March 28, 2024

కొత్త కోణం (కథ)

రచన: ప్రభావతి పూసపాటి

“మనం నా పరీక్షలు అయిపోయిన వెంటనే వూరు వెళ్లిపోదామే అమ్మమ్మ” కాలేజీ నుంచి వస్తూనే వత్తులు చేసుకొంటున్న కృష్ణవేణి పక్కన కూర్చుని మెడ చుట్టూ చేతులు వేసి భుజం మీద తలవాల్చి గారంపోతూ చెప్పింది స్నిగ్ధ. .
“ఏమి ఉన్నట్టు ఉండి గాలి వూరు మీదకి మళ్లింది, బావ ఏమైనా ఫోన్ చేశాడా? వత్తులు చేసుకొంటూనే అడిగింది.
అదేమీ లేదులే. పరీక్షలు అయిపోయాక ఇంకా ఇక్కడ మనకి పనేమీ ఉందని అన్నాను అంతేలే, తాత ఎక్కడికి వెళ్లారు ? అంటూ కాళ్ళు కడుక్కునే నెపంతో ఇంట్లోకి వెళ్ళిపోయింది.
కృష్ణవేణి చేతులు యాంత్రికంగా వత్తులు చుడుతున్నాయ్ గాని మనసు చక్కర్లు కొడుతూ గతంలోకి జారీ పోయింది.

*****

“కృష్ణవేణి అమ్మాయి తయారు అయ్యిందా ?పెళ్ళివారు బయలుదేరినట్టు ఫోన్ వచ్చింది”. కండువా తో పట్టిన చమట తుడుచుకొంటూ గదిలోకి వచ్చారు సూర్యంగారు. “ఇదిగో అయిపోయింది. మీరుకూడా కొంచెం మొహం కడుక్కొని రండి అంటూ తువ్వాలు తీసి ఇచ్చింది.
నెమలి కంఠం చీరలో, మేడలో సన్నని గొలుసుతో, చక్కని వాలుజడలో జాజుల తురిమి చక్కగా ముస్తాబు అయిన కూతురిని చూసి మురిసిపోయారు సూర్యంగారు. డిగ్రీ పరీక్షలు రాసిన నీరజ తండ్రి మాటకి విలువ ఇచ్చి పై చదువులు చదవాలని వున్నా కృష్ణ మోహన్ తో పెళ్ళికి అంగీకరించింది. కృష్ణమోహన్ కి అమెరికాలో జాబ్ వచ్చిందని పెళ్లిచేసి పంపాలని వాళ్ళవాళ్ళు తొందరపడుతున్నారని దగ్గర్లో వున్న ముహూర్తం నిర్ణయించి పెళ్ళికి ఒప్పించేసారు.
పెళ్లి, అమెరికా ప్రయాణం అంతా ఒక కలలా జరిగిపోయింది. సంవత్సరం తిరగకుండానే కూతరు పురిటికి ఇండియా వస్తోంది అన్న వార్త తెలిసింది. అందరు పురిటికోసం తల్లితండ్రుల్ని అక్కడికి రమ్మంటారు కానీ తానే వస్తున్నట్టు నీరజ అన్నప్పుడు కూడా మనసు కీడు శంకించలేదు. పోనిలే పురుడు ఎక్కడైతేనేమి తల్లి పిల్ల క్షేమంగా ఉంటే అంతే చాలు అనుకొన్నది. కానీ స్నిగ్ధ పుట్టాక నీరజ మళ్ళీ అమెరికా ప్రయాణం గురించి ప్రస్తావించలేదు. కృష్ణమోహన్ తో కలిసి జీవించలేను, మా ఇద్దరివీ భిన్నమైన జీవితాలు, ఆలోచన ధోరణులు ఎంత రాజీపడి జీవితం సాగిద్దామని అనుకొన్న సాధ్యపడటం లేదు. అందుకని కొన్నాళ్ళు ఈ ఆలోచనలకి, ఆ వాతావరణానికి దూరంగా ఉంటే మనసు మారుతుంది అని చంటిపిల్లగా వున్న స్నిగ్ధ భాద్యత మా మీద ఉంచి చదువుకోడానికి పట్నం వెళ్ళింది.
కృష్ణమోహన్ కూడా కొంత కాలం ఎడబాటు మనుష్యులకు ఇతరుల మనసు అర్థం చేసుకొనే అవకాశం ఇస్తుంది అని అనుకొని, కొన్నాళ్ళు పంతం కొద్దీ, కొన్నాళ్ళు పని వత్తిడి వల్ల ఇండియాకి రాలేదు. ఈ లోపల నీరజ తనని ఇష్టపడి, తన సంగతి తెలిసి తనని కోరుకొంటున్న బెంగాలీ ప్రొఫెసర్ని పెళ్లిచేసుకొని వెళ్ళిపోయింది. తాము కుదిర్చిన సంబంధంలో ఇమడలేకపోయిన నీరజని, ఇప్పుడు స్వతత్రంగా తన జీవితభాగస్వామిని ఎంచుకొని వెళ్లిపోయిన నీరజని కేవలం ప్రేక్షకులలాగే చూడగలిగారు తప్పించి. , ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పే పరిస్థితి ఎప్పుడో కోల్పోయారు. . విడాకుల పత్రం మీద సంతకం చేసే రోజున మాత్రం నీరజ మొదటిసారిగా తన మనసులోని మాటని తెలియపరిచింది. . “ఏ బంధం నిలబడటానికైనా ఇద్దరి వ్యక్తుల ప్రమేయం సమపాళ్లలో ఉండాలి, దానిని నిలబెట్టడానికి తగినంత సమయం కేటాయించాలి, ఇవి రెండు జరగాలి అంటే ముందు ఆ వ్యక్తి మీద సదభిప్రాయం కలగాలి, అది కలిగేలోపులే ఆ వ్యక్తి మీద వ్యతిరేక భావం వచ్చేసాయో. . . అంతే ఇంక అతను చేసిన ప్రతి పని, మాట్లాడిన ప్రతిమాట ఆ అనుబంధం తెగిపోవడానికే దోహదం చేస్తాయి తప్ప కలసి బ్రతకడానికి సహాయపడవు. బహుశా కృష్ణమోహన్ కి నాకు మధ్య అగాధం ఏర్పడటానికి ఇవే కారణమేమో, బహుశా నేను తొందరపడ్డానేమో, కానీ ఇంక అతనితో కలిసి ఉండటానికి నా మనసు వ్యతిరేకిస్తోంది, అతను మంచివాడు కాదు అని నేను అనను కానీ నా మనసుకి నచ్చలేదు. ముందుగా విడాకులకు ఇష్టపడని కృష్ణ మోహన్ కూడా నీరజ భావాలకు ప్రాముఖ్యతని ఇచ్చాడు. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటం అంటే ఒక ఇంట్లో ఉండటం కాదు, ఒకరి మనసులో ఒకరు ఉండటం. మనసులు కలవని మనువులు సాగవు. నా అభిప్రాయం తీసుకోకుండా నా జీవితం లోనుంచి వెళ్లిపోతానని అనుకొన్న భావం నాకు బాధ కలిగించినా. . నేను దానిని గౌరవిస్తాను. అని స్నిగ్ధని ఒకసారి ముద్దాడి నీరజ జీవితంలో నుంచి సజావుగా తప్పుకున్నాడు. ఆ తర్వాత ఇంకెప్పుడు అతని ప్రస్తావన గాని, అతని ఆనవాళ్లు గాని మళ్ళి ఇంట్లో వినపడలేదు, కనపడలేదు. మొదట స్నిగ్ధని తనతో తీసుకొని వెళతాను అనుకొంది. కానీ కొన్నాళ్ళు కొత్తజీవితం ఎలావుంటుందో చూసి తీసుకు వెళదామనుకొంది. అప్పటికే దాదాపు 5 ఏళ్లుగా మా దగ్గర అలవాటు అయిపోయిన స్నిగ్ధ కూడా తల్లితో వెళ్లనని మారాము చేసింది. అప్పటినుంచి మేమే దానికి అన్నీ అయి పెంచాము. మేనమామ, అత్తయ్య అలనాపాలనలో, వంశి సాంగత్యంలో అన్ని మరిచిపోయి సంతోషంగా ఇన్ని ఏళ్ళు గడిచాయి. వంశికి స్నిగ్ధ అంటే ఇష్టమే. వంశి ఎమ్మెస్సీ అగ్రికల్చర్ చదివి తండ్రికి సహాయంగా ఊరిలోనే వుంటూ వ్యవసాయం చేసుకొంటున్నారు, ఈ పరీక్షలు అయిపోయాక సెలవుల్లో వాళ్ళిద్దరి పెళ్లి చేద్దామనుకొంటున్నారు, నీరజ విషయములో జరిగిన పొరపాటు స్నిగ్ధ పెళ్లి విషయములో జరగకూడదు భగవంతుడా నువ్వే కాపాడు” ఆఖరి మాటలు అనుకోకుండా బయటికి వినపడినట్టు వున్నాయి “ఎవ్వరిని కాపాడమని భగవంతుడిని అడుగుతున్నావు” బయటి నుంచి వస్తూ సూర్యంగారు అడిగారు”, లక్షవత్తుల నోము ఏమైనా చేద్దామనుకొంటున్నావా ఇన్ని వత్తులు చేసేసావు” అడిగారు ఎదురుగా రాశిపోసి వున్నా వత్తులని చూస్తూ. . . . నిజమే ఆలోచనలో పడి చాలానే చేసేసాను పదండి మీకు మీ మనవరాలికి కాఫీ ఇస్తాను అని అంటూ లోనికి నడిచారు కృష్ణవేణి.
” ఊరిమీద గాలి మళ్లింది మీ మనవరాలికి వెళ్లిపోదాము” అని అంటోంది ఇద్దరికీ కాఫీ ఇచ్చి కూర్చుంటూ చెప్పిందికృష్ణవేణి. “ఎమ్మా! ఇక్కడ ఉండి కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకొంటానన్నావు కదా? ఏమైంది? లాలనగా అడిగారు. “లేదు తాతయ్య మనఊరు వెళ్లిపోదాము మళ్ళి అదే పాట పాడింది” నువ్వు సరిఅయిన కారణం చెపితే అలాగే వెళ్లిపోదాము. నువ్వు ఎదో దాస్తున్నావు అనిపిస్తోంది ” తాత దగ్గర బాగా చనువు కొంచెం తడబడుతూ “ఈ మధ్య మా యూనివర్సిటీకి స్టూడెంట్ ఎక్స్చేంజి అనే ప్రొగ్రాము మీద విరించి అనే అతను US నుంచి వచ్చాడు. మొదటి నుంచి నన్ను గమనిస్తూనే ఉండేవాడు. మంచివాడని అనిపించి మాట్లాడటం మొదలుపెట్టాను నెమ్మదిగా స్నేహం బాగానే కుదిరింది. నిన్న నన్ను ఇష్టపడుతున్నాను అన్నట్టు మాటల్లో తెలిపాడు, ఈ రోజు మ్యారేజ్ చేసుకోవాలని వుంది అని ప్రపోజచేశాడు. “మీకు ముందే చెపుదామనుకొన్నాను కానీ విరించి ఇలా ప్రపోజ్ చేస్తాడని ఊహించలేదు. నా అభిప్రాయం చెప్పే ముందు మిమ్మల్ని కూడా కలుస్తాను” అని అన్నాడు. నాకు ఏమి పాలుపోవటం లేదు తాత. . ఇక్కడ ఉంటేనే ఈ ఇబ్బంది మనం మన ఊరు వెళ్లిపోదాము. అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయింది.
స్నిగ్ధ చెప్పింది విని ఇద్దరు మాటలు రాని వాళ్ళల్లా ఉండిపోయారు. సూర్యంగారు తేరుకొని “వెళ్ళు అది ఏమి చేస్తోందో చూడు. నేను ఆలా పార్క్ కి వెళ్లి వస్తాను” అని కండువా తీసుకొని వడివడిగా వెళ్లిపోయారు.
పార్క్ లో జనం చాల తక్కువ మంది వున్నారు. రేడియోలో నుండి పాత పాటలు నెమ్మదిగా వినిపిస్తున్నాయి. . బెంచి మీద కూర్చున్నాక గాని గుండె వేగం తగ్గలేదు. స్నిగ్ధ మాటలు చెవిలో గింగురుమంటున్నాయి. మొదట కొంచెం ఆవేశంగా అనిపించినా మళ్ళి ఇంకో సారి అతని మాటలు తలుచుకున్నాక కొంచెం ఆలోచింప చేసేలా చేసాయి. అసలు విరించి అన్నదాంట్లో తప్పేమి వుంది. మనసులో మాట తెలిపాడు. స్నిగ్ధ అభిప్రాయం చెప్పక ముందే నన్ను కలుస్తాను అన్నాడు. ఇందులో తప్పు ఏముంది ?ఎందుకు విన్నవెంటనే కంగారుపడ్డాను. అసలు అతను ఎవరో, స్నిగ్ధ మీద అతనికి అంత అభిమానం ఇంత కొంచెం సమయంలో ఎలా కలిగిందో? కలిసి మాట్లాడితే తెలుస్తాయి కదా. పిచ్చిపిల్ల స్నిగ్ధ. . నేనే ఇంత కంగారుపడితే పాపం అది ఎంత గాభరా పడిందో. . . నీరజ పెళ్లి తాలూకు ప్రభావం అందరి మనస్సులో బలంగా నాటుకుపోయింది ఫలితం పెళ్లి పదం వింటే చాలు అందరం ఉలిక్కిపడుతున్నాము. రేపు విరించిని కలుస్తాను రమ్మనమని చెప్పాలి అని అనుకొని స్థిమితపడి తేలికైన మనసుతో ఇంటికి వచ్చారు.
భోజనాల దగ్గర విరించిని కలుస్తాను అని స్నిగ్ధకి చెప్పి పడుకోవడానికి వెళ్లిపోయారు కానీ స్నిగ్ధకి మాత్రం నిద్దర పట్టలేదు. చిన్నప్పటి నుంచి వంశి అంటే ఇష్టమే కానీ అది పెళ్లి అనే అనుబంధంగా మారేంత ఇష్టము లేదు కానీ అమ్మ చేసిన పనివల్ల అమ్మ తన కొత్త జీవితంతో సంతోషంగానే వుంది కానీ, బావని తప్పించి వేరేవారిని చేసుకొంటే నా జీవితం కూడా అమ్మలా అయిపోతుందన్న అమ్మమ్మ భయం ఇంకో ఆలోచనకి తావి ఇవ్వటం లేదు. నిజానికి విరించి దగ్గరగా వున్నప్పుడు ఎదో తెలియని ఆత్మీయభావం కలుగుతోంది. కానీ దానికి పెళ్లి అని పదం ముడివేసి తొందరపడితే తన జీవితం ఎలా ఉంటుందో. వంశి కావాలి అనిపించటం లేదు అలాగని విరించి వద్దు అనిపించటం లేదు. మానసిక అలజడితో తెల్లారిపోయింది.
సూర్యంగారు అందరికన్నా ముందే లేచి తయారై కూర్చున్నారు. స్నిగ్ధ పొద్దున్న లేచాక కూడా “తాతయ్య మన ఊరు వెళ్లిపోదాము, ఈ రోజు ఆఖరి పరీక్ష రాసి వస్తాను, రాత్రి కి బయలుదేరి వెళ్లిపోదాము”మళ్ళి విరించిని కలిస్తే మనసు అతని వైపే మొగ్గుచూపుతుందేమో అన్న సందేహంతో వద్దు అంది . సూర్యంగారు మాత్రం విరించి తనని ఎందుకు కలుద్దామనుకొన్నాడో తెలుసుకొనే వెళ్ళాలి అని నిర్ణయించుకొన్నారు. “చూడమ్మా స్నిగ్ధ! విరించి కేవలం నీ నిర్ణయం తెలిపితే చాలు అని ఉండివుంటే ఎలా ఉండేదో. కానీ నీ నిర్ణయం తెలుసుకునే ముందే నన్ను కలుస్తాను అనటం, అతని వ్యక్తిత్వం మీద గౌరవం ఏర్పడింది. నాకు అతన్ని కలవాలని వుంది. మీ పరీక్ష అయ్యాక నేను మీ యూనివర్సిటీకి దగ్గర వున్న కాఫీ షాప్ లో వెయిట్ చేస్తూ వుంటాను, టైం అవుతోంది ప్రశాంతంగా పరీక్ష రాయడానికి వెళ్ళు” అంటూ ఆశీర్వదించి వాకింగ్ కి వెళ్లిపోయారు.

*****

పరీక్ష రాసి వస్తుంటే కారిడార్ లో నుంచుని స్నిగ్ధ కోసమే వెయిట్ చేస్తునట్టు వున్నాడు విరించి. . చూస్తూనే హాయ్ అని పలకరించాడు. రోజూ చూస్తూనే వున్నా ఈ రోజు కొత్తగా, మరిమరి చూడాలనిపించేలా వున్నాడు. “తాతగారు కలుస్తానన్నారా? నేను రానా ?ఆయనే వస్తారా?”ఆత్రంగా అడిగాడు. “తాతాగారే వచ్చారు. దగ్గర వున్నా కాఫీ షాప్ లో వెయిట్ చేస్తున్నారు.నెమ్మదిగా చెప్పింది స్నిగ్ధ. “ఓహ్ అవునా!థాంక్ యు వెరీముచ్ అంటూ సంతోషంతో షేక్‌హాండ్ ఇచ్చాడు. స్నిగ్ధ తేరుకోనేలోపలే వడివడిగా కాఫీ షాప్ వైపుకి వెళ్ళిపోయాడు.
కాఫీ షాప్ లో కూర్చున్న పెద్దాయన్ని తాతగారిగా గుర్తుపట్టి దగ్గరగా వచ్చి “నమస్కారం తాతగారు నేను విరించిని “అంటూ ఎదురుగా వున్న కుర్చీలో కూర్చున్నాడు. చక్కని ప్యాంటు షర్ట్ లో, మంచి క్రాఫ్ తో చక్కటి రూపంతో చాల అందంగా, హుందాగా వున్నాడు
“నువ్వు. “ఎలా మాటలు కలపాలో తెలియక సూర్యంగారు తడబడుతుంటే, “ఇక్కడ కాఫీ చాల బాగుంటుంది తాతగారు. వుండండి నేను ఆర్డర్ చెప్పి వస్తాను” అంటూ వెళ్లి రెండు పొగలుకక్కే కాఫీలతో వచ్చాడు.
“నా మాట మన్నించి వచ్చినందుకు చాల థాంక్స్ తాతయ్యగారు. నేను ఎవరినో మీకు తెలియదు కానీ మీ గురించి నాకు చాలా బాగా తెలుసు. నేను కృష్ణమోహన్ గారి కొడుకుని. అదే కన్న కొడుకుని కాదు. . . “చెప్పుతూ తాతయ్యగారు ఏమంటారో అని అయన వైపు చూసాడు. కృష్ణ మోహన్ పేరు దాదాపు చాల రోజుల తర్వాత వినపడిందేమో సూర్యంగారికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు.
నీరజగారితో విడాకులు తీసుకున్నాక US తెరిగి వచ్చిన కృష్ణమోహన్ గారు దాదాపు జీవచ్ఛవంగా అయిపోయారు. అయన ప్రాణస్నేహితుడైన మా నాన్నగారు రోడ్ ఆక్సిడెంట్ లో చనిపోయారు. ఆ టైం లో నాకు మా అమ్మకి అండగా నిలిచారు. నీరజగారు కృష్ణ మోహన్ గారి వ్యక్తిత్వంలో ఒక కోణం మాత్రమే చూడగలిగారు. కానీ మేము ఆయనలోని మరో కోణాన్ని చూసాము. ఆయనలోని మంచితనాన్ని చూడటానికి ప్రయత్నించకుండానే నీరజగారు అయన జీవితం నుండి నిష్క్రమించారు. కానీ కృష్ణ మోహన్ గారు మాత్రం ఆవిడని తలచుకొంటూ. తనకి దగ్గర లేని కూతురిని మనసులోనే ప్రేమించుకొంటూ కాలం గడుపుతున్నారు. . అవును తాతగారు కృష్ణ మోహన్ గారు నాకు తండ్రిలాంటి వారు. నాకు మా అమ్మకి కేర్ టేకర్ లా వుంటూ నన్ను మంచి ప్రేమ ఆప్యాయతల మధ్య పెంచారు. ఎన్నోసార్లు స్నిగ్ధని ఇక్కడికి తీసుకు వచ్చేద్దామనుకొన్నారు కానీ ఏమి చెప్పి మిమ్మలిని, అమ్మమ్మగారిని ఒప్పించాలో తెలియక అయనలోనే మధనపడేవారు. . టెక్నాలజీ పుణ్యమా అని నీరజగారి ఫొటోస్, స్నిగ్ధ ఫొటోస్ పేస్ బుక్, ఇంస్టాగ్రామ్ లోకృష్ణ మోహన్ గారితో పాటు నేను కూడా చూస్తూ పెరిగాను. నీరజగారిని తిరిగి అయన జీవితంలోకి తీసుకొని రాలేను. . . కానీ స్నిగ్ధని తిరిగి అయన దగ్గరికి చేర్చి కొంతైన అయన మనసుకి సాంత్వన చేకూర్చాలని నా అభిప్రాయం. అంత మంచి తండ్రి ప్రేమ, ఆప్యాయతలకు దూరంగా పెరిగింది ఇన్నాళ్లు. . కనీసం మా పెళ్లి వాళ్ళిద్దరిని కలుపుతుంది అని నా ఆశ. స్నిగ్ధ నన్ను ఇష్టపడకపోతే ఇంతే నా అదృష్టం అనుకొంటాను కానీ. నేను ఫలానా అని తెలిసాక వద్దు అనటం నేను భరించలేను. అందుకే ముందు మిమ్మలిని కలిసి నేనెవ్వరినో, కృష్ణమోహన్ గారు తాను కోల్పోయిన జీవితం తలచుకొంటూ ఎంత బాధపడుతున్నారో మీకు తెలియాలి. మీ ఆమోదంతోనే మా పెళ్లి జరగాలి. . . నీరజగారి నిర్ణయంతో మీరు ఎంత మానసిక క్షోభ అనుభవించారో. మా పెళ్లి జరిగి మీరు ఆ ఆవేదన నుంచి విముక్తి పొందాలని నా కోరిక.” చెప్పటం ఆపి తాతగారిని చూసాడు.
సూర్యంగారు చెవులు రిక్కించి సానుకూలంగా వింటున్నారు. ఇది నిజమా. . . . . ఇతను కృష్ణ మోహన్ పెంపకంలో పెరిగాడా? ఎంత హుందాగా ఆలోచిస్తున్నాడు. తనని పెంచిన మనిషి ఆంతర్యం గ్రహించి, అతనిలో మేము చూడలేకపోయిన కొత్త కోణాన్ని మాకు చూపించి ఆ తండ్రికి కూతురి ప్రేమ అందచేయాలని తపిస్తున్నాడా. . అనుకోకుండానే లేచి విరించిని దగ్గరికి తీసుకొన్నారు.
తాతగారు పెదవి విప్పి ఏమి చెప్పకపోయినా అయన మనసు అర్థం అయ్యింది. కృతజ్ఞతతో లేచి కాళ్లకి నమస్కరించాడు. విరించి ని లేవదీసి ఆప్యాయంగా గుండెలకి హత్తుకొన్నారు. ఇన్నాళ్లు మనసు మోస్తున్న కొండంత బరువు తగ్గించటానికే విరించిని భగవంతుడే పంపించాడా అనిపించింది.
విరించి భుజం మీద చెయ్యి వేసి నడిచి వస్తున్న తాతగారిని చూస్తుంటే స్నిగ్ధ మనసు సంతోషపడింది. . . . తానూ కోరుకొన్నది కూడా ఇదేనేమో. . . .

*****

అమ్మమ్మ కూడా విరించిని కలిసి చాల సంతోషించింది. భోజనం చేసి వెళితేగాని అమ్మమ్మ విరించిని వదిలిపెట్టలేదు. కొద్దిపాటి పరిచయానికి చాలా ఆత్మీయభావం కలిగింది. మంచి అబ్బాయిలా వున్నాడు అని అమ్మమ్మ మురిసిపోయింది. తాను చెప్పవలసిన విషయం తేలికగానే అంగీకరిస్తుంది అని సూర్యంగారికి అనిపించింది. రాత్రి ఏమి చెప్పారో గాని పొద్దున్న కృష్ణవేణి స్నిగ్ధని దగ్గరికి తీసుకొని విరించి విషయము అంతా చెప్పి”భగవంతుడు ప్రతి మనిషికి చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇస్తాడు. బహుశా మా విషయములో నీరజ చేసిన తప్పుకి సరిదిద్దుకొనే అవకాశం విరించి రూపంలో పంపించాడేమో. మావయ్య వాళ్లతో మేము మాట్లాడతాము, నీకు కూడా విరించి ప్రతిపాదన నచ్చితే నీ అంగీకారం తెలుపు “అంటూ నుదిటి పై ముద్దు పెట్టి తన అంగీకారం తెలిపింది. నీరజ కూడా విరించి చెప్పిన విషయము విన్నాక పెద్దగా అభ్యంతరం ఏమి చెప్పలేదు
స్నిగ్ధకి తండ్రి కృష్ణమోహన్ అని తెలుసు గాని అయన గురించి ఏమి తెలియదు. ఇంట్లో కూడా ఎవరు ఆ విషయము ప్రస్తావించేవారు కాదు. భర్తగా అయన పాత్ర నిర్వహించటంలో సఫలీకృతులు కాలేకపోయారేమో, అంతమాత్రాన అయన చెడ్డ వ్యక్తి అని నిర్ధారించటం సబబు కాదేమో. . . విరించి మాటలు వింటూ ఉంటే అంత వున్నత మనస్తత్వం వున్న వ్యక్తి తన తండ్రి అనే భావం ఎందుకో మనసు సంతోషపడేలా చేస్తోంది. . అంతేకాదు అలాంటి మనిషిని ఎప్పుడు చూద్దామా అనిపిస్తోంది. . . .
ఊరినుండి అత్తయ్య మావయ్య వంశి వచ్చారు. వంశి, విరించి ఇద్దరు తొందరగానే ఒకరితో ఒకరు కలిసిపోయారు. నీరజకి కూడా విరించి చాలా నచ్చాడు. పెళ్ళికి ముహూర్తం పెట్టేసారు. స్నిగ్ధకి జరుగుతున్నది అంతా కలలా అనిపిస్తోంది.
కృష్ణమోహన్ గారిని రిసీవ్ చేసుకునేందుకు అందరు ఎయిర్ పోర్ట్ కి కారుల్లో బయలు దేరారు
తండ్రిని చూసే ఆ క్షణం ఎలా ఉంటుందో అన్న భావం విరించి కి దగ్గరికి జరిగేలా చేసింది. తన ప్రేమ తో పాటు తండ్రి ఆప్యాయతని కూడా అందిస్తున్న విరించి మీద ప్రేమ రెట్టింపు అయ్యింది. ఇంత ప్రేమ, ఆప్యాయత ఒకేసారి తనకి దొరికేలా చేసిన విరించి గుండెల మీద కృతజ్ఞతతో తల ఆనించింది. వాటికి నువ్వు హక్కువున్నదానివి అన్నట్టు భరోసా కల్పిస్తూ దగ్గరికి తీసుకొన్నాడు. . . . స్నిగ్ధ మనసు వేగంతో పోటీపడుతూ కారు వేగంగా ఎయిర్ పోర్ట్ వైపుకి పరుగులు తీసింది.

*****************

1 thought on “కొత్త కోణం (కథ)

  1. చాలా బాగుంది. నిజంగా కొత్త కోణమే. వడి వడిగా చదివించింది..ఒకటి కంటే ఒకటి చాలా బాగా రాస్తున్నావు ప్రభా…సూపర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *