April 25, 2024

అత్తమ్మ

రచన: డా.మీరా సుబ్రహ్మణ్యం

స్టాఫ్ రూంలో అదరి ముఖాలు ఏదో తెలియని ఆనందంతో వెలిగి పోతున్నాయి. కారణం ఆరోజు ఒకటో తారీఖు. మధ్యాన్నం రెండు గంటలకల్లా ఆఫీస్ సూపెరింటెండెంట్ గారు ట్రెజరీ నుండి డబ్బు సంచీలో వేసుకుని వచ్చేసారని కబురు అందరికీ తెలిసిపోయింది.
“మనం కూడా వెళ్ళి జీతం తెచ్చుకుంటే ఒక పనైపోతుంది”. ఉత్సాహంగా అంది సరళ. కొత్తగా ఉద్యోగంలో చేరిన ఆ పెళ్ళికాని పాతికేళ్ళ అమ్మాయికి జీతం అందిన రోజే సరదాగా షాపింగ్ చేసి చీరలు కొనుక్కోవడం మహా సరదా.
“అవును. మళ్ళీ అందరూ వచ్చేస్తే గంట సేపు కాచుకోవాలి. రేపు మావాడి పుట్టినరోజు. విడియో గేం కొనిస్తానన్నాను.” హాండ్ బాగ్ భుజానికి తగిలించుకుని లేచింది ఒక అమ్మ.
అది విమెన్ అండ్ చైల్డ్ డెవెలప్ మెంట్ ఆఫీసు.అందులో పని చేసే వారిలో ఎక్కువ శాతం ఆడవాళ్ళే.
స్త్రీలకు , పిల్లలకు సంబంధించిన ఆరోగ్య పరమైన, ఆర్థిక సంబంధమైన విషయాలలో అవగాహన కల్పించడం, చేతి వృత్తులు మొదలైనవి నేర్పడం, బాల్య వివాహాల వలన కలిగే అనర్థాలు వివరించి, చదువుకోమని ప్రోత్సహించడం, యెయిడ్స్ మొదలైన ప్రాణాంతక వ్యాధులు సంక్రమించకుండా తీసుకో వలసిన జాగ్రత్రల గురించిన సూచనలను ఇవ్వడం, తాగుడు అనర్థాల గురించి తెలియచెప్పడం ఇలా వివిధ శాఖలలో పనిచేస్తారు.
నిరాసక్తంగా కిటికీలో నుండి కనబడుతున్న ఆఫీసు గది వైపు చూస్తూ కూర్చుంది లలిత .
వున్నట్టుండి అక్కడ హడావిడి పెరిగింది. అట్టెండర్లూ,గదులు వూడ్చి శుభ్రం చెసే పనివాళ్ళు ఆఫిస్ గది దగ్గర చేతులు కట్టుకుని నిలబడడం కనబడింది.
లలిత తను కూర్చున్న చోటునుండి లేచి నిలబడింది.
అయిదునిముషాలు గడిచేసరికి ఠీవిగా నడుస్తూ ఆఫీసు దగ్గరకు వచ్చిన పరమేశం కనబడ్డాడు.
అతను లోపలికి రాగానే లోపల వేచివున్న వుద్యోగినులు అతనిచూపుల నుండి తప్పుకుని బయట పడ్డారు.
ఒక అటెండర్ పరిగెత్తుకుని వచ్చి, పక్కగా వున కుర్చీ ని తన చేతిరుమాలుతో తుడిచి సూపెరింటెండెంట్ గారి బల్లకెదురుగా జరిపాడు.
“ముందువీళ్ళ జీతాలు ఇచ్చేయండి వాసుదేవరావు గారు.” అంటూ కూర్చున్నాడు పరమేశం.
అయిష్టతను ముఖంలో కనబడనీయకుండా వేరే రిజిస్టర్ తీసి క్లాస్ ఫోర్ ఉద్యోగులను ఒక్కొక్కరిని పిలిచి సంతకం చేయించుకుని నెల జీతం అందించసాగాడు వాసుదేవరావు.
వాళ్ళు తనకు కట్టాల్సిన బాకీని అక్కడి కక్కడే వడ్డీతో సహా వసూలు చేసుకుంటున్నాడు పరమేశం.
ఆ కార్యక్రమం ముగిసాక, కొత్తగా అప్పులు కావలసిన వాళ్ళు వినయంగా ముందుకు వచ్చి పరమేశం ముందున్న కాగితం మీద తాము ఎంత తీసుకున్నారో రాసి సంతకం చేసి, అతను అందించిన డబ్బు ఏదో ధర్మం అందుకున్నట్టు సభక్తితో తీసుకుని కదిలారు.
ఆ కార్యక్రమం ముగిసాక ” రాముడూ వెళ్ళి లలిత మేడం ని రమ్మని చెప్పు.”అని ఒక నౌకరుకి ఆజ్ఞ వేసాడు పరమేశం.
వాడు పరుగు లాటి నడకతో స్టాఫ్ రూంకి వెళ్ళాడు .
అప్పటికే గది బయటకు వచ్చి వేచి చూస్తున్న లలిత అడుగు ముందుకు వేసింది.
“రండి మేడం సంతకం చేయండి” ఆమెను చూడగానే రిజిస్టర్ ముందుకు జరిపాడు వాసుదేవరావు.
పరమేశం చిదానందంగా చూస్తున్నాడు.
లలిత అటు ఇటు చూడకండా తల వంచి సంతకం చేసి మౌనంగా బయటికి నడిచింది.
వాసుదేవరావు అందించిన ఆమె జీతం అందుకుని, లెక్క చూసుకుని కుర్చీలో నుండి లేచాడు పరమేశం.
మోటారు సైకిలు ధడ ధడ లాడించుకుంటూ మహరాజులా కదిలి పోయిన పరమేశం వైపు చూస్తూ కిటికీ దగ్గర నిలబడిన లలిత దీర్ఘంగా నిట్టూర్చింది.
సాయంత్రం అయిదయ్యేసరికి ఉద్యోగులంతా ఇంటికి బయలుదేరారు.
పిల్లలకు కట్ట వలసిన జీతాలు, అపార్ట్ మెంట్ కి కట్టాల్సిన వాయిదాలు, తలితండ్రుల మందులు మాకుల ఖర్చుల గురించి కొందరు లెక్కలు వేసుకుంటుంటే, ఏ బాదరబంది లేని వాళ్ళు మల్టి ప్లెక్స్ లో సినిమా, ఆపైన ఖరీదైన రెస్టారెంట్ లో విందు గురించి ఆలోచిస్తూ కదిలారు.
లలిత పర్స్ తీసి చూసుకుంది. పదిరూపాయలే వున్నాయి. మొదటి తారీఖు నాడైనా ఆటోలో వెళ్ళే భాగ్యం లేదు” అనుకుంటూ బస్ స్టాప్ వైపు నడిచింది.
ఇంటికి వచ్చేసరికి ఆరున్నర అయ్యుంది. క్లబ్ కు వెళ్ళడానికి సిద్ధమై, ఒంటి మీద సెంటు కొట్టుకుంటున్నాడు పరమేశం.
“ఏమిటి ఇంతాలస్యం? నువ్వు వచ్చాక గుడికి వెళ్ళాలని అమ్మ ఎదురు చూస్తోంది.”అన్నాడు అలసిపోయి వాడి పోయిన ఆమె ముఖం వైపు చూడకుండా వాలెట్లో డబ్బులు పెట్టుకుంటూ.
“ఒక రోజు గుడికి వెళ్ళక పోతే కొంప ముణిగి పోదులే. ఏమ్మా లలితా ఆఫీసులో పని ఎక్కువగా వుందా? బాగా అలసటగా కనబడుతున్నావు ముఖం కడుక్కుని రా. కాఫీ కలిపి ఇస్తాను” అంది పరమేశం తల్లి, లలిత అత్తగారు అయిన పార్వతమ్మ.
“అన్నట్టు ఇదిగో నీకు ఈ నెల ఖర్చులకు” అంటూ పరమేశం రెండు వేలు అందించాడు లలిత చేతికి.
“అమ్మా నీ చేతి ఖర్చులకు వుంచు అని ఆమెకో వెయ్యి ఇచ్చాడు.
“నాకేం ఖర్చులు వుంటాయిరా? మందులు అవీ నువ్వే తెస్తావు.మొన్న నీ చెల్లెలి దగ్గరకు నెల్లూరికి వెళ్ళినప్పుడు రెండు జరీ అంచు వెంకటగిరి చీరెలు కొనిపెట్టింది. తిరిగి వచ్చేటప్పుడు రెండు వేలు చేతిలో పెట్టింది. ఉద్యోగం చేసి స్వతంత్రంగా సంపాదించు కుంటోంది కదా. “ అంటూ కొడుకు ఇచ్చిన డబ్బు అందుకుంది పార్వతమ్మ.
“సరేలే ఆ విషయాలు ఇప్పుడెందుకు?” చిరాకుగా అంటూ బయటకు నడిచాడు పరమేశం.
పెళ్ళైన కొద్ది రోజుల్లోనే లలిత సంపాదన మొత్తం పరమేశం చేతిలోకి వెళ్ళడం మొదలైంది. ఆమె బేంక్ అకౌంట్ లో ఒక వెయ్యి కన్న ఎప్పుడూ వుండదు. ఒక చీర కొనుక్కోవాలన్నా, ఆఫీసులో ఏదన్నా సందర్భానికి విరాళం ఇవ్వాలన్నా అతన్ని అడిగి తీసుకోవలసిందే.
అయితే లలిత చేసుకున్న పుణ్యమో ఏమోగానీ అత్త, ఆడబడుచు ఆమెను ఆదరాభిమానాలతో చూస్తారు.
“అత్తమ్మా! మీరు గుడికి వెళ్ళి రండి. ఇంట్లోపని నేను చూసుకుంటాను.” తల్లిలా ఆదరించే అత్తమ్మ అంటే లలితకు గౌరవం, అభిమానం.
తల్లికి ఆరోగ్యం బాగులేదని ఫోను వచ్చినప్పటినుండి దిగులుగా వుంటోంది లలిత.
ఆవిడకు వయసు మీద పడింది.లలిత ఒకత్తే కూతురు. కూతురు పెళ్ళై కాపురానికి వెళ్ళాక ఆమె ఒంటరిగా వుంటోంది. తాను వుంటున్నది చిన్న ఇల్లే అయినా అందులో ఒక భాగం అద్దెకు ఇచ్చి ఆ డబ్బుతో గడుపుతోంది.
తాను సంపాదిస్తున్నా ,అందులో కొంత తల్లికి పంపి ఆదుకునే స్వతంత్రం లలితకు లేదు. భర్త దగ్గర ఆ విషయం ఎత్తాలంటేనే భయం.
అనుకోకుండా ఈ సమస్యకు పరిష్కారం కమల ద్వారా దొరికింది.
“లలితా మీరు సంగీతంలో డిప్లొమా చేసారుట? ఈ మధ్యనే తెలిసింది నాకు. మా అమ్మాయికి సంగీతం నేర్చుకోవాలని చాలా ఆశ. మీరు నేర్పుతానంటే మీ ఇంటికి పంపిస్తాను. వూరికే కాదులెండి. గురుదక్షిణ తీసుకోవాలి.” అంది లలిత సహోద్యోగిని కమల ఒక రోజున.
లలిత ఒక నిముషం ఆలోచనలో పడింది. ‘అవును. ఎంతో ఇష్టంగా కష్టపడి నేర్చుకున్న విద్య. సాధన లేకుండా మరుగున పడింది. తనకు వచ్చిన విద్యను ఇంకొకరికి నేర్పడానికి భర్త అనుజ్ఞ దేనికి?’
“ మా ఇంటికి వద్దు కమలా. నేను ఆఫీస్ నుండి వెళ్ళేటప్పుడు మీ ఇంటి మీదనే వెడతాను కదా. మీ ఇంట్లోనే ఒక గంట ఆగి పాఠం చెప్పి వెడతాను. మ ఇంట్లో మా అత్తమ్మా, పిల్లలు వుంటారు. మీ అమ్మాయి స్నేహితులు నలుగురు వచ్చినా మంచిదే ” అనేసింది లలిత.
పదిమంది దాకా అమ్మాయిలు సంగీతం నేర్చుకోడానికి ఉత్సాహం చూపి ముందుకు వచ్చారు. .
వారం లో రెండు రోజులు చీకటి పడ్డాక ఆలస్యంగా ఇల్లు చేరుతున్నది లలిత. బస్ దొరక లేదనీ, ఆఫీసులో పని అనీ, ఆటోకి ఎక్కువ అడిగాడనీ నెట్టుకు వచ్చింది.
నెలతిరిగేసరికి రెండువేలు చేతిలో పడ్డాయి లలితకు. ఆ డబ్బుకు తన చేతి ఖర్చుకు ఇచ్చే డబ్బు కూడా కలిపి తల్లికి పంపింది పళ్ళు, పాలు, టానిక్ తీసుకోమని.
ఇలా రెండు నెలలు గడిచేసరికి పరమేశానికి అనుమానం వచ్చింది లలిత తన దగ్గర ఏదో దాస్తోందని. ప్రతీ మంగళ వారం, శుక్రవారం మాత్రమే ఆలస్యం ఎందుకు అవుతోందో కనుక్కోవాలని ఒక మంగళ వారం సాయంత్రం ఆఫీసుకు వెళ్ళాడు.
ఆఫీసుకు తాళం వేసి వుంది. “అందరూ వెళ్ళిపోయారు సార్” అన్నాడు వాచ్ మాన్ .
ఆ పైనెల ఒకటో తేదిన లలిత జీతం అందుకోడానికి ఆమె ఆఫీసుకు వెళ్ళిన పరమేశానికి తన పశ్నకు జవాబు దొరికింది.
చెప్పిన సమయానికి బాకీ తీర్చలేదని ఒక అటెండర్ని బాగా తిట్టాడు.
వాడు ఇంకో ప్యూనుతో “ఈయన వడ్డీ వ్యాపారిలా ఆ అమ్మ జీతమంతా పట్టుకు పోతున్నాడు గనుకనే ఆ మేడం పాపం సంగీతం పాఠాలు చెప్పుకుని నాలుగు రాళ్ళు సంపాదించుకుంటొంది” అని కడుపుమంట వెళ్ళగక్కాడు.
ఆ మాటలు పరమేశం చెవిన పడ్డాయి.
ఆ రోజు మంగళ వారం . లలిత ఆలస్యంగా ఇంటికి వచ్చింది.
“ఇవాళ ఆటో బందా? బస్సుల బందా? లేక సంగీతం పాఠాలా?” లలిత ఇంట్లో అడుగు పెట్టగానే నిలదీసాడు పరమేశం.
నోట మాట రానట్టు నిలబడింది లలిత.
“ఆ పిల్ల దేవుడా అని ముఖం వేలాడేసుకుని ఇంటికి రాగానే ఏమిట్రా ఆమాటలు?” పార్వతమ్మ కోడలికి వత్తాసుగా వచ్చింది.
“నీకు తెలియదు అమ్మా నీ కోడలు మనకు తెలియకుండా ఏ రాచకార్యాలు వెలగ బెడుతోందో. మాట్లాడవేం?ఎన్నాళ్ళ నుండి జరుగుతోంది ఈ నాటకం? చెప్పు నీ సంగీత పాఠాల సంపాదన ఎవరికోసం? నీ పుట్టింటికి పంపుతున్నావా?” కోపంగా మీదకి వస్తూ అరిచాడు.
“నాకు అన్నీ తెలుసురా. వాళ్ళ ఆఫీసులో తనతో కూడా పనిచేసే కమల వాళ్ళ అమ్మాయికి సంగీతం నేర్పమని అడిగిందని నాకు ఎప్పుడో చెప్పింది లలిత.” పార్వతమ్మ అంది.
“మరి నాదగ్గర దాచడమెందుకు? ఆ డబ్బు ఏంచేస్తున్నట్టు?” కాస్త తగ్గి అన్నాడు.
“అదికాదండీ. అమ్మకు ఆరోగ్యం బాగాలేదు. ఆ అద్దె డబ్బు అమ్మ తిండికే చాలదు. మందులు,పళ్ళు, టానిక్కులు అంటే ఎవరిని అడుగుతుంది? ఆమె నన్ను డబ్బు పంపమని అడగలేదు. ఏదో సాయం చేద్దామని..” ఆగింది లలిత.
“ఏం? దాని జీతం తన చేతికి అందకుండా తీసుకున్నట్టు ఈ సంపాదన కూడా లాక్కుందామనా? మీ అమ్మను అంటే నన్ను నువ్వు పోషిస్తున్నావు. మరి లలితా వాళ్ళ అమ్మని ఎవరు పోషించాలి? ఆవిడకు వుండేది ఈ పిల్ల ఒక్కత్తే. తన జీతంలో కొంత అమ్మకు పంపిస్తానంటే నువ్వు కోప్పడుతావేమో అని ఈమార్గం ఎంచుకుంది.తప్పేముందీ? నువ్వు నా ఖర్చు కోసం ఇచ్చే వెయ్యి రూపాయలు కూడ కలిపి పంపమని లలితకే ఇస్తున్నా.” పార్వతమ్మ కొడుకుని నిలదీసింది.
“అత్తమ్మా! మీరు వూరుకోండి. ఏమండీ! నేను చేసిన పని మీకు అవమానమనిపిస్తే క్షమించండి. రేపటి నుండి ఆ పాఠాలు చెప్పడం మానేస్తాను.” కళ్ళలో నీళ్ళు నిండగా గద్గద స్వరంతో అంది లలిత.
“అదేం తప్పు చేసిందని క్షమించమని అడగాలి? అత్తగారంటే అమ్మతో సమానమని అత్తమ్మా అని ఆప్యాయంగా పిలుస్తూ నన్ను అమ్మలా చూసుకుంటోంది.మరి వాళ్ళ అమ్మ నీకు అత్తమ్మ కాదా? ఆమెను చూసుకో వలసిన బాధ్యత నీకు లేదూ?
నీ చెల్లెలు నన్ను తీసుకెళ్ళి నాలుగు నెలలు పెట్టుకుని, చీరలు కొనిచ్చి, నా ఖర్చులకని డబ్బు ఇచ్చి పంపితే నేను గొప్పగా చెప్పుకోవడం లేదూ? వాళ్ళ అమ్మకు ఆమాత్రం చేసే హక్కు లలితకు లేదూ? నిజానికి నువ్వు మంచి అల్లుడివి అయితే ఆమెను ఈ వయసులో ఒంటరిగా వదిలేయకుండా మీదగ్గరకి తీసుకొచ్చి పెట్టుకునేవాడివి.నీకు భార్య సంపాదన కావాలి గానీ ఆమె మనసుకు కష్టం కలగకుండా చూసుకోవాలన్న ఇంగిత జ్ఞానం లేదు.” అంటూ కొడుకును దులిపేసింది పార్వతమ్మ.
తప్పు తెలుసుకున్నట్టు తలవంచుకున్నాడు పరమేశం.
“అత్తమ్మా!” ఆర్థ్రంగా పిలుస్తూ అత్తమ్మను హత్తుకుంది లలిత.

————. ————- ————- ————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *