April 23, 2024

అమ్మమ్మ -22

రచన: గిరిజ పీసపాటి

ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న అమ్మమ్మ ఎదురింటావిడ అడిగిన ప్రశ్నకు జవాబుగా “నాగకు సీమంతం చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చానని, పువ్వులు, గాజులు మొదలగునవి తేవడానికి ఎవరికీ తీరుబాటు లేదంటున్నార”ని చెప్పింది.
అందుకావిడ “ఈ మాత్రానికే దిగులు పడతారెందుకు అక్కయ్యగారూ! నాగను ఎప్పుడూ మా ఇంటి పెద్ద కూతురిలాగే భావిస్తాం. మా పిల్లలు కూడా నాగను సొంత తోబుట్టువులాగే చూస్తారు. కాకపోతే మీ మరిదిగారు బడిపంతులు కావడం, ఐదుగురు సంతానం కావడం వల్ల పెట్టుపోతలు చెయ్యలేకపోవచ్చు”.
“మా పెద్దాడిని బొబ్బిలి పంపించి సామాను తెప్పిస్తాను. సీమంతం కూడా దగ్గరుండి జరిపిస్తాను. మీరేం దిగులు పడకండి. అంతా సవ్యంగా జరుగుతుంది” అంటూ అమ్మమ్మ దగ్గర సామాను లిస్ట్, డబ్బు తీసుకుని వెళ్ళింది.
ఆవిడ మాటిచ్చినట్లుగానే మొత్తం సామాను తెప్పించి, తమ ఇంట్లోనే ఉంచింది. సీమంతానికి అమ్మమ్మే స్వయంగా నాగకు పూలజడ వేసింది. మిగిలిన ముస్తాబు అంతా మిగిలిన ముత్తైదువలు చేయగా, ఎదురింటావిడ చేతుల మీదుగా నాగకు గాజులు వేయించి, ఒడిలో పట్టు చీర, జాకెట్టు ముక్క, పసుపు కుంకుమలు, పళ్ళు, స్వీట్లు మొదలైనవి పెట్టించింది.
తను తెచ్చిన కొత్త బట్టలు అల్లుడికి, వియ్యాలవారికి ఇప్పించింది. ముత్తైదువలందరికీ పళ్ళు లేకుండా తాంబూలం, జాకెట్టు ముక్కలు, గాజులు నాగ చేత ఇప్పించింది. గర్భవతి అయిన స్త్రీలు తమ చేతుల మీదుగా ఎవరికీ పండు ఇవ్వకూడదంటారు కనుక పళ్ళు మాత్రం ఎదురింటావిడ చేత ఇప్పించింది.
విధవ స్త్రీలు తమ చేతుల మీదుగా శుభకార్యం జరిపించకూడదనే మూఢ నమ్మకం ఇప్పటికీ జనాల్లో పాతుకుపోయి వుంది. ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ నమ్మేవారు. కనుకనే తను చెయ్యవలసిన పనులన్నీ ఎదురింటావిడ చేతుల మీదుగా జరిపించింది అమ్మమ్మ.
తండ్రి లేకపోవడం వల్ల తన అచ్చట ముచ్చట తీరలేదనే లోటు నాగకి కలగకూడదని తాపత్రయపడిన గొప్ప తల్లి కదూ! మన అమ్మమ్మ.
సీమంతం వేడుక అయిపోయాక, పురుడు అయ్యాక మళ్ళీ వస్తానని చెప్పి, తిరిగి హైదరాబాదు వచ్చేసి, తన పనిలో పడిపోయింది అమ్మమ్మ. మళ్ళీ బారసాలకి బోలెడు ఖర్చు అవుతుంది కనుక క్షణం తీరిక లేకుండా పనులు ఒప్పుకోసాగింది.
తొమ్మిది నెలలు నిండిన పదిరోజులకు నాగ పండంటి పాపాయికి జన్మనిచ్చినట్లు వియ్యంకుడు ఇచ్చిన టెలిగ్రామ్ అందుకుంది అమ్మమ్మ. మళ్ళీ బట్టలు, స్వీట్లు, పళ్ళు మొదలైనవి పట్టుకుని రాముడువలస బయలుదేరి వెళ్ళింది.
పదకొండవ రోజే బారసాల కావడంతో బంధువులతో ఇల్లు కళకళలాడుతూ అంతా హడావుడిగా ఉన్నారు. ఊరి వాళ్ళు మాత్రం ”ఈసారి కూడా ఆడపిల్లేనా! పీసపాటి ఆయనకి ఈ పిల్లతో కలిపి నలుగురు మనవరాళ్ళు పుట్టారు. ఈసారైనా వంశాంకురం పుడితే బాగుండేది” అనుకోసాగారు.
ఆ మాటలు తన చెవిన పడడంతో బాధ పడింది అమ్మమ్మ. వియ్యపురాలి మనసు తెలుసుకోవడానికి మాట వరసకి అన్నట్లుగా “ఈసారైనా మగ పిల్లాడు పుడితే బాగుండేది కదా! వదినగారూ!” అంది. దానికావిడ “మొదట ఆడపిల్ల పుడితే తరువాత మగపిల్లాడు పుట్టాలని, అదే మొదట మగపిల్లాడు పుడితే తరువాత ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటాం. ఒకరు ఎక్కువ ఇంకొకరు తక్కువ అని కాదు. ఇద్దరూ ఉన్న ముచ్చట తీరాలని”.
“నాకు మీ అల్లుడి తరువాత రెండోసారి మగపిలాడు పుడితే ‘మళ్ళీ మగపిల్లాడేనా!? ఆడపిల్ల పుడితే బాగుండేది’ అనుకున్నాం. మాకు ఆడపిల్లలు లేని లోటు తెలియకుండా మా బావగారి కూతురిని పెంచుకున్నాం. పెళ్ళి చేసాం. మా రెండోవాడు పుట్టిన పద్నాలుగు సంవత్సరాలకు మాకు మళ్ళీ ఆడపిల్ల పుట్టింది”.
“ఆడైనా, మగైనా ఆ భగవంతుని ప్రసాదమే. అసలు పిల్లలే పుట్టక బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది లేరు? మా ఇంట్లో నలుగురు మహాలక్ష్ములు పుట్టారనుకుంటున్నాం. మాకేం బాధగా లేదు” అన్న ఆవిడ మాటలకు గుండెల మీంచి కొండంత భారం దిగినట్లు అయింది అమ్మమ్మకి.
బారసాల నాడు శుభకార్యం జరుగుతున్న చోటుకి తనెందుకని పెరట్లో వంట పనిలో ఉన్న అప్పలనరసయ్య గారికి సహాయం చేస్తూ ఉండిపోయింది అమ్మమ్మ. పాపాయికి పేరు పెట్టేముందు కూతురికి, అల్లుడికి, పాపాయికి పీటల మీద బట్టలు పెట్టడానికి అమ్మమ్మను కేకేసారు.
అమ్మమ్మ తను తెచ్చిన కొత్త బట్టలను నాగ ఆడపడుచు అత్తగారు, మామగారి (రాయగడ వాస్తవ్యులు) చేతుల మీదుగా దంపతులకు ఇప్పించింది. వారికి కూడా ఆనంద్ (నాగ ఆడపడుచు భర్త) ఏకైక సంతానం కావడంతో, వారు కూడా నాగను కన్నకూతురిలా చూసుకుంటారు.
ఆనంద్ కూడా నాగను సొంత అక్కలా భావిస్తాడు. కొత్త బట్టలు కట్టుకుని వచ్చిన దంపతులు మళ్ళీ పీటల మీద కూర్చున్నాక, పాపాయికి పేరు పెట్టడానికి బియ్యం ఉన్న వెండి పళ్ళెం, పసుపు కొమ్ము చేతిలోకి తీసుకున్నాడు పెదబాబు.
“ఏరా పెద్దాడా! ఈ పిల్లకైనా ఏం పేరు పెట్టాలో నిర్ణయించుకున్నారా? లేదా?” అని అడిగారు పీసపాటి తాతయ్య. పెద్ద మనవరాలికి పేరు పెట్టిన సందర్భాన్ని గుర్తు చేస్తూ. “లేదు. ఈసారి కూడా నువ్వే పేరు చెప్తే అదే పెడతాను” అన్నాడు పెదబాబు.
“పెద్దదానికి మీ అమ్మ పేరు పెట్టావు కనుక దీనికి మీ అత్తగారి పేరు పెట్టు” అనారాయన. పెదబాబు సరేనని అమ్మమ్మ పేరుని రాయబోతుండగా అప్పటి వరకు తలుపు చాటున ఉండి ఏం పేరు పెడతారా! అని కుతూహలంతో వింటున్న అమ్మమ్మ “దయచేసి నా పేరు దానికి పెట్టొద్దు. నా పేరు పెడితే, నా తలరాతే దానికీ వస్తుంది”.
“అది నిండు నూరేళ్ళు సౌభాగ్యవతిగా సుఖంగా ఉండాలి. పెద్ద ముత్తైదువ అయిన ఆ పార్వతీ దేవి పేరు ‘గిరిజ’ అనో ‘శైలజ’ అనో పెట్టండి” అని సూచించింది. “నాగా! మీ అమ్మగారు చెప్పిన రెండు పేర్లలో ఏ పేరు పెడితే బాగుంటుంది?” అని అడిగారు పీసపాటి తాతయ్య.
“గిరిజ అని పెడదాం మామయ్యగారూ! ‘గిరీ!’ అని మగపిల్లాడిని పిలిచినట్లు పిలుచుకోవచ్చు” అంది నాగ.
“సరే అయితే. గిరిజ పక్కన మీ అమ్మగారి పేరైన రాజ్యలక్ష్మి కూడా కలిపి ‘గిరిజా రాజ్యలక్ష్మి’ అని పెడదాం” అని పీసపాటి తాతయ్య చెప్పగా పెదబాబు అదే పేరుని రాసారు. (నా పేరు వెనుక ఉన్న చిన్న కధ ఇది – రచయిత్రి). పాపకి నామకరణం పూర్తి కాగానే తను తెచ్చిన వెండి గ్లాసు బహుమతిగా ఇచ్చింది అమ్మమ్మ.
బారసాల అయ్యాక తిరిగి హైదరాబాదు వచ్చేసింది అమ్మమ్మ. సంవత్సర కాలం గడిచిపోయింది కానీ మళ్ళీ నాగను చూడడానికి వెళ్ళలేకపోయింది. ఉత్తర ప్రత్యుత్తరాలు యధాప్రకారం సాగుతున్నాయి. తమ చిన్న కొడుకుకి మళ్ళీ ఆడపిల్ల పుట్టిందని ఉత్తరం వచ్చింది వియ్యంకుడి దగ్గర నుండి.
‘ఇద్దరు కొడుకులకీ కలిపి వరుసగా ఐదుగురు మహాలక్ష్ములు పుట్టారు. ఒక్కడైనా వారసుడు పుడితే బాగుండును’ ఈసారి అనుకోకుండా ఉండలేకపోయింది అమ్మమ్మ.

***** సశేషం *****

1 thought on “అమ్మమ్మ -22

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *