April 24, 2024

రాజీపడిన బంధం. 12

రచన: ఉమాభారతి

అందరితో నమ్రతగా మెలిగే శ్యాంలో ‘జెంటిల్మెన్’ నైజం ఓ ప్రక్క, పైశాచిక ప్రవర్తనతో నన్ను బాధిస్తున్న తీరు మరో ప్రక్క… నన్ను నిత్యం ఆలోచింపజేస్తుంది.
ఆ ఆలోచనే నన్ను, యూనివర్సిటీ వారి ‘ఆన్-లైన్ డిగ్రీ-కాలేజ్’ – దిశగా నడిపించింది.
నాకున్న బి. ఎస్. సి డిగ్రీ నేపథ్యంలో, నేరుగా ‘హ్యూమన్ సైకాలేజీ ‘ కాలేజ్ కోర్సులు తీసుకొంటున్నాను. కేవలం నా వ్యక్తిగత ఆసక్తి తోనే, ఆరు నెల్లగా అలా చదువు సాగిస్తున్నాను. ఎంత సమయం వెచ్చిస్తే అంత త్వరగా డిగ్రీ పొందవచ్చు.
నా ‘కోర్స్ ఆఫ్ స్టడీ’ లో భాగంగా, భిన్న వ్యక్తిత్వాలు, విభిన్న ప్రవృత్తుల గురించి వాస్తవాలు సమగ్రంగా చదువుతున్నాను. తెలుసుకొంటున్నాను. సైకాలజీ విద్యార్దినిగా నా ఆసక్తికి తగ్గ పరిశోధన చేయగలుగుతున్నాను. ప్రస్తుతానికి, మా పట్ల శ్యాం ప్రవర్తన అర్ధం చేసుకొనే యత్నంలో భాగమే ఈ చదువు, పరిశోధన కూడా.
పదే పదే దౌర్జన్య పూరితంగా ప్రవర్తించడం, ఎక్కువుగా తన భార్యనైన నా పట్ల, లేదా పసివాళ్ళ పట్ల, లేదా మూగజీవుల పట్ల అలక్ష్యంగా మసలుకోడం, ఖతారు లేకుండా మమ్మల్ని ఉద్దేశపూరితంగానే గాయపరచడం – స్పష్టంగా శ్యాం ప్రవర్తనలో నాకు కనబడుతున్నాయి.
శ్యాం వ్యక్తిగా బయటికి, బయటవారికి గొప్పగా కనబడినా అతనిలో ఓ ‘శాడిస్ట్’ నైజం తప్పక ఉందని నా అభిప్రాయం…. పిల్లల పట్ల అతనిది పుత్రోత్సాహం అనో, అత్యోత్సాహమనో కొందరనవచ్చు…. మరి అదైనా, బిడ్డలకి తండ్రివల్ల చేటే కాదా?…
నా దృష్టిలో, అతనికి నిపుణుల సలహాసహకారాలు చాలా అవసరం. అలాగని నేను శ్యాం వద్ద ప్రస్తావించే ఆశ లేదని కూడా నాకు తెలుసు.
**
ఏదైనా, ఈ అసమాన పరిస్థితి నుండి ముందు మమ్మల్ని మేము రక్షించుకోవాలంటే, ఓ ఫామిలీ లాయర్ ని సంప్రదించాలి. ఈ చుట్టుపక్కల శ్యాం పలుకుబడి ఎక్కువే కాబట్టి, కాస్త దూరంలో ఉన్న వారిని సంప్రదించాలని నిశ్చయించుకొన్నాను.
శ్యాం గురించి కాని, నా సమస్యల గురించి కానీ, అనుసరించబోయే న్యాయనిపుణుల సలహాలు గానీ వీలయినంత గుంభనంగా ఉంచుదామనే నా ఆశ. చిత్ర ఆనంద్ ల నుండి కూడా.
తన వృత్తినైపుణ్యంతో చిత్ర గ్రహించగలిగినంత ఎలాగూ గ్రహిస్తుంది. అంతేతప్ప, అగ్నిగుండం లాంటి నా జీవితంలోని మరెన్నో వివరాలు చిత్ర ఊహించలేదనే అనుకుంటాను.
నా సమస్యల పరిష్కార దిశగా మొదటి అడుగు వేశాను. ఆగ్రాకి వెళ్ళే దారిలో ఓ పేరున్న లాయర్ – రాఘవ శర్మ వద్ద ఎపాయింట్మెంట్ తీసుకొన్నాను. నాలుగు వారాల సమయం ఉంది.
**
తెల్లారుఝాము నుండి మళ్ళీ వేద ఊపిరందక, దగ్గుతూ బాధపడసాగింది.
పొద్దున్నే డాక్టర్ వచ్చి చూసారు… స్వల్పంగా ‘ఎలర్జిక్ బ్రాంకైటిస్’ లా ఉందని నిర్ధారించారు. నర్స్ ని పిలిపించి, ఇంటివద్దనే చేయగల వైద్యం – నెబ్యులైజర్ మాస్క్ వేయించారు… దాంతో సర్దుకుంది వేద…..
నామకరణం నాడు పొలమారినప్పటి నుండి పాప ఇంకా కోలుకోలేదనిపించింది. కాని ఇప్పటి పరిస్థితి పాపకి స్వతహాగా ఏర్పడ్డ ఆరోగ్యపరమైన ఇబ్బందని చిత్ర వివరించింది…
పసిదాని అవస్థ నన్ను బాగా కృంగదీస్తుంది….
**
కంప్యూటర్ ని నా పరిశోధనలకే కాదు. రమణి, చిత్రలతో అప్పుడప్పుడు సుదీర్ఘ సంభాషణలకి కూడా ఉపయోగిస్తున్నాను. మా మధ్య సాగే స్నేహపూరిత సంభాషణలు మనసుని తేలిక పరుస్తున్నాయి.
అత్తయ్యకి, మామయ్యకి అంతర్జాలంలో చదివిన విషయాలు, విశేషాలు చెబుతుంటాను. అత్తయ్య ఈ మధ్య కొత్తరకం వంటకాల కోసం ఇంటర్నెట్ చూడమంటున్నారు.
**
సందీప్ ఐదవ తరగతికి వచ్చాడు. కాస్త పొడవయ్యాడు. రొజూ స్విమ్మింగ్ చేయమని మాత్రం ప్రోత్సహిస్తాను. అప్పుడప్పుడు నా ఎదురుగా, ఆనంద్ – శ్యాం లతో టెన్నిస్ ఆడుతాడు కూడా.
కొత్త మెడికల్ రిపోర్ట్ ప్రకారం, వాడి ఎడమ కంటి చూపు నెమ్మదిగా మెరుగవ్వడం సంతోషంగా ఉంది. మరోప్రక్క, వేద తరచుగా ఊపిరందక బాధపడ్డం నాకు బెంగగా ఉంది.
**
సోమవారాలు శ్యాం చాలా బిజీగా ఉంటారని తెలిసే రాఘవ శర్మ గారితో నా అపాయింట్మెంట్ సోమవారానికే పెట్టుకున్నాను..
పెందరాలే పని ముగించి విశాలకి, అత్తయ్యావాళ్ళకి, పాప బాధ్యత అప్పజెప్పి బయలుదేరాను. సందీప్ ని స్కూల్లో దిగవిడిచి లాయర్ గారి ఆఫీసు దారి పట్టాను.
దారిలో ‘యానిమల్ షెల్టర్’ కి వెళ్లాను. వచ్చిన చందాలు, ఖర్చులు లెక్క చూసి బ్యాంక్ డిపాజిట్ కి పంపాను. ఎంత చందాలు వచ్చినా మూగజీవుల పరిరక్షణకి ఇంకెంతో సహాయ సహకారాల అవసరం ఉంది. అకౌంట్స్ చూస్తూ ఈ సారి నుండి, నా వంతుగా మరింత చేయూతనివ్వాలని అనుకున్నాను.
అక్కడ పని కూడా రెండు గంటల్లో ముగిసింది. బయలుదేరి పావుగంటలో లాయర్ గారి ఆఫీసు చేరాను.
**
రాఘవ శర్మ గారి ఆఫీసురూములో ఐదునిముషాలుగా ఎదురు చూస్తున్నాను. నేను చెప్పేది విని లాయర్ గారు ఏమంటారోనని ఆదుర్దాగా ఉంది
మరికాసేపటికి, పనివాడు కాబోలు… ట్రేలో మంచినీళ్ళ గ్లాసులు తెచ్చి, బల్లమీద ఉంచాడు. ఆ వెనుకాలే మరో వ్యక్తి లోనికి వచ్చారు.
రూంలోకి వస్తూనే, “ఏమ్మా నీలా, చాలా దూరం నుంచే వస్తున్నావు” అన్నారాయన… లేచి నిలబడి నమస్కరించాను.
“కూర్చో. కాఫీ ఏమన్నా తీసుకుంటావా?” అంటూ ఎదురుగా సీట్లో కూర్చున్నారు రాఘవ గారు.
“వద్దండీ, నీళ్ళు చాలు” అంటూ కూర్చుని, బల్లమీద మూత వేసున్న గ్లాసు నుండి కాసిన్ని మంచినీళ్ళు తాగాను.
నుదుటి మీద విభూతి రేఖతో ప్రశాంతంగా ఉన్న ఆయన ముఖం చూసాక, మనసులోని ఆదుర్దా కాస్త తగ్గింది.
పూర్తి వ్యక్తిగత ఘర్షణలు మినహాయించి, ఆయనకి విషయాలన్నీ నిర్మొహమాటంగా చెప్పాను. నేను చెప్పింది ఓపిగ్గా విన్నారు. కాసేపు ఆలోచించారు. కొన్ని ప్రశ్నలు వేసి నానుండి జవాబులు రాబట్టారు.
“న్యాయపరంగా ఈ సమస్యకి పరిష్కారం అనేది, నీ విషయంలో అంత సులభం కాదు. ఎందుకనంటే, మానసికంగా నీ వాళ్ళతో నీవు వేరవలేవు.
కానీ బౌతికంగా నీకు వేర్పాటు కావాలి.
కాబట్టి, నీవు విడిగా ఉండాలని కోరుకుంటున్నావని కారణాలతో సహా నీ భర్తతో పాటు అత్త మామలకి చెప్పాలి. ఆ ఆపైన కోర్టులో ‘లీగల్ సెపరేషన్’ కి పిటీషన్ పెట్టవచ్చు. అంటే ‘న్యాయబద్దమైన వేర్పాటు’ అనుకో” అన్నారాయన.
“అయితే, వాళ్ళు దానికి ఒప్పుకుంటేనే పిటీషన్ వేయవచ్చని కాదు. నీ విషయంలో, ‘విడాకులకి’ ప్రత్యామ్న్యాయం ఇటువంటి వేర్పాటు అని నా అభిప్రాయం. వేరుగా ఉంటూ, సమస్య పరిష్కరించుకునే వ్యవధిని పొందవచ్చు” ఓ క్షణం ఆగారు.
‘లీగల్ సేపెరేషన్’ క్రింద వేరే నివాసం ఏర్పరుచుకోవాలి. ఆర్ధిక వ్యవహారాలు నిర్ధారించుకోవచ్చు. అక్షరాల అయితే, సెపెరేషన్ పిటీషన్ వేసాక, విడాకులు తీసుకొనే ప్రయత్నంలో ఉన్నట్టన్నమాట. అలాగని తప్పకుండా విడాకులు తీసుకోవాలని అంక్ష ఏమీ లేదు. కొంతకాలం సమస్యపై పునరాలోచనకి వెసలుబాటు ఉంటుంది. ఈ లోగా సమస్య తీరిపోవచ్చు. లేదా దూరంగా ఉంటూ కొంత సమయం వెళ్ళబుచ్చనూవచ్చు” అంటూ నా వంక చూశారు.

“ఇలా అయితేనే, నీకు, నీ పిల్లలకి బౌతికంగా నీ భర్త నుండి రక్షణ ఉంటుంది. ఓ తండ్రిగా అతనికి నిర్దిష్ట సమయాల్లో, నీ ఇష్టప్రకారం మాత్రమే మీ పిల్లలతో మెలిగే అవకాశం ఉంటుంది” అని ఆయన వివరించారు.
ఆయన చెప్పే ప్రతిమాట జాగ్రత్తగా వింటూ ఆలోచించసాగాను.
కొద్దిపాటి మౌనం తరువాత, “నీ భర్త ప్రవర్తన ఇంత తీవ్రంగా మిమ్మల్ని బాధిస్తుంటే, ఆయన్ని ముందుగా ఫామిలీ కౌన్సలింగ్ కి ఒప్పించాలి. అవసరం మేరకు నిపుణులని సంప్రదించవచ్చు. అప్పుడుకాని నీ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరక్క పోవచ్చు” అని నిష్కర్షగా చెప్పేసారాయన.
అన్ని విషయాలు ఆలోచించి మళ్ళీ కలుస్తానని, ఆయన వద్ద శలవు తీసుకొని తిరుగుముఖం పట్టాను.
లాయరు గారు పెద్దాయన. మంచివారిలా నా పట్ల సానుభూతితో ఉన్నారనిపించింది.
**
జనవరి నెల వచ్చేసింది. వాతావరణం చల్లగా బాగుంది. వేదని చూసే నెపంతో రాత్రి తొమ్మిదయ్యాక, శ్యాం నా గదిలోకి రావడం, నాతో మాటలు కలపడం చేస్తున్నారు. సాయంత్రాలు హాలు మధ్యలో పాపని ఉంచి, ఇంటిల్లిపాదీ ఆడుతుంటారు. అందరినీ గమనిస్తూ జానకి సాయంతో వంటపని చూస్తుంటాను. వేదతో ఆడుతున్నప్పుడు, చెల్లిని సుకుమారంగా చూసుకోవాలని సందీప్ కి సూచిస్తుంటాను.
ప్రతిరోజు పాపతో కాసేపు ఆడి, కబుర్లు చెప్పిగాని పైకి వెళ్ళరు శ్యాం..
వేద పది నెలలప్పటి నుండే అడుగులు వేస్తుండడంతో, నాతో పాటు శాంతమ్మ కూడా నిత్యం దాని వెన్నంటే ఉంటుంది.
త్వరలోనే వేద మొదటి పుట్టినరోజు కూడా.
**
ఆదివారాలు పొద్దుటి నుండే మధ్యాహ్న భోజనాల ఏర్పట్లల్లో ఉంటారు అత్తయ్య.
చిత్ర, ఆనంద్ మామూలుకన్నా కాస్త ముందుగానే వచ్చారు. పాలక్ పనీర్, చనా-బతూర చేసి తెచ్చింది చిత్ర. నేను ఎప్పటిలా మెంతికూర కైమా, వెజిటబిల్ ఫలావ్ చేసాను. అదే చేత్తో క్యాండి, మిండి లకి కూడా మట్టన్ రైస్ వండేసాను.
భోజనసమయంలో వేద పుట్టినరోజు విషయం ప్రస్తావనకొచ్చింది.
నేనేమంటానోనని అంతా నా వంకే చూస్తున్నారు. ఆలోచిస్తూ మిన్నకుండిపోయాను.
వేద తరుచు అనారోగ్యం పాలవడమే కాక.. లాయర్ గారు సూచించిన ‘వేర్పాటు’ వెసలుబాటు ద్వారా పిల్లలతో విడిగా ఉండాలన్న నా ఆలోచన కూడా గుర్తొచ్చింది. వేడుకలు, ఆర్బాటాలు చేయాలనిపించడం లేదని… బయటకి అందరితో అన్నాను కూడా…

ఒకింత నిశ్శబ్దత తరువాత, “అలాగే నీలా, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యనే కేక్ కట్ చేసి ఆశీస్సులు తీసుకుంటుంది మన వేద. ఈ మధ్య పాపం రెండు సార్లన్న జబ్బుపడింది కదా! మళ్ళీ ఆ పార్టీ హడావిడి, గోల వద్దులేమ్మా” అన్నారు మామయ్య.
మిగతా వాళ్ళంతా అర్ధం చేసుకొని మామయ్య మాటలతో ఏకీభవించారు.
**
భోజనం తరువాత, టి. వి చూస్తూ ఐస్క్రీం తింటున్నారంతా. వాళ్ళ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఎదురుగా కొత్తగా నిర్మాణమైన పార్క్ లో సంక్రాంతి పండుగ ఏర్పాట్ల గురించి చెప్పసాగారు ఆనంద్.
పతంగీలు ఎగరవేయడానికి భిన్న ఎత్తుల్లో వెడల్పుగా గోడలు నిర్మాణం చేసారని, అక్కడ జరగబోయే మొదటి పతంగీ-పండుగ పోటీల్లో చాలామంది పాల్గొనబోతున్నారని ఆనంద్ చెబుతుంటే, సందీప్ ఉత్సాహంగా విన్నాడు.
“మేమూ పోటీలో ఉండవచ్చా అంకుల్?” అని అడిగాడు సందీప్.
“తప్పకుండా పాల్గొనవచ్చు.. పతంగీలు ఎగరవేయడంలో నేను ముందుంటాను. మన కాంప్లెక్స్ కి సరిగ్గా ఎదురు గేటు.. రేపే వెళ్ళి మన పేర్లు ఇచ్చి వస్తాను” అని ఆనంద్ ప్రోత్సహించడంతో, తన ఫ్రెండ్స్ కి చెప్పాలంటూ వెళ్లాడు సందీప్.
అమ్మావాళ్ళకి వేద పుట్టినరోజు విషయం చెప్పాలంటూ ఫోన్ అందుకున్నారు అత్తయ్య..
“హలో రాజ్యం వదినా, వేద పుట్టినరోజుకి… అమ్మమ్మతాతయ్యల ఆశీర్వాదాలు కూడా కావాలంటుంది.. సంక్రాంతి సెలవలు కూడా కలిసొస్తాయిగా! అన్నయ్యగారు, మీరూ, వినోద్ సహా తప్పక రండి” అంటూ అమ్మావాళ్ళని ఆహ్వానించారామె.
హాల్లో పుట్టినరోజు ప్లానింగ్ అయ్యాక… చిత్ర, నేను పాపతో సహా నా గదిలో చేరాము.
వేదని బోర్లా వేసి నెమ్మదిగా జోకొడుతున్నాను.
“మన రమణి గురించి తెలిసిందా? అడిగింది చిత్ర. లేదన్నట్టు తలూపాను. “ఇవాళ పొద్దున్నే, చెప్పింది మంచి వార్త.. నీకూ ఫోన్ చేస్తానంది” అంది.
“అవునా.. చేసే ఉంటుంది.. చూసుకోనుండను.. నేనే చేసి మాట్లాడుతా” అన్నాను.
నిత్యం శ్యాం నుండి వేర్పాటు ఆలోచనల్లో మునిగి ఉండడంతో.. ఫోన్ కాల్స్ కూడా చూసుకోడం లేదన్నమాట అనుకుంటూ “మంచి వార్త అంటే… ” అడిగాను..
“త్వరలో తల్లి కాబోతుంది… అందునా.. ” అంటూ ఆగిపోయింది.. ” సరేలే మాట్లాడుతావుగా” అంది చిత్ర..
“ఆహా, మంచిదేగా! ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటుందని తెలుసు కదా!” అన్నాను.
“అవును, అదంతా అయ్యింది. ఇకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది రమణి” అంది చిత్ర.
**
సాయంత్రం టీ తాగి చిత్ర, ఆనంద్ వెళ్ళిపోయాక, హాల్లో కూర్చునున్న అత్తయ్యా వాళ్ళ వద్దకి వెళ్లాను. శ్యాం కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళ ముగ్గుర్నీ ఉద్దేశించి, “కాసేపు విశ్రాంతి తీసుకొని ఏడు గంటల సమయంలో ఇక్కడే కలుద్దాము. మీ అందరితో ముఖ్యమైన విషయం మాట్లాడాలి” అనేసి నా గదిలోకి వెళ్ళిపోయాను.
నిద్రపోతున్న వేద పక్కన వొరిగి, కొద్దిక్షణాలు కళ్ళు మూసుకున్నాను….
శ్యాం అంటే చిరాకు, అయిష్టం తప్ప భయమేమీ లేదు. అత్తయ్య మామయ్య అంటే గౌరవం. వారి పరువు ప్రతిష్టలకి భంగం కలగకుండా, వీలయినంత సులభమైన ఓ ఏర్పాటు గురించి చెప్పడమే కదా. నా క్షేమం, నా బిడ్డల క్షేమం మాత్రమేగా నేను కోరుకునేది… అని సరిపెట్టుకున్నాను.
ఈ మధ్య, శ్యాం నాతో మాటలు కలపడం అదీ గమనించి, మళ్ళీ ఏదొక దుర్ఘటన జరిగే అవకాశం కల్పించదలుచుకోలేదు. నా ‘లీగల్ సేపెరేషన్’ నిర్ణయం గురించి ఇంట్లో వాళ్లకి చెప్పడం మంచిదని భావించే ఇలా అందరితో మాట్లాడుతానని సూచించాను అని నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను..
**
సాయంత్రమవుతుండగా జానకితో రోటి, కర్రీ చేయించి, ఆవిడని పంపేసాను. సందీప్ తన రూంలో కంప్యూటర్ మీద ఉన్నాడు. అక్కడే ఉన్న విశాలకి వేదని అప్పజెప్పాను. గది తలుపులు వేసుకోమన్నాను. ఇక డిస్టర్బ్ చేయరు.
**
శ్యాం, అత్తయ్య, మామయ్యా అంతా హాల్లో ఉన్నారు. వెళ్ళి వారి ఎదురుగుండా కూర్చున్నాను. ముగ్గురినీ ఉద్దేశించి, మొదటి నుంచీ నాకు వ్యక్తిగతంగా కష్టం కలిగించి, బౌతికంగా బాధ కలిగించిన సంఘటనలు ఏకరువు పెట్టాను.
నేను మెట్ల మీద నుండి పడిపోయిన సంగతి ప్రస్తావించి, “అది శ్యాం చెప్పిన అబద్దం అత్తయ్యా, ఆయన నాకు విధించిన శిక్ష. ఎన్నో సార్లు నా పై దౌర్జన్యం చేసినా, నేను ప్రతఘటించింది మాత్రం అదే మొదటిసారి. అందుకే నన్ను గాయపరిచి, నేనే జారి పడినట్టు అందరిని నమ్మించారు” అన్నాను.
“ఇకపోతే, నా బిడ్డలకి ఎన్నిసార్లు తండ్రి వల్ల హాని జరిగిందో, మీకు ప్రత్యక్షంగా తెలుసు. చూసారు కూడా. నిజానికి ఇప్పుడు నా జీవితాన ప్రతినిముషం భయాందోళనలతో గడుపుతున్నాను. నా బిడ్డల క్షేమం నాకు ముఖ్యం మామయ్యా” అని ఓ క్షణం ఆగాను.
ఇదంతా వింటూ శ్యాం మాత్రం ముడిపడిన భ్రుకుటితో కిందకి చూస్తూ గంభీరంగా ఉన్నారు.
“మీకు గాని, శ్యాంకి గాని, మా కుటుంబానికి గాని ‘విడాకుల’ అప్రతిష్ట రాకుండా ఓ ఏర్పాటు ఆలోచించాను. న్యాయపరంగా ఆ ఏర్పాటుని ‘లీగల్ సేపెరేషన్’ అంటారు. నేను పిల్లలతో బయట వేరే ఇంట్లో ఉండవలసి వస్తుంది. కొంతకాలం ఇలా సాగవచ్చన్నారు లాయర్.
నాకు, నా పిల్లలకి శ్యాం నుండి పూర్తి స్వేచ్చ, రక్షణ కోరుకుంటున్నాను. ఆయనకి నా మీద భర్తగా ఎటువంటి అధికారం ఉండకూడదు. దౌర్జన్యం చేసే వీలు లేకుండా ఉండాలి” అన్నాను ధృడంగా.
ఓ సారి కళ్ళెత్తి ధైర్యంగానే శ్యాం వంక చూసాను. “నా కనుసన్నలలోనే ఆయన పిల్లలతో మెలగాలి. వాళ్ల పట్ల ఆయన తన బాధ్యతలు నిర్వహిస్తే అభ్యంతరాలు ఏమీ ఉండవు. ఓ కోడలిగా మీ పట్ల నా బాధ్యతలు, గౌరవాలు అన్నీ యధాతధం. పిల్లలు మీ కళ్ళ ముందు మీ మనమలుగానే పెరుగుతారు. అందుగ్గాను నివాసానికి దగ్గరిలో నిర్మాణంలో ఉన్న ఒక ఇల్లు కొనవచ్చునని నా ఆలోచన.
వేద పుట్టినరోజు అవగానే ఈ ఏర్పాటు విషయమై మరిన్ని వివరాలు మీ ముందుంచుతాను. శ్యాం కూడా సహకరించాలి. ఈ ఏర్పాటు తనకి వద్దనుకుంటే మాత్రం, అది ఆయన ఇష్టం. నేను నా నిర్ణయంతో ముందుకి సాగిపోతాను.. ఆయనతో కలిసి ఉండే ప్రసక్తి మాత్రం లేనట్టే” అన్నాను.
క్షణంసేపు చెప్పడం ఆపాను.
అత్తయ్యావాళ్ళని ఉద్దేశించి, ధుఖాన్ని ఆపుకుంటూ చేతులు జోడించాను. “మీరు కూడా నన్ను అర్ధం చేసుకొని సహాయ పడతారని ఆశిస్తున్నాను” అంటూ పైకి లేచాను.
కళ్ళు తుడుచుకుని, “మరో సారి టీ తాగుతారా?” అని నెమ్మదిగా అడిగి అక్కడి నుండి కదిలాను.
**
వేద పుట్టినరోజు పండుగకి రెండురోజులు ముందే వచ్చారు అమ్మావాళ్ళు. వినోద్ వచ్చినప్పటి నుండి శ్యాంతో, యూనివర్సిటీల గురించి సంప్రదిస్తున్నాడు. మంచి రాంకింగ్ వస్తే ఢిల్లీకి వచ్చి చదువుకోవాలని ఆశపడుతున్నాడు..
అమ్మావాళ్ళు వచ్చారన్న సంతోషం అత్తయ్యలో కనిపించకపోవడం గమనించాను. అత్తయ్య స్తబ్దుగా ఉన్నారు. అమ్మతో కూడా మునపటిలా లేరు. మామయ్య ముభావంగా ఉన్నారు. శ్యాం అయితే, ఎవరి వంకా సూటిగా చూసి మాట్లాడ్డం కూడా లేదు. పెద్దవాళ్ళందరిలో మా విషయంగా కొంత నైరాశ్యం చోటుచేసుకుందని అనిపించింది.
రాత్రి భోజనాలయ్యాక తమ గదిలోనికి పిలిచి అమ్మ నన్ను నిలదీశింది. అసలు విషయం ఏమిటని, ఏమయిందని అడిగింది.. చెప్పేసేయడమే మంచిదని… నేను లాయర్ వద్దకి వెళ్ళిన విషయం అమ్మావాళ్ళకి చెప్పాను.. “నాకూ కాస్త దిగులుగానే ఉంది. కానైతే, బూటకపు దాంపత్యాన్ని, పిల్లల విషయంగా అభద్రతని కూడా భరించలేను కదా!… నేనైనా, లేని కారణాలతో కాపురాన్ని పాడు చేసుకునేటంత అవివేకిని కాను…. ఈ సంఘటనలన్నీ యాదృచ్ఛికంగా జరిగాయా? నిజంగా శ్యాం అమాయకుడా? అని కూడా ఆలోచించాను. ‘కాదనే’ జవాబు తేలుతుంది” అన్నాను. విని ఇద్దరూ నిశబ్దంగా ఉండిపోయారు…
దిగులు మాని ప్రశాంతంగా పడుకోమని చెప్పి బయటపడ్డాను.
***

పొద్దుటే లేచి అనడరికీ ఇష్టమైన ఫలారాలు సిద్దం చేసాను… కాఫీ, టిఫిన్లు అయ్యాక, మాటలు కలుపుకుని పండుగ పిండివంటలు చేయడంలో నిమగ్నులయ్యారు అమ్మా, అత్తయ్యా. తత్తిమా వారంతా ఎవరి కాలక్షేపంలో వాళ్ళున్నారు….
మరోవైపు… ఓ డజనుకి పైగా పతంగీలు వరండాలో పరిచి, పొద్దున్నే వాటికి అలంకారాలు మొదలు పెట్టారు సందీప్, వాడి ఫ్రెండ్స్. పతంగీల పంపకాలు, మాంజాల మాటలే వినబడుతున్నాయి. వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే అందరికీ ముచ్చటేసింది.
నిద్రలేచిన దగ్గరినుంచి వేద మాత్రం చిరాగ్గా ఉండడంతో, పని ముగించి నేను మాత్రం దాన్ని కనిపెట్టుకుని గదిలోనే ఉండిపోయాను.. కాసేపు గార్డెన్ లో తిప్పి, బలవంతంగా కాసిని పాలు మాత్రం తాగించగలిగాను. ఓపిక వచ్చాక, అందరితో సాయంత్రం వరకు ఆడుతూనే ఉంది..
**
అర్ధరాత్రవుతుండగా, ఇబ్బంది పెట్టే దగ్గుతో పాటు, ఊపిరాడక తలకిందులవ్వడం మొదలుపెట్టింది వేద. డాక్టర్ కి ఫోన్లు చేస్తూనే మామయ్యవాళ్ళని నిద్రలేపాను. శ్యాంతో సహా ఉన్నపళంగా హాస్పిటల్ చేరాము.
అడ్మిట్ చేసి, బ్రాంకో డయలేటర్స్ మీద ఉంచి, వైద్య పరీక్షలు చేయసాగారు.
ఆదుర్దాగా అందరం కొన్ని గంటల పాటు అక్కడే ఉండిపోయాము….
మధ్యాహ్నానికి కాని కాస్త తేలికవ్వలేదు వేద పరిస్థితి.
రిపోర్ట్స్ వచ్చాక, శ్వాసేంద్రియాల్లో వాపు వల్ల, ఊపిరందడం లేదని తేల్చారు… డాక్టర్లు. ఉబ్బసం (asthmatic bronchitis) వ్యాధి లక్షణాలు ఉన్నాయన్నారు. వయస్సు పెరిగి బలం పుంజుకుంటే, ఒక్కోసారి నయమయిపోతుందట. లేదంటే పాప ఎదిగాక మరిన్ని పరీక్షలు చేసి, సమస్యకి కారణాలు ధృవీకరించవచ్చన్నారు.
జన్యు సంబంధిత వ్యాధి కాని, లోపాలు కానీ కనబడలేదని, ప్రాణాపాయం లేదని చెప్పారు. ఈ సంఘటనల వల్ల ప్రాణహాని ఉండకపోవచ్చని కూడా సూచించారు… కాకపోతే, తరుచుగా పాప ఇలా అవస్థ పడుతుంది కనుక అతి ప్రయాసలు లేకుండా ఉంచితే మంచిదన్నారు. పాప పరిసరాల్లో రసాయనక ద్రవ్యాలు లేకుండా జాగ్రత్త పడమన్నారు. మందులు రాసిచ్చి డిశ్చార్జ్ చేసారు..
**
హాస్పిటల్ నుండి ఇల్లు చేరేప్పటికి, సాయంత్రం ఏడు దాటింది. టైం ప్రకారం వేదకి మందులు వేసి పడుకునేప్పటికి రాత్రి పదయింది. అలిసిపోయిన నేను, వేద కూడా అడ్డంపడి నిద్రపోయాము.
**
హాల్లో హడావిడికి మెలుకువచ్చింది. అమ్మా, అత్తయ్య గదిలోకి వస్తూ కనిపించారు. బెడ్ మీద నుంచి లేవబోతే, తూలి పడబోయాను. అమ్మ సాయంతో నిలదొక్కుకుని, తిరిగి మంచం మీద కూర్చున్నాను.
“ఏమ్మా నీలా, టైం పదకొండయ్యింది. వేదకి పాలు పట్టి, మందు వేసాము….. ఇక పోతే, హాల్లో అల్లరి వినబడుతుందిగా!. సందీప్ ఫ్రెండ్స్ వచ్చారు. మరి నువ్వు పిల్లలతో పార్క్ కి వెళ్ళే స్థితిలో ఉన్నావా?”, “నిన్ను చూస్తే బాగా నీరస పడిపోయావు. నీ వొళ్ళు వేడిగా కూడా అనిపిస్తుంది” నా తలపై తాకుతూ అడిగింది అమ్మ.
“ఏమోమ్మా! ఆలోచిస్తాను. నేను లేకుండా సందీప్ ఎక్కడికీ వెళ్ళడుగా” నా మాట నూతిలోలా వినిపించింది.
అత్తయ్య వచ్చి పక్కన కూర్చున్నారు… ”చూడు నీలా, శ్యాం మీదే నీకు అపనమ్మకం అని తెలుసు. నీ కారణాలు నీకున్నాయి. నీ నిర్ణయాలతో ముందుకు సాగిపోతున్నావు. వాడినుండి పిల్లల్ని కూడా దూరంగా ఉంచబోతున్నానని నీవే అంటున్నావు. శ్యాం చాలా కుమిలిపోతున్నాడు” క్షణమాగారు.
“ఏమైనా, ఈరోజు నీ తమ్ముడు, ఆనంద్, మీ మామయ్య, నాన్నగారు, పదిమంది పనివాళ్ళు కూడా పిల్లల వెంట ఉన్నారు. కాబట్టి, ముఖ్యంగా సందీప్ ని నిరుత్సాహ పరచకు. వాళ్ళని వెళ్ళనివ్వు. సాయంత్రం వాళ్ళు తిరిగొచ్చాకే, వేద చేత కేక్ కోయించి పార్టీ చేద్దామని చెప్పాను కూడా” అన్నారత్తయ్య.. .
మౌనంగా విన్నాను. లేచి వెళ్ళి ముఖం కడుక్కుని వచ్చేలోగా, అమ్మ వేదని నిద్ర లేపింది.
హాల్లో నుండి చిత్ర అనందుల గొంతులు వినవస్తున్నాయి..
“హలో, వేద నిద్ర లేచిందా?” అంటూ చిత్ర గదిలోకి వచ్చి అమ్మ పక్కనే కూర్చుంది. నన్ను చూసి, జ్వరంవచ్చిన దానిలా నీరసంగా ఉన్నానంది. ఔనన్నాను. లేచి నడిచే సత్తువ కూడా లేదన్నాను. వేద ఆరోగ్య విషయంగా హాస్పిటలుకి వెళ్ళి వచ్చిన సంగతి వివరించాను. తనకి రాత్రే చెప్పనందుకు నొచ్చుకుంది చిత్ర..
**
తానూ వెంట లేకుండా సందీప్ తన ఫ్రెండ్స్ తో, పార్క్ కి వెళ్ళడం సంగతి చిత్రతో ప్రస్తావించాను. కాస్త సంశాయంగా ఉందని కూడా అన్నాను.
శ్రద్దగా విన్నది చిత్ర. “మరేం పర్వాలేదు… మా కాంప్లెక్స్ ఎదురుగా కొత్త పార్క్ లోనేగా ఈ సంక్రాంతి ఫెస్టివల్ జరుగుతుంది. ఇప్పుడు నేను, ఆనంద్ పిల్లలతో వెళతాము. పతంగీలంటే పిల్లలతో సమానంగా ఆడతాడు ఆనంద్. నువ్వు మా వెంట వచ్చినా మా ఫ్లాట్లో ఉంటావు. రోజంతా సందీప్ వెంట తిరగవుగా! కాబట్టి బెంగపెట్టుకోకు. అక్కడ మరే అవసరమున్నా నేను చూసుకుంటాను. అయినా ఇంత సైన్యం ఉందిగా మన వెంట. పిల్లలు సరదాగా ఆడి వస్తారు. సరేనా?” భరోసా పలికింది చిత్ర.
మౌనంగానే విన్నాను.
“అసలు, ముందుచూపుతో, పార్టీ అదీ వద్దని నువ్వు మంచి నిర్ణయం చేసావు నీలమ్మా…. వేద కూడా బాగా అలిసిపోయింది. సాయంత్రం వరకు వేద, నువ్వు రెస్ట్ తీసుకోండి. దాని ఆరోగ్యం కూడా త్వరలోనే బాగయిపోతుందిలే. సో, చీర్ అప్”.. అంటూ లేచి… పదమంటూ చేయందుకుంది చిత్ర.
హాల్లోకి నడిచాము. ఇంతటి నీరసం ఎన్నడూ అనిపించలేదు. కాస్త తూలుతూ అడుగులో అడుగు వేస్తున్నాను.
**
సందీప్ పరిగెత్తుకుని నా వద్దకు వచ్చాడు. ”పది సార్లు వచ్చాను మమ్మీ. నువ్వు నిద్ర పోతున్నావు. మేమంతా రెడీ. ఆనంద్ అంకుల్ కూడా వచ్చేసారు…. మేమెళ్ళమా? నువ్వూ వస్తావా?” అడిగాడు.
రాలేనంటూ, వాడికి జాగ్రత్తలు చెప్పాను. వినోద్ కి, ఆనంద్ కి కూడా ‘సందీప్ జాగ్రత్త’ అని సూచించాను… ఆ పై ఇక చేసేది లేక, నవ్వుతూ అందరికీ వీడ్కోలు పలికాను.
వేదకి తలార స్నానం చేయించి, కొత్త బట్టలు వేయించారు అమ్మావాళ్ళు. ఫారెక్ష్ తిని విశాలతో హాయిగానే ఆడుకుంటుంది. కాఫీ తాగి, అమ్మావాళ్ళ బలవంతం మీద ఏదో తిన్నాననిపించి, తలపోటుకి మందు వేసుకుని పడుకొన్నాను.
**
గాఢ నిదురలో ఉన్న నన్ను ఎవరో గట్టిగా కుదిపి లేపుతున్నారు……
మగతగా కళ్ళు తెరిచాను…. ఎదురుగా అత్తయ్య…
“నిన్ను అర్జంటుగా రమ్మంటున్నారు… ” హైరానాగా అత్తయ్య గొంతు.
ఉలిక్కి పడి లేచి, చీర, జుత్తు సర్దుకొని బయటకి నడిచాను…
వాకిలి దగ్గర నాకోసం తచ్చాడుతూ ఆనంద్ కనబడ్డారు…
నన్ను చూడగానే, “త్వరగా పద నీలా” అంటూ వడిగా నడుస్తున్న అతన్ని అనుసరించాను.
కార్లో కూర్చుంటూ, “ఏమిటి విషయం? సందీప్, శ్యాం ఎక్కడ?” అడిగాను.
నా మనసు కీడుని శంకించింది.
కాస్త మౌనం తరువాత.. “వాళ్ళంతా పార్క్ లో కదా ఉన్నారు… ఆట ఆఖరి దశలో సందీప్ ని ప్రోత్సహిస్తూ ఆడిస్తుండగా నాకు సైకియాట్రిక్ వార్డ్ నుండి ఎమెర్జెన్సీ కాల్ రావడంతో వెళ్ళక తప్పలేదు…. అప్పటికే శ్యాం సహాయంతో పోటీలో అదరగోట్టేస్తున్నాడు… వాడు. నేనేమో పని చూసుకుని ఇదో ఇప్పుడే తిరిగి వస్తున్నా… ” క్షణమాగారు ఆనంద్…
ఇంకా ఏమి చెబుతారోనని ఊపిరి బిగబట్టి వింటున్నాను….
“అయితే పార్క్ కి కాస్త దూరంలో ఉండగా చిత్ర ఫోన్ చేసింది…. సందీప్ పతంగీ ఎగరవేస్తూ కాలు జారి పడ్డంతో దెబ్బ తగలిందట. వెంటనే అంబులెన్స్ లో అపోలోకి తీసుకెళ్లారుట శ్యాం. చిత్ర కూడా వారి వెంటే వెళ్ళింది. అందుకే నిన్ను తీసుకొని ఇప్పుడు హాస్పిటల్ కే వెళ్లడం” అన్నాడు ఆనంద్.
నిర్ఘాంతపోయాను… అవాక్కయ్యాను….
“జరిగిన సంగతి విని నాకూ ఆదుర్దాగానే ఉందమ్మా” అని ఆనంద్ అంటుండగా హాస్పిటల్ చేరాము.

1 thought on “రాజీపడిన బంధం. 12

Leave a Reply to మాలిక పత్రిక ఫిబ్రవరి 2021 సంచికకు స్వాగతం.. – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *