April 17, 2024

జ్ఞాపకాల బాటలో (కథ)

రచన: జి.వి.ఎల్ నరసింహం

“కామూ, ఓ మెత్తని గుడ్డ…, పాతది…,ఏదైనా ఉందా.” పీపుల్స్ బేంకులో, ఉన్నతాధికారిగా పనిచేసి, ఇరవై మూడు సంవత్సరాల క్రితం, రిటైరయిన విశ్వనాధం, వంటింట్లోని భార్యకు వినిపించేటట్లు, వేసిన కేక.
“వాటికేం భాగ్యం. మీవే ఉన్నాయి. నిన్న, స్టీలు గిన్నెలు వాడు పుచ్చుకోనివి, ఒకటో, రెండో, పాత పంచలు. ఇంతకూ, దేనికేమిటి.” కామాక్షి, ప్రశ్నను జోడించి ఇచ్చిన జవాబు.
“ఈ ఆల్బమ్స్ అన్నీ ధూళి పట్టిపోయేయి. వాటిలో చాలా పాత ఫోటోలు కూడా ఉన్నాయి. కొన్ని ఒకదానికొకటి అంటుకుపోయేయి కూడా. జాగ్రత్తగా శుభ్రం చెయ్యాలి. చెయ్యి తీరుబాటయితే, నువ్వు కూడా సాయం చెయ్యాలి.”
‘‘సరే, అందాక మీరు పని ప్రారంభించండి. ఓ అర గంటలో, నేను వస్తాను.” అని హామీ ఇస్తూ, “సీతాలూ, అటక మీద, పాతబట్టల మూటలో, అయ్యగారి పాత పంచలుంటాయి, వాటిలో ఒకటి అయ్యగారికియ్యి.” అని, దగ్గరలో తడి గుడ్డ పెడుతున్న, పనిపిల్లకు పురమాయించింది, కామాక్షి.
కామాక్షికి, చెయ్యి తీరుబాటయింది. వృద్ధ దంపతులిద్దరూ, ఆల్బమ్సుని సున్నితంగా శుభ్రపరచడంలో నిమగ్నులయ్యేరు.
ఇంతలో, ప్రక్కనే ఉన్న సెల్ ఫోను మ్రోగింది.
“మీకేదో ఫోను వస్తోంది. చూడండి. ఈ లోగా, నేను టీ చేసి తెస్తాను.” అంటూ, కామాక్షి వంటిల్లు చేరుకొంది.
విశ్వనాధం ఫోను సంభాషణ ముగిసింది.
టీకోసం ఎదురు చూస్తున్న భర్తకు, టీ మగ్గు అందిస్తూ, “ఎవరండీ, ఆ ఫోను.” అడిగింది, భార్యామణి.
“మన ఎదురుగా మారుతీలో ఉంటున్న, పద్మనాభయ్యగారు.”
“ఏమిటంటారు”
“రేపు ఉదయం, ఎనిమిదీ ఇరవైకి, వాళ్ళ నీరజని పెళ్లికూతురుని చేస్తారట. మన ఉభయుల్నీ తప్పక వచ్చి, ఆశీర్వదించమన్నారు. రేపు, మన breakfast, lunch, వాళ్ళ ఇంట్లోనే అని మరీ, మరీ, చెప్పేరు. నీకు కూడా, గాయత్రిగారు ఫోను చేసి చెప్తారన్నారు.”
“Thank God, రేపు నాకు వంట పని తప్పిందన్నమాట.” పెద్ద రిలీఫ్ ఫీలవుతూ, మరో సిప్, టీ తీసుకొంది, కామాక్షి.
“కామూ, వాళ్ళ గెస్ట్సుకి, మనవి రెండు బెడ్ రూమ్స్ ఇస్తామన్నాం. ఆ రెండిటిని, ఎల్లుండికల్లా రెడీ చెయ్యమని, సీతాలుకి చెప్పేవా.” విశ్వనాధం ఎంక్వైరీ.
“సీతాలుకి చెప్పేనండీ. రేపు సాయంత్రం చేసీస్తానంది.”
ఇంతలో, వాచ్మెన్ అచ్చయ్య, బెల్లు కొట్టి, లోపలికి ప్రవేశించి,
“అయ్యగారండీ, ఎల్లాజీకి సెప్పేను. రేపొచ్చి, ఏసీలు, ఫేన్లు, చెక్ సేస్తానన్నాడు.”అని వినయంగా చెప్పి, దంపతులిద్దరి దగ్గరా, శలవు తీసుకొన్నాడు.
అచ్చయ్య నిష్క్రమించగానే, దంపతులిద్దరూ మళ్ళీ పనిలో నిమగ్నమయ్యేరు. కామాక్షి, మరో ఆల్బం శుభ్రం చెయ్యడానికి తీస్తూంటే, అందులోనుండి కొన్ని ఫోటోలు నేల జారేయి. వాటిని ఒక్కొక్కటిని జాగ్రతగా ఏరి, ఒక చోట పెడుతూ, “ఈ ఫోటోలన్నీ, కలసిపోయేయండి. మళ్ళీ, ఆర్డర్లో పెట్టాలి.” అని, భర్త దిక్కుగా చూసింది.
“వాటిని, ఇలా తీసుకురా.” అని, భర్త చెప్పడంతో, కామాక్షి ఆ ఫోటోలను, శ్రీవారికి అందించి, తనూ ఆయన ప్రక్కకు చేరింది.
విశ్వనాధం, ఆ ఫోటోలను ఒక్కొక్కటి, పరీక్షగా చూస్తూ, “కామూ, ఇవన్నీ, మన హానీమూన్ ట్రిప్కు లోనివి.” అని, ప్రతీ ఒక్క ఫోటోని ఐడెంటిఫై చేస్తూ, వాటిలోని విశేషాలను, భార్యతో బాటు, నెమరువేసుకొన్నాడు.
భర్త చూస్తున్న ఫోటో నొకదానిని, తనూ దీక్షగా చూస్తూ, “ఇదెక్కడిదండీ” అని, కుతూహలంతో అడిగింది, కామాక్షి.
“కామూ, మరచిపోయేవా. ఇది, రాజస్థాన్ జైపూరులోని, జల్ మహల్.”
“ఆ, జ్ఞాపకమొచ్చింది. జైపూర్ చాలా అందమైన సిటీ గదండీ.” అని, జైపూర్ అందాన్ని పొగుడుతున్న భార్యకు, మరో ఫోటో చూపిస్తూ,
“కామూ, ఇదెక్కడిదో చెప్పగలవా.”అని, స్కూల్లో టీచరు, స్టూడెంటుకు వేసిన ప్రశ్నలా అడిగేడు విశ్వనాధం, భార్యామణిని.
“ఇదీ, జైపూరులోనిదే, సిటీ పేలెస్ కదండీ. ఎన్నిమార్లో చూసేం. ఇక్కడే కదా, ఒక తెలుగు సినిమా షూటింగు చూసేం.” అని, ధైర్యంగా కరెక్ట్ ఆన్సర్ చెప్పిన విద్యార్థిలా, ముఖం పెట్టింది, కామాక్షి.
దీక్షగా, జైపూరులోని పాత ఫోటోలు చూస్తూ, జ్ఞాపకాల బాటలో, ఉభయులూ, సుమారు ఐదు దశాబ్దాల వెనుక, తాము నివసించిన జైపూర్ చేరుకొన్నారు.
ఆనాటికి, విశ్వనాధానికి ఆరునెలల క్రిందటే పెళ్లయింది. పీపుల్స్ బేంకులో, పెర్సొనెల్ ఆఫీసరుగా సెలెక్ట్ అయ్యేడు. బేంకు రీజినల్ ఆఫీసులో చేరడానికి, భార్యతో బాటు, తల్లిదండ్రులు, పెళ్లీడు చెల్లెలితో, ఓ సుముహూర్తాన్న, రాజస్థాన్ రాజధాని, జైపూరులో అడుగు పెట్టేడు. అదే ఆఫీసులో, పనిచేస్తున్న, ఓ కన్నడ ఆఫీసరు శేఖర్, విశ్వనాథం రాకను ముందుగా తెలుసుకొని, అతన్ని రైల్వే స్టేషనులో రిసీవ్ చేసుకొన్నాడు. ఆఫీసుకు దగ్గరలో, తన ఇంటికి ప్రక్కనే, విశ్వనాధం నివాసం కోసం, ముందుగా ఏర్పాటు చేసిన ఇంటికి తీసుకెళ్ళేడు. కేరళకు బదిలీ అయిన, ఓ మలయాళీ ఆఫీసరు వద్ద, అతను వాడిన రుబ్బురోలు, విశ్వనాధం కోసం కొని ఉంచేడు. ఇంట్లో ప్రవేశించగానే, వంటింట్లో, రుబ్బురోలుని చూడగానే, విశ్వనాధం తల్లి, లక్ష్మమ్మ ముఖం చేటంతయి, “నాయనా, పెద్ద బెంగ తీరింది.” అని కొడుకు భుజం తట్టింది.
విశ్వనాధం కుటుంబానికి, ఊరు కొత్త. భాష రాదు. ఇరుగు పొరుగు, తెలుగు వాళ్ళెవ్వరూ లేరు. ప్రక్కనే ఉన్న, శేఖరుకు, అతని భార్యకు, తెలుగు రాదు. విశాఖపట్నంలో లాగ, తమంత తాము, బజారుకెళ్లి, కావలిసిన వస్తువులు, కూరలు, కొనుక్కోగలిగే పరిస్థితి లేదు. దానితో, భారమంతా తన మీదే పడడంతో, విశ్వనాధం ఆఫిసులోని సహచరులు, ముఖ్యంగా శేఖరునుండి, బజారుకు వెళ్లే దారులు, ఏ వస్తువులు ఎక్కడ దొరుకుతాయో, సమాచారాన్ని సేకరించడం మొదలు పెట్టేడు. వారి సలహాతో, ఒక వెస్పా స్కూటరు కొనుక్కున్నాడు. ఆఫీసు నుండి రాగానే, స్కూటరు మీద బజారుకెళ్లి, కావలిసినవి కొనుక్కోడానికి, క్రమంగా అలవాటు పడ్డాడు.
లక్ష్మమ్మగారికి, కుంకుడుకాయలతో తలంటుకోవడం అలవాటు. ఊరునుండి తెచ్చుకొన్న వాటి, స్టాకు అయిపోవడంతో, ఒక సాయంత్రం, బజారుకెళుతున్న కొడుకుని, కుంకుడుకాయలు తెమ్మని, ఆవిడ పురమాయించింది. విశ్వనాధం విశ్వప్రయత్నం చేసేడు. బజారులో, కిరాణా దుకాణాల్లో ఎక్కడా దొరకలేదు. నిజానికి, విశ్వనాధానికి, కుంకుడుకాయల్ని హిందీలో ఏమిటంటారో తెలీదు. తన విఫల ప్రయత్నాలు, తల్లికి విన్నవించుకున్నాడు. నువ్వు సరిగ్గా ప్రయత్నించి ఉండవని, కొడుకుమీద ఆవిడ చికాకు పడ్డాది. అదృష్ట వశాత్తు, డబ్బాలో రెండు కుంకుడుకాయలు మిగిలి ఉన్నాయి. వాటిలో ఒకదానిని, ప్రక్కింట్లో ఉన్న శేఖరుకు చూపించి, తన ప్రయత్నాలు అతనికి వివరించి, అవెక్కడ దొరుకుతాయని, అతణ్ణి అడిగేడు. చిన్న చిరునవ్వుతో, అవి కిరాణా దుకాణాలలో దొరకవని, వాటిని హిందీలో, రీటాఫల్ అంటారని, అవి కేవలం డ్రై ఫ్రూట్స్ దుకాణాల్లోనే దొరుకుతాయని, శేఖర్ చెప్పడంతో, ‘బ్రతుకు జీవుడా’అని, బజారుకెళ్లి, వాటిని సేకరించి, వినయంగా తల్లికి సమర్పించుకున్నాడు, పుత్రరత్నం. ‘
“నేను అన్నానా. నువ్వు సరిగ్గా ప్రయత్నించి ఉండవని. ఆ దుకాణం జ్ఞాపకముంచుకో. మళ్ళీ అవసరమయినప్పుడు, వెతుక్కోనఖర్లేదు” అని సంతోషంగా కుంకుడుకాయల పొట్లం అందుకొంటూ, కుమారుడికి హితబోధ చేసింది, లక్ష్మమ్మ.
కొత్తగా పెళ్లయిన విశ్వనాధానికి, శ్రీమతిని స్కూటరు వెనుక కూర్చోబెట్టుకొని, ఆమె సున్నితమైన చేతులు, అతని నడుముని బిగించి, గిలిగింతలు పెడుతూంటే, వర్ణింపలేని తీపితనాన్ని చవి చూస్తూ, పింక్ సిటీ అందాలిని తిలకించాలని కోరిక. కానీ, ఆ సరదా తీరడం లేదు. కారణం, రోజూ తను ఆఫీసునుండి ఇంటికి చేరుకొనే వేళకు, కామాక్షి రాత్రి భోజనం తయారీలతో బిజీగా ఉంటుంది. ఆ సమయంలో, బజారులో ఏదేనా పనిబడితే, తనొక్కడే వెళ్తూంటాడు. ఆదివారాలు, ముఖ్యమైన బజారులన్నీ మూయబడి ఉంటాయి. అదీకాక, తామిద్దరే తిరగడానికి వెళితే, తల్లి, చెల్లెలు, ఎలా స్పందిస్తారో అనే భయం వెనకాడుతుంది.
ఒక సాయంత్రం, విశ్వనాధం ఆఫీసునుండి వచ్చి, కుర్చీలో ఆసీనుడై, జోళ్ళు విప్పుకొంటూ, దగ్గరలోనున్న తల్లితో, “అమ్మా, ఇవాళ ఒక తెలుగాయనని కలిసేను. ఆఫీసు పని మీద, మధ్యాహ్నం, మా M.I.Road branchకి వెళ్ళేను. అక్కడ, మేనేజర్ గారి ఛాంబరులో, వినోద్ రెడ్డి గారని, ఒక తెలుగాయనని కలిసేను. ఆయన ఇరవై ఏళ్ళనుండీ, మా బేంకు కష్టమరట. ఆర్మీలొ రిటైరయ్యాక, ఈ ఊళ్ళో స్థిరబడ్డారట. ఎక్సపోర్ట్స్ బిజినెస్ చేస్తున్నారు. ఎల్లుండి ఆదివారం, మనందరినీ వాళ్ళింటికి బ్రేక్ఫాస్ట్ కి ఇన్వైట్ చేసేరు. ఆయనే కారులో వచ్చి, మనని పిక్ అప్ చేసుకొంటానన్నారు.” అని, సంతోషం వ్యక్తబరుస్తూ చెప్పేడు.
“ఈ ఊళ్ళో, ఎన్నాళ్ళనుండో ఉన్నారంటున్నావు. వాళ్ళని కలిస్తే, మనకు కావలిసిన చాలా విషయాలు తెలుసుకోవచ్చు.” అని, వాళ్ళని కలియడానికి, ఉత్సాహం కనబరిచింది, లక్ష్మమ్మ.
“వాళ్ళ ద్వారా, మనకి మరికొన్ని తెలుగు కుటుంబాలతో పరిచయమవుతుంది.” వంట చేస్తూ, ఒక చెవి ఇటు పారేసిన, కామాక్షి స్పందన.
ఆదివారం ఉదయం, రెడ్డిగారు విశ్వనాధం ఇంటికి వచ్చి, అతిథుల్ని స్వయంగా కారులో తన ఇంటికి తీసుకెళ్ళేరు. రెడ్డిగారి భార్య ఇందిర, ఇడ్లీలు, వడలు, సాంబారు చట్నీలతో, బ్రేక్ఫాస్ట్ అమర్చింది.
ఇడ్లీలు తింటూ, “ఇందిరగారూ, ఇడ్లీలు చాలా మృదువుగా ఉన్నాయండి. ఈ ఊళ్ళో ఇడ్లీ రవ ఎక్కడ దొరుకుతుందండీ.” అని, సమాచార సేకరణ మొదలు పెట్టింది, లక్ష్మమ్మ.
“అమ్మగారూ, ఈ ఊళ్ళో ఇడ్లీరవ దొరకదండి. రామనాధం అని ఒక మలయాళీ ఆయన, ఢిల్లీ నుండి మనకు కావలిసిన వస్తువులు తెచ్చి అమ్ముతూంటాడండి. ఇడ్లీరవ, కాఫీపొడి, అప్పడాలు, త్రివేణీ వక్కపొడి, తెలుగు మేగజీన్లు, ఇంకా మనకి కావలిసినవన్నీ, ఢిల్లీ నుండి తెచ్చి అమ్ముతాడండి.” అని, అతి విలువైన సమాచారాన్ని, లక్ష్మమ్మకు అందజేసింది, ఇందిర.
“విస్సూ, ఆయన దుకాణం అడ్రస్ నోట్ చేసుకో నాయనా.” వడలు తింటున్న నారాయణమూర్తి, కొడుకు విశ్వనాధానికి, సలహా ఇచ్చేడు.
“ఆయనకు, వేరే దుకాణం లేదండి అయ్యగారూ. ఆయనే, ఇళ్లకు వెళ్లి, డెలివర్ చేస్తాడు. ఈవేళ సాయంత్రం మన ఇంటికి అప్పడాలు పట్టుకు వస్తాడు. అప్పుడు, మీ ఇంటికి అతనిని పంపిస్తాను.” అని హామీ ఇచ్చింది, ఇందిర.
“చాలా థేంక్సండీ. మా మామగారికి, త్రివేణి వక్కపొడి బాగా అలవాటు. ఆయనకు, ప్రోబ్లెం ఉండదు,” కామాక్షి ఇందిరకు ధన్యవాదాలు చెప్పుకొంది.
సరదాగా ఖబుర్లు చెప్పుకొంటూ, ఓ రెండు గంటలు గడిపి, విశ్వనాధం కుటుంబం గృహోన్ముఖులయ్యేరు.
ఒక రోజు సాయంత్రం, చెల్లెలు జానకిని స్కూటరు వెనుక కూర్చోబెట్టుకొని, కూరల బజారుకు బయలుదేరేడు, విశ్వనాధం. జానకి, తొలిసారిగా స్కూటరు వెనుక కూర్చుని, బజారుకు వెళుతున్నాది. సరదాగా, ఏవో ఖబుర్లు చెప్పుకొంటూ, ఇద్దరూ వెళ్తూండగా, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రెడ్ లైట్ రావడంతో, విశ్వనాధం స్కూటరుని ఆపేడు. కొద్ది సేపట్లో గ్రీన్ లైట్ రాగానే, వాహనాన్ని కూరల బజారు దిక్కుగా, ముందుకు పోనిచ్చేడు. ముందున్న వాహనాలిని తొందరగా పోనివ్వమని తెలియజేస్తూ, హోరెత్తుతూ మ్రోగుతున్న కారుల హారన్సులో, చెవులు చిల్లులు బడుతున్నాయి. ఆ రణగొణ ధ్వనిలో, కూరల బజారు చేరుకోగానే, విశ్వనాధం స్కూటరును ఆపి, హెల్మెట్ తీస్తూ, “చెల్లీ, కూరల బజారు వచ్చేసిందమ్మా, దిగు.” అంటూ, చెల్లెలు దిగితే, స్కూటరుకు స్టేండు వేసి, లాక్ చేద్దామని, వెనక్కి తిరిగేడు. ఒక్కసారిగా హతాశుడయ్యేడు. వెనకన చెల్లెలు కనబడ లేదు. గాభరా బడుతూ, జానకీ, జానకీ.” అని కేకలు వేస్తూ, నలుదిక్కులా, పరుగులెత్తి చూస్తూ, మళ్ళీ స్కూటరు దగ్గరకు వచ్చేడు. చెల్లెలు కనపడకపోవడంతో, బెంబేలెత్తి, దగ్గరలోనున్న వాళ్లందరినీ, తన చెల్లెలిని చూసేరా, అని ఆందోళనతో అడుగుతూంటే, వారిలో ఒక పెద్దాయన, చీకటి పడకుండా పోలీస్ స్టేషనులో రిపోర్ట్ ఇమ్మని, సలహా ఇచ్చేడు. ఆ సలహా పాటించి, విశ్వనాధం దగ్గరలోనున్న పోలీస్ స్టేషన్ చేరుకొని, రిపోర్ట్ ఇచ్చేడు. ఎలాగయినా, తొందరగా చెల్లెలి జాడ కనుక్కోమని, ఆఫీసరుని ప్రాధేయపడ్డాడు. ఆయన, అన్ని ప్రయత్నాలు వెంటనే చేస్తామని హామీ ఇస్తూ, విశ్వనాధాన్ని ధైర్యంగా ఉండమని సలహా ఇచ్చేడు. విశ్వనాధానికి, ఓ ప్రక్క చెల్లెలి జాడ కోసం ఆందోళన, మరో ప్రక్క, చెల్లెలు లేకుండా ఇంటికి ఎలా వెళ్లగలననే, భయం, మతి స్థిమితం లేకుండా చేసేయి.
పరిస్థితి చెయ్యిదాటిపోకుండా చూడాలని, పోలీసు ఆఫీసరు విషయాన్ని కమిషనరు ఆఫీసుకు తెలియజేసి, వారి సహాయం కోరేడు. వెంటనే, వారు రంగం లోకి దిగేరు. నగరంలోని అన్ని పోలీసు స్టేషన్లకు వివరాలిచ్చి, ఎలర్ట్ చేసేరు. జైపూర్ నుండి బయటకు వెళుతున్న ప్రతీ వాహనాన్ని, ముఖ్యంగా ట్రక్కులను థరోగా ఛెక్ చెయ్యమని, ఆర్డర్స్ పాస్ చేసేరు. నగరంలోని అన్ని హాస్పిటల్సుకు, జానకి వివరాలిచ్చి, ఏక్సిడెంటు కేసు ఏది వచ్చినా, వెంటనే తెలియబరచమని, మెసేజ్ ఇచ్చేరు. ఒక ప్రక్క సూర్యాస్తమయి, చీకటి బడుతోంది. చెల్లెలి జాడ తెలియక, విశ్వనాధం దిక్కుతోచని స్థితిలో, కృంగిపోతున్నాడు. అది గమనించిన, పోలీసు ఆఫీసరు, కమిషనరు ఆఫీసు వారు చేబట్టిన చర్యలను వివరించి, త్వరలోనే తన చెల్లెలి జాడ తెలుస్తుందని, మరోసారి ధైర్యం చెప్తూ, విశ్వనాధం వెన్ను తట్టేడు.
దిక్కు తోచని స్థితిలోనున్న విశ్వనాధం, నువ్వే దిక్కని, ఏడుకొండలవాడిని మ్రొక్కుకొన్నాడు. చెల్లెలి జాడ వెంటనే తెలిస్తే, చెల్లిలితోబాటు, దర్శనం చేసుకొంటానని స్వామిని వేడుకొన్నాడు. ఇంతలో, పోలీస్ స్టేషనులో ఫోను మ్రోగింది. S.M.S. హాస్పిటలునుండి వచ్చింది. ఏక్సిడెంటు కేసొకటి, తమ హాస్పిటలులో అప్పుడే ఎడ్మిట్ అయిందని, వ్యక్తి, సుమారు ఇరవై ఏళ్ళున్న అమ్మాయని, ఆ అమ్మాయి రోడ్డు వెంబడి నడూస్తూంటే, శరవేగంతో మోటారు సైకిలుపై పోతున్న, ఇద్దరు వ్యక్తులు వెనుకనుండి ఆమెను ఢీకొని, తప్పించుకు పోయారని, ఆ సమయంలో, ఎదురుగా కారులో వస్తున్న ఒక జంట, అది గమనించి, రక్త స్రావం, గాయాలతో, రోడ్డు ప్రక్కన పడి ఉన్న, ఆ అమ్మాయిని, త్వరగా తమ హాస్పిటలులో చేర్పించి వెళ్లిపోయారని, అమ్మాయి వివరాలు మరేమీ తెలియవని, హాస్పిటలు వారు సమాచారం అందజేసేరు. వెంటనే, హుటాహుటిన పోలీసు ఆఫీసరు, విశ్వనాధం, S.M.S. హాస్పిటలు చేరుకొన్నారు. ఏక్సిడెంటు పాలయిన అమ్మాయిని చూడాలని, హాస్పిటలు అధికారులను కోరేరు. ఆ అమ్మాయి, ఎమర్జన్సీ రూములో ఉందని, స్టిచెస్ వేస్తున్నారని, ఆ సమయంలో, బయటవారినెవ్వరిని లోపలకు అనుమంతించరని, అందుచేత, వేచి ఉండాలని చెప్పడంతో, తప్పనిసరై, ఎమర్జన్సీ రూము బయట, గది తలుపులు ఎప్పుడు తెరుస్తారా అని, వేయికళ్లతో ఆ ఇద్దరూ ఎదురు చూడసాగేరు.
ఎనర్జెన్సీ రూము తలుపులు తెరువబడుతున్నాయి. ఇద్దరు నర్సులు, స్ట్రెచ్చరును జాగ్రత్తగా బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది గమనించిన, విశ్వనాధం, పోలీసు ఆఫీసరు, శరవేగంతో అక్కడకు చేరేరు. విశ్వనాధం, అతృతతో అమ్మాయి ముఖం చూసే ప్రయత్నం చేస్తూంటే, స్ట్రెచ్చరుకు అడ్డుగా రావద్దని, నర్సులు సౌంజ్ఞ చెయ్యడంతో, ప్రక్కకు తప్పుకున్నాడు. స్ట్రెచర్ పూర్తిగా బయటకు వచ్చింది. విశ్వనాధం, అమ్మాయిని దగ్గరగా చూడడానికి వీలు కల్పిస్తూ, నర్సులు స్ట్రెచ్చరును ఆపి ఉంచేరు. అమ్మాయి ముఖాన్ని, విశ్వనాధం దగ్గరగా పరికించి చూసేడు. తల అడ్డంగా ఊపుతూ, ప్రక్కనే ఉన్న పోలీసు ఆఫీసరు ముఖంలోకి చూస్తూ, ఆ అమ్మాయి తన చెల్లెలు కాదని నిర్ధారణ చేస్తూ, పెదవి విరిచేడు. కథ మళ్ళీ ముందుకు రావడంతో, పోలీసు ఆఫీసరుతో బాటు, పోలీసు స్టేషను చేరుకొన్నాడు.
విశ్వనాధానికి, మళ్ళీ నిరీక్షణ ప్రారంభమయింది. ఇంతలో, టెలిఫోను మ్రోగింది. ఆఫీసరు ఎత్తుకున్నాడు. కమిషనరు ఆఫీసునుండి వచ్చింది. తాజా పరిస్థితిని విశ్లేషించి, జానకి జాడ తెలుసుకోడానికి, వెంటనే రెండు సెర్చ్ టీమ్సుని, నగరంలో నలుదిక్కులా పంపడానికి, ప్రణాళిక సిద్దమయిందనీ, ఒక టీముతో విశ్వనాధాన్ని పంపడానికి, మరో టీముకి, జానకి ఫోటో ఇచ్చి పంపడానికి నిర్ణయమైందనీ, అంచేత, విశ్వనాధాన్ని వెంటనే ఇంటికి వెళ్లి, జానకి ఫోటో ఒకటి తెమ్మని చెప్పమనీ, సందేశం వచ్చింది. ఆ విషయం, పోలీసు ఆఫీసరు విశ్వనాధానికి చెప్పేడు. పెళ్లి సంబంధాల ప్రయత్నంలో, ఈ మధ్యనే తీయించిన ఫోటోలు ఉండడం మూలాన్న, విశ్వనాధానికి సమస్య లేకపోయింది. సమయం కలసి వస్తుందని, విశ్వనాధాన్ని తన జీపులో కూర్చోబెట్టుకొని, ఆఫీసరే స్వయంగా విశ్వనాధం ఇంటికి బయలుదేరేడు. చెల్లెలు లేకుండా, ఇంట్లో ఎలా అడుగు పెట్టడమా అని తలచుకొంటూ, భయంతో బితుకు బితుకుమని, జీపులో కూర్చున్నాడు, విశ్వనాధం. ‘చెల్లేదిరా’ అని ఇంట్లోవాళ్ళడిగితే, సమాధానం ఏమిటి చెప్పడమా అని, అయోమయ పరిస్థితిలో నుండగా, జీపు ఇల్లు చేరుకొంది.
ఇల్లు చేరుకొన్న విశ్వనాధం, బెల్లు వేసేడు. తలుపులు తెరవబడ్డాయి. విశ్వనాధం నిర్ఘాంతపోయేడు. కలా, నిజమా, అని ఆశ్చర్యపోయేడు. కారణం. ఎవరి జాడ తెలియక, తను వర్ణింపతరము కాని ఆందోళన పడుతున్నాడో, ఎవరి జాడకై, తాను విశ్వప్రయత్నాలు చేస్తున్నాడో, ఆ వ్యక్తే, సాక్షాత్తు తన ఎదురుగా ఉన్న వ్యక్తి, తన చెల్లెలు, జానకి. అది చూసి, సంభ్రమాశ్చర్యాలతో ఒక్క మారు, చెల్లెలును దగ్గరగా తీసుకొన్నాడు. దీర్ఘ శ్వాసతో, కళ్ళు మూసుకొని, మనసులో ఏడుకొండలస్వామికి ధన్యవాదాలు చెప్పుకొన్నాడు.
“గుమ్మంలోనే నిలబడిపోయేరు. లోపలి రండి.” అంది, కామాక్షి.
విశ్వనాథం, పోలీసు ఆఫీసరు, ఇంట్లోకి వెళ్ళేరు.
“ఈ పోలీస్ ఆఫీసరు గారు నాకెంతో సాయం చేసేరు.” అని, ఆయన చేసిన సహాయాన్ని, ఎదురుగా ఉన్న కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ,
“ I am grateful to you.” అని పోలీసు ఆఫీసరుకు వినయంగా నమస్కరించేడు, విశ్వనాధం.
“I have done my duty. I am happy, your sister reached home safely.” అని,పోలీసు ఆఫీసరు, అందరి శలవు తీసుకొని, జీపు ఎక్కేడు.
ముందుగదిలోని కుర్చీల్లో ఐదుగురూ ఆసీనులయ్యేరు.
ప్రక్కనే ఉన్న చెల్లెలి అరచేతిని, తన అరచేతితో గట్టిగా పట్టుకొని, ఆమె తలా నిమురుతూ, “ఏమిటి జరిగిందో, ఎలా జరిగిందో, తెలీక, ఎంత గాభరా పడ్డానో, తెలుసా, అమ్మా. ఓ మూల చీకటి పడిపోతూంటే, ఆందోళన మరీ ఎక్కువయింది.” అని, ఆ క్షణాల్లో, తన దిక్కు తోచని స్థితిని చెబుతూంటే,
“మీ గురించి, మేమూ చాలా గాభరా పడ్డామండి. జానకిని వెతుక్కొంటూ, మీరు ఏం అవస్థలు పడుతున్నారో అని ఆందోళన పడ్డాం. తను క్షేమంగా ఇల్లు చేరుకొందని మీకు ఎలా తెలియజెయ్యాలో తెలీక, శేఖరు గారిని అడిగేను. ఏం చెయ్యాలని. ఆయన గాభరా పడొద్దన్నారు. కొద్దిసేపట్లో, మీరు ఇంటికి వచ్చీస్తారని ధైర్యం చెప్పేరు.” అని ఇక్కడి కథ చెప్పింది, కామాక్షి.
అన్నయ్యా, నేను చేసిన పొరపాటుకు, నువ్వు టెన్షన్లో, అవస్థలు పడ్డావు. ఐ ఏం సారీ.” అని అన్నకు క్షమాపణలు చెప్పుకొంది జానకి.
“ఇందులో, క్షమాపణలు దేనికమ్మా. నువ్వు మొదటి సారి స్కూటరెక్కేవు. ఊరు కొత్త, భాష రాదు. నేను కూడా, కొంత జాగ్రత్తగా ఉండవలసింది. ఇంతకూ, ఏమిటి జరిగింది.” అని, విశ్వనాధం కుతూహలంగా చెల్లెల్ని అడిగేడు.
అతనికి జానకి చెప్పిన వివరాల్లోకి వెళితే –
ట్రేఫిక్ సిగ్నల్ వద్ద రెడ్ లైటు చూసి, విశ్వనాధం స్కూటరును ఆపేడు. ఆ సమయంలో, అన్నయ్యకు స్కూటరుతో బాటు తన బరువు భారం కూడా ఉందని ఊహించి, భారం తగ్గిద్దామన్న ఉద్దేశంతో, జానకి స్కూటరు దిగి, ప్రక్కనే నిలబడింది. అది విశ్వనాధం గమనించలేదు. గ్రీన్ లైటు రాగానే, స్కూటరుని ముందుకు పోనిచ్చేడు. ఒక్కమారుగా జోరందుకున్న వాహనాల, హారన్ల హోరులో, బెంబేలెత్తిపోయి, “అన్నయ్యా, అన్నయ్యా” అని జానకి వేసిన కేకలు, హెల్మెట్ ధరించిన విశ్వనాధానికి వినిపించలేదు. ఓ ప్రక్క, స్కూటరు వెనుక తాను లేదని తెలియక, జోరుగా ముందుకు పోతున్న అన్నయ్య, మరో ప్రక్క, తప్పుకోమని తెలియజేస్తూ, వెనుకనున్న వాహనాల హారన్ల హోరు, జానకిని బెంబేలెత్తించేయి. కొద్ది క్షణాల్లో, అన్నయ్య కనుచూపు మేరలో లేకుండా పోయేడు. జానకికి, కళ్ళనీళ్ల పర్యంతం అయింది. వాహనాల రద్దీ తగ్గగానే, పేవుమెంటు చేరుకొంది. చేతిలో చిల్లిగవ్వ లేదు. నలుప్రక్కలా చూసింది. దగ్గరలో, స్టేట్ బేంక్ అఫ్ బికనీర్ అండ్ జైపూర్ వారి శాఖ తెరిచి ఉండడం గమనించింది. ముగ్గురు, నలుగురు, ఉద్యోగస్తులు పనిలో నిమగ్నమై ఉన్నారు. తలుపు తట్టి లోపలికి ప్రవేశించింది. జరిగిన విషయం వారికి విన్నవించుకొంది. వారు తగు రీతిలో స్పందించేరు. జానకిని, దగ్గరలో నున్న, ఫటఫటీ స్టాండుకు తీసుకెళ్లి, కావలిసిన డబ్బులిచ్చి, జానకి ఇంటిదిక్కుగా పోయే, ఫటఫటీలో కూర్చోబెట్టేరు. జానకి క్షేమంగా ఇల్లు చేరుకొంది.
ఇలా, స్మృతి పథంలో యాభై సంవత్సరాల వెనుకనున్న, విశ్వనాధం, కామాక్షి, తమ డోర్ బెల్ వినిపించగానే, వర్తమానంలోకి వచ్చేరు.
తలుపు తెరవగానే, రిటైరుడు ప్రొఫెసర్, ఆంజనేయ శర్మగారు ఎదురుగా ఉన్నారు.
“విశ్వనాధంగారూ, బిజీగా ఉన్నట్టున్నారు. ఇవాళ వాకింగుకి వస్తున్నారా.” అని, ఆయన వేసిన ప్రశ్నకు,
“అబ్బే, బిజీ ఏమీ లేదండీ. రండి. కూర్చోండి. అయిదు నిమిషాల్లో బయలుదేరుదాం.” అని, బట్టలు మార్చుకొని, జోళ్ళు వేసుకొని, శర్మగారితోబాటు, వుడా పార్కుకు ప్రస్థానమయ్యేడు, విశ్వనాధం.

——————————-

1 thought on “జ్ఞాపకాల బాటలో (కథ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *