March 28, 2024

ఇంటింటి కథ

రచన: MRVS మూర్తి

“అబ్బా, నెమ్మదిగా తీసుకెళ్ళవచ్చు గదా! ఈ విసిరెయ్యడమేమిటి? తల తిరిగి పోతోంది” ఆవేదనగా ఓ గొంతు.
“అయ్యో, నీ స్పీడ్ తగలెయ్య. పెద్దరాయి గుచ్చుకుందిరా. ఎన్నాళ్ళకు తగ్గుతుందో ఏమిటో? “బాధగా
మరో గొంతు.
“ఒరేయ్, నీ చేతులు పడిపోయాయేమిటిరా, కాళ్ళతో తన్నుతున్నావ్? నీ వాళ్ళనయితే ప్రేమగా చేతుల్తో ఎత్తుకుని ముద్దాడుతావ్. మా గురించి అడిగేవాళ్ళు ఎవరూ లేరనేగా నీ ధైర్యం. మాకూ ఓ రోజు వస్తుందిరా. అప్పుడు చెబుతాం, నీ సంగతి? “ఉక్రోషంతో ఇంకో గొంతు.
“నిదానం.. నిదానం… మొన్న గడపకు తగిలి మెడ వంకర పోయింది. జాగ్రత్తరా. ఉహూ. నా మాట వీడికి వినపడదు. అమ్మో, చచ్చాన్రో దేవుడా, మళ్ళీ గడప తగిలింది. “ఉసూరుమంటూ మరో గొంతు.
అప్పారావుకి ఇవేం వినపడవు. వాడికి కావల్సింది డబ్బులే. పైగా భోజనం టైమ్ అయ్యింది. బయటకు వచ్చి సైకిలెక్కి ఇంటివేపు బయల్దేరాడు.
గోడౌన్ గేటు దగ్గరున్న ధర్మారావు నాలుగు శాల్తీల్ని చిన్న పిల్లల్ని ఎత్తుకున్నట్టు జాగ్రత్తగా ఒక్కొక్క దాన్నీ తీసుకెళ్లి గోడౌన్ లో ఉంచి, గేటు దగ్గరగా వేసి భోజనానికి వెళ్ళాడు.
లోపలకు చేరిన నాలుగు శాల్తీలు స్థిమితపడ్డాయి. అప్పారావుని తిట్టి పోసాయి. ధర్మారావు మంచితనాన్ని పొగిడాయి. ఆప్యాయంగా ఒకరి నొకరు పలకరించుకున్నాయి.
అప్పుడు మొదటి సిలిండర్ తన పక్కనే ఉన్నరెండవ సిలిండర్ని అడిగింది. “అక్కా, నువ్వు వెళ్ళిన
ఇంట్లో అందరూ బాగున్నారా? నీవలన ఎవరికీ హాని జరగలేదుగా?”
“లేదమ్మా, నావలన ఎవరికీ కీడు జరగలేదు. నేను ఈ రెండు నెలల పాటు ఉన్న ఇల్లు మంచి ఇల్లు. కానీ యజమానే కోపిష్టి. “అంది బాధగా రెండవ సిలిండర్.
మిగతా సిలిండర్లు ఆ ఇంటి విశేషాలు చెప్పమని అడగడంతో రెండవ సిలిండర్ చెప్పడం మొదలెట్టింది.
…….
“అమ్మా, గ్యాస్ బండ వచ్చిందమ్మా”
సుగుణ గ్యాస్ తెచ్చే అబ్బాయి పిలుపు విని, డ్రాయర్ లో ఉంచిన గ్యాస్ బుక్ తీసి అందులో ఉన్న
డబ్బులు అతనికిచ్చింది. డబ్బులు లెక్క చూసుకుని బిల్లు సుగుణకిచ్చి పుస్తకంలో సంతకం చేసి, గది మూల ఉన్న ఖాళీ గ్యాస్ బండ తీసుకుని వెళ్ళాడు.
సుగుణ బరువుగా ఉన్న గ్యాస్ బండని జాగ్రత్తగా తీసుకెళ్లి వంటింటిలో పెట్టింది. పిల్లలకు క్యారేజీలు సర్ది
బ్యాగుల్లో పెట్టి హాల్లోకి వచ్చింది. అప్పటికే రెడీగా ఉన్న పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చింది. రెండు నిముషాలలో కాన్వెంట్ ఆటో వచ్చింది. పిల్లలు ఇద్దరినీ ఆటో ఎక్కించి లోపలకు వచ్చింది.
ఆమెని చూడగానే మండిపడ్డాడు దయాకర్. “ప్రొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు? నీకు పెత్తనాలు ఎక్కువయ్యాయి. మొగుడంటే లెక్కలేదు. దువ్వెన ఎక్కడ పెట్టి చచ్చావు? ”
సుగుణ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న దువ్వెన తీసి అతనికిచ్చింది. “పిల్లల్ని ఆటో ఎక్కించి వచ్చాను.
ఎక్కడికీ వెళ్ళలేదండి. టిఫిన్ పెట్ట‌మంటారా? “భయంభయంగా అడిగింది.
“ఆ, తగలెయ్. ఏదో ఒకటి తిని ఆఫీసుకు వెళ్ళాలిగా “తల దువ్వుకుంటూ చిరాగ్గా అన్నాడు.
ప్లేటులో ఇడ్లీలు పెట్టి తీసుకువచ్చింది. పచ్చడి బాగోలేదని, ఇడ్లీలు సరిగా ఉడకలేదని సణుక్కుంటూ
టిఫిన్ తిన్నాడు దయాకర్.
“పల్లెటూరి పిల్ల అయితే అణిగి, మణిగి ఉంటుందిరా, అని మా అమ్మ చెప్పబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఒక ముద్దూ, ముచ్చటా లేదు. ఎప్పుడూ గంపెడు కష్టాలు నెత్తికెత్తుకున్న దానిలా ఏడుపుగొట్టు మొహంతో ఉంటావు. ఉద్యోగం చేసే పిల్లని చేసుకుంటే నా జీవితం హాయిగా ఉండేది. ఛీ ఛీ “అని ఈసడించి, బయటకు వచ్చి మోటార్ బైక్ మీద ఆఫీసుకి వెళ్ళాడు.
‘ఉద్యోగస్తురాలినే చేసుకోపోయారా? మరి కట్నం కోసం ఆశపడి నన్నెందుకు చేసుకున్నారు? ‘అని భర్తని
అడిగేద్దామని చాలా సార్లు అనుకుంది సుగుణ. కానీ సంస్కారం అడ్డువచ్చి ,సంసారం వీధిన పడకూడదన్నఆలోచనతో ఆ ప్రయత్నం మానుకుంది.
సుగుణకి వరకట్నంగా మూడెకరాల మాగాణి పొలం ఇచ్చాడు ఆమె తండ్రి. ఏభై కాసుల బంగారం, చాలా వెండి సామాను కూడ ఇచ్చాడు. మొదటి ఏడు పండుగ బహుమతిగా మోటార్ బైక్ కొనిచ్చాడు సుగుణ తండ్రి. అప్పటి వరకు దయాకర్ ఆఫీసుకి మోపెడ్ మీదే ళ్ళేవాడు.
మనవలు ఇద్దరి పేరుమీద చెరో లక్ష రూపాయలుబ్యాంకు లో డిపాజిట్ చేసాడు సుగుణ తండ్రి వెంకట్రావు. వాళ్ళ చదువులకి ఉపయోగపడుతుందని.
చామన ఛాయగా ఉన్నా సుగుణది కళ గల మొహం. చలాకీగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఇంటి పనులన్నీ తనే చేసుకుంటుంది .కానీ పిల్లలు పెరుగుతుంఢటంతో వారికి స్నానాలు చేయించడం, బట్టలు వెయ్యడం, టిఫిన్లు తయారు చేయడం వంటి పనులతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది.
పనమ్మాయిని పెట్టుకుందామని భర్తని అడిగితే ‘నువ్వు వెలగబెట్టే రాచకార్యాలు ఏమున్నాయి? నువ్వే పనిచేసుకో. పనమ్మాయికి నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వాలి. వద్దు వద్దు. ‘అని నిష్కర్షగా చెప్పాడు.
ఇటీవల ఆఫీసుకి బదిలీ‌మీద వచ్చిన మహిళా ఉద్యోగినులను చూసినప్పటి నుంచి భార్యమీద ద్వేషం
పెంచుకోసాగాడు దయాకర్. తనకు సరైన జోడీ తన భార్య కాదని మధనపడి పోతున్నాడు. తన లాయర్ ఫ్రెండ్ ద్వారా ఏవో కారణాలు స్రృష్టించి సుగుణనుండి విడాకులు తీసుకుని మరో అందమైన మహిళను పెళ్లి
చేసుకోవాలని ఉబలాటపడ్డాడు.
కానీ విడాకులు తీసుకుంటే సుగుణ పేరుతో ఉన్న రెండు కోట్ల ఆస్తి ఆమెకే దక్కుతుంది. పైగా మామగారు బంగారు పిచిక.ఎపుడు ఎన్ని లక్షలు కావాలన్నా ఇస్తాడు. అందుకే విడాకుల ఆలోచన విరమించుకున్నాడు.
అయినా రోజూ భార్యని మాటలతో, చూపులతో హింసిస్తున్నాడు. పెళ్ళైన కొత్తలో తరచుగా భార్యని బయటకు తీసుకువెళ్ళేవాడు.ఆరోజంతా ఇద్దరూ ఎంతో సంతోషంగా గడిపేవారు.
మావగారిచ్చే పండుగల కానుకలకోసం అమలాపురం వెళ్ళడం తప్పితే సుగుణని బయటకు తీసుకు వెళ్ళడం పూర్తిగా మానేసాడు.
పిల్లల కోసం భర్త చేష్టలని మౌనంగా భరిస్తోంది సుగుణ. పి. జి. చదువుకున్న తను పనిమనిషిగా, వంట
మనిషిగా మిగిలిపోతానా అన్న ఆలోచన కూడా ఆమెని బాధిస్తోంది. అయినా తన సంసారం కోసమేగా తాను కష్టపడుతున్నానని తనని తాను సమాధాన పర్చుకుంటోంది సుగుణ.
……..
రెండవ సిలిండర్ చెప్పడం పూర్తి కాగానే మిగతా మూడు సిలిండర్లు భారంగా నిట్టూర్పు విడిచాయి.
“సుగుణ కూడ ఉద్యోగం చేస్తే ఆమె జీవితంలో మార్పు వచ్చేదేమో? “అంది మొదటి సిలిండర్.
“ఉద్యోగం చేసే ఆడదాని పరిస్థితి మరీ ఘోరంగా ఉంటోంది “అంది మూడో సిలిండర్.
“అలాగా, నువ్వు వెళ్ళిన ఇంట్లో వాళ్ళ విశేషాలు చెప్పు “ఆసక్తిగా అడిగింది రెండో సిలిండర్.
మూడవ సిలిండర్ చెప్పడం ప్రారంభించింది.
……..
“ఏమండీ, చిన్నదాని స్నానం అయ్యింది. కొంచెం దానికి బట్టలు తొడగండి. “ప్రజ్ఞకి టవల్ చుట్టి హాలులో ఉన్న భర్త దగ్గరకు పంపి, పెద్దమ్మాయి ప్రత్యూషకి స్నానం చేయించసాగింది మాధవి.
ప్రజ్ఞ కి నాలుగేళ్ళు. ప్రత్యూషకి ఆరేళ్ళు. మాధవి బ్యాంక్ లో పనిచేస్తోంది. ఆమె భర్త మధు మండల పరిషత్తు ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. వాళ్ళకి ఇద్దరూ ఆడపిల్లలే.
పది నిమిషాలు గడిచాకా పెద్దమ్మాయికి స్నానం చేయించి ఆమెతో పాటు హాల్లోకి వచ్చిన మాధవి అక్కడి
దృశ్యం చూసి ఆశ్చర్య పోయింది. మధుకర్ ఫోన్లో వాట్సప్ చూసుకుంటున్నాడు. ప్రజ్ఞ టీవీ చూస్తోంది.
“ఏమండీ, చిన్నదానికి స్కూల్ డ్రెస్ వేయమన్నాను. నా మాట వినిపించుకోపోతే ఎలా?”
భర్తని అడిగింది మాధవి.
“నువ్వు నన్ను పిలిచావా? సారీ, అర్జెంటు మెసేజ్ లు ఉంటే చూస్తున్నాను. “ఫోన్లోంచి తల తిప్పకుండానే జవాబిచ్చాడు మధుకర్.
అతనితో మాట్లాడి ప్రయోజనం లేదని గ్రహించిన మాధవి పిల్లలిద్దర్నీ తీసుకుని బెడ్ రూం లోకి వెళ్ళింది. వాళ్ళకి యూనిఫాం వేసి, టిఫిన్ పెట్టి హాల్లోకి తీసుకుని వచ్చింది.
“ఆటో డ్రైవర్ పిలవగానే పిల్లల్ని కిందకు తీసుకువెళ్ళండి. నేను స్నానం చేసి వస్తాను “అని భర్తకి చెప్పి
టవల్ తీసుకుని స్నానానికి వెళ్ళింది ‌మాధవి. ఆమె తిరిగి వచ్చేసరికి పిల్లలు వాళ్ళే కిందకు వెళ్ళి ఆటో ఎక్కి స్కూలుకి వెళ్ళారు కానీ మధుకర్ న్యూస్ పేపర్ నుంచి కదలలేదు. కుటుంబం పట్ల భర్త బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న తీరు ఆమెని చాలా బాధించింది. పిల్లల చదువు విషయంలో కూడా పట్టించుకోడు. మాధవే బ్యాంకు నుండి వచ్చాకా వాళ్ళచేత హోంవర్కు చేయిస్తుంది.
“రేపు స్కూలులో పేరెంట్సు మీటింగు ఉంది. మీరు స్కూలుకి వెళ్ళండి. నాకు బ్యాంకు లో ఆడిట్ ఉంది”చెప్పింది మాధవి భర్తతో.
“సారీ మధూ. నాకు ఆఫీసులో అర్జెంటు వర్కు ఉంది. నాకు వీలవదు. “నిర్మొహమాటంగా అన్నాడు
మధుకర్.
“మనం ఇద్దరం వెళ్లకపోతే పిల్లలు చిన్నబుచ్చుకుంటారు. అందరి పేరెంట్సు వస్తారు. తీరికచేసుకుని
స్కూలుకి వెళ్ళండి. క్రితం సారి కూడా మనమిద్దరం పేరెంట్సు మీటింగ్ కి వెళ్ళలేదు. మనం ఇలాగే చేస్తూ
ఉంటే హెడ్ మిస్ట్రెస్ పిల్లలకు టీ. సీ. లు ఇచ్చిపంపించేస్తుంది. ”
“ఈ స్కూల్ కాకపోతే ఇంకో స్కూలులో చేరుద్దాం. దానికి వర్రీ ఎందుకు? ”
“ఈ స్కూల్లో టీచింగ్ బాగుంటుంది. పిల్లలగురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అందుకేగా మన పిల్లల్ని ఇక్కడ చేర్చాం. ”
“పిల్లలు టెంతో, ఇంటర్మీడియటో చదువుతున్నట్టు అంత టెన్షన్ పడతావెందుకు? నీకు చాదస్తం ఎక్కువైపోయింది. ప్రతీదీ భూతద్దంలో చూసి భయపడుతున్నావు. ఏం జరగదులే. “అని మధుకర్
ఆఫీసుకి వెళ్ళిపోయాడు.
బ్యాంకు మేనేజర్ ని రిక్వెస్ట్ చేసి, పర్మిషన్ తీసుకుని మాధవే స్కూలుకి వెళ్ళింది పేరెంట్సు మీటింగుకి. ఇది జరిగిన కొద్ది రోజులకి మాధవికి జ్వరం వచ్చి బ్యాంకుకి శలవు పెట్టింది. అప్పుడు కూడా మధుకర్
పిల్లల గురించి పట్టించుకోలేదు. మాధవే అంత జ్వరంలోనూ పిల్లల్ని స్కూలుకి పంపడం, వంటచేయడం
చూసినా స్పందించలేదు. పైగా ‘మీ పేరెంట్స్ ని వచ్చి సాయం చేయమని చెప్పు ‘అని ఉచిత సలహా ఇచ్చాడు.
మాధవి తండ్రికి ఆరోగ్యం బాగుండదు. తల్లి ఆయనకు సేవలు చేస్తోంది. అటువంటి పరిస్థితులలో తల్లి వచ్చి తనకు ఏం చెయ్యగలదు?.
ఎంతసేపు తన ఉద్యోగం తనకు ముఖ్యమంటాడు. గట్టిగా మాట్లాడితే ‘నువ్వు ఉద్యోగం మానేసి ఇంటిపనులు చూసుకో ‘అని చెప్పాడు. ఇప్పుడు ఉంటున్న ప్లాట్ మాధవి జీతంమీద లోను తీసుకుని
కొనుక్కున్నారు. పైగా పిల్లల చదువులకి, పెళ్ళిళ్ళకి చాలా డబ్బు కావాలి. అవన్నీ ఎలా సమకూరుతాయి.?
మధుకర్ ఒక్క జీతంమీద ఈ అవసరాలన్నీ తీరడం సాధ్యం కాదని మాధవికి బాగా తెలుసు. అందుకే ఉద్యోగం మానడం లేదు.
పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలంటే తను కష్టపడక తప్పదని నిర్ణయించుకుంది మాధవి. ఇటు
కుటుంబం,అటు ఉద్యోగ బాధ్యతలు రెండూ చూసుకుంటూ సతమతమవుతోంది మాధవి.
………
మూడో సిలిండర్ చెప్పిన విషయాలు విని మరింతగా దిగులు పడ్డాయి మిగతా సిలిండర్లు.
నాల్గవ సిలిండర్ ని ‘నువ్వు వెళ్ళిన ఇంట్లో కూడా ఇవే కష్టాలా? ‘అడిగింది మొదటి సిలిండర్.
‘అవి ఇంకోరకం కష్టాలు. ‘అని చెప్పడం ప్రారంభించింది నాల్గవ సిలిండర్.
…….
“అమ్మా సుమతీ, బాత్రూమ్ ఖాళీ అయ్యిందా. కాసిని వేణ్ణీళ్ళు తెచ్చుకుంటాను “చాలా నమ్రతగా
కోడల్ని అడిగాడు జగన్నాథం.
“ఇంకా పిల్లల స్నానాలు అవలేదు. ప్రొద్దున్నే అంత కంగారెందుకు? ” విసురుగా అంది సుమతి.
జగన్నాథం హాల్లోని గడియారం కేసి చూశాడు. టైము ఎనిమిది గంటలయ్యింది. డిసెంబర్ నెల. చలి
ఎక్కువగా ఉంటోంది. కొడుకు వాళ్ళ బాత్రూమ్ లోనే గీజరు ఉంది. రోజూ ఆ బాత్రూమ్ లోంచి బకెట్ లో
వేడినీళ్లు పట్టుకుని రెండో బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేస్తాడు జగన్నాథం.
ఆరోజు శనివారం. స్నానంచేసి వేంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలని అతని కోరిక.
కొడుకు, కోడలు, మనవల స్నానాలు, టిఫిన్లు అయ్యాకా తొమ్మిది గంటలకు అనుమతి ఇచ్చింది సుమతి, మామగారు వేడినీళ్లు పట్టుకెళ్ళడానికి.
కొడుకు ఆఫీసుకి,కోడలు,మనవలు కాన్వెంట్ కి వెళ్ళాకా ఇంటికి తాళంవేసి గుడికి వెళ్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఇంటికి వచ్చాడు జగన్నాథం.
సమయం పదిగంటలయ్యింది. టేబుల్ మీద గిన్నెలో ఉన్న చల్లారిపోయిన ఉప్మాని ప్లేటులో పెట్టుకుని తిన్నాడు. శీతాకాలం. టిఫిన్ హాట్ ప్యాక్ లో పెడదామన్న మంచిఆలోచన సుమతికి ఉండదు. టిఫిన్ అయ్యాకా కోడలు ఇచ్చిన లిస్టు ప్రకారం రైతు బజారుకి వెళ్ళి కూరలు తెచ్చాడు.
మధ్యాహ్నం ఒంటి గంటకు డైనింగ్ టేబుల్ మీద ఉన్న మీల్స్ ప్లేటులో కోడలు సర్ది ఉంచిన భోజనం చూసి
నిట్టూర్చాడు జగన్నాథం. కొద్దిగా కూర, పచ్చడి, చిన్నకప్పులో సాంబారు, మరో కప్పులో నీళ్ళ మజ్జిగ. వాటినే తిని భోజనం అయిందనిపించాడు. కోడలు వంట బాగానే చేస్తుంది. కానీ రేషన్ లా పెడుతుంది. అందరూ పెరుగు వేసుకునే తింటారు. కానీ జగన్నాధం కి నీళ్ళ మజ్జిగే దిక్కు.
ఒకసారి నోరు తెరిచి అడిగాడు కోడల్ని, ‘కొంచెం పెరుగు వెయ్యమ్మా ‘అని.
‘మావయ్య గారు, మీకు అరవైఆరేళ్ళు. ఈ వయసులో నెయ్యి, పెరుగు వేసుకుంటే కొలెస్ట్రాల్ వస్తుంది. అది మీకు మంచిది కాదు ‘అని సన్నాయి నొక్కులు నొక్కింది సుమతి.
భోజనం చేసి హాల్లోని దివాన్ మీద విశ్రాంతి తీసుకున్నాడు జగన్నాథం. ఒక బెడ్ రూమ్ కొడుకు, కోడలికి, రెండో బెడ్ రూమ్ పిల్లలకి. జగన్నాథం పడక హాల్లోని దివాన్ మీదే. జగన్నాథం పెట్టె, బట్టలు పిల్లల బెడ్ రూమ్ లో పెట్టుకోవడానికి చాలా ఉదారంగా అను‌మతించింది సుమతి.
కిరాణా సరుకులు తేవడం, కరెంట్ బిల్లు కట్టడం, లాండ్రీ నుంచి బట్టలు తేవడం వంటి పనులన్నీ జగన్నాథమే చేస్తాడు.
ప్రతి నెలా పెన్షన్ ఇరవైవేలు తెచ్చి కోడలుకి ఇస్తే, ఆమె ఎంతో దయతో వెయ్యి రూపాయలు ఆయన ఖర్చులకిస్తుంది. కొడుకు, కోడలు గీచిన గీత దాటడు.
తన ఇబ్బందులు కొడుకుతో చెబితే ‘సర్దుకోవాలి నాన్నా..నా జీతం ఇంటి ఖర్చులకి సరిపోకే, సుమతి కాన్వెంట్ లో పనిచేస్తోంది. తనూ కుటుంబం కోసం చాలా కష్టపడుతోంది. అర్ధం చేసుకో ‘అన్నాడు.
జగన్నాథం భార్య జానకి హార్ట్ ఎటాక్ వచ్చి రెండు సంవత్సరాల క్రితం చనిపోయిన తర్వాత ఆయనకు కష్టాలు ప్రారంభం అయ్యాయి.
పార్కులో రోజూ కలుసుకునే మిత్రుడు రామ్మూర్తితో తన బాధలు చెప్పుకున్నాడు. ‘మంచి వృద్ధాశ్రమం చూసి చేరిపో. నీ పెన్షన్ చూసి చేర్చుకుంటారు. నీకు శ్రమ తప్పుతుంది. విశ్రాంతి లభిస్తుంది. నేనూ అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తాను ‘ అన్నాడు రామ్మూర్తి.
‘మనవల్ని చూడకుండా ఉండలేను ‘బాధగా అన్నాడు జగన్నాథం. రామ్మూర్తి మౌనం వహించాడు.
ఒకరోజు లోపలి బాత్రూమ్ లోంచి వేడినీళ్లు తెచ్చుకుంటూ ఉండగా కళ్ళు తిరిగి బకెట్ వదిలేసాడు.
నీళ్ళన్నీ కింద ఒలికి పోయాయి. సుమతి వచ్చి హాలంతా పాడుచేసారని నానా మాటలు అంది. జగన్నాథం భుజం మీద తువ్వాలుతో నేలమీద ఉన్న నీటిని ఒత్తి, బకెట్ లో పిండి హాలంతా శుభ్రం చేసాడు.
…….’జగన్నాథం గారి కష్టాలు చూసి నాకే కన్నీళ్లు వచ్చాయి ‘అంది బాధగా నాల్గో సిలిండర్.
“మేము వెళ్ళిన ఇళ్ళల్లోని విశేషాలు చెప్పాం. మరి నువ్వు వెళ్ళిన ఇంటి సంగతులు కూడా చెప్పు వింటాం” అంది నాల్గో సిలిండర్, మొదటి సిలిండర్ తో.
మొదటి సిలిండర్ చిరునవ్వు నవ్వి, తాను వెళ్ళిన ఇంటి విశేషాలు చెప్పసాగింది.
………
ఉదయం ఐదు గంటలకు సెల్ ఫోన్ అలారం విని నిద్ర లేచాడు సదాశివం. రెండు అరచేతులూ కళ్ళకద్దుకుని ‘కరాగ్రే వసుధౌ లక్ష్మీ ‘శ్లోకం చదువుకున్నాడు. నేలను తాకి నమస్కరించి, ‘సముద్ర
వసనే దేవీ ‘శ్లోకం పఠించి, మంచం దిగి హాలులోకి వచ్చి దేవుని పటాలకు నమస్కరించాడు. ఆ తర్వాత బాత్రూమ్ కెళ్ళి బ్రష్ చేసుకుని కాలకృత్యాలు తీర్చుకున్నాడు. గీజర్ ఆన్ చేసి హాల్లోకి వచ్చి కాస్సేపు
యోగా చేసాడు.
ఆరుగంటలకి వాట్సప్ లో నాలుగు గ్రూపులకి శుభోదయం మెసేజ్ పెట్టి, మొదటి గ్రూపుకి సుమతీ శతకం లోని పద్యం, రెండో గ్రూపుకి వేమన పద్యం, మూడవ గ్రూపుకి భగవద్గీత శ్లోకం, తాత్పర్యం, నాల్గవ గ్రూపుకి వివేకానంద సూక్తి పెట్టాడు సదాశివం.
సదాశివం భార్య హైమవతి లేచి, వాకర్ సాయంతో బాత్రూమ్ కి వెళ్ళి, వచ్చి హాలులో కూర్చుంది.
ఆమె మోకాలికి ఇటీవలే ఆపరేషన్ చేసారు. సదాశివమే ఆమెకు పరిచర్యలు చేస్తున్నాడు. అతనికి ఒక్కడే కొడుకు. భార్యా, బిడ్డలతో ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు.
సదాశివం హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి రిటైరై ఏడు సంవత్సరాలుఅయింది. అరవై
ఐదేళ్ల వయసులో కూడా యువకుడిలా చలాకీగా ఉంటాడు. క్రమశిక్షణ, నిజాయితీ అతనికి రెండు కళ్లు.
ఉపకారమే ఊపిరిగా, మానవత్వమే గుండెచప్పుడుగా జీవిస్తున్నాడు.
భార్యకు కాఫీ కలిపి ఇచ్చాడు. తాను పూజ చేసి పాలు తీసుకుంటాడు. వంట తనే చేస్తున్నాడు.
“ఆడసాయం లేకుండా ఎలా ఉంటారు? మీ భార్యకి సహాయం చేయడానికి, వంటపనికి బంధువులెవరినైనా రమ్మనమనండి. మీరు ఒక్కరూ ఎంతవరకు కష్టపడతారు? ” సదాశివం మిత్రుడు రామకృష్ణ సలహా ఇచ్చాడు.
రామకృష్ణ మాటలకి చిన్నగా నవ్వాడు. “పెళ్ళైన నలభై సంవత్సరాల నుండి నా భార్య నాకు సేవలు చేస్తూనే ఉంది. ఒక నెలో, రెండు నెలలో ఆవిడ ఆరోగ్యం కుదుట పడేవరకూ సహకరించడం నా విధి. ఇది నేను కష్టంగా, ఇబ్బందిగా భావించడం లేదు. ఒకరి మీద ఆధారపడకుండా జీవించడం నా అలవాటు.” అన్నాడు సదాశివం.
రోజూ భార్య స్నానం చేసి రాగానే కట్టుకోవడానికి ఆమె బట్టల్ని కప్ బోర్డు లోంచి తీసి టేబుల్ మీద సిద్ధంగా ఉంచుతాడు. పనిమనిషి రాకపోతే గిన్నెలన్నీ తానే తోమి శుభ్రం చేస్తాడు. తనవీ, భార్యవీ బట్టల్ని పిండి డాబాపైకి తీసుకెళ్లి దండెంమీద ఆరేస్తాడు. పనిమనిషి ఒకరోజు మానేసి మర్నాడు వచ్చినా ఏమీ అనడు. ‘మీ ఇంట్లో అందరూ బాగానే ఉన్నారుగా? డబ్బులు అవసరమైతే చెప్పు. ఇస్తాను. ఇబ్బందిపడకు ‘అని ఆదరంగా మాట్లాడతాడు.
ఇంటి దగ్గరే ఉచితంగా హోమియో వైద్యం చేస్తాడు. ఫోన్ లో కూడా వైద్య సలహాలు ఇస్తూంటాడు.
రోజూ సాయంత్రం పార్కుకి వెళ్లి మిత్రుల్ని కలిసి వాకింగ్ చేసేటప్పుడు వారి మంచిచెడ్డలు కనుక్కుంటాడు
ఇంటికి వచ్చేటప్పుడు నగరేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి శివ పార్వతుల దర్శనం చేసుకుంటాడు. ఎంత వర్షం వచ్చినా సాయంత్రం శివ దర్శనం మానడు.
ఒకటవ తేదీన బ్యాంకు నుంచి పెన్షన్ తీసుకుని వృద్ధాశ్రమానికి, అనాధాశ్రమానికి పదివేలు విరాళం
పంపుతాడు. తాను పనిచేసిన హైస్కూల్లో పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థుల్ని దత్తత తీసుకున్నాడు సదాశివం. వారి చదువు కోసం చెరో మూడు వేలు పంపుతాడు.
భార్యాభర్తలు ఇద్దరూ టీ. వీ. లో భక్తికి సంబంధించిన చానల్సు మాత్రం చూస్తారు. మంచి పుస్తకాలు రోజూ చదువుతారు. అందుకే వారి మనసులు ప్రశాంతంగా, పవిత్ర గంగానదిలా ఉంటాయి.
……..
“నేను మాష్టారి ఇంట్లో ఉన్నన్ని రోజులూ నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఒక దేవాలయంలో గడిపి
వచ్చిన అనుభూతి కలిగింది. మనిషి ఎలా జీవించాలో సదాశివం మాష్టారి జీవితాన్ని చూస్తే తెలుస్తుంది. ”
అంది మొదటి సిలిండర్.
“నిజమే. మనిషి ఎలా ఉండకూడదో అని మనం వెళ్లి వచ్చిన మూడు ఇళ్లల్లోని వ్యక్తుల ద్వారా తెలిసింది. మనిషి ఉన్నతంగా జీవించి సమాజానికి మార్గదర్శి కావాలని సదాశివం మాష్టారి జీవన విధానం తెలిపింది. మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుంటామో? ఏమో? విశ్రాంతి తీసుకోండి “అంది రెండవ సిలిండర్.
———————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *