April 20, 2024

రామదాసు గారి కుటుంబం (కథ)

రచన: రమా శాండిల్య

“నీకు తెలుసా శారదా? మా ఊరిని తలుచుకుంటే నాకు ఆ రోజంతా ఒక తెలియని అనుభూతి మైకంలా శరీరమంతా అవహిస్తుంది. ఎన్నెన్నో అపురూపమైన విషయాలు, బాంధవ్యాలు, బంధుత్వాలు కలగలిపిన ఒక సువాసన మనసంతా నిండిపోతుంది.”
“నాకు తెలుసుగా? ఇప్పటికి మూడు వందల ముప్పై సార్లు చెప్పి ఉంటారు! మరోసారి చెప్పండి, వింటాను!” చిరునవ్వుతో అంది శారద.
శారదలో నాకు నచ్చేదదే. నేనేది చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా విసుక్కోదు. పైగా నవ్వుతూ వింటుంది. అందుకే నా చిన్నప్పటి మా ఊరిని, అప్పటి విషయాలను పదే పదే ఆమెతో ముచ్చటిస్తూ ఉంటాను.
శారద వైపు ఓ చిరునవ్వు విసిరి కొనసాగించాను.
“అలాంటి మా ఊరిలో అమాయక ప్రజలున్నారు, అతి కర్కోటకులు వున్నారు. అవేమి మాకక్కరలేదంటూ చుట్టూ మంచుకప్పిన ఎత్తైన పర్వతాలు, అడపాతడపా వచ్చే సూర్యకిరణాలు కరిగిన మంచు, నదిగా మారి ప్రవహించే నీరు చూడవలసినదే కానీ ఎంతగా చెప్పినా తనివితీరదు. అప్పుడప్పుడు మాత్రమే కనిపించే ఎండకు. ఆకుపచ్చని తివాచీలా మొలిచిన గడ్డి, దానికి పూచిన రంగు రంగుల పువ్వులు. ఎక్కడ చూసినా సెలయేళ్ళు, చిన్న చిన్న పిట్టలు! భగవంతుడు గీసిన ఒక అద్భుతమైన వర్ణ చిత్రమే మా ఊరు!”
చెప్పుకుంటూ పోతున్న నా చేతిలో వేడి వేడి కాఫీ కప్పు పెట్టింది శారద. కాఫీ ఘుమఘుమలు నా మెదడును మరింతగా ఉత్తేజితం చేసాయి. ఆమె వైపు ప్రేమగా చూసాను. కాఫీ సిప్ చేస్తూ, ఒక అలౌకికానందాన్ని పొందసాగాను. ఆ నేపథ్యంలో నా మనోయవనిక పైన ఆనాటి మా ఊరి కథ, రామదాసు గారి గాథ కదులుతూనే ఉంది.
కాఫీ తాగేసిన తరువాత ఖాళీ కప్పును అందుకొని, దానిని వంటగదిలో పెట్టేసి వచ్చింది శారద.
“ఊ.” కంటిన్యూ చేయమన్నట్టుగా చూసింది.
“మా అందమైన ఆ పల్లెలో, ఒక చిన్న హనుమంతుని దేవాలయంలో పూజారిగా ఉండేవారు రామదాసు గారు.
రామదాసుగారు స్వచ్ఛమైన శ్రోత్రియ బ్రాహ్మణులు. ఆయనకు తెలిసిన పనులు మూడుసంధ్యలలో సంధ్యవార్చుకోవడం, (అంటే సంధ్యావందనం) రెండుసార్లు హనుమంతుడి గుడిలో దేవతార్చన కార్యక్రమాలు నిర్వహించడం, ఆయన సేవచెయ్యడం, మంగళహారతి పళ్ళెంలో వచ్చే డబ్బులతో ఇల్లుగడపడం. ఎప్పుడైనా ఊరిలో పెద్దలు సుందరకాండ, హనుమాన్ చాలీసా పారాయణ చేయించుకుని (చదివించుకుని) ఇచ్చే దక్షిణ ఆ ఇంటివారికి మూడోపూట తినడానికి పనికి వచ్చేది.
ఆయన భార్య జానకమ్మ! ఆవిడ ఎప్పుడు వంటఇల్లుదాటి బయటకు వచ్చినట్లు ఎవరూ చూడలేదు. తెల్లవారుఝామున స్నానం చేసి మడికట్టిన ఆ ఇల్లాలు రోజులో అయిదారుసార్లు స్నానముచెయ్యడానికి బావి దగ్గరకొచ్చేది. ఆ తడిబట్టలు ఒంటిమీదే ఆరుతుండేవి.
ఎప్పుడు ఏదో ఒక కీర్తన పాడుతూనో, భాగవతంలో పద్యాలు వల్లె వేసుకుంటూనో ఉండేదావిడ. ముఖానికి పచ్చగా పసుపు పూసుకుని, ఎర్రని కుంకుమతో నుదుట పెద్దదిగా బొట్టు తీర్చుకునేది. స్నానంచేసి, నిడుపాటి కురుల చివర ముడివేసుకుని, తలలో ఎర్రని ముద్దమందార పువ్వు, పెదవులపై త చిరునవ్వు, మెడలో కుత్తికంటూ (మెడవరకు గుంటపుస్తెలతో తాడుతోకట్టిన నల్లపూసలు) పసుపు తాడుకే మంగళ సూత్రాలు, పచ్చగా పసుపుపూసిన కాళ్లకు కడియాలు, పట్టాగొలుసులు, మట్టెలు ఇదే రూపం సర్వకాలాలలో కనిపించేది.
ఎప్పుడైనా రాత్రి వాళ్ళింటికెడితే తెల్లనిచీరలో పొడిపొడిగా ఉన్న జుట్టును పెద్దవాలుజడగా అల్లుకుని, మల్లెలో, జాజులో, ఛంబేలీలో. ఏ కాలంలో పూసే ఆ పువ్వులతో, తాంబూలం వేసుకున్న నోటితో అపర సరస్వతిలా కనిపించేది.
ఇంట్లో వారికి వండడం, దేవుడి భోగానికి మూడుసార్లు మహానైవేద్యం తయారు చేయటంతోనే సరిపోయేది ఆవిడకు. వారు వండుకున్నా లేకున్నా, స్వామి కైంకర్యానికి మాత్రం ఎటువంటి లోటు రాకుండా చూసుకునే వారు ఆ దంపతులు.
వారి చిన్న పాకలాంటి ఐదు గదుల ఇల్లు. చుట్టూ పెద్ద పెరడు, అన్నిరకాల కాయగూరలు, ఆకుకూరలు, పువ్వుల మొక్కలతో చాలా బావుండేది. ఏ రోజూ వారు బయటనుండి కూరలు కొనేవారు కాదు.
వారితో పాటు వారి ఆరుగురు ఆడపిల్లలు కాక తల్లిదండ్రులు , భర్త పోయిన అక్కగారు. ఇది మన పూజారి గారి ఇంటి సంగతులు.
వారు ఆరాధిస్తున్న ఆ గుడి మాన్యం ఆ ఊరి కరణం, మునసబుల చేతిలో ఉండేది. అది ఎంత, ఏమిటి అనే లెక్కలు ఎవరికీ తెలియవు. సంవత్సరానికి రెండు సార్లు జరిపే బ్రహ్మోత్సవాలకు ఖర్చయ్యాయని లెక్కల్లో ఉండేదట.
ఏమైనా రామదాసు గారి కుటుంబం మాత్రం చాలా పేదరికంలోనే ఉండేది. పిల్లలు కూడా తల్లితండ్రులకు చాలా సహాయంగా ఉండేవారు.
ఒకరోజు ఊరి పెద్దల దగ్గరనుండి కబురొచ్చింది రామదాసు గారికి. బట్టలు మార్చుకొని బయలు దేరి రచ్చబండ దగ్గరకెళ్లారు రామదాసు గారు.
“పంతులుగారూ, దండాలండీ, ఎలా ఉన్నారు? గుడిలో కార్యక్రమాలు ఎలా ఉన్నాయి?” అంటూ గుడి గురించి కనుక్కున్నారు. ఇంతలో కరణం గారు, ఇతర పెద్దలందరూ కూడా వచ్చేసారు.
రామదాసుగార్ని చూస్తూ కరణంగారు “ఏమయ్యా పంతులూ ఎలా వున్నావు? ఏమి లేదయ్యా. మన గుడి పెద్దదిగా కట్టాలనుకుంటున్నాము. గుడి కట్టేదాకా రోజువారీ కార్యక్రమాలు నువ్వే చేసుకో. కట్టాకా మాత్రం ఇంకో ఇద్దరు ముగ్గురు అర్చకులను తీసుకుని యాగాలు, యజ్ఞాలవీ చేస్తూ, గుడికి ఆర్థికవనరులను పెంచాలని అనుకుంటున్నాము. నువ్వేమంటావు?” అని అడిగారు.
రామదాసుగారు వారిమాటలకి “బాబు గారూ, అనడానికి నేనెవరిని? స్వామివారి ఇష్టప్రకారమే అన్నీ జరుగుతాయి. అయితే ఈ రెండు నెలల తరువాత నాకు పని ఉండదు ఎక్కువ అని తెలియచేస్తున్నారు అంతే కదా బాబూ!” అని విచారంగా అడిగారు.
అందుకే ముందుగా తెలియ జేస్తున్నామన్నారు ఆ ఊరి పెద్దలు.
కొంచెంసేపు కట్టబోయే ఆ గుడి గురించి మాట్లాడుకుని లేవబోయేంతలో.
ఎక్కడినుండి వచ్చాయో తెలియదు కానీ, ఉన్నట్టుండి కొన్ని కోతులు గుంపులు గుంపులుగా వచ్చి, అక్కడ కూర్చున్న పెద్దలందరి మీదా పడి రక్కసాగాయి.
వారికేమీ అర్థం కాక, అయోమయంగా కంగారుగా పరిగెత్తసాగారు. అందరి మీదా క్రూరంగా తమ ప్రతాపాన్ని చూపుతున్న ఆ వానరాలు, రామదాసు గారి దగ్గరకు మాత్రం రావటం లేదు.
కరణంగారికి అర్ధమైంది. తాము కుత్సిత బుద్ధితో రామదాసుగారిని గుడికి దూరం చేయాలనుకుంటే స్వామి ఆయన తరఫున నిలబడ్డాడని.
వెంటనే రామదాసుగారిని ప్రార్ధించి కోతుల్ని పంపించెయ్యమని అడిగారు.
రామాదాసుగారు ఆశ్చర్యంగా ఆ వానరాలకేసి చూస్తూ, హనుమాన్ దండకం చదవగానే అన్ని వానరాలు ఒక్కొక్కటిగా తిరిగి వెళ్లిపోయాయి. ఆ ఊరి వారికి ఆ గుడి అన్నా రామదాసుగారన్నా భక్తి, భయం మొదలైనాయి. అప్పటినుండి వారి సంసారానికి అండగా ఆ ఊరు ఉహు మా ఊరి వారందరూ నిలిచారు. ఆరుగురి ఆడపిల్లల పెళ్లిళ్లు చేసి ఆయన, జానకమ్మ గారు ఇరువురు ఆస్వామివారి సేవలో ఉన్నారు ఇప్పటికీ.”
చెప్పటం ముగించాను, భావోద్వేగాలతో నా గొంతు రుద్ధమవగా.
“ఎల్లుండి ఎటూ వెళుతున్నాము కదా. తప్పకుండా ఆ పూజారి గారిని కలుద్దాంలెండి. మీరు ఆఫీస్ కి వెళ్ళి రండి. టిఫిన్ పెట్టేస్తాను, స్నానం చేసి వస్తే.” టవలందించింది నా శ్రీమతి శారద.
మళ్ళీ ఇన్నాళ్ళకు మా ఊరు చేరబోతున్నాను, ఆ పుణ్య దంపతుల దర్శనం చేయబోతున్నానన్న ఆనందంతో మనసు ఉరకలు వేస్తుండగా వాష్ రూమ్ వైపు కదిలాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *