August 11, 2022

వెన్నెల విరిసిన నవ్వులు

రచన: కాదంబరి కుసుమాంబ

డజను ఆశల తర్వాత ఎట్లాగో పొత్తిళ్ళలో నిలిచిన పసికూన … ఆడపిల్ల అవడంతో ముక్కు చిట్లించారు.
పేరు పెట్టడం, నామకరణ మహోత్సాహాదుల తలపులకు చోటు లేకుండా పోయింది.
చంటిది దోగాడుతూ వచ్చి, తినుబండారాల వైపు ఆశగా చూసింది, “ఇదిగో అప్పచ్చీ!” అంటూ ఇచ్చిన అప్పచ్చితో పాటు ఆ పొరుగింటి నాపసాని పలికిన పదమే పిల్లదానికి పేరుగా స్థిరం ఐ కూర్చుంది.
ఫలితం అందరూ “అప్పచ్చీ!” అని పిలిస్తే పలికేది. ఇంకేముంది, పల్లెలో అప్పచ్చి అనే ఒకానొక అమ్మాయి పెరిగి పెద్దదయ్యింది.
ఆచార సంప్రదాయాల మీద సంపూర్ణ విశ్వాసం ఉన్న రోజులు అవి. అప్పచ్చి పెరిగి పెద్దది అయ్యింది అంటే అర్ధం, ఏడేళ్ళ పిల్ల అయ్యింది అని అర్ధం.
అష్టవర్షాత్ భవేత్ కన్యా అనే సుభాషిత వాక్కు ప్రకారం, అమ్మాయి పెళ్ళి జరిగిపోయింది.
అప్పచ్చి ఊరు ఇప్పుడు కుందమాల అనే పల్లెటూరు, మహారాష్ట్రంలో ఉన్నది. భర్త ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్ళిన అప్పచ్చికి మరాఠీ భాష రాకపోవడంతో ఎవరితోనూ మాట్లాడకుండా కాలం గడిచిపోయింది.
సంతానంలోని ఒక కూతురికి కుందమాల అనే పేరు పెట్టుకున్నారు అప్పచ్చమ్మ దంపతులు.
*****************,
భర్త కూడా సతీ సమేతంగా తెలుగునాడుకు వస్తుండేవాడు.
“అన్నా, ఏదీ ఓసారి మన అచ్చతెనుగులో నన్ను వచ్చిన అన్ని తిట్లనూ వాడేసెయ్యి, నా చెవుల తుప్పు వదులుతుంది.” అనేవాడు నవ్వుతూ.
పండగలకు పబ్బాలకు అతనికి లీవు దొరకకపోతే సతి అచ్చిని పంపేవాడు.చూస్తుండగానే కొడుకులు, కూతుళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు దోసపాదులా సంసారం, కళ్ళకళలాడ్తూ, అచ్చి బాధ్యతలు తీరి, retire ఐన భర్తతో స్వంత ఊరు చేరింది.
అచ్చి ఇప్పుడు అప్పచ్చమ్మ అయ్యింది. వయసు హుందాతనం ద్వారా ఆమె పేరు మారింది. కానీ కొన్ని అలవాట్లు ఆ మాటకొస్తే చాలా అలవాట్లు, సాంప్రదాయంతో ముడిపడి ఉన్నవి మారలేదు.
ఉన్న ఊరు సాగరతీరం, కనుక ఏడాదిలో అనేకసార్లు చుట్టాలు, స్నేహితులు వచ్చినపుడు, సముద్ర స్నానాలు హుషారు గొలిపే ఆచారం ఆచరణ ఐనది.
*********,
ఈసారి పుష్కర స్నానాలు, సముద్ర స్నానాలు వేడుకల కోసమని ఆబాలగోపాలం ఈ మారుమూల కుగ్రామానికి వచ్చేసారు.
ఈ పల్లెకు దగ్గరలోనే క్రిష్ణమ్మ కృష్ణానది రెండూ కలిసి వస్తున్నవి కాబట్టి, పెద్దలు, కురువృద్ధులు అందరికీ ఎక్కడ లేని ఓపిక వచ్చింది, పిల్లా పీచూక్రికెట్ లాంటి sports కంటె వెరైటీగా కలుగుతున్న ఈ ఆనందం ప్రకృతిని పలకరించగలుగుతున్న కొత్త కోణం
అచ్చమాంబ సంతోషం అంతా ఇంతా కాదు తన సంతానం, మూడు తరాలు అటు అమెరికా నుండి, ఇటు ఢిల్లీ ముంబై చెన్నై ల నుండి అందరూ వచ్చిన సంబరం. బంధుమిత్ర బలగాలు తిరుగు ప్రయాణం కట్టేటప్పుడు కొసరు మొగ్గు సముద్ర స్నానాలు ….. !
ఏ కొండుంభొట్లు ఆజ్ఞ తీసుకోకుండానే యావన్మందీ కృష్ణానదీ పుణ్య పుష్కర స్నానాలు గావించారు. ఇక తరువాయి సముద్రస్నానాలు వెనక్కి మళ్ళి, గ్రామం చేరి, బడలికలు తీర్చుకున్నారు.
యావన్మందీ జలధి వైపు మూటాముల్లె సరంజామా సర్ది, చిన్నపాటి పిక్ నిక్ హడావుడి చేసూ బైలుదేరారు.
మర్నాడు “జై బంగాళాఖాతం … ” అంటూ జేజేలు, కేరింతలు హోరెత్తిస్తూ start ఐనారు. తీరా అందరూ “స్టార్ట్, లెఫ్ట్ రైట్.” అంటూ వేస్తున్న ముందడుగు తటపటాయిస్తూ ఆగిపోయింది అప్పచ్చమ్మ.
“ఇంటో చాలా పని ఉంది. మీరు సముద్ర స్నానం అదీ పూర్తి చేసుకుని రండి. మీరు వచ్చేసరికి నేను వంటా వార్పూ పూర్తి చేసి ఉంచుతాను.” అంటూ నిలబడింది.
అప్పచ్చమ్మ రాకపోతే, ఆమె పిల్లలకు, ముఖ్యంగా . గ్రాండ్ డాటర్స్ అండ్ గ్రాండ్ సన్స్ వర్గంవాళ్ళ ఉత్సాహం కాస్తా చప్పగా చల్లారిపోయింది.
నానీ నిన్న కూడా క్రిష్ణమ్మ స్నానానికి రాలేదు, ఐతే ఇవాళ కూడా రానంటున్నది, ఇదేమిటి, ఉన్న ఊరు, కన్నతల్లి అంటారు,ఈ పరిసర ప్రాంతాలను ఆమె enjoy చేయలేకపోతే ఎట్లా!!?
కొందరికి అప్పచ్చమ్మ ప్రయాణ నిరాకరణోద్యమంలోని అంతరార్ధం అంతుపట్ట లేదు.
*****************,
అప్పచ్చమ్మ రాక నిరాకరణ వెనుక ఉన్న రహస్యం ఆమె భర్తకు తెలుసు. ఐతే అతను ఎప్పుడూ తన పత్నిని వేలెత్తి చూపలేదు. భార్యామణి అంటే అతనికి గల ఆపేక్ష అటువంటిది.
అప్పచ్చిఉరఫ్ అప్పచ్చమ్మ ప్రయాణ నిరాకరణ బ్యాక్ గ్రౌండ్ సీక్రెట్ ఆమెకు మడి దడి ఎక్కువ.చిన్నప్పటి నుండీ దైనందిన కార్యక్రమంగా రంగరించిన హాబీ ఆయె మరి. ఓ పట్టాన ఎట్లాగ మానగలదు ఆమె. అణువు అణువున జీర్ణించుకున్న హాబీ అది. భర్త గుంభనంగా ఊరుకున్నాడు.
కానీ మూడవ తరం వాళ్ళు, వాళ్ళతో పాటు తదితరులూ గొంతు కలిపారు, అచ్చమాంబ రాకపోతే తామూ ఆగిపోతాము అంటూ.
పూనాలో ఉన్న కూతురి బిడ్డ ఇంటర్ పూర్తి చేసి, డిగ్రీ కాలేజీకి వెళ్ళబోతున్నది. పత్రికలకు కథలూ గట్రా రాస్తున్నది కూడానూ. మాతామహురాలు అప్పచ్చమ్మతో అన్నది,
“అమ్మమ్మా! మహాజనం ఒక్కచోట ఒకేసారి చూడటం అదృష్టం. దేవుడు సృష్టించిన ఇంత జనాలను మన రెండు కళ్ళతో చూసే అవకాశాన్ని వదులుకుంటావా!? మనిషి ఒక్కడికే ప్రతి చిన్న విషయాన్ని, ప్రతి విశేషాన్నీ ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంది. ఇంత మంచి experianceని మిస్ ఔతావా, ప్లీజ్, రా అమ్మమ్మా!”
మనుమరాలు కుందమాల పలికినవి నాలుగు మాటలే ఐనా అప్పచ్చమ్మ మనసుపై బాగానే ప్రభావం చూపాయి. ఇన్నాళ్ళూ, ఇన్నేళ్ళూ తను చేసినది పొరపాటు అని అనిపించింది. తను ఇంటి గడప దాటి రాదు, అసలు కారణం మనుషులు ఒరుసుకుంటూ తాకిన స్పర్శ అంటే ఆమెకు ఒక రకమైన ఎలర్జీ. తనను ఎవరైన తాకినట్లు అనిపిస్తే ఒంటి మీద పురుగు పాకినట్లు అనిపిస్తుంది.
కుందమాల వాక్కుల ద్వారా భగవంతుడు తనకు జ్ఞానోదయాన్ని కలిగించాడు. దైవం సృజనాత్మకతకు దూరం అయ్యింది తను, స్వామి తీర్చిదిద్దిన ప్రకృతి, ప్రాణికోటి చైతన్యతరంగాలు వీక్షించ గలిగే భాగ్యం ఉన్నది మానవులకు మాత్రమే. తన మూఢ నమ్మకములు, అవివేకం వలన నేత్రపర్వమైన దృశ్య మాలికలు అగణితం, లెక్కలేనన్ని miss అయ్యింది.
అప్పచ్చమ్మ మనసుకు కించిత్తు లజ్జ కలిగింది. కొంచెం సిగ్గుతో ఆమె హృదయ కమలంముడుచుకుంది, యావన్మందితో కలిసి నడుస్తూన్నప్పుడు తెలియని ఆనందం పొంగిపొర్లుతూంటే విప్పారిన మానస పద్మం అప్పచ్చమ్మ ఆలోచనా సరసులో పరిమళాల వ్యాప్తిని ఆమె భర్త నిగమశర్మ పెదవులపై చిరునవ్వులు వెన్నెలలై విరిసాయి.
*****

1 thought on “వెన్నెల విరిసిన నవ్వులు

  1. thank u Madom – వెన్నెల విరిసిన నవ్వులు – అనే నా కథను ప్రచురించినందుకు, కృతజ్ఞతలు – కాదంబరి కుసుమాంబ ;

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *