April 19, 2024

తెలివైన యువకుడు

రచన: మోహనరావు మంత్రిప్రగడ.

పిల్లలు అరుగు మీద కూర్చోని కధలు చెప్పుకొంటున్నారు. ఇంతలో రాముడు మావయ్య వచ్చాడు.” ఏం చేస్తున్నార్రా పిల్లలు” అని అడిగాడు. “కధలు చెప్పుకొంటున్నాం మావయ్యి” అని అందరు ముక్త కఠంతో అరిచారు. “అలాంటి పిచ్చి కధలు కాదురా నేనో మంచి కధ చేపుతాను వినండి” అని అరుగుమీద కూర్చొన్నాడు ఆయన.
“చెప్పు మావయ్యా” అని పిల్లలు అందరు దగ్గరగా చేరారు.
“సరే వినండి పూర్వం అలకాపురం అనే రాజ్యం ఉండేది దాన్నీ చంద్రుడు అనే రాజుపాలించెవాడు. ఆయన ప్రజలని నానావిధాలుగా బాధలు పెట్టేవాడు. అనవసరంగా అధిక సుంకాలు విధించి బాధపెట్టి వసూలు చేయించేవాడు. అలా వసూలైన సొమ్మంతా తన విలాసాలకి వాడుకొనేవాడు.
కొంత కాలానికి కోశాగారంలోని ధనం అంతా అయిపోయింది. ఆదేశ మంత్రిగారు ఈ విషయం ఆయన దృష్టికి తీసుకెళ్ళాడు. రాజుగారు ప్రజల దగ్గరనించి ఇంకా పన్నులు వసూలు చేసి తెమ్మని ఆదేశించారు. అప్పుడు మంత్రిగారు, మరి కొంతమంది అలా చేస్తే ప్రజల్లొ తిరుగుబాటు వస్తుందని, ప్రస్తుతం ఆ తిరుగుబాటుని అణచివేసే బలం మన దగ్గర లేదని, జీతాలివ్వలేక పోవడంవల్ల చాలామంది సైనికులు వెళ్ళిపోయి పొరుగు రాజ్యం రాజు సైన్యంలో చేరిపోయారని చెప్పారు.
అయితే ఎలాగైనా ధనం వచ్చే మార్గం చూడమని ఆ రాజు మంత్రిని ఆదేశించాడు. మంత్రిగారు ఆ రాజ్య సలహా దారుని సలహా అడిగాడు. దానికి ఆయన ఓ సలహా ఇచ్చాడు. రాజుగారు ముందుగా రాజ్యంలోగల ధనవంతుల జాబితా తయారు చేయించమని గ్రామాధికార్లకు ఆదేశాలు పంపించి ఆతర్వాత రాజుగారు రాజ్య పర్యటన చేస్తు ఒక్కొక్క గ్రామమే వేళ్ళి ఆ జాబితాలో గల వార్ని పిలిపించి రాజుగారు మంచి మంచి కధలు వినడానికి ఆసక్తిగా ఉన్నారని, అలా వారందరు కధలు చెప్పి రాజుగార్ని మెప్పించాలని అలా వారు మెప్పించకపోతె పదేసి వరహాలు జరిమానాగా చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేయమని, అలా కధలు చెప్పలేనివారు చెల్లించే జరిమానా మూలంగా చాలా ధనం వస్తుందని రాజుగారికి ఆశ కల్పించాడా సలహాదారు.
ఆ రాజుగారు అలానే ఉత్తర్వులు జారీచెసారు. ఆ తర్వాత ముందుగా ఓ గ్రామం వెళ్ళి అక్కడ బస చేసి ఆగ్రామాధికారి తయారు చేసిన జాబితా ప్రకారం అందర్ని పిలిచి విషయం చెప్పారు. రాజాజ్ఞ కదా అందరూ ఏంచెయ్యలేక విధిలేక కధలు చెప్పడం ప్రారంభించారు, కాని ఎవరెన్ని కధలు చెప్పినా రాజు చాలు అంటంలేదు. అందరూ పదేసి వరహాలు చెల్లించారు.
రాజుగారికి అహం బాగా పెరిగింది. ఇంకా ఎరైనా గ్రామంలొ ఉంటే ఈ కార్యక్రమంలొకి రావచ్చని ప్రకటించారు. అంతవరకూ ధనవంతుల జాబితాలో చేరని ఒక యువకుడు ముందుకొచ్చాడు. .”అయ్యా ఇంతవరకు కధలు చెప్పి తమని మెప్పించి, చాలని అని అనిపించకపోతే పదేసి వరహాలు జరిమానా కట్టాలని ఆదేశించారు కాని, ఒకవేళ తమని మెప్పించి కధలు చాలనిపిస్తె బహుమతిగా ఏం ఇస్తారు అని అడిగాడు.
రాజుగారు తననెవరు మెప్పించలేరనే గర్వంతో ఈ అందరిదగ్గర తీసుకొన్న ధనం అంతా ఇచ్చేస్తానని వాగ్దానం
చేసారు.
ఆ యువకుడు ముందుగా ఓ కధ చెప్పాడు. రాజుగారు ‘తర్వాత’ అన్నారు. అతను మరో కధ చెప్పాడు. దానికి కూడా “తర్వాత” అన్నారు రాజుగారు ఉత్సాహంగా. ఈసారి అతను మరో కధ ప్రారంభించాడు. ” ఓ గ్రామంలో ఓ జమిందారు గారి పేద్ద ఇల్లు ఉంది ఆ ఇల్లు పాడుపడి పోయింది. దాని నిండా కోతులు చేరాయి రమారమి ఓ వెయ్యి
కోతులు ఆ బంగాళా కప్పుమీద కూర్చొన్నాయి. ఓ వేటగాడొచ్చీ తుపాకి ఓ కోతికి గురి పెట్టి పెల్చాడు. ఆ శబ్దానికి ఓ కోతి క్రిందకి ఉరికింది” అని ఆగాడా యువకుడు.
“తర్వాత” అన్నారు రాజుగారు మళ్ళా “ఉరికింది” అన్నాడా యువకుడు. “తర్వాత” అన్నారు రాజుగారు. “ఉరికింది” అన్నాడాయువకుడు. ఇలా ఓ పదిసార్ల వరకు రాజుగారు తర్వాత అనడం ఆయువకుడు ఉరికింది అనడంతో రాజుగారికి కోపం వచ్చింది.
“ఏమయ్య ఎన్నిసార్లు ఉరికిందండంటావు మిగతాకధ కాని” అన్నారు రాజుగారు కోపంగా. “అయ్యా రమారమి వెయ్య కోతులు ఉరకాలి. అలాగే అక్కడకి చేరిన మరో ఐదొందలు కోతులురకాలి కదా. అదంతా అయితేగాని మరో కధ ఎలా చెప్పడం ” అన్నాడా యువకుడు.
“అయితే ఆ కోతులన్ని ఉరికేదాకా అలా ఉరికింది అని అంటూంటావా” చిరాగ్గా అడిగారు రాజుగారు
“అవును ప్రభూ అన్ని ఉరికితేకాని కధ పూర్తవదు” అన్నాడాయువకుడు శాంతంగా.
రాజుగార్కి వళ్ళు మండింది. ” అయితే వద్దులే ఇంక చాలు ఇప్పటికె నా తల తిరిగి పోతోంది ఇంకేం ఏంచెప్పకు” అనేసారు చిరాగ్గా.
“అయితే ప్రభు తమరు చాలన్నారు కనక నేను విజయం సాధించినట్లే కదా. తమరన్న మాట ప్రకారం ఆ సంపదంతా నాకిచ్చేయండి” అని అడిగాడు. రాజుగారు మంత్రిగారికేసి చూసారు.
మంత్రిగారు రాజుగారి దగ్గరగా వచ్చి” ఇచ్చెయండి ప్రభు. లేకపోతే తమరికి అపవాదొస్తుంది. ఈ విషయం రాజ్యం అంతా తెలిస్తే మంచిదికాదు” అని సలహాఇచ్చారు.
విధిలేక ఆ సంపదంతా ఆ యువకునికిచ్చేసారు. ఆ యువకుడు ఆ సంపదనించి అక్కడ ఓడిపోయి పదేసి వరహాలు చెల్లించిన వారందరికి తిరిగి పంచేసాడు. వాళ్ళంతా సంతోషించి అందరు తలో వరహా ఆ యువకునికిచ్చి, మెచ్చుకొని వెళ్ళి పోయారు.
ఆ తర్వాత ఆ యువకుడు రాజుగార్ని ఉద్దేశించి “ప్రభు పాలకుడు ప్రజల మంచి చెడ్డలు చూసేవాడుగా ఉండాలికాని ఇలా దోచుకొనే వాడిలా ఉండకూడదు, దానివల్ల ప్రజలు విసిగిపోయి తిరుగుబాటు చేస్తారు అదే అదనుగా తీసుకొని మీ శత్రు రాజులు దండయాత్ర చేస్తారు. రాజ్యంతోపాటు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు” అని అనునయంగా చెప్పాడు.
రాజుగార్కి ఙ్ఞానోదయం అయింది. వెంటనే ఆ యువకుడిని తన సలహాదారుగా నియమించుకొని చక్కగా చాలాకాలం పరిపాలించాడు.
“అంచేత మీరంతా అలా ఆ యువకుడిలా తెలివితెటలు నేర్చుకోవాలి తెలిసిందా” అని రాముడు మావయ్య లేచి వెళ్ళిపోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *