April 19, 2024

శిశుపాలుడు

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు

శిశుపాలుడు ఛేది రాజ్య చక్రవర్తి ధర్మఘోషుని కుమారుడు. శిశుపాలుడు కృష్ణునికి మేనత్త కొడుకు. అంటే ఈయన తల్లి కృష్ణుడి తండ్రి అయిన వసుదేవుని సోదరి శ్రుతదేవి, ధర్మఘోషుని భార్య. సంస్కృతములో శిశుపాల అనే మాటకు అర్ధము శిశువులను సంరక్షించేవాడు.

శిశుపాలుడు, అతని మేనమామ దంతవక్రుడు పూర్వము శ్రీమహావిష్ణువు వైకుంఠ ద్వారాల వద్ద ద్వారపాలకులుగా ఉండి ముని శాపము వల్ల మానవజన్మ ఎత్తి శ్రీ మహా విష్ణువుతో వైరము వహించి అయన చేతిలో సంహరింపబడి తిరిగి వైకుంఠానికి చేరుకుంటారు. ఆ విధముగా జయవిజయులు మూడవది ఆఖరుది అయిన మానవ జన్మలో శిశుపాలుడు, దంతవక్రుడిగా జన్మించి శ్రీమహావిష్ణువు చేతిలో సంహరింపబడతారు. శిశుపాలుడు పుట్టుకతోనే నాలుగు భుజాలతో, నొసటి మీద కంటితో, గార్దభ స్వరంతో పుట్టాడు. తల్లితండ్రులు ఆ బాలుని చూసి కలతచెందారు. అప్పుడు అశరీరవాణి ఈ బాలుడిని ఎవరు ఎత్తుకున్నప్పుడు మామూలు రూపం పొందుతాడో అతని చేతిలో ఇతడు హతుడు కాగలడు ” అని పలికింది. అప్పటి నుండి ఆ బాలుని ఇంటికి ఎవరు వచ్చినా చేతికి ఇవ్వసాగారు. ఒకరోజు బలరామకృష్ణులు ఆ బాలుని చూడటానికి వచ్చారు. శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే ఆ బాలునికి మామూలు రూపం వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుని చేతిలో అతని మరణం తధ్యమని భావించిన శ్రుతదేవి, శ్రీకృష్ణుని చూసి ” కృష్ణా ! నీ మరిది అయిన శిశుపాలుని రక్షించు ” అని కోరింది. అలాగే అన్నాడు కృష్ణుడు. ఇతని నూరు తప్పులు సహిస్తాను అవి పూర్తి కాగానే నా చేతిలో హౌతుడౌతాడు ” అని చెప్పాడు

విదర్భ రాకుమారుడైన రుక్మి (రుక్మిణి సోదరుడు)శిశుపాలునికి మంచి స్నేహితుడు అందువల్ల రుక్మిణిని శిశుపాలునికి ఇచ్చి వివాహము చేయాలనీ అనుకుంటాడు కానీ రుక్మిణి శ్రీకృష్ణుని వివాహమాడదలచి ఒక విప్రునితో సందేశము పంపుతుంది ఆ సందేశము అందుకున్న శ్రీ కృష్ణుడు ఆవిడ కోరిక మేరకు వివాహానికి ముందు వచ్చి రుక్మితో యుద్ధము చేసి రుక్మిణిని తీసుకొనిపోయి వివాహము చేసుకుంటాడు. శిశుపాలునికి తనకు కాబోవు భార్య అయిన రుక్మిణిని ఎత్తుకొనిపోయినందుకు కృష్ణుని పై వైరము పెంచుకుంటాడు. ఆ విధముగా శ్రీకృష్ణుడు శిశుపాలునికి శత్రువైనాడు. .

ధర్మరాజు రాజసూయ యాగము చేస్తున్నప్పుడు భీముడిని పంపి సామంతరాజైన శిశుపాలునుడిని యాగానికి ఆహ్వానిస్తాడు. శిశుపాలుడు ధర్మరాజు అధికారాన్ని అంగీకరించి ఇంద్రప్రస్థానికి వస్తాడు. ఆ సందర్భముగా పాండవులు పెద్దల సలహా అనుసరించి శ్రీకృష్ణునికి అగ్ర తాంబూలము ఇవ్వాలని నిర్ణయిస్తారు. ఈ నిర్ణయము శిశుపాలునికి కోపము తెప్పిస్తుంది అప్పుడు శ్రీకృష్ణుని గోవులకాపరి అని, ఏమాత్రము విలువ లేనివాడని, తాను పెళ్లి చేసుకోబోయే రుక్మిణిని ఎత్తుకెళ్లాడు అని సభాసదుల ముందు తిట్టటం ప్రారంభిస్తాడు. అప్పుడు భీష్ముడు ఆగ్రహము చెంది శిశుపాలుని తీవ్రముగా మందలిస్తే శ్రీకృష్ణుడు భీష్ముని శాంతిపజేస్తాడు. అత్తకు ఇచ్చిన మాట ప్రకారము శిశుపాలుని వంద తప్పులను శ్రీ కృష్ణుడు క్షమించి, శ్రీకృష్ణుడు సభాసదులను చూసి ” మేము ప్రాగ్జ్యోతిష పురం మీద దండెత్తినప్పుడు ఈ శిశుపాలుడు ద్వారకను తగులబెట్టాడు. భోజరాజులు రైవతకాద్రి మీద భార్యలతో గడుపుతుంటే వారిని దారుణంగా చంపాడు. నా తండ్రి వసుదేవుడు అశ్వమేధయాగం చేస్తుంటే అశ్వాన్ని అపహరించాడు. బబ్రుని భార్యను తన భార్యగా చేసుకున్నాడు. నా మేనత్త ఇచ్చిన మాట ప్రకారం నూరు తప్పులు సహించాను. ఇతడు నాకు పరమ శత్రువు అయ్యాడు వాని చావు నా చేతిలో వ్రాసి పెట్టబడింది ” అన్నాడు.

శిశుపాలుడు శ్రీకృష్ణుని చూసి ” నేను వివాహమాడదలచిన కన్యను అపహరించి సిగ్గులేకుండా మాట్లాడు తున్నావా? “అని దూషించాడు. ఇక శ్రీకృష్ణుడు నూరుపూర్తి అయినాయి కాబట్టి సహించలేక పోయాడు . తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి శిశుపాలుని శిరస్సు ఖండించాడు. ఆ విధముగా శిశుపాలుడు శ్రీకృష్ణునితో వైరము పెట్టుకొని శ్రీకృష్ణుని చేతిలో హతుడై అతని ఆత్మ పరమాత్మునిలో ఐక్యం అయింది. ఆ విధముగా శిశుపాలుడు మోక్షాన్ని పొందాడు.

తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అతని అంత్యక్రియలు జరిపించమన్నాడు. శిశుపాలుని కుమారుని ఛేది దేశానికి రాజుని చేసాడు. శిశుపాలుని వధతో రాజసూయం పరిసమాప్తి అయింది. శిశుపాలునికి దృష్టకేతు, కరేణుమతి , మహీపాల, సుకేతు, శరభ అనే కుమారులు ఉన్నారు వీరందరు కురుక్షేత్ర యుద్దములో కౌరవుల తరుఫున పోరాడి చనిపోయినవారు. శిశుపాల వధ అనే కావ్యము సంస్కృతములో మంచి కాయముగా ప్రసిద్ధి చెందింది. ఈ కాయాన్ని 7 వ శతాబ్దములో మాఘ అనే సంస్కృత పండితుడు 1800 శ్లోకాలను 20 సర్గలు గావిభజించి రచించాడు. సంస్కృతములోని మహాకావ్యాలలో ఇది ఒకటి దీనిని మాఘ కావ్యము అని కూడా అంటారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *