March 29, 2023

పెద్దాయన (కథ)

రచన-డా. లక్ష్మీ రాఘవ

“చిన్నక్కా నేను ఆఫీసు పనిమీద బెంగళూరు వస్తున్నా. నాకు హోటల్ లో అకామిడేషన్ వుంటుంది అయినా ఒకరోజు నీ దగ్గరకి వస్తా“ నీరజ ఫోనులో అనగానే
“నీరజా, ఎంత హాపీ న్యూస్ చెప్పావే. నేరుగా ఇక్కడికే వచ్చేసేయ్.కలిసి ఉందాం …” సంతోషంగా అంది సుజాత.
“అలా కుదరదులే అక్కా, అక్కడ నాకు మధ్యలో వేరే మీటింగ్స్, కస్టమర్స్ తో డిన్నర్ కూడా వుంటుంది. ఒక రోజు బ్రేక్ తీసుకుంటా నీ కోసం“ అని ఖచ్చితంగా అంటూన్ననీరజను ఇంకేమీ అనలేకపోయింది సుజాత. పెద్ద కంపెనీలో నీరజది పెద్ద ఉద్యోగమాయే!
నిజానికి నీరజ అలా చెప్పడానికి కారణం వుంది. అమ్మతో మాటాడినప్పుడు సుజాత అత్తగారు పోయాక అగ్రహారం నుండీ అక్కావాళ్ళ దగ్గరికి వాళ్ళ మామగారు వచ్చేసారని ఆ తరువాత అక్క ఉద్యోగం వదిలేసిందని…ఇంకా వివరాలు తెలియలేదు అని చెప్పింది.
అదేమిటి ఇంటికి ముసలివాళ్ళు వచ్చారని ఉద్యోగం వదిలేసి ఇంట్లో వు౦డమన్నాడా బావ రవి? అయినా అక్క ఎలా ఒప్పుకుంది? అక్కది మంచి ఉద్యోగం, పైగా సిటీ జీవితంలో ఇద్దరి జీతాలు ఎంత అవసరం? అక్క మామగారు అక్కడే వున్నప్పుడు తమకు కబుర్లు చెప్పుకోవడానికి కూడా వీలుంటుందో లేదో అని అనుమానపడింది. అందుకే హోటల్ లో ఉండటానికి నిర్ణయించుకుంది నీరజ.
సుజాత పిన్నికూతురైనా వయసు ఇంచుమించు దగ్గరగా వుండటం వల్లేమో ఎక్కువ స్నేహం వీరిద్దరికీ. అందుకే చిన్నక్క సుజాత పెళ్ళి తరువాత అత్తారింటికి తీసుకెళ్లడానికి “నీవూ రావే నీరజా…సుజాతకి తోడుగా “ అని పిన్ని పిలిస్తే తయారైపోయింది.. పిన్ని బాబాయిలతో వెళ్ళడానికి.
చిన్నక్క సుజాతతో వెళ్ళడానికి ఇంకో కారణం కూడా వుంది. తను ఎప్పుడూ పల్లెటూరు చూడలేదు. బావ ఉద్యోగం బెంగళూరులో అయినా మొదటగా అత్తగారిల్లైన అగ్రహారంకు తీసుకెళ్లాలన్నది వాళ్ళ ఆచారం.
అగ్రహారం చేరగానే బస్సు మొదట రాములవారి గుడి దగ్గరికి వెళ్ళింది. అందరు బస్సు దిగి, గుడిలో పూజ చేయించుకుని బయటకు వచ్చేసరికి బయట బోలెడు జనం..అందరినీ పలకరిస్తూ హుందాగా జవాబులిస్తున్న పెద్దాయన అనబడే అక్క మామగారు! వూరివాళ్ళు చేతులు కట్టుకుని మాట్లాడే విధానం చూస్తేనే తెలుస్తుంది అందరికీ ఆయన మీద వున్న గౌరవం! తరువాత ఊరేగింపుగా పెళ్లికూతురూ, పెళ్లికొడుకులను మేళతాళాలతో ఇంటికి తీసుకు వచ్చారు.
వారిది పాతకాలం నాటి పెద్ద ఇల్లు. ఎత్తుగా రూఫ్ వున్న హాలు. అక్కడ గోడల మీద గాంధీ, నెహ్రూలాటి ఫోటోలు. పద్దతిగా వున్నా ఒక మూలగా వేలాడుతున్న ఒక బెత్తం, ఒక పొడుగాటి తోలు బెల్టు చూసి ఆశ్చర్యమైంది నీరజకు ఇవి రెండూ హాలులో ఉండటమేమిటి? ఎందుకు ?అని ఎవరినీ అడిగే దైర్యం లేక ఊరుకుంది. అక్కడ వున్న మూడు రోజుల్లో అర్థం అయ్యింది. పెద్దాయన అంటే ఇంట్లో అందరికీ ‘సింహ స్వప్నం’ అనీ, ఆయన ఇంట్లో వున్నప్పుడు ఇంటివారు ఎవరూ ఎదురుగా వచ్చి మాట్లాడేంత సీను ఉండదనీ…వంట సరిగా లేకపోయినా కంచం విసిరి కొట్టి లేచి వెళ్లిపోతాడనీ మెల్లిగా చెప్పింది నీరజకు ఆ ఇంట్లో పనిమనిషి కూతురు రామక్క,
ఇంకో విషయం ఆశ్చర్య పరిచింది ఏమిటంటే అగ్రహారంలో ఎలాటి తగాదాలైనా పెద్దాయన దగ్గరే పంచాయితీ జరుగుతుందట. ఆయని తీర్పు నిర్ణయం జరిగాక దోషులను ఆ బెత్తంతో గానీ , తోలుబెల్టుతో గానీ కొట్టే శిక్షించే పద్దతి వుండట. ఇదేమి పద్దతి…ఎంత పల్లె అయినా ఇలాటి తీర్పుకు అందరూ ఎలా కట్టుబడి వుంటారు? ఏమైనా అప్పటినుండీ ఆయనను చూస్తే భయమేసింది నీరజకు.
పిన్ని వాళ్లకు చెప్పలేదు కానీ అక్క అత్తగారు ఆయనతో ఎంత వినయవిధేయతలతో ఉండేదో గమనించింది. భార్యకు భర్త దగ్గర కొంచెం కూడా చనువు వుండదా అనిపించింది.
పించపోసి తెల్లటి ఖద్దరు అంచుపంచ కట్టి, తెల్లటి కుర్తా వేసుకుని, భుజాన పైపంచతో ఏంతో హుందాగా వుండే వ్యక్తి, ఎంత రావణాసురుడో అనిపించింది. ఇంకా నయం అక్కా, బావా వాళ్ళ కాపురం సిటీలో, వీరికి దూరంగా అనుకుంటే … మనసు నిశ్చింత అయ్యింది అప్పట్లో.
అప్పటి ఆలోచనలనుండీ బయట పడినాక నీరజకు ఒక్కటే అనిపించింది. ‘ఇలాటి ఆయనను ఇప్పుడు అక్క ఎలా భరిస్తూ వుందో’ అని.
బ్రేక్ తీసుకున్నరోజు ఇంటికి వస్తున్నట్టు ఫోను చేసి, పది గంటలకే చేరుకుంది. ఆనందంగా వాటేసుకుంది నీరజని సుజాత. ఇద్దరూ కాస్త టీ తాగి కబుర్లలో పడితే టైం పరుగులు తీసింది. ఉన్నట్టుండి పెద్దాయన గుర్తుకు వచ్చారు. ఎక్కడా అలికిడే లేదు అసలు ఆయన వున్నారా? అదే ప్రశ్నించింది అక్కను.
“ఓ, నీ వరకూ వచ్చిందా. ఆయన వచ్చాడనీ, అందుకే నేను ఉద్యోగం వదిలేశాననీ ఏదేదో చెబుతున్నారు అందరూ…” అక్క మాటలు అడ్డుకుంటూ “ఆయన ఏరీ ..?” అనడిగింది నీరజ
“వున్నారు…ఇక లేస్తారు టైం అయ్యింది“ అంటూ ఉండగానే పక్కగా వున్నరూము తలుపు తెరుచుకుంది. అక్క ఒక్కసారిగా లేచింది
“అమ్మా ఈ బొత్తం ముడి వేస్తావా ..”అంటూ పైజమా జారుతూ వుంటే ఒక చేత్తో నాడా పట్టుకుని సుజాత దగ్గరకు నడుస్తున్న అతడిని గుర్తుపట్టలేకపోయింది నీరజ. ఒక చెయ్యి సరిగా లేదు. గమనిస్తే ఎడమ వైపు శరీరం కొద్దిగా పరాలిటిక్ అటాక్ అయినట్టుగా వుంది. మనిషి సన్నగా అయిపోయి బేలగా చూస్తూన్న అతడు అక్క మామగారు! అదీ పైజమా లో…నిజమేనా ?? ఎలా వుండేవారు?
ఏమిటిలా ??
“వస్తున్నా నేను కడతాను నాన్నా” అంటూ ఎదురు వెళ్ళింది అక్క. దగ్గరికి రాగానే ఒక చెయ్యితో అక్క భుజ౦ పట్టుకుని నుంచుని పైజమా నాడా కట్టించుకుంటూ ”అమ్మా ఆకలి…”అన్నాడు.
నీరజను గమనించినట్టే లేదు. చాలా బ్లా౦క్ వున్నాయి అతని చూపులు.
“ముందు ముఖం కడుక్కోవాలి కదా”అంటూ బాత్రూం ముందున్న వాష్ బేసిన్ దగ్గరకి తీసుకెళ్ళింది అతన్ని అక్క. తరువాత డైనింగ్ టేబల్ దగ్గర తీసుకు వచ్చి ప్లేట్ లో అన్నీ కలిపిపెడితే, నోట్లో నుండీ పడిపోతూ వున్నా ఆబగా తిన్నాడు అక్క పెట్టిన అన్నాన్ని. ఎడమచెయ్యి లేవటం లేదని కాబోలు అక్క నీళ్ళ గ్లాసు నోటి దగ్గర వంచి తాగిపించింది మంచి నీళ్ళను… అప్పుడు ఆయనలో నేను గమనించిన ఒకప్పటి దర్పం అంత మాయమైపోయి ఒక పసిపిల్లడిలా కనిపించాడు.
ఇదంతా నీరజ సినిమా ప్రేక్షకురాలిగా నోరు తెరుచుకుని చూస్తూంది..
తరువాత రూమ్ లో కి తీసుకెళ్ళి పడుకోమని చెప్పి. తలుపు ముందుకు వేసి వచ్చి కూర్చుంది అక్క
”అబ్బా అలా చూడకే నీరజా, అత్తగారు పోయాక ఆయనకు ఎడమ వైపు కొద్దిగా పెరాలసిస్ వచ్చింది..ఆయన సిటీకి రావడానికి ఇష్టపడలేదు అందుకని కొద్దిరోజులు వూర్లో నౌకర్లతో మానేజ్ చేశాము. ప్రతివారం రవి అక్కడికి వెళ్ళేవాడు. ఒక నెలలోనే నాన్నగారికి మతిమరుపు ఎక్కువ అయ్యిందని…ఆల్జీమర్స్ కావచ్చనీ అనుమానం వచ్చాక ఇక అక్కడ వుంచడం రవికి నచ్చలేదు. అందుకే ఇక్కడికి తీసుకు వచ్చాము. ట్రీట్మెంట్ జరుగుతూ వుంది. ఒక 15 రోజులు ఒక మేల్ నర్స్ ను పెట్టి ఎలా వుంటుందో చూసాము. అది ఎందుకో సరిగా లేదని రవికి అనిపించి నాతో చెప్పి బాధపడ్డాడు.
అప్పుడు నాకు కూడా ‘ఇది మా బాధ్యత’ అనిపించింది. ఇదే మా నాన్న అయితే ఏమిచేస్తాము అని ఆలోచించి తరువాత రవికి చెప్పాను నేను ఉద్యోగం వదిలేస్తానని…
“ఒక్కటే ఆలోచించా నీరజా, నాకు ఉద్యోగం మళ్ళీ అయినా దొరుకుతుంది, వీరికి సేవ చెయ్యడం అనే చాన్స్ మళ్ళీ దొరకదు అని. రవి నా నిర్ణయానికి చాలా సంతోషించాడు. ఇందులో రవి అస్సలు ఫోర్స్ చెయ్యలేదు నన్ను. ఇలా ఎందుకు చెబుతున్నానంటే మన వాళ్ళు అందరూ నేను ఉద్యోగం మానేయటం గురించి వేరు,వేరు గా మాట్లాడుతున్నారు. ఆయన ‘పెద్దాయన’గా వూరిలో ఎలా వుండేవారో నీకు కూడా తెలుసు. అలాటి మనిషి ఇలా తయారయ్యాడని అందరికీ చెప్పడం నాకు కూడా ఇష్టం లేకపోయింది. అందుకే వివరాలు అన్నీ అందరికీ తెలియవు. ఇక్కడ నాకు నేనుగా ఉద్యోగం వదిలేసా… నా కొడుకు కూడా కోచింగ్ కోసం హాస్టల్ లో వున్నాడు, ఈయనను చూసుకుంటూ మేము హ్యాపీగా వున్నాము…” అక్క మాటలు విని లేచి అక్కను ఒక్కసారి కౌగలించుకుంది నీరజ.
ఇంత నిస్సహాయంగా మారిపోయినా ఆయనను చూసుకునే దేవతలా కనిపిస్తోంది అక్క.
ఆ రోజు అక్క, రవితోనే కాదు పెద్దాయనతోనూ గడపడం అనేది అపురూప దృశ్యంగా నిలిచిపొయ్యింది నీరజ జీవిత౦లో….
ఇప్పుడు మారిన పరుగుల కాలంలో కూడా తల్లిదండ్రులను వృద్దాశ్రమాలలో వుంచేయాలని అనుకోవటం లేదు అందరూ. దీనికి సుజాత, రవిల జీవితమే ఉదాహరణ! మానవత్వం, అనుబంధాలు, ప్రేమా ఇంకా ఇలాటి వ్యక్తులలో సజీవంగా ఉన్నాయి.

$$$$$.

3 thoughts on “పెద్దాయన (కథ)

  1. పెద్ద వయసు చిన్న పసిపిల్లడిని చూసుకునే అమ్మ… అద్భుతం. మానవతా విలువలంటే ఇవే కదా. చాలా బాగా రాశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

February 2021
M T W T F S S
« Jan   Mar »
1234567
891011121314
15161718192021
22232425262728