April 18, 2024

తామసి 4

రచన: మాలతి దేచిరాజు

“అసలు సీమాతో మీరు ఎప్పుడు,ఎలా ప్రేమలో పడ్డారో చెప్తారా?”
రుద్రాక్ష్ అడిగిన ప్రశ్నకి తన దగ్గర సమాధానం ఉంది.కానీ అది నమ్మశక్యంగా ఉండదని అతనికి తెలుసు. బట్ అదే నిజం అని కూడా తనకి తెలుసు.
“నవల రాసేటప్పుడు ఆ పాత్ర కి బాగా కనెక్ట్ అయ్యాను…అలా క్రమేపి సీమా మీద ఇష్టం ఏర్పడింది.చివరికది ప్రేమగా మారింది.” చెప్పాడు.
ఫక్కున నవ్వాడు రుద్రాక్ష్..నవ్వుతున్నాడు..ఇంకా..ఇంకా.నవ్వుతూనే ఉన్నాడు.
గాంధీకి కోపం వస్తోంది కానీ చూపించలేడు.
“ఎందుకు నవ్వుతున్నారు.?” కూల్ గా అడిగాడు…
నవ్వు ఆపి..”ఏంటి రైటర్ సార్.. కామెడి చేస్తున్నారా… ”
“నిజం…ముందు నాకు ఆ పాత్ర మీదే ప్రేమ కలిగింది ..”
అతను చెప్పేది నమ్మబుద్ధి కాకపోయినా అదే నిజం.రైటర్స్ కి నవలలు ,కథలు,కవితలు రాసేటప్పుడు కొన్ని, కొన్ని సార్లు అందులోని పాత్రలతో గాని పాత్ర స్వభావాలతో గాని కనక్టివిటి ఏర్పడుతుంది.(అన్ని సందర్భాల్లో కాదు) అలా ఏర్పడినప్పుడు ఆ పాత్ర పై మక్కువ పెరిగి మరింత మెరుగులు దిద్దుతుంటారు .సినిమాల విషయంలో ఇది ఎక్కువ జరుగుతుంటుంది.మొదట దర్శకుడు గాని,కథా రచయిత గాని కొంత భాగమే అనుకున్న పాత్రలు క్రమేపి సినిమా అంతా కొనసాగుతాయి…అది నటీనటుల అభినయం వల్ల కావచ్చు, మాటల రచయిత వల్ల కావొచ్చు లేదా సీన్ కంటెంట్ వల్ల కావొచ్చు ..”ఖడ్గం” సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ అలరించిన పృథ్వి పాత్ర ఇందుకు ఒక ఉదాహరణ.ఇంకా చెప్పాలంటే అసలు తెలుగు సినిమా మొత్తం ఇలాంటి కనెక్టివిటితోనే సాగుతోంది.అందుకే మన కథలన్నీ హీరో పాత్రల చుట్టూనే తిరుగుతాయి. కానీ సినిమా విషయంలో రచయిత కన్నా ప్రేక్షకుడు ఎక్కువ కనెక్ట్ అవుతాడు. కారణాలు అప్రస్తుతం.(చెప్పక్కర్లేదు)
గాంధి పరిస్థితి కూడా అంతే..అది రుద్రాక్ష్ కి అర్ధం కాదు.
“పాత్ర మీద ప్రేమ కలిగితే..తమరు పాప వెంట పడటం ఏంటీ సార్..” వ్యంగ్యంగా అన్నాడు.
నవ్వి..”బొమ్మరిల్లు సినిమా చూసాక చాలా మంది కుర్రాళ్ళు జేనీలియాకి ఫ్యాన్స్ అయ్యారు…అంతకు ముందు కూడా ఆమె చాలా సినిమాలలో నటించింది..మరి ఈ సినిమా తర్వాతే ఆమెకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎందుకు పెరిగింది..”?లాజికల్ గా చెప్పాడు.రుద్రాక్ష్ నిజమే కదా అన్నట్టు మొహం పెట్టాడు.
“చిరంజీవి దాదాపు యాభై సినిమాల తర్వాత “ఖైదీ “లో నటించాడు.ఆ సినిమా తర్వాతే కదా ఆయనకి కూడా….” అని ఆపాడు… రుద్రాక్ష్ కి అర్ధం అయ్యింది అని గ్రహించి.
“మనిషికి మరో మనిషి దగ్గరయ్యేది వాళ్ళ వాళ్ళ క్యారేక్టరైజేషణ్ (స్వభావం) వల్లే..”
సినిమా వాళ్ళు అనేక పాత్రలు వేస్తుంటారు.తమకి నచ్చిన పాత్రలో కనిపిస్తే ప్రేక్షకులు ఆరాధిస్తారు. లేదంటే సినిమా ఫ్లాప్..”
నెమ్మదిగా నమ్మకం కలుగుతోంది రుద్రాక్ష్ కి.
“పెద్ద ఎన్.టి.ఆర్ దగ్గర నుంచి చిన్న ఎన్.టి.ఆర్ వరకు వాళ్ళు ప్రేక్షకులకు దగ్గరైంది పాత్రల ద్వారానే.” వింటున్నాడు రుద్రాక్ష్
“తమకి నచ్చిన పాత్రని ఎవరు వేసినా వాళ్లతో కనెక్ట్ అయిపోతారు ప్రేక్షకులు .
దానికి అభిమానం అనే ఒక ట్యాగ్ పెట్టుకుంటారు అంతే.”
“అందం ,కులం,శరీరాకృతి చూసి కలిగేది అభిమానం కాదు..పిచ్చి ,వ్యామోహం.
ఎంచుకున్న పాత్రల్ని బట్టి దాన్ని సక్రమంగా పోషించే వాళ్ళనేవ్వరినైనా జనం ఆదరిస్తారు.
నాని,శర్వానంద్,(తెలుగు ) ధనుష్ ,విశాల్ ,విజయ్ ,(తమిళ్) వాళ్ళు ఎంచుకున్న సినిమాలు ,అందులో వాళ్ళ పాత్రల ద్వారానే ప్రేక్షకులకు దగ్గరైయ్యారు.
సినిమాల్లో పాత్ర ని బట్టి నటన ,జీవితంలో పాత్ర (క్యారెక్టర్) ని బట్టి ప్రవర్తన పరిపూర్ణమవుతాయి “అని ఆగాడు గాంధి ఇంతకు మించి చెప్పనక్కర్లేదు అని భావించి.
“మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను మిస్టర్ గాంధి. బట్ ఇక్కడ విషయం పుస్తకం.”
“అది దొరికినా మీకు ఉపయోగం లేదు..ఎందుకంటే నేను రాసిన దానిని బట్టి ఒకరు సూసైడ్ చేసుకుంటే అది వాళ్ళ తప్పు నాది కాదు. ఎండ్రిన్ తాగి చస్తే అది తాగిన వాడి తప్పు తయారు చేసిన వాడిది కాదు కదా!” చెప్పాడు.
“కానీ డ్రగ్స్ కి ఎడిక్ట్ అయ్యే వాళ్ళ కన్నా ..అది తయారు చేసే వాళ్ళకే శిక్ష పడే అవకాశాలు ఎక్కువ.” కౌంటర్ ఇచ్చాడు రుద్రాక్ష్.
గాంధి మౌనం వహించాడు.
“అసలు ఆ పుస్తకం గౌతమ్ చేతికి ఎలా వెళ్ళింది..తన దగ్గర నుంచి ఎలా మాయం అయ్యింది.”ప్రశ్నించాడు రుద్రాక్ష్.
*******
“ఐ లవ్ యు..” పెదాల పై నుంచి వచ్చినట్టుంది ఆ మాట
నవ్వాడు.”ఇజాక్”
“నీ ఫీలింగ్స్ కి రెస్పెక్ట్ ఇవ్వగలను ..బట్ నా ఫీలింగ్స్ ని షేర్ చేసుకోలేను.అండ్ వన్ మోర్ థింగ్..నువ్వు నన్ను నిజంగా లవ్ చెయ్యట్లేదు..చేసుంటే అసలు చెప్పేదానివే కాదు.”
అర్ధం కానట్టు చూసి “అదేంటి ..చెప్పకుండా ప్రేమ ఎలా తెలుస్తుంది.?” ప్రశ్నించింది.
“చెబితేనే తెలుస్తుంది..కాని అది మాటల్లో కాదు చేతల్లో ..”దేర్ ఈజ్ నో వర్డ్స్ టు ఎక్స్ ప్రెస్ లవ్” సో …లీవ్ ఇట్…” చెప్పి కదిలాడు.
తెల్ల మొహం వేసుకుని చూస్తోంది స్పందన.
మనుషులెందుకు ఫీలింగ్స్ ని మాటల్లో ,అందమైన కవితల్లో చెప్పడానికి ప్రయత్నిస్తారో అర్ధం కాదు. అమ్మ మీద ప్రేమని ,నాన్న మీద గౌరవాన్ని ,అన్నా,అక్కా,చెల్లి ఇతర బంధాల పై మమకారాన్ని ఎన్ని మాటల్లో రోజు చెప్పుకు తిరగాలి..చిత్రమేంటంటే మనుషులు కూడా వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు..మాములుగా “నువ్వు బావున్నావు ,నీ కళ్ళు బావున్నాయి అంటే జస్ట్ థ్యాంక్ యు అని నవ్వి ఊరుకుంటారు..అదే ..ఒక కవిత లాగో,పాట లాగో రాసి ఇస్తే పొంగిపోతారు..”మాట అసంకల్పితం.. కావ్యం ప్రేరేపితం” చూడాగానే కలిగే భావం మాటల్లో చెబితేనే అందం..కవిత్వం లో చెబితే అది అందమైన అబద్ధం..ఏది ఏమైనా ప్రేమని మాటల్లో చెబితే నేనెప్పటికీ ఒప్పుకోలేను..అసలు చెప్పనేకూడదు. తెలిసిపోవాలి అంతే..అలా తెలిసే ప్రేమ ..తెలుసుకునే ప్రేమ ఈ లోకంలో దొరుకుతుందా..కారు నడుపుతూ ఇంత ఆలోచన చేసాడు ఇజాక్.
ఆ ఆలోచనలో పడి సిటీ అవుట్ కట్స్ వరకూ వచ్చేసాడు..అతనికి ట్రావెలింగ్ అంటే ఇష్టం దాదాపు చీకటి పడింది, సమయం తొమ్మిది దాటింది.కారు నెమ్మదిగా నడుపుతూ అవుటర్ రింగ్ రోడ్ వైపు తిప్పాడు .కొంత దూరం వెళ్లి కారు పక్కకు ఆపి దిగాడు.
సిగరెట్ వెలిగించి…ఒక పఫ్ లాగాడు..రెండోది…మూడోది..
రోడ్ కి లెఫ్ట్ లో చిన్న చెత్త కుండి ఉంది…సిగెరేట్ తాగుతూ క్యాజువల్ గా చూసాడు అతను. అతని చూపునేదో ఆకర్షించింది..నల్లని ఆకారం.ఇజాక్ అడుగు కదిలింది…చెత్త కుండి వైపు కదిలాడు…కుంచెం దగ్గరైయ్యాడు …తోలు సంచి అని తెలిసింది….ఇంకాస్త దగ్గరైయ్యాడు ..లాప్ టాప్ బ్యాగ్… వంగి తీసుకున్నాడు బ్యాగ్ ని.తేలిగ్గానే ఉంది.లాప్ టాప్ లేదని అర్ధం అయ్యింది…బ్యాగ్ ని పక్కన పడేసాడు.అతన్ని ఆకర్షించింది బ్యాగ్ కాదు..బ్యాగ్ లోంచి దాదాపు బయటకి కనిపించేలా పడి ఉన్న పుస్తకం.
పుస్తకం చేతిలో అందుకుని చూస్తున్నాడు ఇజాక్…
తన కోరిక ప్రకారం..తెలిసే ప్రేమ ,తెలుసుకునే ప్రేమ ఈ.. రోడ్ పక్కన ఉన్న చిన్న చెత్తకుండీలో అతనికి దొరికిందని ముందు, ముందు తెలుసుకుంటాడు..
తన సామానంతా సర్దుకుని బయల్దేరింది షీబా..హాల్ లో సోఫా పైన కూర్చునుంది సీమా.
“నేను వెళ్తున్నాను..” చెప్పింది గుమ్మం వైపు చూస్తూ.
“ఎక్కడికి ” అడిగింది సీమా.
“వెళ్లొస్తాను అనలేదు ..వెళ్తున్నాను అన్నాను.” తన వైపు చూడకుండానే చెప్పింది మళ్ళీ
“ఏమైంది షీబా నీకు..ఎందుకిలా చేస్తున్నావ్.?”
“నాకు గౌతమ్ తోనే ఏ రిలేషన్ అయినా..తనే లేనప్పుడు నేను ఇంకా ఇక్కడే ఉండి ఏం ప్రయోజనం.”బదులిచ్చింది.
“అంటే…?” అర్ధమయ్యి కానట్టు అడిగింది సీమా.
“వద్దు సీమా ..నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వు..ఇక నుంచి నువ్వెవరో ,నేనెవరో ”
సీమా మనసు చివుక్కుమంది.
“ఏ ఆడది చేయని పని మనం చేసాం..దానికి మూల్యం గౌతమ్ చావు..అసలు మనమే లేకపోతే ….” ఆగింది.. తమాయించుకుని
“నేనే లేకపోతే ఈ రోజు గౌతమ్ ఉండేవాడు..నువ్వు తను పెళ్ళి చేసుకుని ఉండేవాళ్ళు..”
కన్నీళ్లు పెట్టుకుంది తను.
“పిచ్చి దానిలా మాట్లాకు షీబా..”గద్దించింది సీమా..
“అవును పిచ్చి దాన్నే…నా పై నీకుంది కేవలం సానుభూతి అని, గౌతమ్ కి ఉంది జాలి అని తెలుసుకోలేని పిచ్చిదాన్ని..నీది స్నేహం అని ,తనది ప్రేమని నమ్మిన పిచ్చిదాన్ని..కేవలం మీకు ఇంటి పని,వంట పని చేసి పెట్టే పని మనిషినని తెలుసుకోలేని పిచ్చిదాన్ని..”అంది ఏడుస్తూ.. తను అన్న ఒక్కో మాట… సీమా కి బాణాల్లా దిగాయి..
“అదేంటి షీబా అలా మాట్లాడుతావ్…అన్ని తెలిసే కదా నువ్వు గౌతమ్ జీవితంలోకి వచ్చింది.ఇప్పుడు ఇలా అనడం న్యాయం కాదు..”
“అవును….అన్నీ తెలిసే వచ్చాను..ఒప్పుకుంటా ..కానీ వచ్చాక ఇంకా చాలా తెలుసుకున్నా అందుకే వెళ్ళీ పోతున్నా..”
“ఇప్పుడు గౌతమ్ ఉంటే ..నువ్విలా మాట్లాడే దానివి కాదు…”
“అందుకే కదా సీమా…గౌతమ్ లేనప్పుడు నేను ఇక్కడ ఎందుకు ఇంకా..!”
“వెళ్ళడం నీ అభిప్రాయం అయితే మార్చుకో అని చెప్పే దాన్ని కానీ అది నిర్ణయం అని తెలిసాకా చెప్పడానికి ఏం లేదు.”
ఇద్దరి మధ్య కాసేపు మౌనం…షీబా కదిలింది..ఏమనుకుందో ఏమో..ఆగి
“నాకు నీ మీద కోపం లేదు సీమా…గౌతమ్ మీద ప్రేమ ఉంది అంతే..”అని వెళ్ళిపోయింది.
ఆ ఆఖరి మాటలు ఎంత ఊరట కలిగించినప్పటికీ …ముందన్న మాటలు సీమా మనసుకి మానని గాయం చేసాయి..ఆ క్షణం అర్ధమైంది ఆమెకి, గౌతమ్ తో వచ్చినవి ..గౌతమ్ తోనే వెళ్ళిపోయాయి అని.
*************
కోర్ట్ లో వాదోపవాదాలు జరిగాయి..గౌతమ్ సూసైడ్ కి గాంధి రాసిన నవలే కారణమని ఆరోపణలు వచ్చినప్పటికీ సాక్ష్యాధారాలు సరిగా లేనందున, పైగా అసలు ఏం రాసాడో తెలియకుండా, గౌతమ్ ఏం చదివాడో తెలియకుండా శిక్షించడం సబబు కాదని..ఒకవేళ నిజంగానే గాంధి రాసిన నవల చదవడం వల్లనే గౌతమ్ సూసైడ్ చేసుకుని ఉంటే,
కనుమరుగైన ఆ నవల దొరికేవరకు ఎలాంటి నిర్ధారణకు రాలేము కాబట్టి…గాంధి అలియాస్ అనురాగ్ గాంధి ని పదిహేను రోజులు రిమేండ్ లో ఉంచవలసిందిగా కోర్ట్ ఆదేశించింది.
“అసలు ఎవడో రాసిన నవల చదివి ,దానికి ప్రేరేపితుడై ఒకడు సూసైడ్ చేసుకుంటే..దానికి కేస్ పెట్టి ..కోర్ట్ దాకా తీసుకొచ్చి …ఉష్..ఏంటీ రచ్చా ..ఏమైనా అర్ధం పర్ధం ఉందా “అన్నాడు న్యూస్ పేపర్ మడత పెడుతూ ఒక పెద్దాయన..
“మరే” వంత పాడాడు మరో పెద్ద మనిషి.
టీ స్టాల్ దగ్గర వాళ్ళ సంభాషణ విన్న ఇజాక్ నవ్వుకున్నాడు..వాళ్ళ మాటలకి కాదు ఆ న్యూస్ కి…సిగెరేట్ వెలిగించుకుని వెళ్ళిపోయాడతను.
రాత్రి దొరికిన పుస్తకాన్ని తీసి ..అటు తిప్పి,ఇటు తిప్పి చూసాడు దానిపైన కవరు గట్రా ఏమీ లేదు..సాధారణ బైండింగ్ చేసి ఉన్న పుస్తకం అది, బైండింగ్ కవరు తిప్పాడు మంచం పై కూర్చుంటూ.మొదటి పేజీ ఖాళీగా ఉంది…పేజీ తిప్పాడు.
నల్లని అక్షరాలు అందంగా ఉన్నాయి..చేతి వ్రాత బాగుంది అనుకున్నాడు..కళ్ళతో పైపైన చదివాడు..వాక్య నిర్మాణం చూస్తే కథో, నవలో అయ్యి ఉంటుంది అని తెలుస్తోంది.
“పాపం ఎవరో కష్టపడి రాసుకున్నట్టున్నారు.” అనుకున్నాడు పేజీలన్నీ బోటని వేలితో సర్రున తిరగేస్తూ.. పది మాటలున్న వాక్యాన్నే పూర్తిగా చదవడానికి ఇష్టపడడతడు…. అలాంటిది ఇన్ని పేజీలు చదవగలడా..ఇంతలో
“బేటా ” అమ్మ పిలుపు..
“హా అమ్మి..బోలో..”
“మై చాచా కే ఘర్ జారహిహు.. దర్వాజ బంద్ కర్లే ..”అంది ఆవిడా..
“జీ అమ్మి..” అని తన బెడ్ రూమ్ నుంచి బయటకి వచ్చి అమ్మ వెళ్ళాక తలుపులేసాడు ఇజాక్.
వెనక నుంచి ఎవరో అమాంతం కౌగిలించుకున్నారతన్ని..విడిపించుకుని చూసాడు..గుండ్రమైన ముఖం ,కళ్ళకి నల్లని కాటుక,చున్ని తల పైనుంచి చుట్టుకుని అందంగా నవ్వుతూ నిలబడి ఉంది నజీరా..
(ఇద్దరి మధ్య సంభాషణ అంతా ఉర్దూ లోనే)
“ఏంటిది..నువ్వెప్పుడు దూరావు లోపలికి..”? అడిగాడు ఆమెని దాటుకుని పోతూ..
“అత్తయ్యా కిచెన్ లో ఉన్నప్పుడు,తమరు మీ గదిలో ఉన్నప్పుడు..” వయ్యారంగా చెప్పింది.
“సరే..ఎందుకొచ్చావ్..?”
“ఏ…రాకూడదా..?”
“వచ్చు…కానీ…ఇలా కూడదు..”
“ఇలా అంటే ఎలా ..?”
“అమ్మ లేనప్పుడు..నేను మాత్రమే ఉన్నప్పుడు..”
“అమ్మ ఉన్నప్పుడు వస్తే..కోడలిగా వచ్చినట్టు..ఇలా వస్తే నీకు మరదలిగా వచ్చినట్టు.”అని అతని మెడని చేతులతో చుట్టేసింది.ముఖం లో ముఖం పెట్టి కళ్ళలోకి చూస్తోంది..ఆమె ప్రతిబింబం అతని కన్నుల కొలనిలో తామర పువ్వులా వికసించినట్టుగా తోచింది ఆమెకి..నులివెచ్చని ఆతని నిస్శ్వాసల సెగలు ఆమె ముఖాన్ని తాకుతుంటే..చెంపలపై చెక్కర్లు కొడుతున్న చెమట చుక్కలు ఆవిరైపోతున్నాయి..ఆమె ఆధారాలు ఒణుకుతూ విదివడుతున్నాయి,అతని పెదవులకు దారి చుపుతున్నట్టుగా..ముఖాల మధ్య మొహమాటపడుతున్న మొహాన్ని ఆమె స్వాగతిస్తుంటే,
అతను సాగానంపుతున్నాడు..ఒక్కసారిగా ఆమె కౌగిలి చెర నుంచి వదిలించుకుని..
“ఏమైంది బావ..?” నిరుత్సాహపరిచిన అతని మగతనానికి సవాలుగా అడిగింది..
“ఏమీ కాకూడదనే..” తేలిగ్గా చెబుతూ ..మెట్లెక్కి పైకి వేలుతున్నాడతాను.
“ఏ..ఎందుక్కాకూడదు..” అతన్ని అనుసరిస్తూ అంది తను.
“పెళ్ళి కాకుండా ఏంటిది..?”
“ఒక్క ముద్దుకి ..అరిగిపోతావా..తరిగిపోతావా..?” మూతి విరుపు ..
“దేనికైనా మనసుండాలి…అది ఉంటే..నువ్వడగక్కర్లేదు..నేనే..” అని ఆమె ముఖంలో ముఖం పెట్టి..కొరికేసేంత
బిల్డ్ అప్ ఇచ్చాడు..ఆమె గుండె ఒక్క క్షణం ఆగినట్టైంది…గట్టిగా ఊపిరి పీల్చుకుంది..
“నీలో ఇంత రొమాంటిక్ నేచర్ ఉందా బావ..” నడుం గిల్లుతూ అన్నది..
“స్..ఆ…(అరిచి) పాతికేళ్ళు వచ్చాక ఆ మాత్రం రొమాంటిక్ గా ఉండకపోతే ఎలా..పైగా మరదలితో..”అని కన్నుకోట్టాడు.
“సర్లే..చేతిదాకా అందిన కూడు నోటికందదని..మాటల్లో బాగానే చెప్తున్నావ్..చేతల్లోనే ఏమీ చేయవు”అంది కొంటెగా నవ్వుతూ..
“ఎప్పుడు పడితే అప్పుడు చేసేది కాదు రోమాన్స్ అంటే..దానికి ఒక మూడ్ ఉండాలి,ఒక సిట్యువేషన్ ఉండాలి,ఎన్విరాన్మెంట్ కూడా అంతే రొమాంటిక్ గా ఉండాలి..అన్నిటికన్నా ముఖ్యంగా ఒకరినొకరు చూసుకుంటే
థ్రిల్లింగ్ గా ఉండాలి..”
“అంటే ఎలా….?”గోముగా అడిగింది తను..
“మెడ ఓంపుని మెరుపుని మేలి ముసుగుతో కప్పినట్టు ..ఇలా చున్నితో చుట్టేయకూడదు..”అంటూ ఆమె చున్ని తోలిగించాడు..అదిరి పడింది తను.ఆమె మెడ ఓంపుపై మునివేళ్ళతో మీటాడు..అరికాలి నుంచి అమాంతం మస్తిష్కపు అంతరాల్లోకి సర్రున నెత్తురు ప్రవహించిన భావం కలిగింది ఆమెకి..జడని పక్కకి జరిపి చిరు ముద్దు పెట్టాడు..భారమైన తల నుంచి జారిన మైకపు మంచు తునకలు కళ్ళని కమ్మేసినట్టుగా ఉంది తనకి…చూపు చినబోయింది..
తేలికవుతున్న ఆమె దేహాన్ని అదిమి పట్టుకున్న ఆతని పట్టుకి..ఉండ చుట్టినట్టుగా మారిపోయి ,అతని కౌగిలిలో ఒదిగిపోయింది..కాలు దువ్వుతున్న కోరికకి ఆమె బానిస..వాలుతున్న కంటిరెప్పల్లో లిపి లేని లాలస..
“అగేయ్…నజీరా..క్యా కర్తి హే…”(ఒసేయ్..నజీరా ఏం చేస్తున్నావే..) అంటూ అరిచింది వాళ్ళమ్మ .
టక్కు మని ఊహాలోకం నుంచి ఈ మాయలోకం లోకి వచ్చింది తను..ఇదంతా నిజమైతే ఎంత బావుణ్ణు అనుకుంది..
ఇంతసేపు కన్న కలని తలుచుకుని..ఇలాంటి ఒక రోజు వస్తే మాత్రం చచ్చినా మిస్ చేసుకోకూడదు అనుకుంది మనసులో..అమ్మ ఎందుకు పిలిచిందో అని వెళుతూ…
*********
తన గదిలోకి వచ్చి బట్టలు మార్చుకుని..బాల్కాని లోకి వెళ్లి సిగెరెట్ వెలిగించాడు ఇజాక్..దమ్ము మీద దమ్ము ..గుప్పు,గుప్పున పొగ..సిగెరెట్ తాగి..లోపలికొచ్చి ఫ్యాన్ వేసాడు..
మంచం మీద ధబ్బున పడ్డాడు కాసేపు అలా పడుకున్నాడు ఫ్యాన్ కి బూజు పట్టి ఉంది కాబోలు తిరుగుతున్న రెక్కల పై నుంచి జారి కొంత బూజు అతని పెదవిపై పడింది. “థు..థు..”అని లేచాడు.. ఫ్యాన్ ఆఫ్ చేసాడు ..రెక్కల నిండా బూజు, రూమ్ అంతా చూసాడు..ఓ పక్క విడిచిన బట్టలు..ఓ వైపు సాక్స్ ,అండర్వేర్లు గోడల మూలల్లో బూజు. చిరాగ్గా
అనిపించింది అతనికి…లేచాడు చకచకా అన్ని సర్దేసాడు..పాత సరంజామా కొంత ఉంది అదంతా అట్టపెట్టేలో వేసాడు..పనికి రానివి కావు ప్రస్తుతానికి అవసరం లేనివి.
అట్టపెట్టె సగం నిండింది సగం ఖాళీగా ఉంది..
మంచానికి ఒక వైపు ఉంది అట్టపెట్టి.. ఇజాక్ మరో వైపు నుంచి మంచం పై దుప్పటిని లాగి దులిపాడు..అతను లాగిన వెంటనే దుప్పటిపై ఉన్న పుస్తకం అట్టపెట్టెలో పడింది..దుప్పటి వేసాడు.”మ్..ఆల్ క్లియర్..”అని అట్టపెట్టె ఎత్తుకున్నాడు.అందులో పడిన పుస్తకాన్ని అతను గమనించలేదు. పెట్టె భుజానికెత్తుకుని కదిలాడు..స్టోర్ రూమ్ కీస్ తీసుకుని..ఇంటి పెరటి భాగంలో ఉంది స్టోర్ రూమ్..ఇన్ బిల్ట్ లాక్ అది తలుపుకే లాక్ అమర్చి ఉంటుంది. కీ పెట్టి కుడి వైపుకి అర సెంటీమీటర్ తిప్పి మళ్ళా యధా స్థానానికి తిప్పాడు….అన్ లాక్ కాలేదు ..మళ్ళా తిప్పాడు కాలేదు ..అటూ,ఇటూ బలంగా తిప్పాడు..అయ్యింది.. తలుపు తెరిచి లోపలికి కదిలాడు..తాళం తలుపుకే వదిలేసాడు..అది ఇన్నాళ్ళు అతనికి అలవాటు లేని పని చేయటానికి తొలిమెట్టు అని మరికాసేపట్లో తెలుసుకుంటాడు.
లోపలికి వెళ్లి అట్టపెట్టె దించాడు..చేతులు ,భుజం దులుపుకుని తిరిగొస్తుంటే టప్ అని కాలికి తగిలింది పాత మేజా బల్లా..ముందుకు ఒరిగాడు…అలా ఒరుగుతూ తలుపుకి చేతులు ఆనించాడు ఆ ధాటికీ తలుపు మూసుకుపోయింది. కొంప మునిగింది…కానీ అది అతనికి అర్ధం కావటానికి రెండు నిమిషాలు పడుతుంది.
దెబ్బ తగిలిన చోట రుద్దుకుంటూ వచ్చి తలుపు తెరవబోయాడు..అది స్టక్ అయ్యింది.
ప్రయత్నిస్తున్నాడు ….ప్రయత్నిస్తున్నాడు….అటూ,ఇటూ తిప్పుతున్నాడు ఫలితం లేదు..అది ఇక తెరుచుకోదు బయట నుంచి ఎవరైనా తాళం తిప్పి తీయాల్సిందే..
తలుపు కొడదామంటే అమ్మ లేదు….వీధిన వెళ్ళే వాళ్ళకి ఎంత కొట్టినా వినపడదు ఎందుకంటే స్టోర్ రూమ్ పెరటి వైపు ఉంది కాబట్టి. చేసేది లేదు అమ్మ వచ్చే వరకు ఎదురు చూడటం తప్ప…అనుకుని..ఊరుకున్నాడు.. స్టోర్ రూమ్ కిటికీ నుంచి కొంత వెలుగు పడుతుంది లోపల ..అయినప్పటికీ లైట్ వేసాడు.. వాళ్ళ తాతగారి పాత పడక్కుర్చి కనపడింది మొదట అతనికి…దాన్ని అందుకుని ..వేసుకుని కూర్చుని నడుం వాల్చాడు..
టైం గడుస్తోంది..పది నిమిషాలు ..పావు గంట…అర గంట… జైల్లో ఖైదీలా అనిపించింది అతనికి.. లేచి పాత సామానంతా చూస్తున్నాడు ఒక్కోటి అందుకుని..
తను చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలు చూసాడు మురిసిపోయాడు..
దాదాపు 40 నిమిషాలు గడిచింది..అప్పుడు చూసాడు అతను అట్టపెట్టె లో ఉన్న పుస్తకాన్ని.
“ఇది ఇందులో ఎప్పుడు పడింది..బహుశా దుప్పటి సర్దినప్పుడు కాబోలు ”
అనుకున్నాడు..
“సరే..అమ్మ వచ్చేవరకు దీనితో టైంపాస్ చేద్దాం.”అనుకున్నాడు ఉర్దూలో..
పేజీ తిప్పాడు..
అక్షరాలున్న మొదటి పేజీ….

**********************************

1 thought on “తామసి 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *