March 28, 2024

శిఖరాగ్ర సమావేశం (కథ)

రచన: మణి గోవిందరాజుల

గదిలో పడుకుని తీరిగ్గా పుస్తకం చదువుకుంటున్నది శోభన. అత్తగారు తులసీ వాళ్ళ స్నేహితులూ కిట్తీ పార్టీ చేసుకుంటున్నారు. తాను కూడా ఇప్పటివరకు అక్కడే ఉంది. తంబోలా కాసేపు, బాల్ ఆట కాసేపూ ఆడాక, అత్తగారు, “శోభనా వెళ్ళి కాసేపు నడుము వాల్చమ్మా” అన్నారు. మిగతా అందరూ కూడా “అయ్యో! ఇంత సేపు కూర్చున్నావు. ఇప్పటికే నడుం పట్టేసి ఉంటుంది. పడుకోమ్మా” అన్నారు. వాళ్ళన్నారని కాదు కానీ తొమ్మిదో నెల బొజ్జలో బుజ్జిగాడు గందరగోళం చేస్తున్నాడు. కాఫీ కలుపుతానని లేచినా ఎవ్వరూ ఒప్పుకోలేదు. అందుకని లోపలికి వచ్చి పడుకుంది. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. అందరూ అరవై దాటిన వాళ్లే కానీ ఎంత ఉత్సాహమో వాళ్ళల్లో. కిట్టీ పార్టీ రోజు రోజంతా వీళ్లకు కాలక్షేపమే. ఉదయం పదింటికి మొదలు పెట్టుకుంటారు. రోజంతా సందడే సందడి. మొదటి రెండు గంటలూ వెల్కం డ్రింక్స్ తాగడం, బాగున్నారా అనుకోవడం. . . ఇక ఆ తర్వాత ఒక్కరు కూడా కూర్చోరు. ఆటలు పాటలు, డంషరాడ్స్, ఆ హడావుడిలోనే అందరూ బఫెట్ లంచ్ చేసేస్తారు. మొదట్లో కాస్త కొత్తగా ఉన్నా ఆ తర్వాత తాను కూడా అందులో భాగమయింది, అందులోని ఆనందాన్ని అందుకోసాగింది. కాసేపు చీరల ముచ్చట్లూ నగల ముచ్చట్లూ అయ్యాక కుటుంబవిషయాల్లోకి వెళ్ళింది సంభాషణ. “అనుకుంటాం కానీ కోడల్ని ఎంత బాగా చూసుకున్నా అత్త తల్లి కాలేదు. . . కోడలు కూతురు కాలేదు. . మా కోడల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను కాని ఆమెకి ఎంత సేపూ తన తల్లి స్మరణే” అన్నది అరుంధతి

“నువన్నది నిజమేనేమో. నా కూతురు అత్తగారిని ఎంత బాగా చూసుకుంటుందో. ఊళ్లోనే ఉన్నా కనీసం వారానికి ఒక్కరోజన్నా రాదు. మా అత్తగారు చేసుకోలేరు, నేను లేకపోతే అంటూ ఎప్పుడు రమ్మన్నా ఏదో ఒక కారణంతో రానే రాదు. కాని ఆ అత్తగారికి తృప్తే లేదు. ఏదో ఒకటి అంటూనే ఉంటుంది” నిట్తూర్చింది కాంతామణి.
ఆ తర్వాత సంభాషణ అత్తలూ కోడళ్లూ అంటూ ఎవరి అనుభవాలు వాళ్ళు చెప్పసాగారు.
“ఆడపిల్లని అపురూపంగా పెంచుకుంటాము. ఆడపిల్ల పుట్టినదగ్గరనుండీ పెళ్ళై అత్తవారింటికి వెళ్లేవరకు ఒక జీవితం. తండ్రి తాను కన్న తల్లిలో (కూతురిలో) తన తల్లిని చూస్కుంటూ పెంచుకుంటాడు ఆ తల్లిని ఒక అయ్య చేతిలో పెట్టినప్పుడు గుండెల మీది భారం తగ్గించుకున్నాననుకుంటాడు. కాని ఆ అమ్మాయి భర్త చేయి పట్టుకుని అత్తవారింటిలో కాలు పెట్టాక అమ్మాయి తండ్రికి గుండెల మీది భారం పెరగకూడదు. కాని ఎవరో అదృష్టవంతులకు మాత్రమే దించిన భారం మళ్లీ చేరకుండా ఉంటుంది. మాకా అదృష్టం లేకపోయింది. మంచి కోడలుగా ఉన్న వాళ్ళు మాత్రమే మంచి అత్తలు కాగలుగుతారు. మా వియ్యపురాలు కోడలిగా ఉన్నప్పుడు అత్తను కాల్చుకు తిన్నది. ఇప్పుడు కోడల్ని కాలుస్తున్నది. ఆమె అదృష్టం అప్పుడు ఆ అత్తగారు సహించింది. ఇప్పుడు కోడలు భరిస్తున్నది. కనీసం ఆమె తన కొడుకు గురించి కూడా ఆలోచించడం లేదు ఎంతమంది తల్లులు ఆలోచిస్తారు కోడలు సంతోషంగా ఉంటే కొడుకు కాపురం బాగుంటుందని?” దిగులుగా వినపడుతున్నాయి కామేశ్వరమ్మ మాటలు. “ఏమిటో జీవితాలు. అత్తా కోడళ్ళు సఖ్యంగా ఉన్న కాపురాలు చాలా తక్కువేమో? అయినా ఈ రోజుల్లో మగపిల్లల్ని అటు అమ్మ కాని, ఇటు కోడలు కాని ఆడిస్తున్నారు. అయితే అమ్మకూచి. . . లేదంటే భార్యావిధేయుడు” ఒకామె తేల్చేసింది. అవన్నీ వింటుంటే అయిదేళ్ళ క్రితం అయిన తన పెళ్లీ, ఆ తర్వాత అత్తగారూ మామగారూ తనతో ఉన్న తీరూ గుర్తొచ్చాయి శోభనకు.

కొత్త పెళ్ళికూతురు శోభన గదిలో కూర్చుని వర్క్ చేసుకుంటున్న విఘ్నేష్ దగ్గరకొచ్చింది. ఏదో చెప్పబోయేలోగానే దగ్గరికి లాక్కున్నాడు విఘ్నేష్. “ఓయ్! అంత సీన్ లేదు. అక్కడ మీ నాన్నగారు మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మన్నారు. నీలేష్ ఏమో శిఖరాగ్ర సమావేశానికి రమ్మని చెప్పమన్నాడు” కొంటెగా చెప్పింది అతన్నుండి తప్పించుకుంటూ.
విఘ్నేష్ కీ, శోభనకూ పెళ్ళై ఇంకా వారం కాలేదు. సరదాగా ఇటూ అటూ తిరుగుతున్నారు. వాళ్ళ పెళ్ళి కూడా గమ్మత్తుగా జరిగింది. విఘ్నేష్ కీ మామూలుగా పెళ్లి చూపులూ అదీ అంటే చిరాకు. పోనీ ఎవర్నైనా ప్రేమించావా చెప్పు అంటే ఎవరూ లేరంటాడు. నేనెళ్ళి రహస్యంగా చూసొస్తానంటాడు. విఘ్నేష్ వాళ్ళ నాన్న మోహన్రావ్ ఒంటి కాలి మీద లేచాడు. . . . . ”నువు చూసి ఓకే అంటే సరిపోతుందా? ఆ అమ్మాయి చూడక్కరలేదా?” అని. కాని విఘ్నేష్ నేను ఆ అమ్మాయిని చూసాక నాకు నచ్చితే అప్పుడు ఇద్దరం కలుసుకుంటాము. అప్పుడు ఆ అమ్మాయికి నేను నచ్చకపోతే నో చెప్పొచ్చు నో ఇష్యూస్” అన్నాడు. మొత్తం మీద ఎవరేమి చెప్పినా వినకుండా తల్ల్లీ తండ్రీ సెలెక్ట్ చేసిన వాళ్ళల్లో ప్రధమంగా వాసవి అన్న అమ్మాయిని చూడటానికి వాళ్ళ ఆఫీసుకెళ్ళాడు. వాళ్ళు కెఫెటేరియాలో ఉన్నారని తెలిసి అటెళ్ళాడు. ఫొటో చూసాడు కాబట్టి వెంటనే గుర్తుపట్టాడు. చాలా అందంగా ఉన్నదా అమ్మాయి. కాని విఘ్నేష్ ని వాసవి పక్కన ఉన్న అమ్మాయి ఆకర్షించింది. కాని పెద్దపిల్లని చూసి చిన్నదాన్ని చేసుకుంటా అంటే సభ్యతగా ఉండనట్లే . . . ఒక అమ్మాయిని చూడటానికి వెళ్ళి ఇంకో అమ్మాయిని చేసుకుంటా అంటే బాగుండదని అసలు చూద్దామనుకున్న అమ్మాయిని కూడా కలవకుండా వచ్చేసాడు. ఆ తర్వాత ఇక ఏ పెళ్ళిచూపులకూ వెళ్ళకుండా సెలవు లేదని తిరిగి బెంగళూరు వెళ్ళిపోయాడు.

ఆ తర్వాత ఆర్నెల్లకు మళ్లీ తల్లీ తండ్రీ పోరగా పోరగా హైదరాబాద్ వచ్చాడు. వాసవి పని చేస్తున్న ఆఫీసుకు వెళ్ళి క్యాంటీన్ లో కాపు కాసాడు. లంచ్ టైం అయ్యాక అంతకు ముందు వాసవితో ఉన్న అమ్మాయి వేరే ఎవరితోనో కలిసి వస్తున్నది. విఘ్నేష్ కళ్ళు మెరిశాయి. “సో! ఈ అమ్మాయి ఇక్కడే చేస్తున్నది అన్న మాట” అనుకున్నాడు. కాఫీ తాగేసి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే ఆ ఆఫీసులో తెలిసిన వాళ్ళెవరైనా ఉన్నారా అని ఎంక్వైరీ చేస్తే ఫ్రెండ్ కి ఫ్రెండ్ ఒకతను ఉన్నాడని తెలిసి ఆ అమ్మాయి వివరాలు కనుక్కుని అప్పుడు పెళ్ళి చూపులకు వెళ్ళాడు. లక్కీగా ఒకరికొకరు నచ్చుకుని పెళ్ళిదాకా వచ్చింది వ్యవహారం. విఘ్నేష్ తండ్రి మోహన్రావ్ చాలా పద్దతి గల మనిషి. చాలా ఖచ్చితం కూడా. పెళ్ళిలో శోభన తల్లితండ్రి నిజానికి కావాలని కాదు కాని అనుభవం లేని కారణంగా కూతురి పెళ్ళి ఎంతో గొప్పగా చేయాలనుకుని చేయలేకపోయారు. విఘ్నేష్ తల్లితండ్రులది ఎంత గొప్ప వ్యక్తిత్వం అంటే అంత గందరగోళంగా, మర్యాదలు సమంగా చేయకపోయినా అసలు ఆ మాటే రానీయలేదు. కాని పక్కనుండి ఉంటారు కదా ఎగతోసేవాళ్ళు? దొరికింది కారణం అని “ఇంత మర్యాదలు లేని కుటుంబం ఏమిటి? మీకెంత అవమానం” అని ఏదో అనబోయారు. ఎవ్వరినీ నోరెత్తనీయలేదు మోహన్రావ్. ఒక్కటే మాట చెప్పారట “ఇది మా ఇంట్లో పెళ్ళి. మర్యాదల గురించి మాకు లేని పట్టింపు ఎవరికైనా ఉంటే నిరభ్యరంతంగా వాళ్ళెళ్ళిపోవచ్చు” అని. దాంతో ఎగతోసేవాళ్ళ నోళ్లన్నీ మూత పడ్డాయి. ఎటువంటి అలకలూ, కోపాలూ లేకుండా చాలా ప్రశాంతంగా కల్యాణం జరిగిపోయింది. ఇదంతా పెళ్లయ్యాక శోభనకు తల్లి చెప్పి “ఇదొక్కటే చాలే నువ్వు మమ్మల్ని మరచిపోవటానికి, అంత గొప్పవారిని ఆనందంగా జీవితాంతం ఉంచటం నీ బాధ్యత” అని ఏడ్చినంత పని చేసింది. చిన్న లాజిక్ మిస్ అవుతారు పెళ్ళిళ్ళల్లో. . అప్పుడు చూపించే సంయమనమే కోడలికిచ్చే బహుమతి.
నిజమే వధూవరులు ఎన్నో కలలతో చేసుకుంటున్న వివాహం కనులపండువగా జరిగేట్లుగా చూసే బాధ్యత రెండువైపులా ఉన్నా జీవితాంతం తమతో కలిసి ఉండడానికి వచ్చే అమ్మాయికి భరోసా ఇచ్చే బాధ్యత అబ్బాయి తలి తండ్రులదే. అది పెళ్ళి నుండే మొదలవుతుంది.
తండ్రి రమ్మంటున్నారనగానే “ఎలా ఉన్నారు మా నాన్న? బాబోయ్ ఇప్పుడు క్లాస్ పీకుతారు. పడుకున్నానని చెప్పు” కంప్యూటర్ మూసేసి మంచం మీదకు దూకి ముసుగు పెడుతూ చెప్పాడు విఘ్నేష్.
“లేచి ఉన్నారనే చెప్పాను” కొంటెగా చెప్పింది శోభన.
“ఎంత పని చేసావు డియర్. ఇంతకింతా బదులు తీర్చుకోకపోతే నా పేర్ విఘ్నేషే కాదు…” ప్రతిన బూని “ఏమి చేస్తాం మరి. పద బంగారం” అంటూ బయటికి వచ్చాడు విఘ్నేష్. అప్పటికే అక్కడ ఇంట్లోని అందరూ తలా ఒకచోట కూర్చొని ఉన్నారు. విఘ్నేష్ ని చూడగానే ముసి ముసి నవ్వులు నవ్వారందరూ.
“ఈ రోజు నేనేనన్న మాట టార్గెట్ ని. . ఏమి చేసానబ్బా?” ఎంత ఆలోచించినా తట్టలేదు. “సరే కానివ్వు. రోకటిలో తల పెట్టాక రోకటి పోటుకు వెరవనేల” అమ్మ అనే సామెత గుర్తొచ్చింది.
“తులసీ కాంచనను టీ పెట్టుకు రమ్మను. అలాగే ఇందాక అమ్మాయి (శోభన) చేసిందే స్వీట్? అది అందరికీ తెమ్మను. రారా! విఘ్నేష్” అంటూ తన దగ్గరికి వచ్చి కూర్చోమన్నాడు మోహన్రావు. ఇంతలో వంటామె అందరికీ శోభన చేసిన రవ్వకేసరి తెచ్చి ఇచ్చింది. అది తినగానే మోహన్రావ్ చాలా సంతొషపడిపోయాడు. “అమ్మాయ్! మీ అత్తగారు చేసినట్లే ఉంది” అని. వెంటనే పక్కనే ఉన్న వాలెట్ తెరిచి చేతికి అందినంత తీసి శోభనకి ఇచ్ఛాడు. “శోభనా! ఇంటి కోడలు మొదటగా తీపి చేసి కుటుంబ సభ్యులతో తినిపించడం మా ఆనవాయితీ. ఆ సంతోషాన్ని ఇలా తెలుపుకోవడం మాకు ఒక ఆనందం. తీపి తినిపించడం వల్ల భావి జీవితమంతా ఆనందంగా ఉంటుంది అని నమ్ముతాము. అన్నట్లు తులసీ అమ్మాయికి నువు కూడా ఏదో తెచ్చావుగా అది ఇవ్వు” అన్నాడు.
అప్పటికే రడీగా పెట్టుకుంది తులసి. శోభనను విఘ్నేష్ ని సోఫాలో పక్క పక్కన కూర్చోబెట్టి చిన్న నెక్లెస్ సెట్ ఇచ్చింది బొట్టు పెట్టి. చాలా ముద్దుగా ఉంది ఆ సెట్. “నచ్చిందా?” ప్రేమగా అడిగింది తులసి. “చాలా బాగున్నదత్తయ్యా” సంతోషంగా చెప్పింది శోభన. లేచి అత్తగారికి, మామగారికి కాళ్ళకు దండం పెట్టింది. విఘ్నేష్ రిలాక్స్ అయ్యాడు హమ్మయ్య ఇంతేనా అని. “నాన్నా! వర్క్ ఉంది నే వెళతాను” అని వెళ్ళబోయాడు. “ఒరేయ్ ఇంకా కాలేదు నీ పని. . . కూర్చో” మళ్లీ కూర్చోబెట్టాడు మోహన్రావ్. “హతోస్మి!” అనుకుంటూ కూర్చున్నాడు విఘ్నేష్.
కుటుంబంలోని మంచీ చెడు, ఆ రోజు లోని విశేషాలు, అన్నీ చెప్పుకోవటానికి, విశ్లేషించుకోవటానికి కనీసం రోజులో ఒక గంటన్నా అందరూ కలిసి కూర్చోవాలి అనేది మోహన్రావ్ పాలసీ. చాలా ఏళ్ళు అలాగే జరిగింది కూడా. కానీ ఈ మధ్య ఉద్యోగాల్లో చేరాక టైమింగ్స్ అందరివీ సెట్ అవటం లేదు. ఇప్పుడు ఏదన్నా చెప్పాలంటే మాత్రమే సమావేశం ఆరంభిస్తాడు. అప్పుడు అందరూ రావాల్సిందే. దానికి పిల్లలు ముద్దుగా పెట్టుకున్న పేరు “శిఖరాగ్ర సమావేశం” ఇంకా బోర్ కొడితే “క్లాసులు పీకటం. ” పిల్లలేదన్నా తప్పు చేసినట్లనిపించినా? లేక ఏదన్నా ఫైనాన్స్ మాటలు మాట్లాడాలన్నా అందర్నీ కూచోబెట్టే చెబుతాడు. ఇంట్లో చేసే ప్రతీ ఖర్చూ, ఆ ఖర్చు పెట్టాలా వద్దా అన్నది కూడా పిల్లల్ని కూర్చోబెట్టుకుని చర్చించేవాడు. అందువల్ల వాళ్ళకు డబ్బు విలువ తెలుస్తుందని, అలా ఉంటే అందరూ స్వచ్ఛంగా ఉంటారని, దాపరికలు ఉండవని మోహన్రావ్ అభిప్రాయం. పిల్లల మంచితనమో, వాళ్ళ పెంపకమో చాలా బాధ్యతగా ఉంటారు విఘ్నేష్ తమ్ముడు నీలేష్ కూడా.
“చూడమ్మా! శోభనా. . . ఇప్పుడు ఎందుకు పిలిచానంటే మీ పెళ్ళితో మీ కుటుంబం, మా కుటుంబం కలిసి మన కుటుంబం అయ్యాము. ఇప్పటివరకు మేము మా మా తలితండ్రులతో కూడి మా తమ్ముడు మా చెల్లెలు మా మరదలు ఒక కుటుంబం. నీ రాకతో మీ కుటుంబం కూడా కలిసి కొత్త బంధాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఇది మాకు అన్నిటికంటే ముఖ్యమైన బంధం. ఇది కాపాడుకోవటం మాకెంత ముఖ్యమో నీక్కూడా అంత ముఖ్యం. విఘ్నేష్ నీక్కూడా చెప్తున్నాను. నీకు మేమెంత ముఖ్యమో శోభన తలితండ్రులు కూడా అంత ముఖ్యం. అలాగే శోభనా! నీకు మీ అమ్మానాన్నా ఎలానో, మేము కూడా అలానే. నీ ఇష్టాలు, అభిప్రాయాలు, అభిరుచులూ పుట్టింట్లో ఎలా నెరవేర్చుకున్నావో ఇక్కడ కూడా అలానే కొనసాగించవచ్చు. ఎవరేమనుకుంటారొ అన్న బెంగ వద్దు. అలాగే మీరు ఇద్దరూ ఆడపిల్లలే. మీ తలితండ్రుల బాధ్యత మీదే. ముందెలా ఉన్నావో ఇప్పుడు కూడా అలానే నీ బాధ్యతలను మేము ఏమనుకుంటామో అని భయపడవద్దు, భయపడుతూ చేయవద్దు. మీ తలితండ్రులు మన ఇంటికి ఆనందంతో రావాలి కాని ఆందోళనతో కాదు. స్వేచ్ఛగా రావాలి కానీ తప్పదురా భగవంతుడా అన్నట్లు కాదు. విఘ్నేష్! ముఖ్యంగా ఇంటి ఇల్లాలి కంటి తడి ఇంటికి మంచిది కాదు. కళ్ళు ఆనందంతో తడి అవ్వాలే కాని బాధతో కాదు. మన ఇంటికొచ్చిన కూతురు శోభన. ఆ అమ్మాయిని ఆనందంగా ఉంచడం నీ బాధ్యత” ఇద్దరికీ ఒక్కసారే చెప్పేసి ఊపిరి పీల్చుకుని మళ్లీ ఏదో గుర్తొచ్చినట్లు . “అన్నట్లు ఇంకో విషయం శోభనా! ఏ సమస్య వచ్చినా అది మన మధ్యే ఉండాలి. పరిష్కారం కూడా మనమే వెతుక్కోవాలి. అంతే కాని ఎవరికో చెప్పి సానుభూతి పొందాలనుకోవద్దు. ఎవరి దగ్గరినుండో పరిష్కారం కోరుకోవద్దు. ఒక వృత్తం గీసుకుని అందులో మనముంటే మొదటి వృత్తంలో మనము అంటే మేము నలుగురము, మీరు నలుగురు ఉంటారు. ఇక మిగతా వాళ్ళందరూ రెండో వృత్తమే. మా గౌరవం కాపాడుకోవటం మాకెంత ముఖ్యమో మీ గౌరవం కాపాడటం కూడా మాకు అంతే ముఖ్యం. అలాగే వైస్ వర్సా. చెప్పుడు మాటలు రెండో చెవిలో నుండి వెళ్ళిపోవాలి. మంచి మాటలు మనసులోకి తీసుకోవాలి” అనునయంగా చెప్తున్న మామగారి మాటలకు ఆనందంతో కళ్ళనీళ్ళు వచ్చాయి శోభనకు. మొదటిసారి తండ్రి ఉపన్యాసం ఎంజాయ్ చేసాడు విఘ్నేష్. తలితండ్రుల మీద గౌరవం రెట్టింపు అయింది.
“అదిగో! అదే. . . ఆ కళ్ళనీరే వద్దన్నది” నవ్వుతూ శోభనను హగ్ చేసుకుంది తులసి. అదిగో ఆ రోజు నుండీ ఈ రోజు వరకూ కూడా వాళ్ళు అదే మాట మీద ఉన్నారు. ఒక చిన్న మాట వాళ్ళు అనరు. విఘ్నేష్ ని సరదాగా కూడా అననివ్వరు. పుట్టింట్లో కూడా లేని గారాబం శోభనకు అత్తగారింట్లో ఉంది. అందుకే శోభన ఇంట్లో ఎన్నడూ వియ్యాలవారి గురించిన నిందావాక్యాలు వినపడవు. నిజమే ఒక కుటుంబం ఆనందంగా ఉండాలంటే ఇంటికొచ్చే కోడలికి ముందు పెద్దవారు ఆ ధైర్యాన్ని ఇవ్వాలి. . ఆ ఇచ్చిన ధైర్యంతో కోడలు కుటుంబంతో ఆప్యాయంగా మమేకమై పోవాలి.
ఒక్కసారిగా హాల్లోనుండి నవ్వులు వినపడేసరికి ప్రస్తుతంలోకి వచ్చింది. “అమ్మో! చాలా టైం అయింది. ఇక లేద్దాము” అంటూ లేచి బయటికి వచ్చింది శోభన. అప్పుడే అందరూ బయలు దేరటానికి సిద్ధంగా ఉన్నారు. వచ్చిన శోభనకు కూడా బై చెప్పేసి అందరూ వెళ్ళాక అలసటగా సోఫాలో కూర్చుండి పోయింది తులసి. తలుపేసి వచ్చిన శోభన అత్తగారి కాళ్ళదగ్గర కూర్చుని ఆమె ఒళ్లో తలపెట్టుకుంది “అత్తయ్యా! నేనెంత అదృష్టవంతురాలిని. . . భగవంతుడు మీ కుటుంబంలో నన్ను చేర్చాడు. వాళ్ల అందరి మాటలు వింటుంటే నాకు బాధగా అనిపించింది. అందరూ మీలా ఎందుకు ఉండరో?” అన్నది.
“ఏయ్! ముందు కిందనుండి లే. . . అందరూ మరి నీలా ఎందుకుండరు? ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలే” లేపి తన పక్కన కూర్చోబెట్టుకుంది. “ఏ ఇద్దరు కలిసి ఉండాలన్నా కొద్ది అడ్జస్ట్‌మెంట్ తప్పని సరి. అది మొగుడూ పెళ్ళాలే కావచ్చు. అత్తా కోడళ్ళే కావచ్చు. ఆఖరికి తల్లీ కూతుళ్ళైనా సరే, అక్కా చెల్లెళ్ళైనా సరే అన్నదమ్ములైనా సరే. ఒకరు ఏదైనా పొరపాటు చేస్తే అవతలి వాళ్ళకు పట్టించుకోని గుణమైనా ఉండాలి. లేదా అపారమైన ప్రేమైనా ఉండాలి. లేదా నొప్పించకుండా చెప్పగలిగే చాతుర్యమన్నా ఉండాలి. మరి ఇన్ని కలవాలంటే కష్టం కదా? ఇవన్నీ సాధారణంగా అన్ని కుటుంబాల్లో ఉండేవే. మనం అనుకున్నంత మాత్రాన ఏవీ మారవు. వెళ్ళి మొహం కడుక్కుని కాఫీ తాగు”.
“శోభనా! నువ్వే కాదు మేము కూడా అదృష్టవంతులమే” లేచి వెళ్తున్న కోడల్ని అపురూపంగా చూస్తూ అనుకుంది తులసి.
*****

9 thoughts on “శిఖరాగ్ర సమావేశం (కథ)

Leave a Reply to Sravya Cancel reply

Your email address will not be published. Required fields are marked *