April 20, 2024

చంద్రోదయం 12

రచన: మన్నెం శారద

సిగ్గు మొగ్గలేస్తున్న ఆమె కళ్లలో.. మెరుస్తోన్న మెరుపు… ఎర్రబడుతోన్న చెక్కిళ్ళు.. మెల్లగా క్రిందికి వాలిపోతున్న చూపులు.
సారధి నిలువునా నీరుకారిపోతున్నాడు.
గొంతు తడారిపోతోంది.
ఏదో దారుణం జరిగిపోతోన్న అనుభూతి.. నిలువునా తనని హత్య చేస్తోన్నట్టుగా భ్రాంతి.
అతని మొహంలో కత్తివాటుకి నెత్తురు చుక్క లేదు.
అచేతనంగా కూర్చుండిపోయాడు.
“అమ్మాయి పేరు స్వాతి. బి.ఏ. ఫైనల్ పరీక్షలు రాసింది.” మాస్టారు గొంతు వినబడింది. ఒక్కో అక్షరం ఒక్కో కొరడా దెబ్బలా తగులుతోంది సారధికి.
“ఇక వెళతాం మాస్టారూ!” అన్నాడు శేఖర్ లేచి నిలబడుతూ.
సారధి కూడా యాంత్రికంగా లేచి నిలబడి అతన్ని అనుసరించేడు.
బైక్ స్టార్టు చేస్తుంటే శంకరంగారు” ఏం బాబూ..”అన్నారు ఏదో అడగాలని అడగలేక బోతున్నట్టుగా.
“ముహూర్తం పెట్టించండి. మీ ఖర్చు కూడా నాదే” అన్నాడు శేఖర్.
ఆ మాటలు వింటున్న సారధి ముఖం రక్తం విరిగినట్టుగా తెల్లబడిపోయింది.
ఏమీ చెప్పలేని నిస్సహాయత అతన్ని ఆవరించింది.
దారిలో శేఖర్ అన్నాడు. “చూసేవురా. నేను చూడకుండా ఒప్పుకున్నా ఊర్వశిలాంటి పెళ్ళాం దొరికింది. అమ్మ చూస్తే చాల అసంతోషిస్తుంది కదూ”
సారధి అదోలా నవ్వి వూరుకున్నాడు.
సారధి మాట్లాడకపోవటంతో శేఖర్ అతనికేసి ఆశ్చర్యంగా చూసేడు.
సారధి ముఖమంతా చెమటలు పట్టేసేయి. మనిషి వణికిపోతున్నాడు. శేఖర్ గాభరాగా అతని చేయి పట్టూకున్నాడు. “అదేం అలా అయిపోతున్నావు?” కంగారుగా అన్నాడు.
“తలనొప్పి.. ఏమిటోలా వుంది”
సారధి కోసం దారిలో టేబ్లెట్స్ కొన్నాడు శేఖర్.
ఇల్లు రాగానే సారధి మౌనంగా పడుకొన్నాడు. శేఖర్ సారధి చేత టెబ్లెట్ మింగించి అతని పక్కనే కూర్చున్నాడు.
“నువ్వు ఆఫీసుకెళ్లు. నాకు అదే తగ్గిపోతుంది” అన్నాడు శేఖర్. కాని తన మనసు కుదుటపడదని అతనికి బాగా తెలుసు.
సారధికి ఏకాంతం కావాలి. అందుకే బలవంతంగా శేఖర్ని ఆఫీసుకి పంపేసేడు.
శేఖర్ వెళ్లగానే సారధికి బావురుమని ఏడ్వాలనిపించింది.
ఆలోచనలతో అతని తల పగిలిపోతోంది.
అతని హృదయంలో ఒకే ఒక సమాధానం దొరకని ప్రశ్న తొలుస్తోంది.
ఎందుకిలా జరిగింది?
బుద్ధిలేని ప్రశ్నది.
తప్పు తనదే. ఎవర్నీ నిందించి లాభం లేదు.
******
సారధి అన్యమనస్కంగా బీచ్ ఒడ్డున నడుస్తున్నాడు. సముద్రం తన మనసులానే సతమతమవుతూ ముందు వెనుకలకి పరుగు తీస్తోంది. ఇసుకలో జాలర్లు వలలు ఎండబెట్టుకుంటున్నారు. పశ్చిమాద్రిన క్రుంగిపోతున్న సూర్యకాంతికి సముద్రం కెంజాయ్ రంగులో మెరుస్తోంది.
తెల్లని కొంగలు సముద్రంలోని రాళ్ల మీద కూర్చుని చేపల కోసం కొంగజపాలు చేస్తున్నాయి.
సముద్రం మీదనుంచి వీస్తున్న గాలి చల్లబడి మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తోంది.
అయినా సారధికిదేం పట్టలేదు. అతని హృదయం ముక్కలు ముక్కలుగా బీటలేసింది. సముద్రంలోకి దూకి చావాలన్నంత కసి.
ఆ కసి ఎవరిపైన? అతనికే తెలియదు.
“ఇలా ఎందుకు జరగాలి?” అని మాత్రమే అతని మనసు నిలదీసి ప్రశ్నిస్తోంది.
ఆమె ఎవరో తెలియకుండానే, ఆమె పూర్తి వివరాలు తెలుసుకోకుండానే ఆమెనంతగా ప్రేమించేడా?
ప్రేమ మనిషినింతగా చంపుతుందా?
ఏమిటీ ప్రేమ? ప్రేమ కాదు పిచ్చి.
తామిద్దరు ఒక్కసారి సినిమాహాల్లో కలుసుకోవటం మినహాయించి, మరెప్పుడూ కలుసుకోలేదు. ప్రేమలేఖలు రాసుకోలేదు. పార్కులూ, షికార్లూ అంటూ చెట్టాపట్టాలేసుకుని తిరగలేదు. ఒకరి గురించి ఒకరికి అసలు తెలియదు. కాని తన మనసింతగా కుమిలిపోతుందెందుకు?
సారధి ఎంత సమర్ధించుకోవాలన్నా అతని మనసుని సర్ది చెప్పుకోలేకపోతున్నాడు.
ప్రేమకి మొదటి చూపు చాలదా? ఆమెకోసం తనెలా కాలేజీల చుట్టూ తిరిగేడు. ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపేడు? ఎన్నెన్ని కలలు కన్నాడు. ఆ కలల్లో ఎన్నెన్ని గాలిమేడలు కట్టేడు.
సారధికి వున్నట్టుండి ఒక్కసారిగా వళ్లు ఝల్లుమంది.
అవును. తను సరిగ్గా అలాగే అనుకున్నాడు.
స్వాతి తనకి కాకుండా పోడానికి వీల్లేదు.. తనది భరించలేడు. తనకి కాకపోతే ఆమెకి ఈ జీవితంలో ఎవ్వరితోనూ పెళ్ళి కాకూడదు. ఒకవేళ అయినా అతను ప్రాణలతో వుండటానికి వీల్లేదు.
అసలా రోజు స్వాతి సినిమాహల్లో కనబడకపోతే, అటు తర్వాత శేఖర్ అడగ్గానే ఆమెని చేసుకోటానికి ఒప్పుకుని వుండేవాడు. అంతా దురదృష్టం.
స్వాతి పెళ్లి రోజుల్లో వున్నది. అదీ తన ప్రియమిత్రుడు శేఖర్‌తో. అతని నాశనం కోరుకుంటున్నాడా తను. అమానుషం కదూ.
తను ప్రేమించింది స్వాతినే అని చెబితే శేఖర్ క్షణాల మీద పెళ్లి కేన్సిల్ చేసుకుని తనకిచ్చి చేస్తాడు. ఆ విషయం సారధికి బాగా తెలుసు.
కానీ ఎలా చెప్పగలడు.
“శేఖర్! నేను స్వాతిని గాఢంగా ప్రేమించేను. ప్లీజ్. నువ్వు నా కోసం త్యాగం చేసి ఆ పిల్లని నా కోసం వదిలేయ్. నేను స్వాతిని పెళ్లి చేసుకుంటాను. స్వాతి లేకపోతే నేను బ్రతకలేనురా. స్వాతి నా ప్రాణం. నా సర్వస్వం. నాలోని అణువణువూ ఆమెనే స్మరిస్తోంది.” అని చెప్పగలడా.
చెబితే శేఖర్ త్యాగం చేయగల సమర్ధుడే. ఆ సంగతి ఎవరూ చెప్పనవసరం లేదు.
స్వాతిని చూసేక శేఖర్ కళ్లలో కనిపించిన మెరుపు, చూపించిన వుబలాటం తను మరచిపోగలడా??
శేఖర్ త్యాగం చేస్తే మాత్రం, దాన్ని స్వీకరించగల స్థితిలో వున్నాడా తను.

ఇంకా వుంది…

1 thought on “చంద్రోదయం 12

Leave a Reply to మాలిక పత్రిక ఫిబ్రవరి 2021 సంచికకు స్వాగతం.. – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *