March 28, 2024

కంభంపాటి కథలు – నీచు

రచన: రవీంద్ర కంభంపాటి

వేప, నేరేడు, ఉసిరి, సపోటా చెట్లు, అక్కడక్కడా బాదం చెట్లు, కనకాంబరాలు, సన్నజాజి తీవెలు, మల్లె పొదలు, బెండకాయ, బీరకాయపాదులు. ఓ అందమైన వనంలా ఉంది . అందులో బాగా పెద్దగా ఉన్న వేప చెట్టు కింద కట్టిన చప్టా మీద, అన్నయ్యలతో అష్టా చమ్మా ఆడుకుంటూ తను.
చిన్నన్న ఏదో జోకేసేడు.. ఒక్కసారి గవ్వలు వదిలేసి మరీ నవ్వేను, వాడంతే. ఎప్పుడూ అలా జోకులేస్తూ నవ్విస్తూంటాడు .
దూరం నుంచి అమ్మ మాటలు వినిపించేయి. ‘ఏమిటా నవ్వులు గట్టిగా? ఆడపిల్లవి.. కాస్త కుదురుగా ఉండాలి ‘ అంటూ.
ఒక్కసారి మెలకువ వచ్చి..లేచి కూచున్నాను . టైం చూసేను.. తెల్లవారుజామున రెండున్నర అయ్యింది . కిటికీ లోంచి బయటకి చూస్తే ధారగా వర్షం . వర్షం చూస్తూ అలా కిటికీ దగ్గరే నుంచుండిపోయేను .
‘ఏమిటీ? మళ్ళీ మీ ఇల్లు కలలోకొచ్చిందా?’ శ్రీకాంత్ గొంతు వినిపించింది. ఎప్పుడు లేచేడో మంచం మీద కూచుని నన్నే చూస్తున్నాడు .
ఏం మాట్లాడలేదు నేను .
‘పోనీ.ఓసారి ఇండియా వెళదామా? నీకు మీవాళ్ళని కూడా చూసినట్టు ఉంటుంది?’ అడిగేడు
‘నాకెందుకో మా ఇంట్లోవాళ్ల కన్నా.. మా ఇంటిని చూడాలని ఉంది.నేను వాళ్ళతో ఎన్నిసార్లు మాట్లాడాలని ప్రయత్నించినా. సక్సెస్ కాలేకపోయేను. పైగా ఇంటి ఫోన్ నెంబర్ మార్పించేసేరు. నా మీద ఇంత ద్వేషం ఉందనుకోలేదు ‘ అన్నాను
‘ద్వేషం నీమీద కాదు. నా మీద. అంత పెద్ద కులం అమ్మాయివి నా లాంటి తక్కువ కులం వాడిని చేసుకోవడం వాళ్ళకి నచ్చలేదు. ఎందుకో. నేనే నిన్ను వాళ్ళ నుంచి దూరం చేసేనేమో అని చాలా గిల్టీగా ఉంటుంది ‘ శ్రీకాంత్ బాధగా అన్నాడు.
శ్రీకాంత్ ఏమీ మాట్లాడలేదు .
కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో.మొదటిసారి శ్రీకాంత్ ని చూసినప్పుడే, ఓ మంచి ఇంప్రెషన్ కలిగింది. ఆ తర్వాత తనతో స్నేహం పెరిగిన కొద్దీ, ఏం జరిగినా. ఏం ఫర్లేదు శ్రీకాంత్ ఉన్నాడు అని ధైర్యం అనాలో… సెక్యూరిటీ అనాలో తెలీదు గానీ . . ఓ విధమైన నిశ్చింత ఉండేది . కాకపోతే, తనంటే ఇష్టం అని చెబితే తనేమనుకుంటాడో.. ఎలా రియాక్ట్ అవుతాడో అని ఎప్పుడూ చెప్పలేదు.
తన పదో ఏట తలిదండ్రులు ఆక్సిడెంట్లో పోయేరు. తండ్రి స్నేహితుడి ఇంట్లో పెరిగేడు . ఫైనలియర్లో ఉండగానే, ఓ మల్టీనేషనల్ కంపెనీ తనని కాంపస్ లోనే సెలెక్ట్ చేసుకుని, అమెరికా వచ్చేయమని చెప్పినప్పుడు మటుకు. నా దగ్గరికి వచ్చి చెప్పేడు . నేనంటే తనకెంత ఇష్టమో. ‘మరి. ఇంతకాలం ఎప్పుడూ చెప్పలేదేం? ‘ అడిగేను . చిన్నగా నవ్వి చెప్పేడు. ‘నిన్ను నేను బాగా చూసుకోగలను అనే పరిస్థితి నాకు వచ్చినప్పుడు మాత్రమే చెబుదామనుకున్నాను’
శ్రీకాంత్ ఏమీ మాట్లాడలేదు .
కాలేజీ లో చదువుకుంటున్న రోజుల్లో.మొదటిసారి శ్రీకాంత్ ని చూసినప్పుడే, ఓ మంచి ఇంప్రెషన్ కలిగింది . ఆ తర్వాత తనతో స్నేహం పెరిగిన కొద్దీ, ఏం జరిగినా. ఏం ఫర్లేదు శ్రీకాంత్ ఉన్నాడు అని ధైర్యం అనాలో.సెక్యూరిటీ అనాలో తెలీదు గానీ . . ఓ విధమైన నిశ్చింత ఉండేది . కాకపోతే, తనంటే ఇష్టం అని చెబితే తనేమనుకుంటాడో.. ఎలా రియాక్ట్ అవుతాడో అని ఎప్పుడూ చెప్పలేదు.
తన పదో ఏట తలిదండ్రులు ఆక్సిడెంట్లో పోయేరు. తండ్రి స్నేహితుడి ఇంట్లో పెరిగేడు . శఫైనలియర్లో ఉండగానే, ఓ మల్టీనేషనల్ కంపెనీ తనని కాంపస్ లోనే సెలెక్ట్ చేసుకుని, అమెరికా వచ్చేయమని చెప్పినప్పుడు మటుకు. నా దగ్గరికి వచ్చి చెప్పేడు . నేనంటే తనకెంత ఇష్టమో. ‘మరి. ఇంతకాలం ఎప్పుడూ చెప్పలేదేం? ‘అడిగేను . చిన్నగా నవ్వి చెప్పేడు. ‘నిన్ను నేను బాగా చూసుకోగలను అనే పరిస్థితి నాకు వచ్చినప్పుడు మాత్రమే చెబుదామనుకున్నాను’
మా ఇంట్లో విషయం తెలిసి, చాలా పెద్ద గొడవే జరిగింది . ‘ఆ నీచు తినే నీచుడు నీకెలా దొరికేడు?’ అంటూ మా నాన్న గట్టిగా అరిచేరు
‘తను నీచు తినడు ‘ అన్నాను
‘వాళ్ళ కులం వాళ్ళు తింటారు కదా’
‘ఇప్పుడు మీకున్న ఇబ్బంది ఏమిటి? తను తినడనా.లేకపోతే వాళ్ళ కులం వాళ్ళు తింటారనా?’ మా నాన్న తో నేను ఎప్పుడూ ఇలా ఎదురు మాట్లాడలేదు.
మా అమ్మ లాగి ఒక్కటి కొట్టింది. ‘ఆయనతో వాదించేంత పెద్దదానివయ్యావా నువ్వు ‘ అంటూ అరిచింది
‘నాకు లాయరుగా ఊళ్ళో పేరున్నా. ఎంతోమంది స్నేహితులు ఉన్నా. ఓ మనిషి నీచు తింటాడంటే. ఎంత స్నేహితుడైనా మన ఇంట్లో భోజనం కాదు కదా కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వను. అలాంటిది వాడెవడో వెధవని తీసుకొచ్చి నాకు అల్లుడంటే.నేనెలా ఒప్పుకుంటాననుకున్నావు?’ అన్నాడాయన కోపంగా
‘తన గురించి మీకు చెప్పి ఒప్పించే ప్రయత్నం చెయ్యడంలో తప్పు లేదు కదా’
‘అసలు అలాంటి ఆలోచన రావడమే తప్పు ‘ అన్నారాయన
పెద్దన్న, చిన్నన్న ఏమీ మాట్లాడకుండా చూస్తున్నారు
‘సరే. నా ఆలోచన కరెక్టేనని నేననుకుంటున్నాను ‘ అన్నాను
‘అంటే మేము ఏమైపోతామో అనే బాధ నీకు లేదన్నమాట ‘ అమ్మ అంది
‘ఎందుకు లేదు?. అవతలి మనిషి గురించి తెలుసుకోకుండా అంత చులకనగా మాట్లాడుతున్నారే. ఆ బాధ ఇంకా ఎక్కువగా ఉంది ‘ అన్నాను
మా నాన్న పెద్దన్న వేపు చూసి. ‘పంతులు గారికి కబురు చెయ్యి.”మా చెల్లాయి చచ్చిపోయిందండి. దానికి దశదిన కర్మలూ పెట్టాలని చెప్పు” అన్నారు
నేనేం మాట్లాడకుండా ఓసారి ఇంటి లోపలికి వెళ్ళి,అక్కడున్న విశాలమైన పెరట్లోని నా ఫ్రెండ్సయిన ఆ చెట్లనన్నిటినీ ఓసారి చూసుకుని ఇంట్లోంచి వచ్చేసేను . అదే ఆఖరు. ఆ తర్వాత ఎప్పుడూ వెళ్ళడం కుదరలేదు . చిన్నప్పటి నుంచీ నన్నెంతో ముద్దుగా చూసుకున్న అన్నయ్యలు కూడా ఎప్పుడూ నాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు
నా ఆలోచనల ప్రవాహాన్ని ఆపుజేస్తూ. శ్రీకాంత్ అన్నాడు ‘పోనీ ఓసారి అందరం ఇండియా వెళ్ళి.ఆ ఇంటినే బయట్నుంచి చూసొస్తేనో. మన పిల్లలకి కూడా తెలియాలి కదా.మనం ఎక్కడ పెరిగేమో ‘
తను చెప్పింది కరెక్టేననిపించింది . పల్లవి, ప్రణవ్ ఇద్దరూ ఇక్కడే అమెరికాలోనే పుట్టి పెరిగేరేమో. చాలా ఎగ్జైటెడ్ గా ఫీలయ్యేరు ‘గ్రాండ్ పా వాళ్ళ ఇల్లు చూస్తున్నాం ‘ అనుకుంటూ .
ఫ్లైట్ ఎక్కి. హైదరాబాద్ లో లాండయ్యాక.శ్రీకాంత్ అన్నాడు ‘గూగుల్ లో చెక్ చేసేను.. మీ మంచి ఊళ్ళో హోటళ్ళు అవీ లేవు.కాకినాడ లో హోటల్ బుక్ చేసేను. అక్కడినుంచి ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుని మీ ఊరు వెళ్ళొచ్చు ‘
నిజమే.మాది చిన్న టవున్ కానీ.. చిన్నప్పటి రోజుల్లో. అన్నిటికీ కాకినాడే మాకు. ఇప్పటికీ పరిస్థితి అలాగే ఉన్నట్టుంది .
కాకినాడ జీఆర్టీ హోటల్లో చెకిన్ అయ్యి. ఆరోజు సాయంత్రం క్యాబ్ లో మా ఊరు బయల్దేరేము .
ఎక్కడా గుర్తుపట్టలేనట్టుగా ఉంది.ఎక్కడ చూసినా కార్లూ, బైకులూ . ఓ ఇరవై ఏళ్ల క్రితం, ఊళ్ళో మా నాన్న దగ్గర కాకుండా.ఇంకో పది పదిహేను మంది దగ్గర మాత్రమే బైకులుండేవి. అవి కూడా బజాజ్ స్కూటర్లు.లేదా మోటార్ సైకిళ్ళు . మున్సిపల్ చైర్మన్ గారికి మటుకు కారుండేది . ఇప్పుడు రోడ్ల మీద మనుషుల కన్నా వాహనాలు ఎక్కువ కనిపిస్తున్నాయి .
‘ఊళ్లోకి వచ్చేసేం.ఎక్కడికి వెళ్ళాలమ్మా?’ అడిగేడు డ్రైవర్
వీధి పేరు చెప్పేను. ఎవర్నో కనుక్కుని అటువైపు పోనిచ్చేడు
ఆ వీధంతా అప్పట్లో పెద్ద పెద్ద ఇళ్ళుండేవి. ఇప్పుడు అపార్టుమెంట్లు, షాపులూ కనిపిస్తున్నాయి . ఓ పక్కన కారు ఆపించి, నలుగురం నడవడం మొదలెట్టేము. ఆ వీధిలో ఐదో ఇల్లు మాది. ఒక్క ఇల్లు కూడా పూర్వంలా లేకపోవడంతో గుర్తుపట్టలేకపోతున్నాను .
ఓ కూల్ డ్రింకు షాపు దగ్గర ఆగి అడిగేను.. ‘ఇక్కడ ఫలానా లాయరు గారిల్లు ఉండాలి.వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలుసా?’
‘తెలీదండీ.ఈ మద్దెనే ఈ షాపెట్టేము ‘ అన్నాడతను
పక్కనే నుంచుని చుట్ట కాల్చుకుంటున్న ముసలాయన మా మాటలు విన్నట్టున్నాడు. ‘భలేవోరండీ. ఎదురుగా కనిపిస్తూంది కదేటండీ ‘ అని అతనంటే.. ఉలిక్కిపడి చూసేను
నిజమే.. ఎదురుగా మా నాన్న పేరుతో ఉన్న ‘నరసింహా టవర్స్’ అని అపార్టుమెంట్లు కనిపించేయి .
‘లాయర్ గారు మాతెలివైనోరండి. అద్దెలక్కువ వస్తాయని గ్రౌండు ఫ్లోరంతా షాపులుకిచ్చేసేరు , పైన ఐదో ఫ్లోర్లో ఆయనా, కుటుంబం ఉంటారండీ ‘ అంటూ అతను చెప్పుకు పోతూంటే, ఆ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ‘స్నేహా చికెన్ పాయింట్ ‘, ‘ఏసుపాదం నూడుల్స్ సెంటర్ ‘ లాంటి పేర్లని చూసి ఫక్కున నవ్వేసేను .

*****

3 thoughts on “కంభంపాటి కథలు – నీచు

  1. అన్ని మానవ విలువలకు సంబంధాలకు పునాది డబ్బే అని ఏదో యండమూరి గారి పుస్తకాల్లో చదివిన గుర్తు. మళ్ళీ పునశ్చరణ అయింది. మన నిర్ణయాలన్నీ డబ్బు లేదా అహంకారం మీద ఆధారపడి తీసుకుంటాము. చాలా బాగా రాశారు

    1. అన్ని మానవ విలువలకు సంబంధాలకు పునాది డబ్బే అని ఏదో యండమూరి గారి పుస్తకాల్లో చదివిన గుర్తు. మళ్ళీ పునశ్చరణ అయింది. మన నిర్ణయాలన్నీ డబ్బు లేదా అహంకారం మీద ఆధారపడి తీసుకుంటాము. చాలా బాగా రాశారు

Leave a Reply to Krishna Cancel reply

Your email address will not be published. Required fields are marked *