March 28, 2024

అమ్మమ్మ – 21

రచన: గిరిజ పీసపాటి

తమ పక్కింటి వాళ్ళకు ఫోన్ ఉండడంతో, వాళ్ళ పర్మిషన్ తీసుకుని, తెలిసిన వాళ్ళకు వాళ్ళ నంబర్ ఇచ్చింది అమ్మమ్మ. కేవలం వంట పని ఉంటే తనకు చెప్పడానికి తప్ప ఇతర కారణాలకు ఆ నంబర్ కి ఫోన్ చెయ్యొద్దని అందరికీ మరీ మరీ చెప్పింది.
దగ్గరలో ఉంటున్న భార్యాభర్తలను కూడా తనతో కలిసి వంట పనికి తీసుకెళ్ళసాగింది. పెద్ద పెద్ద గుండిగలతో అన్నం వార్చడం వంటి కొన్ని బరువు పనులకు అతన్ని వినియోగించసాగింది. ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్పీలు, ఆఖరికి కలెక్టర్ ఇంట్లో కూడా వంట పనికి వెళ్ళసాగింది.
అందరూ పేరు, పలుకుబడి ఉన్న వాళ్ళు కావడంతో ఒకరి ద్వారా మరొకరు పనికి పిలవసాగారు. దానివల్ల రాబడితో పాటు గౌరవ మర్యాదలు కూడా పెరిగాయి. అందరూ తమ ఇంటి పెద్ద దిక్కులాగా ఆదరిస్తూ… సలహాలు, సంప్రదింపులు చెయ్యసాగారు.
ఒకరోజు వియ్యంకుడి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. ‘చిన్న కొడుకుకి మళ్ళీ కూతురు పుట్టిందనీ, నాగ కూడా గర్భవతి అయిందని ఇప్పుడు నాలుగో నెల అని, వీలు చూసుకుని ఒకసారి వచ్చి వెళ్ళమని’ ఉత్తరం యొక్క సారాంశం.
కూతురు మళ్ళీ నీళ్ళు పోసుకుందన్న వార్త విని ఆనందంతో ఉప్పొంగిపోయింది అమ్మమ్మ. ఏడవ నెలలో తప్పకుండా వస్తాననీ, మొదటిసారి నాగ గర్భవతి అయినప్పుడు సీమంతం చేసే అదృష్టం దక్కలేదు కనుక ఈసారి తప్పకుండా చేద్దామని, తను వచ్చే ముందు మళ్ళీ ఉత్తరం రాస్తానని’ జవాబు ఇచ్చింది.
రాజేశ్వరమ్మ గారి దగ్గరకు వెళ్ళి ఈ శుభవార్త వినిపించి, తను స్వయంగా తయారు చేసి తీసుకెళ్ళిన లాడూల నుండి ఒకటి తీసి, ఆవిడ నోటికి అందించింది. ఆవిడ కూడా మరోసారి అమ్మమ్మ అవుతున్నందు శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మమ్మ నోరు తీపి చేసారు.
పదిహేను రోజులకి మళ్ళీ అమ్మమ్మకు వియ్యంకుడి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. ‘తమకు సీమంతం ఆనవాయితీ లేదనీ, మీకు ఉన్నట్లైతే తప్పకుండా చేసుకోవచ్చనీ, ఖర్చులన్నీ మీరే భరించుకోవాల్సి ఉంటుందని, ఫలానా రోజు ముహూర్తం బాగుంది కనుక ఆనాడు సీమంతం చెయ్యొచ్చని’ రాసారు. దానికి సమ్మతిస్తూ జాబు రాసింది అమ్మమ్మ.
సందర్భం వచ్చింది కనుక ఇక్కడ ఒక విషయం చెప్పాలనిపిస్తోంది. అప్పట్లో ఉత్తరాలు రాసే పద్ధతి చాలా బాగుండేది. మగవారిని ఈ విధంగా సంబోధిస్తూ ఉత్తరం రాసేవారు : ఇంటి పెద్దని ‘పూజ్యులైన’, అనీ, పేరు, ప్రతిష్ఠ, పాండిత్యం గలవారిని ‘బ్రహ్మశ్రీ వేదమూర్తులైన’ అని, వయసులో చిన్నవారైతే ‘చిరంజీవి’ అని సంబోధిస్తూ తరువాత పేరు రాసేవారు.
ఇక ఆడవారికి అయితే : పునిస్త్రీ అయితే ‘చిరంజీవి సౌభాగ్యవతి’ అని, భర్త లేని స్త్రీ అయితే ‘గంగా భాగీరధీ సమానురాలైన’ అని సంబోధించేవారు. ఇలా సంబోధించకపోతే అవతలి వ్యక్తిని అవమానించినట్లు భావించేవారు. తరువాత క్షేమ సమాచారం ఉండేది. ఆ తరువాత మాత్రమే అసలు విషయం ప్రస్తావనకు వచ్చేది.
తను ఊరు వెళ్తున్నానని, పది రోజులు ఊరిలో ఉండనని అందరికీ చెప్పింది.
వెంటనే ట్రైన్ కి రిజర్వేషన్ చేయించుకుంది. ఇప్పుడు అమ్మమ్మ కి ఊరంతా ఆత్మీయులే. కనుక తెలిసిన వాళ్ళు టికెట్ రిజర్వేషన్ చేయించి పెట్టారు. సీమంతానికి బట్టలు, స్వీట్లు, చక్రకేళీ అరటిపళ్ళ గెల, జాకెట్ బట్టలు మొదలైనవన్నీ సిద్ధం చేసుకుని ట్రైన్ లో బయలుదేరింది.
విశాఖపట్నంలో ట్రైన్ దిగి, పాత బస్టాండ్ కి రిక్షాలో వెళ్ళి, బొబ్బిలి బస్ ఎక్కింది. ముందే టెలిగ్రామ్ ఇవ్వడం వలన బొబ్బిలి కాంప్లెక్స్ కి అల్లుడు రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. కుశల ప్రశ్నలు అయ్యాక బొబ్బిలి నుండి మరో బస్సులో చింతాడ అనే ఊరు చేరుకున్నారు.
(ఇప్పటికీ రాముడువలసకి బస్ సౌకర్యం లేదు. చింతాడ లో దిగి మూడు కిలోమీటర్లు నడవాలి. లేదా బొబ్బిలి నుండి ఆటో చేయించుకోవాలి. లగేజ్ లేకపోతే బైక్ మీద వెళిపోవచ్చు – రచయిత్రి).
అక్కడ వీరి కోసం జోడెద్దుల బండి సిద్ధంగా ఉంది. ఆ బండిలో జాగ్రత్తగా సామానంతా చేర్చి, తను కూడా ఎక్కి కూర్చున్నాక ఉయ్యాల ఊగుతున్నట్లు కదిలింది బండి. అలా జోడెడ్ల బండి ప్రయాణం ఒక మధురానుభూతిని కలిగిస్తుంది ఎవరికైనా సరే. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాముడువలస చేరడానికి అరగంట పట్టింది.
ఎడ్లను గట్టిగా అదిలిస్తే పది నిముషాలు చాలు. కాకపోతే మన ఒళ్ళు హూనం అవడమే కాకుండా, సామాను మొత్తం కిందా మీద పడి స్వీట్లు, పళ్ళు వంటివి పాడయిపోతాయి. పైగా బండిలో కూర్చున్నది పెద్దావిడ కూడానూ. అందులోనూ అవి మైసూరు గిత్తలు. వాటి పేరు ‘రాముడు-భీముడు’. అందుకే బండిని చాలా నెమ్మదిగా నడిపాడు పాలేరు.
ఇంటికి చేరగానే నీళ్ళు నిండిన కళ్ళతో నాగను చూస్తూండిపోయింది అమ్మమ్మ.
పదహారేళ్ళ కూతురు చాలా పెద్దది అయిపోయిన భావన కలిగింది. కళ్ళతోనే కూతుర్ని పలకరించి, నేరుగా ఇంట్లోకి రాకుండా, పశువుల శాల పక్క నుండి పెరట్లోకి వెళ్ళి, నూతిలో నీళ్ళు తోడుకుని, స్నానం చేసి, తడి బట్టలు ఆరేసుకుని మరీ వచ్చింది అమ్మమ్మ.
రాగానే కూతుర్ని దగ్గరకు తీసుకుని “ఏమ్మా నాగేంద్రుడూ! ఆరోగ్యం బాగుందా!” అంటూ కూతురి ఆరోగ్యం గురించి ఆరా తీసింది. ఈలోగా వియ్యపురాలు వచ్చి పలకరిస్తూ, పెద్ద ఇత్తడి గ్లాసు నిండా కాఫీ తెస్తే ఎత్తిపెట్టి మంచినీళ్ళు తగినట్లు కాఫీ తాగేసింది. తరువాత పెద్ద మనుమరాలైన వసంతను ఒళ్ళో కూర్చోపెట్టుకుని, వియ్యపురాలితో కబుర్లలో పడింది.
మాటల్లో అమ్మమ్మకి చాలా విషయాలు తెలుసాయి. అవి ఏమిటంటే అప్పటి వరకు ఉమ్మడి కుటుంబంగా ఉన్న వియ్యంకుడు, అతని అన్నగారు విడిపోయి, వేరు కుంపట్లు పెట్టుకున్నారని. విడిపోవడానికి కారణం ఆడవారి మధ్య సఖ్యత లేకపోవడమేనని. ఒకే ఇంట్లో పక్క పక్క గదుల్లోనే ఉంటున్నా మాటలు లేవని.
ఆస్తి పంపకాలు కూడా జరిగిపోయాయని. వాళ్ళిద్దరూ విడిపోయినందుకు చాలా బాధ పడింది అమ్మమ్మ. సంపాదన మొత్తం వియ్యంకుడి స్వార్జితమే అయినా అన్న గారికి కూడా వాటా ఇచ్చారని తెలిసి సంతోషించింది అమ్మమ్మ. వియ్యంకుడి అన్నగారు చాలా మంచివారు.
సంపాదన వియ్యంకుడిదే అయినా పొలాలు, తోటలు, కళ్ళాలు, పశువులు కొనడం వంటి వ్యవహారాలన్నీ ఆయనే చూసుకునేవారు. దగ్గరుండి వ్యవసాయం పనులను పర్యవేక్షించేవారు. మంచి వ్యవహార దక్షత గల మనిషి. ఆయుర్వేద వైద్యంలో నిష్ణాతుడు.
వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోకపోయినా అమ్మమ్మను అందరూ పలకరించారు. సీమంతం ముందు రోజు కావలసిన సామాను (పువ్వులు, తమలపాకులు, గాజులు, పంచదార చిలకలు మొ.వి) లిస్ట్ రాసి అల్లుడికి ఇచ్చి, తెప్పించమంది. కానీ నాకు వీలుపడదు అన్నాడతను. దాంతో ఏం చెయ్యాలో అర్థం కాక దిగులుగా కూర్చుండిపోయింది.
ఇంతలో ఊరిలోనే ఎదురింట్లో ఉంటున్నావిడ అమ్మమ్మ వచ్చిందని తెలిసి, చూడడానికి వచ్చింది. అమ్మమ్మ దిగులుగా ఉండడం చూసి “ఏం అక్కయ్య గారూ!? అలా ఉన్నారేం? ఒంట్లో బాగోలేదా?” అంటూ చనువుగా పలకరించింది.

****** సశేషం ******

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *