March 19, 2024

జీవిత లక్ష్యం

G.S.S. కళ్యాణి

ఒక ప్రముఖ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో స్నాతకోత్సవం జరుగుతోంది. వినోదిని, గిరిజలకు సమానమైన మార్కులు వచ్చి, ఆ ఏడు నిర్వహించిన పెద్ద పరీక్షల్లో ఇద్దరూ ప్రధమ స్థానంలో నిలిచారు. వారిని స్టేజి పైకి ఆహ్వానించి బంగారు పతకాలతో సత్కరించారు విశ్వవిద్యాలయం యాజమాన్యంవారు. ఆ తర్వాత, విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ తోపాటు కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిధులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగాలు ఇచ్చారు. కార్యక్రమం చివర్లో వినోదిని, గిరిజలను మళ్ళీ స్టేజి పైకి పిలిచి వారి జీవిత లక్ష్యాల గురించి చెరి రెండు నిమిషాలూ మాట్లాడవలసిందిగా కోరారు కార్యక్రమ నిర్వాహకులు.
ముందుగా వినోదిని మైకు ముందు నిలబడి, “నేను చదివిన చదువు నాకు మాత్రమే కాకుండా నా చుట్టూ ఉన్న సమాజ అభివృద్ధికి కూడా ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. నాకు చిన్నప్పటినుండీ, ప్రజా సేవ అంటే ఎంతో ఇష్టం. కాబట్టి నేను రాజకీయాలలోకి ప్రవేశించాలని అనుకుంటున్నాను. నా విద్యను ఉపయోగించుకుంటూ ఈ సమాజంలోని సమస్యలను పరిష్కరించాలన్నది నా జీవిత లక్ష్యం!”, అని చెప్పింది.
ఆ ప్రాంగణమంతా కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది. ఆనందంతో స్టేజి దిగి గిరిజ పక్కనే ఉన్న తన సీట్లో కూర్చుంది వినోదిని.
గిరిజ చిరునవ్వుతో స్టేజి మీదకు వెళ్లి, “నా చదువు పూర్తయింది కాబట్టి నేను వెంటనే పెళ్లి చేసుకుని గృహిణిగా మారి నా కర్తవ్యం సక్రమంగా నెరవేర్చాలని అనుకుంటున్నాను. అదే నా జీవిత లక్ష్యం!”, అని చెప్పింది.
అక్కడ కూర్చున్న వారెవ్వరూ చప్పట్లు కొట్టలేదు సరికదా, గిరిజ నిర్ణయం తప్పని కొందరు భావిస్తే మరి కొందరు దానిని అపహాస్యం చేశారు!
గిరిజ అవేవీ పట్టించుకోకుండా స్టేజి దిగి తన సీట్లో కూర్చుంది.
కార్యక్రమం ముగిశాక, “గిరిజా! నీ లక్ష్యం గురించి ఇంటికెళ్ళాక మరోసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఇంత చదువులు చదివి పెళ్లి చేసుకుని అంట్లు తోముకుంటూ పిల్లలను సాకుతూ ఇంట్లో కూర్చుండిపోవడం అవివేకం!”, అంది వినోదిని.
“వినోదిని! నేను బాగా ఆలోచించే ఆ నిర్ణయం తీసుకున్నాను! సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కారించాలంటే అదే సరైన మార్గం!”, చెప్పింది గిరిజ.
“నీ నిర్ణయం తప్పని త్వరలో నీకే అర్ధమవుతుందిలే!”, గర్వంగా అంది వినోదిని.
నెలలు గడుస్తున్నాయి.
అనుకున్న విధంగా రాజకీయాలలోకి ప్రవేశించింది వినోదిని. ఒక ప్రముఖ పార్టీలో సీటు సంపాదించి, ఊరూరా తిరుగుతూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తూ ఆ ఏటి ఎలెక్షన్లలో తమ సొంత ఊరికి సంబంధించిన నియోజక వర్గం నుండీ భారీ మెజారిటీతో వినోదిని గెలుపొందింది. స్వతహాగా మంచి తెలివితేటలు కలిగిన వినోదిని ప్రభుత్వ కార్యకలాపాలలో ప్రజలకు అనుకూలంగా మార్పులు తీసుకువచ్చి, తనపై వారు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగింది. తమ ఊరి జనమే కాకుండా చుట్టుపక్కల ఊరివాళ్ళు కూడా వినోదినికున్న చదువును, పరిజ్ఞానాన్ని, ప్రజలకు సేవ చేయాలనుకునే గుణాన్నీ, సమాజంలో మంచి మార్పును తేవాలనే లక్ష్యాన్ని చూసి, వినోదినిని ఆదరించి బ్రహ్మరధం పట్టారు!
గిరిజ, తన ఇంట్లోని పెద్ద వాళ్ళు కుదిర్చిన సంబంధం అంగీకరించి, తన వివాహానికి అందిరినీ పిలుస్తూ వినోదినికి కూడా తన పెళ్లి ఆహ్వాన పత్రికను పంపింది. గిరిజ పెళ్లి జరుగుతూ ఉండగా నాలుగు కార్లు వచ్చి పెళ్లి మంటపం ముందు ఆగాయి.
వాటిలో ఉన్న ఒక ఖరీదైన కారులోంచి దిగిన వినోదిని గిరిజ వద్దకు వచ్చి ఒక పెద్ద కానుకను గిరిజ చేతిలో పెడుతూ, “నువ్వు అనవసరంగా అంత కష్టపడి సమయం, డబ్బు వృధా చేసుకుని నాతో పాటూ చదివావు. పెళ్లి చేసుకుని ఏమీ చేతకాని గృహిణిలా బతకదల్చుకున్నప్పుడు అంత కష్టపడటం దేనికీ? ఇక హాయిగా ఇంటి పనీ, వంట పనీ చేసుకుంటూ ఇంట్లోనే కూర్చో!”, అంది .
వినోదిని మాటలలో వెక్కిరింపు, వెటకారం కొట్టొచ్చినట్లు కనపడ్డాయి గిరిజకు.
కానీ గిరిజ బాధపడకుండా, “వినోదిని! నువ్వు ఎంచుకున్న మార్గం నీకు ఎలాగైతే సరైనదని అనిపిస్తోందో నేను ఎంచుకున్న మార్గం నాక్కుడా సరైనదే అని అనిపిస్తోంది. నేను ఎంచుకున్న మార్గంలో నేను పెట్టుకున్న లక్ష్యం సాధిస్తానన్న నమ్మకం నాకుంది!”, అని వినోదినికి బదులిచ్చింది గిరిజ.
“సరే! నీ కర్మ!”, అంటూ వెళ్ళిపోయింది వినోదిని.
ఏళ్ళు గడుస్తున్నాయి.
వినోదిని రాజకీయాలలో రాణిస్తూ ఉండటంతో ఎన్నో విద్యాసంస్థలు, ఆర్థిక సంస్థలు, కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలూ, వారు చేప్పట్టే పలు కార్యక్రమాలకు వినోదినిని ముఖ్య అతిధిగా ఆహ్వానించడం మొదలుపెట్టారు. అలా ఒక బడిలో ఏర్పాటు చేసిన బాలల దినోత్సవ కార్యక్రమానికి వెళ్లిన వినోదినికి ఆ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నపిల్లలను చూస్తే ముచ్చటేసింది. వారు ముద్దు మాటలతో చెప్పిన పద్యాలూ, పాటలూ, వారి అమాయకపు చేష్టలూ వినోదినిని ఎంతో ఆకట్టుకున్నాయి. మొట్టమొదటిసారి వినోదినికి తనకు కూడా ఒక బాబో పాపో పుడితే బాగుంటుందని అనిపించింది.
విషయం ఇంట్లో తన తల్లికి చెప్పగానే, “చక్కటి ఆలోచన! త్వరగా పెళ్లి చేసుకుని నన్ను అమ్ముమ్మను చెయ్యి! నువ్వు ఈ మాట ఎప్పుడంటావోనని నేను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. నీకు నాలాగా ఇంట్లో ఉండే ఆడవారంటే చులకన భావం కదా! అందుకే ఇన్నాళ్లూ నీ దగ్గర పెళ్లి విషయం నేను ప్రస్తావించలేదు. అసలు తల్లి కావడమే కదా ఆడజన్మ సార్ధకత!”, అంది వినోదిని తల్లి సంతోషపడిపోతూ.
వినోదిని వెంటనే తనకు తగ్గ వరుడిని చూసి పెళ్లి చేసేసుకుంది. ఏడాది గడిచాక వినోదినికి ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టగానే వాడిని ఎత్తుకుని, ‘వీడికి స్వతంత్రంగా బతకడం నేర్పిస్తాను! స్త్రీల ప్రగతికి పిల్లలు అవరోధం కాకూడదు!”, అని అనుకుంది వినోదిని.
వినోదిని, తను అనుకున్నట్లే రోజులో కొద్దిసమయం మాత్రమే బాబుకి కేటాయిస్తూ రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెడుతూ సమాజ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలలో పాలుపంచుకోవడం అలవాటు చేసుకుంది. ఆమె తీరు నచ్చని ఆమె భర్త ఆమెను విడిచి వెళ్ళిపోయాడు.
తను చేస్తున్న కార్యక్రమాల వల్ల తను ఉంటున్న జిల్లాలో అందరికీ సుపరిచితురాలైంది వినోదిని.
గిరిజ మాత్రం ఇంట్లోనే గృహిణిగా ఉంటూ సంసారంలో వచ్చే ఒడిదుడుకులను సమర్ధవంతంగా ఎదుర్కుంటూ తన ఒక్కగానొక్క పిల్లవాడిని దగ్గరుండి చూసుకుంటూ, తన భర్త, అత్తమామల వద్ద మంచి పేరును సంపాదించుకుంది.
కాలచక్రం గిర్రున తిరిగింది.
వినోదిని, గిరిజలు అరవయ్యేళ్ళ వాళ్ళయ్యారు. వినోదిని కుమారుడు అభినవ్ చదువు సంధ్యలు లేకుండా చెడుస్నేహాలు మరిగి మాదకద్రవ్యాలకు బానిస అయ్యాడు. తన కొడుకును సరైన దారిలో పెట్టుకోవడానికి తమ ఊరిలోని పునరావాస కేంద్రాన్ని ఆశ్రయించింది వినోదిని. వారు నానాతిప్పలుపడి అభినవ్ ని మామూలు మనిషిని చేయగలిగారు. వినోదిని పరపతి రాజకీయాలలో బాగా తగ్గిపోయింది. తను పని చేస్తున్న పార్టీలోకి కొందరు యువకులు చేరి వినోదినివన్నీ పాత పద్ధతులని, అవి నేటి సమాజానికి పనికి రావని వినోదినిని తీవ్రంగా అవమానపరిచారు. దాంతో వినోదిని రాజకీయాలను వదిలి పెట్టి కొడుకును చూసుకుంటూ ఇంటిపట్టున ఉండటం ప్రారంభించింది.
ఒక రోజు వినోదిని ఇంటికి కొందరు వ్యక్తులు వచ్చి ఆ మరుసటి రోజు తమ సంస్థ వార్షికోత్సవాన్ని వారు ఎప్పటికన్నా ఈ ఏడు ఘనంగా నిర్వహిస్తున్నారనీ, తమ ఊరికి సంబంధించిన ఎందరో ప్రముఖులను ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లుగా చెప్పి, వినోదినిని తప్పకుండా ఆ కార్యక్రమానికి హాజరు కావలసిందిగా మనవి చేశారు. కాదనలేక పోయింది వినోదిని. మరుసటి రోజు, ఎంతో కాలం తర్వాత ఒక కార్యక్రమానికి అతిధిగా వెళ్లే అవకాశం వచ్చినందుకు సంతోషిస్తూ పట్టుచీర కట్టుకుని చక్కగా తయారయ్యి కార్యక్రమం జరుగుతున్న చోటికి వెళ్ళింది వినోదిని. కార్యక్రమ నిర్వాహకులు ఆమెను సాదరంగా ఆహ్వానించి ముందు వరుసలోని ఒక కుర్చీలో కూర్చోపెట్టారు.
‘సమాజానికి నేను చేసిన సేవను కనీసం ఈ సంస్థ వాళ్ళన్నా గుర్తుపెట్టుకున్నారు!’, అనుకుంది వినోదిని.
కార్యక్రమం మొదలు కావడానికి ఇంకొంత సమయం ఉంది. ఆ ప్రాంతమంతా అప్పుడే అక్కడికి వస్తున్న వాళ్ళతో కోలాహలంగా ఉంది. అందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటున్నారు. వినోదినిని మాత్రం అందరూ గమనించనట్లుగా ప్రవర్తిస్తున్నారు. అంతలో వినోదిని కూర్చున్న వెనుక వరుసలో ఎవరో తన గురించే మాట్లాడుకుంటున్నారని గ్రహించి వినోదిని చెవులు రిక్కించి వారి మాటలను వినసాగింది.
‘అరేయ్! ఆ ముందు వరుసలో కూర్చున్న వినోదినిగారిని గుర్తు పట్టావా? గతంలో ఆవిడ సమాజం కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు!” అన్నాడు ఓ వ్యక్తి.
“ఆఁ! అంత గుర్తుపెట్టుకునే పనులు ఆవిడ ఏంచేశారనీ? ఆవిడ తన కొడుకుని సైతం దారిలో పెట్టుకోలేక ఊరిపైకి వదిలేశారు! అసలు ఇక్కడికావిడను ఎవరు పిలిచారో! మన అభిరాం చేస్తున్నది నిజమైన సమాజ సేవరా! “, అన్నాడు ఇంకో వ్యక్తి.
ఆ మాటలు వినోదినికి గుండెల్లో గుచ్చుకున్నాయి. ఎందుకో తనకు ఆ క్షణం గిరిజ పెళ్ళిలో గిరిజను బాధపెట్టడానికి తను అన్న మాటలు వినోదినికి గుర్తుకు వచ్చాయి. కళ్ళ వెంట నీళ్లు జలజలా కారాయి. ఉన్నట్టుండి తన భుజంపై ఎవరో చెయ్యి వెయ్యడంతో ఉలిక్కిపడి వారివంక చూసింది వినోదిని.
“వినోదినీ! బాగున్నావా? ఎన్నాళ్ళయింది నిన్ను చూసీ!”, అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ కనపడింది గిరిజ!
“నీకు నిండా నూరేళ్లు గిరిజా! నువ్విక్కడికొస్తావని నేను అస్సలు ఊహించలేదు. ఇంతకు నువ్వెలా ఉన్నావు?”, అడిగింది వినోదిని కళ్ళు తుడుచుకుంటూ.
“బాగానే ఉన్నాను! ఇంతకీ నీ జీవిత లక్ష్యం సాధించినట్లేగా?”, వినోదిని అవునని అంటుందన్న ధీమాతో అడిగింది గిరిజ.
వినోదిని సమాధానం చెప్పేలోపు ఎవరో మైకులో, “కార్యక్రమం మొదలవ్వబోతోంది. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి!” అని మనవి చేశారు.
కార్యక్రమం మొదలైంది.
ముందుగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఆ తర్వాత సంస్థ వ్యవస్థాపకులు, సంస్థ డైరెక్టర్లు ఉపన్యాసాలు ఇచ్చి ఆ సంస్థ చేపడుతున్న సామాజిక కార్యక్రమాల వివరాలను తెలియజేసారు. ఆ తర్వాత ఆ ఊరిలో గుర్తింపు పొందిన ఎందరినో ఘనంగా సత్కరించారు సంస్థవారు. ముందు వరుసలో కూర్చుని ప్రతి కార్యక్రమం తర్వాత చప్పట్లు కొడుతోంది వినోదిని.
“ఇప్పుడు తన వృత్తిపరంగానే కాకుండా ప్రవృత్తి పరంగా కూడా సమాజ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలను స్వయంగా చేపడుతూ, మా సంస్థ చేస్తున్న సామాజిక కార్యకలాపాలలో మాకు ఎప్పటికప్పుడు మంచి సూచనలందిస్తూ, మాకు మార్గదర్శిగా ఉంటున్న డా. అభిరాం గారికి ప్రత్యేక సన్మాన కార్యక్రమం!”, అని ప్రకటించారు కార్యక్రమ నిర్వాహకులు.
ఈ అభిరాం ఎవరా అని చుట్టూ కలియ చూసింది వినోదిని. సన్నగా పొడుగ్గా ఉన్న ఒక యువకుడు చురుగ్గా పరుగులాంటి నడకతో స్టేజి పైకివచ్చి అందరికీ నమస్కరించాడు. అతడిని ఘనంగా సత్కరించి, వేదపండితుల చేత ఆశీర్వచనం కూడా చెప్పించారు సంస్థవారు. ఆ తర్వాత వినోదినిని స్టేజి పైకి ఆహ్వానించి అభిరాంకి ఒక పుష్పగుచ్ఛం ఇప్పించారు. చివరిగా అభిరాంకి మైకు అందించి మాట్లాడవలసిందిగా కార్యక్రమ నిర్వాహకులు మనవి చేశారు.
అప్పుడు అభిరాం, “అందరికీ నమస్కారం! నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే అందుకు కారణం మా అమ్మ! నా భవిష్యత్తు కోసం బాగా చదువుకుని కూడా తను గృహిణిగా ఉండిపోయి, నాకు ఊహ తెలిసినప్పటినుండీ నీతీ, ధర్మం విలువలను బోధిస్తూ, పదిమందికీ ఎలా సాయపడాలో నేర్పింది. అలా నేను చేపట్టిన కార్యక్రమాలలో ఆసుపత్రులు నిర్మించడం, పాఠశాలలను పునరుద్ధరించడం, చెడువ్యసనాల దుష్ప్రభావం పట్ల జనాలకు అవగాహన కల్పించడం , పునరావాస కేంద్రాలను ఏర్పాటు చెయ్యడం వంటివి ఉన్నాయి. నేను మన ఊరిలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం ఎందరో జీవితాలలో మంచి మార్పును తీసుకువచ్చింది. ఆ ఆలోచన వెనుక ఉండి నన్ను నడిపించింది మా అమ్మే! నేను చేసే ప్రతిపనికీ ప్రేరణ, ప్రోత్సాహం అనునిత్యం అందిస్తున్న మా అమ్మను ఈ సందర్భంలో సత్కరించుకోవడం నా విధిగా నేను భావిస్తున్నాను. ఆవిడను స్టేజి పైకి రావలసిందిగా కోరుతున్నాను!”, అన్నాడు.
కార్యక్రమం తిలకిస్తున్నవారు ఉత్సాహంతో కొడుతున్న చప్పట్ల మధ్య, దారి చేసుకుంటూ గిరిజ స్టేజిపైకి వచ్చింది!
అభిరాం గిరిజను కౌగలించుకుని ఆమె పాదాలకు నమస్కరించాడు. గిరిజ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై అభిరాంను ప్రేమగా ముద్దాడింది. సంస్థవారు గిరిజను కూడా ఘనంగా సత్కరించారు. జరుగుతున్నదంతా ‘కలా? నిజమా?’ అన్నట్టుగా సంభ్రమాశ్చర్యాలతో చూస్తోంది వినోదిని.
కార్యక్రమం ముగుస్తూనే వినోదిని గిరిజను గట్టిగా కౌగలించుకుని, “నువ్వు నీ జీవిత లక్ష్యాన్ని సాధించావు గిరిజా! నీకు నా హృదయపూర్వక అభినందనలు! ఒక గృహిణి సమాజానికి ఇంట్లోనే ఉంటూ ఎలా మేలు చేయగలదో చేసి చూపించావు! పరోక్షంగా నా కొడుకుకి మరుజన్మను ప్రసాదించావు! నువ్వు బాధ పడేలా నిన్ను అనరాని మాటలన్నందుకు నేను ఇప్పుడు అందుకు తగ్గ ఫలితాన్ని అనుభవిస్తున్నాను! నేను నా జీవితంలో ఓడిపోయాను! నువ్వు గెలిచావు!”, అంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది.
గిరిజ వినోదినిని ఓదారుస్తూ, “సమాజం బాగుపడాలంటే ముందు ఎవరి ఇంటిని వారు బాగు చేసుకోవాలి! ‘గృహిణి’ ఎందుకూ పనికిరాదన్న అభిప్రాయం తప్పు! అలాగే గృహిణికి చదువక్కరలేదన్న ధోరణి కూడా తప్పే! గృహిణి తన పిల్లలను చదివించాలన్నా, వారికి వచ్చే సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ, వారి పురోగతికి అవసరమైన సలహాలనూ, సూచనలనూ ఇవ్వాలన్నా, చదువుతో వచ్చే జ్ఞానం ఆమెకెంతో అవసరం! నేను నా చదువును నా లక్ష్య సాధనకు ఆ విధంగానే వాడుకున్నాను! భగవంతుడి దయవల్ల ఈ రోజు విజయాన్ని సాధించగలిగాను!”, చెప్పింది గిరిజ.
“సమాజాన్ని బాగుచెయ్యడానికి నువ్వెంచుకున్న మార్గం సరైనదేనని నాకిప్పుడు అర్ధమైంది గిరిజా! కాలాన్ని నేనెలాగూ వెనక్కి తిప్పలేను! ఇప్పుడైనా నా భర్త వద్దకు వెళ్లి నేను చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను!”, అంటూ అక్కడినుండి వెళ్ళిపోయింది వినోదిని!

*****

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *