August 11, 2022

వంటలేనా? కాసిని నవ్వులు కూడానూ

సమీక్ష: వారణాసి నాగలక్ష్మి

‘నేను వడ్డించిన రుచులు – చెప్పిన కబుర్లు’ అంటూ సంధ్య యల్లాప్రగడ గారు కబుర్లనీ వంటల్నీ కలిపి కదంబ మాలలా అందించిన పుస్తకం చదువుతుంటే పెళ్లి పందిట్లో విందు భోజనం ఆరగిస్తున్నట్టనిపించింది. మధ్యమధ్యలో ఆమె విసిరిన చెణుకులు వేడి వేడి పుణుకుల్లా కరకరలాడాయి.
పుట్టింట్లో మడీ దడీ వల్ల- పెళ్లై వెళ్లేదాకా ఏ వంటా రానిస్థితి నుంచి, ఎన్నో రకాల వంటలు నేర్చుకోవడమే కాక తేలిగ్గా చేసుకోగలిగేలా, వెంటనే చేసి చూడాలనిపించేలా చవులూరించే రెసిపీలు సరిపడా సమకూర్చుకుని, ఒక పుస్తకాన్నే వెలువరించే స్థాయికి ఎదగడం చూస్తే మెచ్చుకోకుండా ఉండలేం.
హాస్య రచనలు రకరకాలు. తన మీద తాను వేసుకునే జోక్స్, పేలాల్లా భలే పేల్తాయి. ఈ పుస్తకంలో ప్రతి రెసిపీకీ ఒక ముందుమాట ఉంది. ఆ ముందుమాట ఒక నవ్వుల మూట. అ నవ్వులన్నీ వంట రాక తను పడ్డ అవస్థల గురించి తన మీద తాను వేసుకున్న హాస్యోక్తులు విరజిమ్మిన పువ్వులే. అవి చదివితే ఈమె హాస్యాన్నీ భోజనాన్నీ వైనంగా కలగలిపి ఎలా వడ్డించగలరో తెలుస్తుంది.
సనాతన బ్రాహ్మణ కుటుంబాలలో వెనకటి తరం పెద్దలకి ఉండే చాదస్తాలూ, నగరాల్లోని ఫ్లాట్స్ లో వాళ్లు ఉండాల్సిన పరిస్థితి వస్తే పుట్టే హాస్య సంఘటనలూ నవ్వుముంచుకొచ్చేలా వర్ణిస్తారు సంధ్య. పక్కింటి వాళ్లిచ్చిన ఢోక్లాని గట్టు తుడిచే స్పాంజి అనుకుని బామ్మ గారు చేసిన తుడుపుడు కార్యక్రమం గురించి చెప్పి, అసలు ఢోక్లా ఎలా చెయ్యాలో సరళంగా వివరిస్తారు. చంటి దానికి పళ్లు కదులుతూ ఎంతకీ ఊడక విసిగిస్తుంటే, ఎంత ప్రయత్నించినా రాళ్ల గారె చెయ్యలేక చివరికి పిజ్జాతో పనికానిచ్చారని చదివితే ఫక్కుమనడం మన వంతు. పెళ్లైన కొత్తలో శ్రీవారికి దోశ వేయాలని చూస్తే అది పెనానికి అంటుకుపోయి, ఉండలు చుట్టుకుపోయి, సిగ్గుపడి ముద్దయిపోయిందిట! ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే- దోశ సిగ్గుల మొగ్గవడం, తనకు బొగ్గులు మిగలడం జరిగేదిట. అక్కడినుంచి పల్చని కరకరలాడే దోశల్ని సాధించేదాకా తన ప్రయాణాన్ని వర్ణించి, తను తెలుసుకున్న కిటుకుని నిస్వార్ధంగా మనందరితో పంచుకుంటారామె.
‘వాంగీ బాద్ తో బాదటము’ అనే శీర్షిక కింద ఆమె అందించిన జీవన సత్యాలు… ‘అసలు ఒక్కసారైనా ఫెయిల్ కాకపోతే వారిని అన్నీ తెలిసిన వారిగా పరిగణించరు ఉద్యోగాల్లో.’ ‘ఒక్కసారి కూడా ఫెయిల్ అయిన అనుభవం లేకుండా రిస్క్ మానేజ్ మెంట్ ఎలా చేస్తారని వారిని దూరం పెట్టడం కద్దు’.
ఇంతా చేసి ఈ తత్త్వబోధ అంతా ఎందుకయ్యా అంటే అంతకు రెండురోజుల ముందే ‘వంకాయ డిజాస్టర్’ జరిగినా మళ్లీ వంకాయతో వాంగీ బాత్ చేసే ప్రయత్నం చేస్తున్నందుకు!
‘చిన్న చిన్న నవనవ లాడే వంకాయలకు అన్యాయం చేస్తే మరు జన్మలో వంకాయంటే తెలియని అండమానులోనో ఆఫ్రికా లోనో పుట్టాల్సొస్తుంది’ట.
చిన్నతనంలో గులాబ్ జామ్ చెయ్యాలని అక్కాచెల్లెళ్లిద్దరూ చేసిన ప్రయోగ వర్ణన చదివితే నవ్వకుండా ఉండలేం.
‘ఈ ప్రయోగం మూలంగా తెలుసుకున్న విషయాలేమనగా, నూనెలో వస్తువులు వేసేటప్పుడు బౌలింగ్ లా వెయ్యకూడదు. కుదిరినంత దూరంగా ఉండాలి. కుదిరితే తలుపులకి దగ్గరగా ఉండాలి, పారిపోవడానికి.’
‘నేను సదా ఏదో ఒక డైటులో ఉండి నేను వండే వంట తినకుండా జాగ్రత్తపడటం మామూలే. ఎపుడూ శ్రీవారే తినాలి. తినకపోతే ఫ్రిజ్జిలో దాచి దాచి వడ్డిస్తాం గాని పారేసుకోం బాబూ ఇండియా లోలాగా.’
ఇంటికొచ్చిన విదేశీ అతిథి ‘ఆహా ఓహో అంటూ ముద్ద నోట్లో పెట్టుకుని షాకైపోయాడు. కళ్లలో నీళ్లు. సంతోషంతో కాబోలనుకున్నా. పైపెచ్చు ఈ తెల్లోళ్లమీద ఒకలాంటి ఫీలింగు నాకు కొంచెం ఓవరాక్టింగని.’
ఇంతకీ విషయం ఏమంటే వంకాయలు చేదుగా ఉన్నాయిట. అందుకే ‘నవనవలాడుతూ రారమ్మని కన్నుకొట్టి పిలిచినా కొంతకాలం దూరంగా ఉంచుదామని ఆలోచన’ట! ‘యాక్సిడెంటు అయ్యాక స్టీరింగు పట్టుకుంటే కొంతకాలం ఇలాంటి బెరుకు సహజమే’ట!
తల్లి తనతో ఉన్న రోజుల గురించి రాస్తూ, అలా ఆవిడ వచ్చి తనతో ఉన్నపుడు ‘ఆవిడ చేత ఒక్కపని కూడా చేయించకుండా చూసుకోవాలని’ తనకో కోరిక అంటారు సంధ్య. ఎక్కడికి వెళ్లినా వంటింటి పని తలకెత్తుకునే అమ్మచేత పని చేయించకుండా చూసుకోవాలని కోరుకోవడం, “మన అత్తగార్లు వస్తే కూర్చుని చేయించుకుంటారు. అమ్మలు వస్తే వాళ్లని మనం వంటవాళ్లుగా చెయ్యకూడదని నా నమ్మకం” అనడం చదివితే ముచ్చటగా అనిపించింది. తను చేసిన వాంగీబాత్ అమ్మకి నచ్చి ఎలా చెయ్యాలని ఆవిడ అడగడం, అందులో ఇచ్చిన రెసిపీ చదవకుండా కూతురు చెప్పింది చెప్పినట్టుగా చేసి, అల్లుడికి వడ్డించి భంగపడడం, ‘పాపం కదా’ అంటూ ఆమె తల్లిని అనునయించడం చదివితే ‘అమ్మలంతా ఒకటే కదా.. బుజ్జి తల్లులు’ అనిపిస్తుంది. సంధ్య లాంటి కూతురుంటే బావుణ్నని కూడా అనిపిస్తుంది.
సంధ్య గారి పుస్తకం చదువుతుంటే సుమ సుకుమారమైన ఆమె మనసుని చదువుతున్నట్టనిపించే భాగాలు కూడా ఈ పుస్తకంలో కనపడి మనసు ఆర్ద్రమవుతుంది. అందుకే ‘ఇవి కబుర్లా… వంటలా?? వంటల కబుర్లు. కబుర్ల వంటలు’ అన్నారు పొత్తూరి విజయలక్ష్మి!
వంటల పుస్తకాలేమో వంటే పరమార్ధం అన్నట్టుంటాయి. హాస్య రచనల పుస్తకాలు చదువుతూ కూర్చుంటే ఆత్మారాముడు నా సంగతేమిటని గోల పెట్టచ్చు. ఇది ఉభయతారకమైన పుస్తకం. ఇందులో రెసిపీలు చదువుతుంటే వెంటనే వండేసుకోవాలనిపిస్తుంది. వంట రానివాళ్లని కూడా పకపకా నవ్వించి, గొప్ప ధైర్యాన్నిచ్చి, దగ్గరుండి బ్రహ్మాండంగా వంటచేయిస్తుందీ పుస్తకం. రచయిత్రి సంధ్య యల్లాప్రగడకు అభినందనలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *