April 19, 2024

నాటి ‘కచుడు’ నేటికీ ఆదర్శమే

రచన: సీతాలక్ష్మి వేలూరి
ఆంధ్రమహాభారతంలో ఉపాఖ్యానాలకు కొఱతలేదు. అద్భుతమైన కథలకు కొలువు కూటమి భారతం. ముఖ్యంగా నన్నయభట్టారకుని రచనలో ఉపాఖ్యానాలకు వన్నెలెక్కువ. ఆయన ప్రసన్నకథాకలితార్థయుక్తికి తార్కాణాలైన కథలలో యయాతి వృత్తాంతం ఒకటి. అందులో ఒక చిన్న పాత్ర ‘కచుడు’. కేవలం 33 గద్య పద్యాలకు మాత్రమే పరిమితమైన పాత్ర ఇది. అయినా పఠితల మనస్సునమితంగా ఆకర్షించి వారి హృదయాలలో శాశ్వతస్థానాన్ని ఏర్పరచుకుంటుదనడంలో విప్రతిపత్తి లేదు. కచుడు ఈ కథలో కేవలం 4 పద్యాలలోను, ఒక వచనంలో మూడు వాక్యాలలోను మాత్రమే సంభాషిస్తాడు. ఐతే నేమి ఒక అద్భుత ధర్మస్వరూపాన్ని మనమా పాత్రలో దర్శిస్తాం. ఈ కచుని తోడబుట్టినవాడే అల్లసాని పెద్దన ప్రవరుడనిపిస్తుంది
.
ఈతని ప్రవర్తనను గమనిస్తే,
కచుడు తన సమాజఋణం తీర్చుకున్న ఆదర్శమూర్తి. తన జాతిశ్రేయస్సుకోసం ప్రాణాలకు తెగించి శత్రుకూటమిలో ప్రవేశించిన వీరసైనికుడు కచుడు. తన జాతి మనుగడకు తన ప్రాణాన్నే పణంగా పెట్టిన త్యాగశీలి. తాను నేర్చేవిద్య తన సమాజ పరిరక్షణకు మాత్రమే అన్న భావనకు ప్రతిరూపం కచుడు. ఆదర్శ విద్యార్థిగా నేటి తరానికీ మార్గదర్శకుడని నిస్సందేహంగా భావించవచ్చు.
.
ఇంతకీ ఈ కచుడెవరంటే …
.
వృషపర్వుడనే రాక్షసరాజుకి శుక్రాచార్యుడు గురువై ఆ రాజుని, దేశాన్ని తన విద్యాబలంచేత, వివిధ నయోపాయాల చేత కాపాడుతూ ఉండేవాడు. దేవతల గురువు బృహస్పతి. అయితే దేవతలకు, రాక్షసులకు జరుగుతున్న యుద్ధంలో ప్రతిరోజు మరణిస్తున్న రాక్షసులను శుక్రుడు తన వద్దనున్న మృత సంజీవని విద్య ద్వారా పునర్జీవులుగా చేసేవాడు. ఇది చూస్తున్న దేవతలు, ప్రతిరోజూ రాక్షసుల సంఖ్య ఏ మాత్రము తగ్గకపోవడంతో భీతిల్లి, ‘శుక్రుని వద్దనుండి ఆ మృతసంజీవని విద్యను పొంది, తీసికొనివచ్చి, తమనుకూడ కాపాడగలిగిన మహాసత్త్వసంపన్నుడు తమ గురుపుత్రుడు కచుడే’ అని నిర్ధారించుకొని అతని దగ్గరకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
.
నన్నయ కచుని రూప గుణవిశేషాలని మొదట్లోనే దేవతల మాటలద్వారా మనకి సూచన ప్రాయంగా అందిస్తాడు. దేవతలు కచునితో, ‘‘తపశ్ర్శీ విభవా! దేవదానవ యుద్ధంలో మరణించిన రాక్షసులు శుక్రుని మృతసంజీవని విద్యవల్ల ప్రతిరోజు బ్రతికి వస్తున్నారు. మన వద్ద ఆ విద్య లేనికారణంగా మనవారు మరణించి పరలోకానికి చేరుకుంటున్నారు. కాబట్టి ఏ విధంగానైనా నీవు శుక్రుని వద్దనుండి ఆ మృతసంజీవని విద్యనేర్చుకొని వచ్చి మన జాతిని కాపాడాలి.’’ అని అంటూ ఇంకా ఇలా అన్నారు,
.
‘‘బాలుండవు, నియమవ్రత
శీలుండవు నిన్ను బ్రీతి జేకొని, తద్వి
ద్యాలలనా దానము గరు
ణాలయుడై చేయు నమ్మహాముని నీకున్’’ (ఆం.మ.భా. ఆది. 3-106)
.
కచుడు మహా సత్త్వసంపన్నుడని దేవతలకు తెలుసు కాబట్టే, తమ దేవతాగణం మొత్తంలో ఆ సంజీవనిని తేగల సమర్థుడు ‘కచుడే’ అని నిర్ధారించుకున్నారు. కచుని గురించి ఇప్పుడు మరో రెండు విశేషణాలు తెలియజేసారు దేవతలు. మొదటిది ‘బాలుడు’ కచుడు. ఇక్కడ బాలుడంటే వయస్సులో చిన్నవాడని అర్థంకాదు. విద్యనభ్యసించే వయస్సులో ఉన్న లేబ్రాయపువాడు. 16సంవత్సరాల వయసు దాటనివాడు. అద్భుతమైన సంజీవని విద్యనభ్యసించి, సమర్థవంతంగా తీసికొని రాగలిగిన విద్యార్థిదశలో ఉన్నవాడని అర్థం. ఇక దేవతల రెండవ మాట కచుడు ‘నియమవ్రత శీలుడు’. విద్యార్థికి ఇది చాలముఖ్యం. ఇది గుణాన్ని సూచించే పదం. విద్య నేర్చేటప్పుడు ఎలాంటి ప్రలోభాలకు కచుడు లోనుకాడని వారి నమ్మకం. ‘బాలుడవు, నియమవ్రత శీలుడవు కాబట్టి శుక్రుడు నిన్నిష్టంతో శిష్యునిగా స్వీకరించి, కరుణతో ఆ విద్యాలలనా దానము చేస్తాడు’ అని నిర్ద్వంద్వంగా అన్నారానిమిషులు.
.
పైగా కచునికి ఓ ఉపాయం కూడ చెప్పారు దేవతలు. ‘‘శుక్రునికి ‘దేవయాని’ అని ఒకే ఒక్క కుమార్తె ఉంది. ఆ అమ్మాయి మీద అపరిమితమైన వాత్సల్యం ఆ తండ్రికి. ఆమె మాటల నాయన అతిక్రమింపడు. కాబట్టి నీవు తెలివిగా ఆమె మనస్సుకు నచ్చినట్లు ప్రవర్తించి, శుక్రాచార్యుని సేవించినట్లైతే నీకా మృతసంజీవనివిద్య సులభసాధ్యమౌతుంది’’ అని బ్రహ్మాండ మైన సలహా ఇచ్చారు. తన వారికోసం ఆ విద్య సంపాదించడానికి కచుడంగీకరించాడు.
ఇక్కడినుండి కచుని కదలికలన్నీ విద్యార్థులకాదర్శప్రాయమే. దేవతలకు మేలు చేయడానికి కచుడు శత్రుదేశంలో ప్రవేశించడానికి సంసిద్ధుడయ్యాడు. ఇది ఎంత అద్భుతమైన సంస్కారం! బృహస్పతి, శుక్రుడు వ్యక్తిగతంగా శత్రువులు కాకపోయినా సృష్ట్యాది నుండి జాతివైరులైన దేవ, రాక్షస గణాలకి గురువులు తమ తమ జాతులను కాపాడుకోవడమే గురువులుగా వారి లక్ష్యం. అలాంటి పరిస్థితుల్లో తన జాతి రక్షణ కోసం ఆజన్మశత్రువులైన వారి ప్రదేశానికి ముక్కు పచ్చలారని తన కుమారుణ్ణి పంపడానికి బృహస్పతి అంగీకరించడం ఎంత గొప్ప విషయం! మన సంస్కృతి, దేశభక్తి ఎంత విశిష్టమైనవో ఈ సన్నివేశం నిరూపిస్తుంది.
.
ఇంతకన్నా విశేషం చూడండి.
.
కచుడు వృషపర్వుపురానికి వెళ్లాడు. అక్కడ వేరాధ్యయన శీలుడై, సకల దానవగణోపాధ్యాయుడైన శుక్రాచార్యుని చూసి ఎంతో వినయంగా నమస్కరించి, తన వివరాలు చెప్పాడు.
.
‘‘ఏను గచుం డను వాడ మ
హా నియమసమన్వితుడ, బృహస్పతి సుతుడన్
మానుగ వచ్చితి నీకును
భానునిభా! శిష్య వృత్తి బని సేయంగన్’’ (ఆది 3-108)
.
అని అన్నాడు. ఈ కథలో కచుడు మాట్లాడిన అతి తక్కువ మాటలలో ఇదే మొదటిది. కచుడెక్కడా అబద్ధం చెప్పలేదు. శుక్రుని మోసం చేయలేదు. తాను దేవతల గురువైన బృహస్పతి కుమారుడనని చెప్పుకున్నాడు. తనను తాను ‘‘మహానియమ సమన్వితు’’డనని చెప్పుకున్నాడు. అలా చెప్పుకోక తప్పదు. మరో ఊళ్లో చదువుకోడానికి వెళ్లినప్పుడు, పాత పాఠశాలలో తన నడవడికిచ్చే యోగ్యతాపత్రాన్ని (Conduct Certificate) చూపడం తప్పని సరికదా! ఆ రోజుల్లో తనను తాను విద్యార్థిగా పరిచయం చేసుకున్నప్పుడు తన నడవడిని తానే చెప్పుకోవడం తప్పనిసరి.
.
ఇక శుక్రుడెంత ఉత్తముడో చూడండి. కచుణ్ణి చూసాడు శుక్రుడు. అతని మాటలు శ్రద్ధగా విన్నాడు. శుక్రాచార్యుడఖండ ప్రజ్ఞాశాలి. మొదటిచూపు, మొదటిమాటలోనే కచునిలోని ముచ్చటైన మూడు లక్షణాలని అంచనా వేసాడు. అవి కచుని సుకుమారత్వము, వినయ ప్రియవచన మృదు మధురత్వము, అనవరతనియమ వ్రతప్రకాశిత ప్రశాంతత్వము.
.
శుక్రుడు కచునిలో గమనించిన విశేషాలలో మొదటిది కచుని రూపలక్షణం కాగా, మరొకటి మాట తీరుని, ఇంకొకటి అతని యోగ్యతను వ్యక్తం చేసేవి. కచుణ్ణి చూసిన తర్వాత శుక్రాచార్యుని మనస్సులో కల్గిన భావన ఆయన అపూర్వ సంస్కారానికి నిదర్శనం.
.
‘‘ఈ పిల్లవాణ్ణి నేనాదరిస్తే సాక్షాత్తు బృహస్పతినే పూజించినట్లు కదా!’’ అని కచుణ్ణి సాదరంగా ఆహ్వానించి, తన శిష్యునిగా స్వీకరించాడు. ఇది ఎంత గొప్ప విషయం! స్వజాతి రక్షణకోసం శ్రతుపక్షానికి చెందిన గురువు దగ్గరికి కన్నకొడుకుని పంపిన తండ్రి ఒకరు కాగా, ప్రతిపక్ష గురుపుత్రుణ్ణి ఏమాత్రం సంశయించకుండా శిష్యునిగా అంగీకరించిన ఆదర్శగురువు మరొకరు. ఏమాత్రం భీతి చెందక తన సమాజ ఋణం తీర్చుకోడానికి శత్రువర్గంలో విద్యార్థిగా చేరిన బాలుడింకొకరు. ఈ మూర్తి త్రయంలో ఎవరినీ తక్కువ అంచనా వెయ్యలేము. వారివారి సంస్కారాలకు నమోవాకాలు. వారి ప్రవర్తన ఈనాటి వారికీ ఆదర్శమే. (తమ కన్నపిల్లల్ని దేశరక్షణకోసం ఆనందంగా యుద్ధరంగానికి పంపుతున్న ఈనాటి మహాత్ములనదగిన మాతాపితలు ఇట్టివారే.) రాగద్వేషాల కతీతంగా ఈ త్రిమూర్తులు నిర్వహించిన ‘సమాజఋణం’, ‘గురుశిష్య సంబంధం’, ‘ధర్మం’ అనే ‘త్రివేణి సంగమం’లో మనమందరం మునకవేసి పునీతులమవ్వాలి.
.
శుక్రుని వద్ద విద్యార్థిగా చేరిన కచుడు, ఏ పని చెప్పినా క్షణాలలో చేస్తూ, గురువు చిత్తవృత్తిననుసరించి ప్రవర్తిస్తూ, వినయంతో త్రికరణ శుద్ధిగా ఒకే భావం కలవాడై, శుక్రుని ఏకైక పుత్రిక దేవయానికి సువిధేయుడై, ఆమెతో ప్రియ, హిత భాషలు చేస్తూ, ఆమె కోరిన పుష్ప, ఫల విశేషాలను సమకూరుస్తూ చాల సంవత్సరాలు నిష్ఠగా శిష్యరికంచేసాడు. శుక్ర, దేవయానుల హృదయాలలో సముచిత స్థానాన్ని సంపాదించాడు. అంతేకాని ఎప్పుడూ, ఎక్కడా ఏ సన్నివేశంలోనూ, దేవయానితో అనుచితంగా ప్రవర్తించలేదు. క్రమేపి శుక్రునికి ప్రియశిష్యుడయ్యాడు. ఇది రాక్షస విద్యార్థులకు నచ్చలేదు. సహజమే కదా! ఈ కచుడు ఎక్కడి నుండో వచ్చాడు. తమ శత్రువర్గానికి చెందినవాడు. అలాంటివాడు శుక్రుడికి తమకన్నా దగ్గరవడం వాళ్లు భరించలేక పోయారు. ఆ కోపంతో ఒకనాడు ఒంటరిగా అడవిలో హోమధేనువులను కాస్తున్న కచుణ్ణి రాక్షసులు చంపి, అక్కడున్న మద్దిచెట్టు కొమ్మకి ఆ శవాన్ని కట్టేసి చక్కాపోయారు.
.
సాయంత్రమయింది. ధేనువులు ఇంటికి వచ్చాయి. కాని వాటితో పాటు వెళ్లిన కచుడు మాత్రం ఇంటికి తిరిగి రాలేదు. క్రమంగా చీకట్లు వ్యాపిస్తున్నాయి. కచుడు రాకపోవడంతో దేవయాని మనస్సు గిలగిలలాడింది. ఆబాధలోనే తండ్రి దగ్గరకువెళ్లి దీనంగా ఇలా అంది.
.
‘‘వాడిమయూఖముల్ గలుగు వాడపరాంబుధి గ్రుంకె ధేనువుల్
నే డిట వచ్చె నేకతమ నిష్ఠమెయిన్ భవదగ్ని హోత్రముల్
పోడిగ వేల్వగా బడియె బ్రొద్దును బోయె గచుండు నేనియున్
రాడు వనంబులోన మృగరాక్షస పన్నగ బాధనొందెనో!’’ (ఆది -3-112)
.
‘‘తండ్రీ! సూర్యుడస్తమించాడు. ధేనువులింటికి చేరాయి. నీ అగ్నిహోత్రాలన్నీ కూడ బాగుగా వేల్వబడ్డాయి. ప్రొద్దుపోయింది. కాని కచుడు మాత్రం ఇల్లు చేరలేదు. అడవిలో క్రూర జంతువులచేతగాని, రాక్షసులచేతగాని, పాములచేతగాని అతడికి హాని జరిగిందేమో!’’ అని ఏడ్చింది. ఆమె శోకాన్ని ఏమాత్రం భరించలేని ఆ తండ్రి దివ్యదృష్టితో చూసాడు. అడవిలో వృక్షశాఖకు బంధింపబడ్డ కచుని శవం దృగ్గోచరమైంది. వెంటనే మృత సంజీవనిని పంపించి, కచుణ్ణి బ్రతికించి, ఇంటికి రప్పించాడు. దేవయాని చాల సతోషించింది. మర్నాడు మామూలుగా ఉన్న కచుణ్ణి చూసి రాక్షస విద్యార్థులు ఖంగుతిన్నారు.
.
ఇక్కడ విశేషమేమిటంటే తనని రాక్షసులు చంపితే శుక్రుడు దయతో బ్రతికించిన తర్వాత కూడ కచుడెక్కడా జంకలేదు. తన లోకం పారిపోలేదు. తనని రాక్షసులు ముందు ముందు తప్పక మట్టుపెట్టే ప్రణాళికలు వేస్తారని తెలిసి కూడ కచుడు నిరామయంగా ఏమీ జరగనట్లు ఎప్పటి లాగానే ప్రవర్తించాడు. ఇంతటి స్థితప్రజ్ఞుణ్ణి సాధారణంగా చూడము. విద్యపూర్తికాకుండా అక్కడినుండి కదలరాదనే అతని దృఢసంకల్పం, నియమవ్రతం ముచ్చటనిపిస్తాయి.
.
తాము చంపినా, తమగురువు దయతో బ్రతికి బట్టకట్టిన కచుడు రాక్షస విద్యార్ధులకింకా కంటగింపుగా తయారయ్యాడు. ఈసారి మరింత పకడ్బందీగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత ఒకరోజు ఒంటరిగా అడవిలో పువ్వులు తీసికొని రావడానికి వెళ్లిన కచుణ్ణి చంపి, ఆ శవాన్ని కాల్చి, బూడిదచేసి, సురలో ఆ బూడిదను కలిపి, దాన్ని శుక్రాచార్యుడి చేతే త్రాగించారీ రాక్షస బాలకులు. ఆ రోజుల్లో ఏ వర్గం వారైనా సురత్రాగడం దోషంకాదు. శుక్రుడికా అలవాటు ఉంది. అందుకే రాక్షసార్భకులాపని అంతనిర్భయంగా చేసారు. ఇక కచుడే రకంగానూ బ్రతికి రాడని వాళ్ల ధైర్యం. సుర సేవించిన శుక్రుడు మత్తుగా ఉన్నాడు. రాత్రి అయింది. కచుడు ఇంటికి రాలేదు. మళ్లీ మొదలు. రాక్షసులే కచుణ్ణి ఏదో చేసి ఉంటారని అనుమానించిన దేవయాని తండ్రి దగ్గరకువెళ్లి గొల్లుమంది.
.
ఇదివరలో శుక్రుడు సురసేవించలేదు కాబట్టి దేవయాని ఏడవగానే వెంటనే స్పందించి మృతసంజీవనిని పంపాడు. ఇప్పుడు సురాపాన మత్తుడవడం చేత వివశుడై, ఏడుస్తున్న కూతుర్ని చూసి, ‘‘అమ్మాయీ! ఏడవడమెందుకు? ఈ రాక్షస పుత్రులొకవేళ కచుణ్ణి చంపినా, అతడు సుఖంగా తన లోకానికి వెళ్లిపోయి ఉంటాడు కదా! నువ్వెందుకు బాధ పడటం?’’ అన్నాడు. అయినా దేవయాని ఊరుకోలేదు.తండ్రికి ఒకరకంగా కర్తవ్యోపదేశం చేసింది. ఇక్కడ కచుని గురించి దేవయాని చెప్పిన మాటలు ఆమెకు కచునిపైగల అనురక్తిని అన్యాపదేశంగా వ్యక్తం చేస్తాయి.
.
మతిలోకోత్తరుడైన యంగిర సుమన్మం డాశ్రితుం డాబృహ
స్పతికిం బుత్రుడు మీకు శిష్యుడు సురూపబ్రహ్మచర్యాశ్రమ
వ్రత సంపన్ను డకారణంబ దనుజ వ్యాపాదితుండైన న
చ్యుత ధర్మజ్ఞ మహాత్మ యక్కచున కే శోకింప కె ట్లుండుదున్ (ఆది 3-118)
.
అని తన శోకానికి కారణాన్ని సమర్థించుకుంది దేవయాని. ‘‘మహాత్మా! మహాబుద్ధిశాలియైన అంగిరసుని మనుమడు, మనలనాశ్రయించినవాడు, దేవతాగురువైన బృహస్పతికి పుత్రుడు, మీదు మిక్కిలి మీకు శిష్యుడు, బ్రహ్మచర్య వ్రతాన్ననుసరిస్తున్న వాడు అయిన కచుడు రాక్షసులచేత అకారణంగా హతమార్చబడితే నేను ఏడవకుండా ఎలా ఉండగలను?’’ అని అంది. ఆ అమ్మాయి మాటలు ప్రత్యక్షర సత్యాలు. ‘మనల్ని నమ్మి మన నాశ్రయించినవాడి బాగోగులు మనం చూడవద్దా!’’ అని తండ్రిని హెచ్చరించింది. చివరికి ‘‘అతణ్ణి చూస్తేనేగాని నేను కుడువనొల్లను’’ అని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. ఇక శుక్రుడికి దిగిరాక తప్పలేదు. మళ్లీ దివ్యదృష్టితో అన్ని లోకాలు గాలించాడు. చివరకు తన ఉదరంలోనే భస్మరూపంలో ఉన్న కచుడు కన్పించాడు శుక్రునికి. అప్పుడు కనువిప్పు కలిగింది ఆయనకి. సురాపానం ఎంతటి ఘోరమైన అకృత్యాన్ని తన చేత చేయించిందో ఆయన గుర్తించాడు. వెంటనే, ‘‘ఇదివరలో మానవుడు చేసిన పుణ్యకర్మలవల్ల కలిగే జ్ఞానమంతటినీ క్షణంలో నాశనం చేసే ‘మద్యసేవ’ చేయవచ్చునా? నేడు మొదలు భూసురులాదిగా గల జనులెవ్వరీ మద్యపానం చేసినా పతితులౌతారు. సురాపానం మహాపాతకం. చేసితి మర్యాద (కట్టుబాటు) దీని చేకొనుడు జనుల్!’’ అని శాసనం చేసేసాడు.
పిమ్మట తన ఉదరంలో ఉన్న కచుణ్ణి సంజీవని విద్యతో బ్రతికించాడు. అయితే శుక్రుని ఉదరంలో బ్రతికిన కచుడు బయటకు రావడం ఎలా? అదే అడిగాడు కచుడు శుక్రాచార్యుణ్ణి.
.
తనువును జీవము సత్త్వం
బును బడసితి నీప్రసాదమున నీయుదరం
బనఘా! వెలువడు మార్గం
బొనరింపుము నాకు భూసురోత్తమ దయతోన్ (ఆది – 3 – 123)
.
ఈ కథమొత్తంలో, ఇది కచుడు సంభాషించిన రెండవ సన్నివేశం.
‘‘గురువర్యా! శరీరాన్ని, ప్రాణాన్ని, శక్తిని నీ దయవల్ల తిరిగి పొందాను. దయతో నీ ఉదరం నుండి బయటకు వచ్చే మార్గాన్ని చూపించు’’ అని అడిగాడు. శుక్రుడాలోచించాడు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. కచుడు బయటకు రావాలంటే తన (శుక్రుని) ఉదరాన్ని చీల్చుకొని రావాలి. అలావస్తే తను మరణిస్తాడు. తిరిగి తాను బ్రతకాలంటే మృతసంజీవనిని ఎవరికైనా ఉపదేశించాలి. అది నేర్చిన వారి వల్ల తాను బ్రతుకుతాడు. అయితే అది ఎవరికి నేర్పాలి? దేవయాని స్త్రీ అవడం వల్ల, ఆ రోజుల్లో స్త్రీలకు మంత్రోపదేశం నిషిద్ధం కాబట్టి వేరెవరినైనా వెదకాలి. ఆయనకు కచునిపై అమితమైన విశ్వాసం ఉంది. అందుకని ఆ సంజీవని విద్యను కచునికే నేర్పాలని నిర్ణయించుకొని, ‘నీకు మృతసంజీవనిని ఉపదేశిస్తాను. నువ్వు నా ఉదరం చీల్చుకుని వచ్చాక విగతజీవుడనైన నన్ను బ్రతికించు’’ అని కచునితో పల్కి కచునికి ఆ విద్యనుపదేశించాడు శుక్రుడు.
.
ఈ సన్నివేశం పరమాద్భుతమైనది. కొన్ని కోట్లమందిని తన విద్యద్వారా బ్రతికిస్తున్న ఆ రాక్షస గురువుకి, తన ప్రాణాన్ని కాపాడే విద్యను నేర్పడానికి కచుణ్ణి మాత్రమే విశ్వసించాడంటే, ఆదినుండి కచుడాయన పట్ల ఎంత విశ్వాసంగా ప్రవర్తించాడో అనే కాక ఆ విద్య నేర్చుకునే అర్హత కచునికి మాత్రమే ఉండటం వల్ల ఈ అక్కర వచ్చిందని శుక్రుడు గ్రహించాడనుకోవాలి. ఒక్క గురువుకి మాత్రమే విద్యార్థి యోగ్యతాయోగ్యతలు తెలుస్తాయి. కాబట్టే కచుని పట్ల పరిపూర్ణ విశ్వాసంతో సంజీవని నేర్పించాడు శుక్రుడు. ధర్మంతో కూడిన యోగ్యత ఎప్పుడూ సత్ఫలితాల్నే ఇస్తుంది. అసలిదిజరగకపోతే శుక్రుడెట్టి పరిస్థితుల్లోనూ కచునికి ఆ విద్య నుపదేశించి ఉండేవాడు కాదేమో!
ఏ విద్యకోసమైతే తాను ప్రాణాలకు తెగించి శత్రుకూటమిలో ప్రవేశించాడో, ఏ విద్యకోసం తానిన్ని సంవత్సరాలు శ్రమించాడో, ఏ విద్యార్జన కోసం తాను రెండుసార్లు చచ్చి బ్రదికాడో, ఆ విద్య ఆకస్మికంగా అదృష్టవశాత్తు తనను వరించింది. సమాజ హితాన్ని కోరే వారికి దైవానుగ్రహం తప్పనిసరిగా లభిస్తుంది కదా!
.
శుక్రుని ఉదరం చీల్చుకుని కచుడు బయటకు వచ్చాడు. ఈ దృశ్యాన్ని నన్నయగారొక చిన్న కందపద్యంలో అత్యద్భుతంగా వర్ణించి రక్తి కట్టించాడు.
ఉదర భిదా ముఖమున న
భ్యుదితుండై నిర్గమించె బుధ నుతుడు కచుం
డుదయాద్రిదరీముఖమున
నుదితుండగు పూర్ణ హిమమయూఖుడ పోలెన్ (ఆది – 3 – 125)
.
శుక్రుని పొట్ట చీల్చుకొని, బయటకు వస్తున్న కచుడు తూర్పుదిశలో అప్పుడే ఉదయిస్తున్న నిండు చందమామలా ఉన్నాడట. సంజీవని విద్యా పరిగ్రహణంవల్ల కచుడు షోడశకళా పరిపూర్ణుడైన పున్నమి చంద్రునిలా భాసించడం శోభాయమానంగా ఉంది. పద్యంలోని పోలిక దృశ్యాన్ని కళ్ల ముందుంచి నేత్రోత్సవాన్ని కలిగిస్తుంది. కచుడు బయటకు వచ్చాడు. శుక్రుడు విగతజీవుడై నేలమీద పడి ఉన్నాడు. ఇక్కడ కూడ ఒక చిన్న తేటగీతిలో నన్నయగారు మరో అత్యద్భుతమైన పోలిక నావిష్కరించారు.
.
విగతజీవుడై పడియున్న వేదమూర్తి
యతనిచేత సంజీవితుడై వెలింగె
దనుజమంత్రి యుచ్చారణ దక్షుచేత
నభిహితం బగు శబ్దంబు నట్లపోలె (ఆది – 3 – 127)
.
విగత జీవుడైన ఆ వేదమూర్తి కచుని చేత ‘సంజీవి’తుడై వెలిగాడు. నన్నయ సంజీవని విద్య స్ఫురించేటట్లు చేసిన పదప్రయోగం సార్థకంగా భాసిల్లింది. ఉచ్చారణలో బహు సమర్థుడైన వానిచేత శబ్దం ఎంత అందంగా శోభిస్తుందో అలా కచుని చేత బ్రతికించబడ్డ శుక్రాచార్యుడు ప్రకాశించాడట. శబ్దోచ్చారణల పరస్పరాధారం ఇక్కడ గురుశిష్యలపరంగా చాల గొప్పగా చెప్పబడింది.
.
‘వేదమూర్తి’ అనే పదాన్ని నన్నయగారు శుక్రునిపరంగా ఎంత సమర్థవంతంగా ప్రయోగించాడో చూడండి. వేదశబ్దానికి ఉచ్చారణే ప్రాణం. ఉచ్చారణ సక్రమంగా లేకపోతే ఆ శబ్దం నిర్వీర్యం అవుతుంది. ఇది లోకవిదితమే. శ్రుతిపరంగా నన్నయగారు ప్రదర్శించిన ఈ పోలిక తెలుగు సాహిత్యంలో ఒక అపురూపమైన, అద్వితీయమైన సామ్యం.
.
ఈ ఘట్టంలో కచుని అపూర్వ సంస్కారం మరోమారు గోచరిస్తుంది. ఏ విద్యకోసమైతే ఇన్నాళ్లు తాను ఓర్పుగా ఎదురుచూసాడో ఆ విద్యాలలనా దానాన్ని తనకు చెసేసాడు శుక్రుడు. ఆ రాక్షస గురువొక్కడికే ‘సంజీవని’ తెలుసు. అతడు శవమై పడిఉన్నాడు. ప్రస్తుతం తన ఒక్కడి దగ్గరే ఆ విద్య ఉంది. మరణించిన ఆ గురువుని అలా వదిలేసి వెంటనే తన లోకానికి వెళ్లిపోవచ్చు కచుడు. కాని అతడు బృహస్పతి పుత్రుడు. కృతజ్ఞతను, గురుభక్తిని శరీరమంతా, మనసంతా నింపుకున్న సులక్షణుడు. తన గురువు నమ్మకాన్ని కచుడు వమ్ము చేయలేదు. అందుకే అతడికా విద్య అప్రయత్నంగా సిద్ధించింది.
.
సరే! గురువుని బ్రతికించాక, తను వచ్చిన పని పూర్తైంది కాబట్టి ఆయనకో నమస్కారం పెట్టి తన లోకానికి తాను పోవచ్చు. కచుడదీ చేయలేదు. సంజీవని తనను చేరినప్పటికీ తొందరపడక ఇంకా చాల సంవత్సరాలు శుక్రుణ్ణి సేవించిన తర్వాత ఒకనాడు తన లోకానికి పోవడానికి గుర్వనుజ్ఞ తీసికొని, ఆ విషయం చెప్పడానికి దేవయాని దగ్గరకు వెళ్లాడు. అది విన్న దేవయాని, అప్పుడు తన మనస్సులోని మాటను బయటపెట్టింది.
.
‘‘నీవును బ్రహ్మచారివి వినీతుడ వేనును గన్యకన్ మహీ
దేవకులావతంస రవితేజ వివాహము నీకు నాకు మున్
భావజశక్తి నైనయది పన్నుగ నన్ను బరిగ్రహింపు సం
జీవనితోడ శుక్రుదయజేయుము నాకు బ్రియంబు నావుడున్’’ (ఆది – 3 – 130)
.
‘‘నీవు బ్రహ్మచారివి, వినీతుడవు, నేను కన్యను. సంజీవనితోబాటు నన్ను కూడ పరిగ్రహించు. నన్ను వివాహం చేసుకో’’ అని అంది.
ఇది వినగానే కచుడు బిత్తరపోయాడు. అత్యంత విషాదాకులుడయ్యాడు. అసలు దేవయాని కచుని ప్రవర్తనను సరిగా అర్ధంచేసికోలేదు. తండ్రి పెంపకంలో ‘ఆడింది ఆట పాడింది పాట’గా పెరిగింది. నిజమే! దేవయాని కల్పించుకోకపోతే కచుడు బ్రతికి బట్టకట్టేవాడుకాదు, సంజీవని లభించేదీ కాదు. అంతమాత్రంచేత అతని మనసు తెలిసికోకుండా ఆమె తొందరపడటం భావ్యం కాదు. దేవయానిని ఎప్పుడు కచుడాదృష్టితో చూసిన దాఖలాలు లేవు. కచునికి దేవయాని పట్ల కృతజ్ఞతే తప్ప, ప్రేమ లేదు. ఆమె అతనికి గురుపుత్రి. అంతే. ఇక్కడ కూడా కచుని ప్రత్యేకత సువ్యక్తం. తనను కోరుకున్న దేవయానిని స్వీకరించవచ్చు. దేవయాని కచునికి అన్నివిధాల తగినదే! ఈ వివాహం జరిగితే అతనికి మేలే జరుగుతుంది. కాని మొదటి నుండి కచుని లక్ష్యం వేరు. సంజీవని విద్య తప్ప మరేమి అతని దృష్టిలో లేదు. అందువల్ల దేవయాని మాటలాతనిని విపరీతంగా బాధించాయి. ఇక్కడ కచుడామె నెంత సున్నితంగా మందలించాడో చూడండి.
.
‘‘…. లోక నింద్యమగు నర్థము నీ వాకునకు దెచ్చు టుచితమె
నాకు సహోదరివి నీవు నా చిత్తమునన్’’ అని అంటూ ఇంకో మహత్తరమైన లోకధర్మాన్ని చెప్పాడు కచుడు.
.
‘‘గురులకు శిష్యులు పుత్రులు
పరమార్ధమ లోకధర్మపథ మది దీనిం
బరికింపక యీపలుకులు
తరుణీ గురుపుత్త్రి నీకు దగునే పలుకన్’’ (ఆది – 3 – 131)
.
ఎంత సంస్కారయుతమైన సమాధానం! వావి వరుసలు మరచి ప్రవర్తిస్తున్న జనారణ్యంలో సిగ్గుతో తలవంచుకుని బ్రతుకుతున్న మనం, మన పూర్వీకుల నుండి నేర్చుకోవాల్సినవి ఇలాంటివే! ‘లోక నింద్యమైన మాట నీ వాక్కున రావచ్చునా?’ అని సున్నితంగా ఒక అన్న, చెల్లెల్ని మందలించినట్లు హెచ్చరించాడు కచుడు దేవయానిని. ఆ మాటలర్ధం చేసుకుంటే ఆవిడ దేవయాని ఎందుకవుతుంది? అసలే ఆభిజాత్యం, అహంకారం, ఆవేశం అధిక పాళ్లల్లో ఉండే దేవయాని తోక త్రొక్కిన త్రాచే అయింది ఆ మాటలకి. ఆమె మాటలనెవరూ, ఎప్పుడూ తృణీకరించడం జరగలేదు. రాక్షస గురువు శుక్రాచార్యుని ముద్దుపట్టికి కోపం ఉవ్తెత్తున లేచింది. తన తండ్రి దయవలన కచుడు నేర్చిన ‘సంజీవని విద్య’ విషయం స్ఫురణకు వచ్చింది. వెంటనే, ‘‘నా కోర్కెను నీవు విఫలం చేసావు కాబట్టి నీకు సంజీవని విద్య పని చేయకుండుగాక!’’ అని గొడ్డలి పెట్టు లాంటి శాపాన్నిచ్చింది కచునికి దేవయాని. అది వినగానే, అంత సౌమ్యుడైన కచుడు కూడ వెంటనే స్పందించాడు. ఆ స్పందన కూడ తన జాతికోసమే.
.
‘‘నేను ధర్మపథంబు తప్పనివాడను. నీ వచనంబున నాకు సంజీవని పని సేయదయ్యెనేని నాచేత నుపదేశంబుగొన్న వారికి పనిచేయుంగాక! మఱి నీవు ధర్మ విరోధంబు దలంచితివి కావున నిన్ను బ్రాహ్మణుండు వివాహంబుగాకుండెడు’’ మని ప్రతిశాపమిచ్చి తక్షణమే తన లోకానికి వెళ్లిపోయాడు. అక్కడ తన వారికి ఆ విద్యనుపదేశించి దేవలోకానికి మహత్తరమైన మేలు చేసాడు. ఇదీ కొసమెరుపు. కచుని వ్యక్తిత్వానికి ఇది నిలువెత్తు దర్పణం. అతనికి కావల్సింది ఆ సంజీవని తన దగ్గరే ఉండి, తన ద్వారానే దేవతాజాతి బ్రతకాలనే తపన కాదు. ఎలాగైనా ఆ విద్యవల్ల తన జాతి బ్రతికి బట్ట కట్టాలి అంతే! అది తమ వారిలో ఎవరి వల్ల జరిగినా అది తన జాతికి శ్రేయోదాయకమే. ధర్మసమ్మతమైన కోరిక. అదే సమాజఋణం తీర్చుకోవడం. ఇంతకన్నా దేశభక్తి ఏముంటుంది? తన చుట్టూ ఉన్న వారిని కాపాడుకోవాలనే తపన ఎంతగొప్పది? ఇక్కడితో కచుని పాత్ర ముగుస్తుంది. దేవయాని కథ ఇంకా మలుపులు తిరుగుతుంది. అది వేరే విషయం.
నన్నయగారమితంగా అభిమానించిన పాత్ర కచుడు. ఆయన వైదిక కర్మానుయాయి. అధర్మాన్ని, అనైతికను సహించడు, క్షమించడు. గురుపుత్రికను వివాహమాడటాన్ని ఆయన ఖండించాడు. నిషిద్ధ ప్రణయాన్ని నిషేధించాడు. ధర్మాన్ని, నీతిని నిత్యం ఆరాధించే భారతీయులకు కచ, ప్రవరులు నేటికీ ప్రాతఃస్మరణీయులే. ముఖ్యంగా కచుడు నేటికీ, ఏనాటికీ విద్యార్థిలోకానికి ఆదర్శప్రాయుడే. 18పర్వాల కవిత్రయ భారతంలో, ఆదిపర్వంలో, అతి తక్కువ పద్యాలలో మాత్రమే కానవచ్చే కచుడు, అందులోని ఎన్నో పాత్రలకన్నా అత్యున్నత స్థానంలో నిలబడతాడు.
‘మన చదువు కేవలం సంపాదనకే అని గట్టిగా నమ్ముతున్న ఈ రోజుల్లో, దానికోసమే కాదు మన చదువు చుట్టూ ఉన్న సమాజానికి, దేశానికి, జాతికి, కొంతైనా ఉపయోగపడాలన్న ఆశయం విద్యార్ధుల్లో కలగాలన్నా, కలిగించాలన్నా కచుని లాంటి వ్యక్తుల్ని సాహిత్యంలో మనం గుర్తించి, ఆవిష్కరించాలి. అదే ఋషి ఋణం తీర్చుకోవడం!
.
‘‘ప్రాచీన సాహిత్యం వల్ల ఈనాడు ప్రయోజనం ఏమిటి? – ఏమిలేదు.’’ అన్న మాట నేడు తరచు వింటున్నాం. విమర్శించే వారెక్కువైపోయారు. నిజమే ప్రాచీన సాహిత్యమంతా నేడు ప్రయోజనకారి కాకపోవచ్చు. కాని కొన్ని నిత్య సత్యాలు, ధర్మాలు ఆ సాహిత్యంలో ప్రతిపాదించబడ్డాయి. అవి మానవజాతికి మేలు చేసేవే కాని అసంబద్ధాలు కావు. బుద్ధి వికాసంతో పాటు, మనోవికాసం కూడ ఉంటేనే మనిషికి పరిపూర్ణత్వం సిద్ధిస్తుంది. ఆ మానసిక వికాసానికి సాహిత్య పఠనం తప్పనిసరిగ దోహదకారి అవుతుందనడం నిర్వివాదాంశం. సాహిత్యంలో కచుని లాంటి పరిపూర్ణ పురుషులు, స్త్రీలు ఈ నాటికీ మనల్ని అలరిస్తూనే ఉంటారు. అట్టివారిని మనస్సుతోనే దర్శించాలి. అవసరమైనప్పుడు ఆచరణలో స్మరించుకోవాలి.
.
ఓం సహనావవతు, సహనౌభునక్తు
సహవీర్యం కరవావహై తేజస్వి
నావధీతమస్తు మా విద్విషావహై
ఓం శాంతిః శాంతిః శాంతిః

1 thought on “నాటి ‘కచుడు’ నేటికీ ఆదర్శమే

  1. అలనాటి కచుని కధ మళ్ళా చదివించి సత్కాలక్షేపానికి అవకాశం ఇచ్చిన లక్ష్మి
    గార్కి ధన్యవాదములు
    మోహనరావు మంత్రిప్రగడ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *