April 19, 2024

అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 56

విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

ఇది ఒక సంస్కృత కీర్తన. చివరలో వెలిగోట కేశవ! అనడంలో కడప జిల్లాలోని వెలిగోడు లో ఉన్న చెన్నకేశవ స్వామిని గురించి వ్రాసిన కీర్తన అని చెప్పవచ్చు. మహావిష్ణువు కేశి అనే రాక్షసుడిని సంహరించడం వల్ల కేశవుడు అయ్యాడు. ఈ కీర్తనలో అన్నమయ్య స్వామిని బహుదా అనేక విశేషణాలతో కీర్తిస్తున్నాడు. మనమూ విని తరిద్దాం.
కీర్తన:
పల్లవి: కేవల కృష్ణావతార కేశవా
దేవదేవ లోకనాథ దివ్యదేహ కేశవా ॥పల్లవి॥
చ.1. కిరణార్క కోటి తేజ కేశవా
హరి లక్ష్మీ నాయక యాది కేశవ
గిరి రాజసుత నుత కేశవ నమో
శరధి గంభీర శాయి జయ జయ కేశవా ॥కేవల॥
చ.2. కేకిపింఛావతంస కేశవ
శ్రీ కర గుణాభి రామ చెన్న కేశవ
కేక వాహన వరద కేశవ
పాక శాసన వంద్య భళి భళి కేశవా ॥కేవల॥
చ.3. కింకర బ్రహ్మాది గణ కేశవ నా –
మాంకిత శ్రీ వేంకటాద్రి కేశవ
కుంకుమాంకవక్ష వెలిగోట కేశవ సర్వ –
శంకా హరణ నమో జగదేక కేశవా ॥కేవల॥
(రాగం: రామక్రియ; సం: 4-391- రాగిరేకు –366-5)

విశ్లేషణ:
పల్లవి: కేవల కృష్ణావతార కేశవా
దేవదేవ లోకనాథ దివ్యదేహ కేశవా

కేవలుడు అంటే పరమాత్మ. ఆయన శక్తులు అపారం కనుక కేవలుడయ్యాడు. అటువంటి మహావిష్ణువును ఓ కృష్ణావతారుడైన కేశవా! దేవదేవా! లోకాలను పాలించే నాధుడా! దివ్యదేహుడవై విరాజిల్లే పరంధామా! అని సంబోధిస్తున్నాడు అన్నమయ్య.

చ.1. కిరణార్క కోటి తేజ కేశవా
హరి లక్ష్మీ నాయక యాది కేశవ
గిరి రాజసుత నుత కేశవ నమో
శరధి గంభీర శాయి జయ జయ కేశవా
ఓ దేవా!కేశవా! నీ దివ్య తేజస్సు కోటి సూర్యులతో సమానము. శ్రీలక్ష్మి హృదయానందకుడవు. ఆది కేశవుడవు. హిమవన్నగమనే గిరి రాజ పుత్రిక అంబిక అపర్ణచే సదా పూజింపబడి స్తుతింపబడే ఓ కేశవా నీకు నా నమస్సులు. పాలకడలిలో గంభీరంగా యోగ నిద్రలో శయనిస్తున్నటువంటి శాయీ! నీకు జయము జయము కేశవా! అంటున్నాడు అన్నమయ్య.
చ.2. కేకిపింఛావతంస కేశవ
శ్రీ కర గుణాభి రామ చెన్న కేశవ
కేక వాహన వరద కేశవ
పాక శాసన వంద్య భళి భళి కేశవా
నెమలి పింఛాలను సదా కిరీటములో అలంకరించుకునే కేశవా! అన్నీ శుభకర గుణాలను కలిగి ఉన్న రామావతారుడవు. చెన్న కేశవుడవై ఇట వెలిసావు. నెమలి వాహనుడైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి అనేక వరములిచ్చిన వాడా! పాకాశురుణ్ణి శాసించి ముల్లోకములలో భళి భళి అనిపించుకున్న కేశవా…నీకు నమస్సుమాంజలులు.
చ.3. కింకర బ్రహ్మాది గణ కేశవ నా –
మాంకిత శ్రీ వేంకటాద్రి కేశవ
కుంకుమాంకవక్ష వెలిగోట కేశవ సర్వ –
శంకా హరణ నమో జగదేక కేశవా
బ్రహ్మాది దేవ, యక్ష, గంధర్వ, కిన్నర, కింపురుషులు నీకు సేవకుల గణములుగా యున్నారు. నీవు శ్రీ వేంకటాద్రిపై వేంకటేశ్వరుడను పేర వెలసియున్న కేశవుడవు. నీ వక్షస్థలము పై కుంకుమతో యెర్రని రంగుతో ప్రకాశిస్తూ వెలిగోడు ఆలయములో వెలసిన చెన్న కేశవుడవు. సర్వ శంకలను హరించి మాకు కైవల్యము ప్రసాదించే దేవదేవుడవు. జగదేక వీరుడవు. కేశవా! మమ్ము ఆదుకొని రక్షించు అని ప్రార్ధిస్తున్నాడు అన్నమయ్య.

ముఖ్యమైన అర్ధములు:
కేవలుడు = పరమాత్మ; దివ్య దేహ = ప్రకాశించే దేహముకలవాడు; కిరణార్క = సూర్య కిరణముల; గిరిరాజనుత = పార్వతి దేవి చేత స్తుతింపబడుచున్న; కేకిపింఛావతంశ = నెమలి పింఛమును తలపై ధరించినవాడు; కేకి వాహన = నెమలి వాహనముగా గల శ్రీ శుబ్రహ్మణ్యస్వామి; పాకశాసన = పాకశాసనుడను రాక్షశుని; శంకాహరణ = అనేక సందేహములను పారద్రోలు; కింకరులు = సేవకులు.
-0o0-

1 thought on “అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 56

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *