాటు రమణి కూడా తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయింది.
**
చెకప్ కి, సందీప్ ని డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్లాను.
ఎదుగుదల డబ్బై శాతంలో ఉన్నాడని, ఎడమ కన్ను చూపు నలభై శాతం మాత్రమే సరిగ్గా ఉందనీ, కుడి కన్ను పూర్తి ఆరోగ్యంగా ఉండడం వల్ల బాబుకి పెద్దగా ఇబ్బంది అనిపించక పోవచ్చని నిర్ధారించారు. ఎడమకంటి దృష్టి మెల్లగా మెరుగయ్యే అవకాశం ఉందనీ, రిపోర్ట్ లో తెలిపారు.
మునుపటి ‘మణికట్టు ఫ్రాక్చర్’ దృష్టిలో పెట్టుకొని, సందీప్ ఎదుగుదల విషయంలో పిల్లల స్పెషలిస్ట్ ని చూడమని సూచించారు..
వారి సూచనల ప్రకారం సందీప్ కి ఆహారం, మందులు ఇవ్వడం చేస్తున్నాను. ఈత… శరీర దృఢత్వానికి తోడ్పడుతుందని కూడా సూచించారు..
**
ఇంటికి వచ్చి అత్తయ్యకి, మామయ్యకి సందీప్ విషయం వివరించాను. బాబుకి తగిలిన దెబ్బల వల్లే ఈ రోజు వాడి కంటిచూపుకి, వాడి ఎదుగుదలకి కూడా ఆటంకం కలిగిందని, ఆ దెబ్బలకి కారణం బాబు తండ్రి శ్యాం అని కూడా వాళ్ళతో అన్నాను.
వాళ్ళు ఆసక్తిగా విన్నా .. మౌనంగా ఉండిపోయారు.
**
రోజ్-విల్లాలో సీమంతం జరిగి, అప్పుడే నాలుగునెలల అవుతుంది. ఒక్కింత ఆయాసం తప్పించి బాగానే ఉన్నాను. కాస్త ముందే డెలివరీ అవ్వచ్చని అన్నారు డాక్టర్.
**
తెల్లారితే సంక్రాంతి అనగా, నాకు ప్రసవ నొప్పులు మొదలయ్యాయి.
సందీప్ పుట్టిన హాస్పిటల్లోనే, రెండోమారు అందమైన పాపకి తల్లినయ్యాను. బంగారపు బొమ్మలా ఉందని శ్యాం సహా అందరూ పొంగిపోయారు.
చిత్ర, ఆనంద్ ల సంతోషాలకి అవధులు లేవు. పాప తమ గాడ్-చైల్డ్ అంది చిత్ర. వారి ఆప్యాయత నాకూ కొండంత బలానిచ్చింది.
హాస్పిటల్ కి వచ్చినప్పుడల్లా పాపని పొదవి పట్టుకుని కూర్చుంటారు శ్యాం. ‘సంక్రాంతి లక్ష్మి’ పుట్టిందంటూ హాస్పిటల్లో అందరికి స్వీట్స్ పంచారు.
**
ఐదవ రోజు పాపతో ఇంటికి వచ్చాను. ఆపరేషన్ అవడం వల్ల ఓ వారంరోజులు నా కూడా నర్స్ ఉండాలని డాక్టర్ ఆదేశించారు. క్రింద అంతస్తులో ఇప్పుడున్న గదిలోనే పాప ఉండేలా ఏర్పాటు చేయించాను.
పాపతో సాయంగా ఉంటుందని శాంతమ్మని మళ్ళీ కొలువులో పెట్టారు అత్తయ్య.
సందీప్ ని వెన్నంటే ఉంటూ, వాడి పనులు చేయడానికి విశాల అనే మరో ఆయాని పెట్టాము. వాడిని కంటికి రెప్పలా చూసుకోవడమే తన పనని సూచించాను.
పాపని ఎత్తుకోవాలన్నా, ఆడుకోవాలన్నా, నా ఎదుటే గడపేలా ఇంటిల్లిపాదికీ అలవాటు చేసాను…..

“నీకు వొంట్లో తేలికయ్యాకే, పాప నామకరణం మూడో నెలలో అయినా పెట్టుకోవచ్చు. తొందరేమీ లేదు” అన్నారు అత్తయ్య. అమ్మావాళ్ళకి ప్రయాణాల ప్రయాసలు తగ్గించాలని, కొంచెం ఆగి ఒకేసారి పాప నామకరణమప్పుడు రమ్మన్నాను.
**
మరో ఆరువారాలకి పూర్తిగా కోలుకున్నాను. మళ్ళీ అన్ని బాధ్యతలు నావే నని అత్తయ్యకి గుర్తుచేసాను. ఆవిడని విశ్రాంతి తీసుకోమని కోరాను.
శుక్రవారం నాడు పొద్దున్నే, పిల్లలని తీసుకుని అత్తయ్యతో అమ్మవారి గుడికి వెళ్ల్లాను. పేరుపేరునా అన్ని మూర్తులకి అర్చన చేయించి ప్రశాదాలు అందుకున్నాను. తిరిగి వస్తూ మార్కెట్ లో ఆగి, శ్యాం కి మామయ్యకి ఇష్టమైన కూరలు, స్వీట్స్ తీసుకుని ఇల్లు చేరాను…
**
సాయంత్రం భోజనాల దగ్గర పాప నామకరణం గురించి మాట వచ్చింది.
ఇదే మంచి సమయం అనుకొన్నాను.
“చిత్ర, ఆనంద్ ఈ కుటుంబానికి సన్నిహితులు. నాకు చాల కావల్సిన వారు. ఆనంద్ ని అన్నయ్యగా భావిస్తున్నాను. పాపకి నామకరణం చేసే అవకాశం వాళ్ళిద్దరికి కల్పించాలని నా మనసులోని కోరిక” అంటూ అత్తయ్య వంక చూసాను.
ఐదు నిముషాలైనా, ఆ ముగ్గురిలో ఎవరు ఏమీ అనలేదు.
“ఏమంటారు? మీకు ఇష్టం లేకపోతే, సరే. మానేస్తాను. ఏదో ఒకటి చెప్పండి” అన్నాను.
“దాని దేముంది? నీ కిష్టమైతే అలాగే కానీ” అన్నారు శ్యాం.
“మీకేమన్నా అభ్యంతరమా?” అన్నాడు శ్యాం అత్తయ్యవాళ్ళతో.
అంత ఉత్సాహంగా కాకపోయినా, “అలాగేనమ్మా, మాదేముంది! మీ ఇద్ధరూ సరేననుకుంటే, మాకేమీ పర్వాలేదు” అంది అత్తయ్య.
భోజనాలయ్యాక, నా గదిలోనికి వచ్చారు శ్యాం. బాత్రూంలో కాళ్ళు చేతులు కడుక్కొన్నాక పాపని చేతుల్లోకి తీసుకొని ఎదురుగా సోఫాలో కూర్చున్నారు.
పాపని ముద్దులాడుతూ, “అచ్చంగా నీలా అందంగా ఉంది పాప. ఏం పేరు అనుకుంటున్నావు మన పాపకి?” అంటూ నాతో మాట కలపాలని ప్రయత్నిస్తున్నారు.
పాప బట్టలు మడతలు వేస్తూ, “మీ ఇష్టమైన పేరుంటే చెప్పండి” అన్నాను ముక్తసరిగా.
అక్కడినుంచే, “అమ్మా, అమ్మా” అంటూ అత్తయ్యని పిలిచారు శ్యాం.
అత్తయ్య వెంటనే వచ్చారు.
“ఇలా వచ్చి కుర్చోమ్మా, పాపకి ఏం పేరు పెడదాము? నువ్వు చెప్పు” అడిగారామెని శ్యాం.
కాసేపు ఆ పేరు ఈ పేరు అంటూ తర్జనా పడ్డారు.
ఐదు నిముషాలకి, “పాపకి ‘వేద’ అనే పేరు బాగుంది. ‘వేద ప్రసాద్ మధురై’. ఎలా ఉంది?” అడిగారు శ్యాం.
అప్పుడే గదిలోకి వచ్చిన మామయ్య, ఆ పేరు విని, “ఏమ్మా నీలా, మరి నీకు నచ్చిందా ?” అనడిగారు.
తడుముకోకుండా వెంటనే, “బాగుంది, అ పేరు పాపకి” అన్నాను.
చిత్ర, ఆనంద్ ల చేతులమీదుగా పాప నామకరణం జరపించడానికి ఒప్పుకోడం, గదిలోకి వచ్చి పాప పేరు గురించి మాట్లాడ్డం, నాతో సఖ్యతకి శ్యాం చేస్తున్న ప్రయత్నమేనని అర్ధమయ్యింది.
శ్యాంకి తన ప్రవర్తన సరైనది కాదని జ్ఞానోదయం అయుండవచ్చా? అనిపించింది ఓ క్షణం….‘నాదెంతటి అత్యాశ?’ అని మరుక్షణం నవ్వుకున్నాను..
‘నా మనస్సు ఏనాడో ముక్కలైంది. కనీసం మనుగడకి అవసరమైన సరళత్వం లేని భర్తతో ఎలా పొంతన కుదుర్తుంది? లేదంటే జీవితంలోని ఎన్నో అందాలు, ఆనందాలు పరస్పరం పంచుకోవాల్సిన మనిషి కదా! నా ఖర్మ! అనుకొని నిట్టూర్చాను.
**
రాత్రి భోజనాలయ్యి పాపని పడక మీదకి చేర్చాక, చిత్ర నుండి ఫోన్ వచ్చింది..
“నీలమ్మా, రేపు పొద్దున్నే మీ ఇంటికి వస్తాను. నిన్ను పికప్ చేసుకొని, నేను నిర్వహిస్తున్న ‘స్త్రీ – మానోవికాసం’ సెమినార్ కి వెళదాము. వీలు చేసుకొని నువ్వు నాతో తప్పక రావాలి. పాపని చూసుకోను విశాల, ఆయమ్మ కూడా ఉన్నారుగా! మూడింటికల్లా ఇంటికి వచ్చేయచ్చు” అంది చిత్ర.
ఓ క్షణం ఆలోచించాను. ఆసక్తికరంగానే అనిపించింది. పైగా నన్ను ప్రత్యేకంగా చిత్ర రమ్మంటుంది. “అలాగే, పొద్దున్నే సందీప్ స్కూల్ కి వెళతాడు. నువ్వన్నట్టు పాపని అత్తయ్య, శాంతమ్మ చూస్తారు. టైం చెప్పు. తయారయి ఉంటాను” అన్నాను.
**
పొద్దున్నే చిత్ర వచ్చినప్పుడు, అత్తయ్య ముందు గదిలోనే ఉన్నారు.

కాఫీ కప్పు చిత్రకి అందిస్తూ “నువ్వు, ఆనంద్ – పాపకి నామకరణం చేయాలని మా అందరి కోరిక” అన్నాను. ఆనందంతో అరవిందంలా విచ్చుకుంది చిత్ర ముఖం. ఆశ్చర్యపోయింది. ఆపైన వెంటనే ఆనంద్ కి చెప్పాలంటూ అతనికి ఫోన్ చేసింది.
చిత్ర హడావిడి తగ్గాక గబగబా కాఫీ తాగేసి, అత్తయ్యకి చెప్పి సెమినార్ కి బయలుదేరాము.
**
‘రాష్ట్ర స్త్రీ-సంక్షేమ సంస్థ భవనం’ లోని ఓ మీటింగ్ హాల్లో ఇరవైమంది స్త్రీలు సమావేశమయ్యారు. ఓ పక్కగా టేబిల్ మీద టీ – కాఫీ – ఫ్రూట్స్ పెట్టున్నాయి.
మేమెళ్లిన పావుగంటకు సమావేశం మొదలైంది…..
డాక్టర్. చిత్ర ఆనంద్ గా తనని పరిచయం చేసుకుంది చిత్ర…..
“ఈ రోజు తమ సమస్యలని తోటి వారితో పంచుకుని, పరిష్కార దిశగా పయనించడానికి పదిహేను మంది సిద్దమయ్యారని తెలుస్తుంది. ఒకొక్కరు పది నిముషాల వ్యవధిలో నిస్సంకోచంగా మాట్లాడండి. మీకు సహాయ పడడానికి, మీ సమస్యని ఎదుర్కొనే ధైర్యం మీలో కలగించడానికి స్త్రీ సంక్షేమ సంస్థ ప్రతినిధిలు, సిబ్బంది, నిపుణులు అందుబాటులో ఉంటారు.
ఓ మనస్తత్వవేత్తగా మీ సమస్యలని తప్పక నేను పరిశీలించి సహాయం చేయగలను,” అంటూ అక్కడ చేరిన వారిని ఉద్దేశించి, చర్చకి నాంది పలికింది చిత్ర.
తరువాతి గంటన్నర సేపు మాట్లాడిన పదిమంది – ఒకొక్కరుగా, తమ ఇంట సంసారం అనే ముసుగులో తామెంత క్షోభ పడుతున్నది వివరించారు. కొందరు కన్నీళ్ళ పర్యంతమయ్యారు కూడా.
కలలోనైనా ఊహించని సమస్యలతో మానసికంగా క్రుంగిపోతున్న యువతుల జీవితాల్లోకి తొంగి చూసి, వారి వ్యధలు అర్ధం చేసుకుని, వారి సమస్యలకి అద్దం పట్టిన ఆ కార్యక్రమం ఓ కనువిప్పే అనాలి…
ఆఖరున, స్త్రీ సంక్షేమ కార్యదర్శి, అందరికి కొంత సమాచారం అందించింది.
..బాధితులు తమ సమస్యలని కూలంకుషంగా ప్రస్తావించి, పరిష్కార దిశగా నడిచేందుకు, డాక్టర్. చిత్ర ని సంప్రదించవచ్చని, బాధిత స్త్రీలకు సాంఘిక, ఆర్ధిక సహాయం కూడా సంస్థ వారు అందిస్తారని.. ఆ సమాచార సారాంశం.
కార్యక్రమం ముగిసాక, ఇంటి దారి పట్టాము. కారులో కూడా ఆలోచిస్తూ స్తబ్దుగా ఉండిపోయాను.
“ఏయ్ నీలు, ఆలోచిస్తున్నావా? సెమినార్ లో మాట్లాడిన యువతుల గురించే కదూ! అన్ని సమస్యలకి పరిష్కారాలు ఉంటాయి. సరయిన పరిష్కార మార్గాన్ని ఎంచుకొని ధైర్యంగా ముందుకు సాగాలి. ఇలాంటి వారికి చేయూత నివ్వడానికే డాక్టరుగా నేను చేసే ప్రయత్నం” అంది చిత్ర.
“నేనూ ఈమధ్యనే ఇక్కడ ఈ వాలంటరీ సర్వీస్ మొదలు పెట్టాను. ఇవాళక్కడ మాట్లాడిన వారిలో కొందరో, అందరో, సహాయానికి నా వద్దకు వస్తారు” అంటూ మా ఇంటిముందు కారాపింది.
“ఈ కార్యక్రమంతో, ఇవాళ మరో ప్రపంచమే చూశాను” అంటూ కారు దిగాను.
“మన ప్రపంచంలో మాత్రం త్వరలో పాప నామకరణం ఉంది. చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది.. ఇవాల్టికి రెస్ట్ తీసుకో. బై” చెప్పి సాగిపోయింది చిత్ర.
**
స్త్రీ సంక్షేమానికి సంబంధించిన సమాచారాన్ని, అంతర్జాలంలో పరిశోధనకి సంబందించిన వెబ్సైట్ల జాబితాని అందించారు సెమినార్ వారు. కంప్యూటర్ వాడమని ప్రోత్సహిస్తున్నారు. ఉచిత కంప్యూటర్ శిక్షణ అందిస్తామని కూడా సూచించారు.
కంప్యూటర్ నాకు కొత్తేమీ కాదు. దాని వాడకంలో ఇప్పటి వరకు అయితే ఆసక్తి లేదు. ఆఫీసురూంలో ఉన్న ఒక డెస్క్టాప్, మరో ల్యాప్టాప్ శ్యాం వాడుతారు. ఈ నాటి సెమినార్ తరువాత మాత్రం తప్పకుండా నాకంటూ ప్రత్యేకంగా ఓ కంప్యూటర్ కావాలనిపిస్తుంది.
మానేజర్ గుప్తగారికి ఫోన్ చేసి నా వాడుకకి ఓ ల్యాప్టాప్ తో పాటు సందీప్ రూంలోకి డెస్క్ టాప్ అమర్చాలని చెప్పాను.. రెంటికీ కావాల్సిన ప్రోగ్రాములు కూడా చెప్పాను.
“అలాగే మేడమ్.. ఇవాళే ఆర్డర్ పంపిస్తాను. అన్నీ ఏర్పాటు చేయడానికి వీలయినంత త్వరలో ఆఫీసు నుండి మనిషిని కూడా పంపిస్తాను మేడమ్” అన్నారు మూర్తి గారు
**
పాప పుట్టాక, వొళ్ళు తేలికవ్వడానికి రెండు పూటలా నడవడం మొదలుపెట్టాను. బరువు తగ్గడానికి అమ్మ అప్పుడప్పుడు ఫోన్లో ఎన్నో చిట్కాలు చెబుతుంది. తేనె నిమ్మరసం తాగమంది. అదీ ఇదీ అన్నీ చేయడం మొదలు పెట్టాను.
ఓ పదిహేను రోజులుగా నా ఆహారంలో వచ్చిన మార్పు చూసి అత్తయ్య మాత్రం కోప్పడ్డారు.
“ఏమిటిది నీలు? అస్సలు తినడం మానేసావు. నీవేమి వొళ్ళు చేసావని ఇలా కడుపు మాడుస్తున్నావు? ఇప్పటికీ నాజుగ్గానే ఉన్నావు. బలమైన తిండి తినకపోతే, అందం చందం లేకుండా పోతుంది. నువ్వు మంచి ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉంటేనే, నా మనవలు కూడా బాగుంటారు” అన్నారు పళ్ళరసం గ్లాసు నా ముందుంచుతూ.
**
రాత్రి, పాపని నిద్రపుచ్చుతుంటే నా గదిలోకి వచ్చారు అత్తయ్య.
“చూడమ్మా, పాపకి మూడో నెల వచ్చింది. ఓ వారంలో అన్ని విధాలా పాప నామకరణంకి మంచి ముహూర్తం ఉంది. మీ అమ్మ కూడా ఇక ఆగవద్దు, చేద్దామంటున్నారు. నువ్వు ‘సరే’ అంటే, చిత్ర వాళ్ళకి చెప్పి, ఏర్పాట్లు, పిలుపులు మొదలు పెడదాము” అన్నారు అత్తయ్య.
“అలాగే అత్తయ్యా. నాకు ఓకే. ఇప్పుడు తీరిగ్గానే ఉన్నాను. ముందైతే అతిధుల జాబితా సిద్దం చేద్దాం” అన్నాను.
పాపని విశాలకి అప్పజెప్పి, ఆ జాబితా తయారుచేయడానికి నోట్-బుక్ అందుకుని అత్తయ్య పక్కన జేరాను.
**
శ్యాం ఆఫీసుకి, బాబు స్కూల్ కి వెళ్ళాక గార్డెన్ లో కొత్తగా పెట్టిన పాదులకి నీళ్ళు పెట్టాను. గజేబో లో కూర్చుని రమణికి ఫోన్ చేసాను. బిడ్డలు కలగడానికి ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవాలన్న నిర్ణయం, ట్రీట్మెంట్ జరుగుతున్నప్పనుండీ తల్లి నవుతానన్న ఆశాభావం తనకి ఆనందంగా ఉందన్నది రమణి. దానితో సంతోషాలు పంచుకుంటూ నా పాప నామకరణం ముచ్చట్లు చెబుతుండగా అత్తయ్య హడావిడిగా నా వద్దకు వచ్చారు. ఫోన్ పెట్టేసి ఏమయిందని అడిగాను.
“సుభద్ర అని, దూరపు బంధువు. మీ మామయ్యకి అక్క వరసవుతుంది.
నీకు గుర్తుందో, లేదో..బాబు పుట్టినరోజుకి కూడా వచ్చాడు శ్రీనివాసు. వాడి తల్లే సుభద్ర. ఈ మధ్యనే ఢిల్లీకి వచ్చిందట. కొడుకు వద్దే ఉంటుందట. అకస్మాత్తుగా నిన్న రాత్రి జబ్బుపడి ఆసుపత్రిలో చేరి, ఇందాకనే గుండెపోటుతో చనిపోయిందట.
ఇక్కడ మేమే వాళ్ళకి అయినవాళ్ళం. పెద్దవాళ్ళం. ఫోన్ చేసి సాయం రమ్మని కోరాడు శ్రీనివాసు. బయలుదేరి వెళుతున్నాము. మరి ఈ రోజు మనం చేయాలనుకున్న పనులు నువ్వు చేసేయమ్మా. మన ఫంక్షన్ కి ఎక్కువ సమయం లేదు.. మేము రాత్రికి వచ్చేస్తాములే” అంటూ అంతే హడావిడిగా తిరిగి ఇంట్లోకి వెళ్ళారామె.
**
నాలుగు రోజుల్లో ఫంక్షన్. బాగా తెలిసిన వాళ్లనే ఆహ్వానించాము. అమ్మావాళ్ళు నామకరణం ముందు రోజు వస్తున్నారు. శలవు మీద ఊరు వెళ్ళిన విశాల కూడా ఎల్లుండి కల్లా వచ్చేస్తుంది.
ఇంట్లోకి వెళ్లి, సామాను తెచ్చుకోమని జానకిని సూపర్ మార్కెట్ కి పంపాను. జీవ, రాము చేత ముందు హాల్ నుండి బూజులు దులపడాలు మొదలు పెట్టించాను.
కేటరింగ్ వాళ్ళని కూడా రమ్మని ఫోన్ చేసాను. వంటల విషయం అత్తయ్య అన్నీ రాసి పెట్టినా, ఆమె ఇంట్లో లేకపోవడం కంగారుగానే ఉంది.
సశేషం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *