April 23, 2024

అమ్మాయి వెడలెను

రచన: తంగిరాల.మీరాసుబ్రహ్మణ్యం

“అమ్మా! క్రిస్మస్, కొత్త సంవత్సరం సందర్భంగా సాన్ హొసె పార్క్ లో దీపాలంకరణ చాలా బాగా చేసారుట. వెళ్ళొద్దామా? “అంది బుజ్జి.
“అదికాదే రేపటినుండి అంగళ్ళకు తిరగడం మొదలు పెట్టి పిల్లకు కావాల్సినవన్నీ కొని, అవన్నీ సర్ది, దాన్ని తీసుకు వెళ్ళి దిగబెట్టి రావాలి. ఇప్పుడు అంత దూరం చలిలో కారు నడుపుకుని వెళ్ళిరావడం,పైగా ఈ కరోనా సమయంలో అవసరమా?” అన్నారు మంగమ్మగారు.
బుజ్జి గలగలా నవ్వింది. “నాకు తెలుసు అమ్మా. బయటకు వెళ్ళాలి అంటేఏదో అడ్డుపుల్ల వేస్తావు. ఒకటి.సాన్ హొసె మనకు కేవలం ముప్ఫై మైళ్ళ దూరంలో వుంది. రెండు. చలిలో కారు నడపను. లోపల వెచ్చగా కూచుని, హీటర్ వేసుకుని వెళ్ళడమే. మూడు. మనం కారు దిగేపని లేదు. దిగనివ్వరు కూడా. అలా కారులోనే పార్క్ అంతాచుట్టి రావడమే. రేపటి షాపింగ్ కు, దీనికి ముడిపెట్టకు.పద, పద.” అంది.
కరోనా కారణంగా బయట తినడానికి వెళ్ళడం గానీ, సినిమాలు, సంబరాలు లాటి ఏవిధమైన సరదాలు లేక విసుగెత్తి పోయిన జనం అందరూ ఇటు బయలుదేరడంతో మైలు పొడవున క్యూలో నిలబడి పోయింది కారు. గంటకు పైగా వేచి వున్నాక ముందుకు కదిలారు.
మధ్యలో బుజ్జి స్నేహితులనుండి సమాచారం అందుతూనేవుంది. మొత్తానికి ఎలాగో పార్క్ లోపలికి ప్రవేశించారు. కళ్ళు మిరిమిట్లు కొలిపే దీపాలంకరణ చూస్తూ వుంటే అంతసేపు కాచుకోవడం వలన కలిగిన విసుగు ఎక్కడికో పారిపోయింది..
వచ్చేటప్పుడు దారిలో ఫ్రీమొంట్ లో స్నేహితుల ఇంటి దగ్గర ఆగి వాళ్ళు తెప్పించిన దేశీ పిజ్జా తిని,రాత్రి పది గంటలకు ఇల్లు చేరారు.
ఇప్పటికి పది నెలల నుండి ఇంటి నుండే పని చేస్తున్నారు గనుక పొద్దున్నే లేచి తయారైఆఫీసుకు వెళ్ళే శ్రమ తప్పింది కనుక తీరిగ్గా ఏడున్నరకు లేచి ఎనిమిది లోపల లాప్ టాప్ ముందు కూర్చుంది బుజ్జి.
మధ్యలో భోజనానికి ఒక గంట కాళి. సాయంట్రం అయిదుకే పని ముగించి సకలను వెంట బెట్టుకుని కావలసిన వస్తువుల కొనుగోలు చేయడానికి వెళ్ళింది బుజ్జి.
తల్లీ కూతుళ్ళ ముఖాలలో ఒకరకమైన వుత్సాహం, వుద్విగ్నత కనబడుతున్నా మరొక వైపు అంతర్లీనంగా ఏదో దిగులు తొంగి చూడడం మంగమ్మగారి దృష్టిని దాటిపోలేదు.
ముగ్గురు ఆడ పిల్లలను, ప్రేమగా పెంచి, చదివించి పెళ్ళి చేసి పంపిన ఆమెకు తన కూతురు మనసులోని దిగులు అర్థం అవుతూంది.సకల అంటే బుజ్జి కి నిజంగా సకల లోకమే. బిడ్డను వదిలి వుండాలంటే ఏ తల్లికి అయినా మనసు దిగులుతో నిండిపోతుంది. కానీ తప్పదు.
టివి ముందు కూర్చున్నా, మంగమ్మగారి కళ్ళు వాళ్ళ రాకకోసం ఎదురు చూస్తున్నాయి.
కారు గరాజ్ తలుపు యాంత్రికంగా తెరుచుకోవడం కనబడి “పిల్లలు వచ్చేసినట్టున్నారు” అనుకుంటూ గరాజ్ నుండి లోపలికి వచ్చే తలుపువైపు చూసారు మంగమ్మగారు.
జెసి పెన్నీ,మేసీ, కోల్ షాపుల వాళ్ళవి పెద్ద సంచీలు మోసుకుంటూ లోపలికి వచ్చారు బుజ్జి, సకల.
సకల ముఖంలో ఉత్సాహం,చిన్ని నడకలో అలసట.
” కొనవలసిన బట్టలన్నీ కొనేసినట్టేనా?” కూతుర్ని అడిగారు మంగమ్మగారు.
“ ఎక్కడమ్మా? అంత సులభంగా అయిపోతుందా? రేపు మళ్ళీ వెళ్ళాలి.” అంది బుజ్జి.
అన్నట్టు ఫ్రిజ్, మిక్రో వేవ్ ఒవెన్ వచ్చేసాయా? మంగమ్మగారు గుర్తు చేసారు.
“అమెజాన్లో బుక్ చేసాము అమ్మా. అక్కడకి వెళ్ళాక తీసుకోవచ్చు. ఇక్కడి నుండి మోసుకు వెళ్ళే పని లేదు.” అంది.
” ఇంకా భోజనం పళ్ళేలు, గ్లాసులు, మిక్రో వేవ్ ఒవెన్ లో పెట్టే గిన్నెలూ కొనాలి.” తనకు తానే చెప్పుకున్నట్టు అందావిడ.
” ఏమేమి కొనాలో రాసి పెట్టుకున్నాము కదమ్మా. రెండు రోజుల్లో అన్ని వస్తాయి.” అంది బుజ్జి.
“సరే మీరిద్దరూ బయట కొనుగోళ్ళు చూసుకోండి. నేను రేపు సకలంకు ఇష్టమైన టొమేటో, గొంగూర పచ్చళ్ళు, నువ్వుల పొడి, పప్పుల పొడి,పులిహార గొజ్జు, ఆవకాయ సిద్ధం చేస్తాను”. అని ఆవులిస్తూ,పడుకోవడానికి లేచింది ఆమె.
“గుడ్ నైట్ అమ్మమ్మా “ అంటూ రెండు చేతులతో హత్తుకున్న మనవరాలి స్పర్శతో ఆమె కళ్ళలో నీళ్ళు నిండాయి. ఇంకో వారం రోజుల్లో దూరంగా వెళ్ళిపోతుంది అన్న వూహనే భరించడం కష్టంగా వుంది ఆమెకు.
ప్రయాణం దగ్గరకు వచ్చేకొద్దీ ఇంట్లో హడావుడి మొదలయ్యింది.
అల్లుడు సకలకు బాంకులో కావలసినంత డబ్బు వేసి క్రెడిట్ కార్డ్ తెచ్చాడు. సకల వుండబోయే వూళ్ళో తన స్నేహితుల పేర్లూ, మొబైల్ నంబర్లు పాప ఫోనులోకి ఎక్కించాడు.అమ్మాయి కారు లేకుంటే ఇల్లు కదలదని తెలుసు గనుక కారు కూడా పంపిద్దామా అనుకున్నారు గానీ అక్కడ పార్కింగ్ కు చోటు లేదుట.
దానికి ఏదన్నా చదువుకునేటప్పుడు, లాప్ టాప్ లో పని చేసుకునేటప్పుడు చిన్న టేబుల్ ఫాన్, టేబుల్ లైట్ అలవాటు అని కొత్తవి వాళ్ళు వెళ్ళబోయే చోట అందించేట్టు అమెజాన్ లో ఆన్ లైన్ లో బుక్ చేసాడు..
ఇక బుజ్జి కూతురుకు జాగ్రత్తలు చెప్పడం మొదలు పెట్టింది.
” అమ్మ ఇంటిలో లాగా అక్కడ ఎవ్వరూ నాలుగు సార్లు వచ్చి ముద్దుగా నిన్ను నిద్ర లేపరు.గడియారం గంటకొడితే దాని నోరు నొక్కి నిద్రపోతావు. అమ్మ ఇల్లు కాదని గుర్తు పెట్టుకుని సమయానికి లేచి తయారవ్వు. అందరితో కలిసిపోయి స్నేహంగా వుండు.ఇక్కడిలాగా ఇరవై నాలుగు గంటలు చెవికి ఇయర్ ఫోన్ తగిలించుకుని మొబైల్ పట్టుకు కూర్చోకు. పొద్దున్న ఫలహారం, మధ్యానం భోజనం సమయానికి అందరితో బాటు కలిసి తిను. స్నానాల గదిలో తువ్వాలు, బట్టలు వదిలేసి వచ్చేయకు. పొద్దున్న మిగతా అందరూ హడావుడి పడే సమయం కంటే ముందే స్నానం ముగించుకో. వయసులో పెద్ద వాళ్ళతో గౌరవంగా మాట్లాడు. తెలియని విషయాలు అడిగి తెలుసుకో. “ అంటూ పొడుగ్గా చెబుతూనే వుంది.
“అమ్మా. నేను పదేళ్ళ పిల్లను కాను. అవన్నీ నాకు తెలుసు.” అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది సకల.
” చూసావా అమ్మా! అప్పుడే నేను దూరం అయిపోయాను. అంతే అమ్మలు తాపత్రయ పడడమే తప్ప పిల్లలకు అదంతా చాదస్తంగా కనబడుతుంది.” అంది బుజ్జి చెమరించిన కన్నులతో.
” అవునమ్మా అదే నేనూ ఇన్నాళ్ళుగా అంటున్నది” అన్నారు మంగమ్మగారు.
సకల వెళ్ళవలసిన రోజు రానే వచ్చింది.తీసుకు వెళ్ళాల్సినవి అన్నీ సర్దుకున్నారా అని జాగ్రత్తగా చూసుకుని బయలు దేరారు.
కారులో ఎక్కే ముందు అమ్మమ్మను కౌగలించుకుంది సకల. ఇద్దరి కళ్ళలో నీళ్ళు.
” అమ్మమ్మకు, తాతకు కాళ్ళకు మొక్కి ఆశీర్వచనం తీసుకో” సకలకు చెప్పాడు బుజ్జి భర్త.
వంగి ఇద్దరికీ దండం పెట్టింది సకల.
“ మళ్ళి ఎప్పుడొస్తావురా?” మంగమ్మగారి గొంతు జీరబోయింది.
“మూడు నెలలలో వస్తానులే అమ్మమ్మా!” అంది సకల.
ఎప్పుడూ టాం అండ్ జెర్రీలా పోట్లాడుకునే అక్కా తమ్ముడు ప్రేమగా వీడ్కోలు చెప్పుకున్నారు.
కారు కదిలింది.
“అక్కడ ఎలా ఉందో ఏమిటో నాకు ఫోను చేసి చెప్పు” బుజ్జి నిహెచ్చరించారు మంగమ్మగారు.
…………
” అమ్మా! సకలను అక్కడవదిలి, తను కొత్త చోటులో కాస్త సర్దుకున్నాక మేము వెనక్కి బయలుదేరాము. రాత్రికి వచ్చేస్తాము.” అంటూ బుజ్జి ఫోను.
“అవునా? అక్కడ బాగానే పలుకరించారా? దాని గది అదీ బాగానే వుందా? వస్తువులన్నీ సర్ది పెట్టారా? అక్కడి మనుషులూ, వాతావరణం, భోజనం సకలకు నచ్చాయా?? సకల ఎలా వుంది? మీరు వెళ్ళిపోతుంటే బెంగ పెట్టుకుందా? ” ప్రశ్నల పరంపర కురిపించారు మంగమ్మగారు.
అది సంతోషంగా వుంది. వుత్సాహంగా అందరితో మాట్లాడుతూ కలిసి పోయింది. అదేం బెంగ పెట్టుకోలేదు. నాకే చాలా దిగులనిపించింది”. అంది బుజ్జి.
“ సకలను వదిలి వస్తుంటే నాకు ఏడుపు వచ్చిందమ్మా. పద్దెనిమిదేళ్ళు నా చుట్టూ తిరిగి పెరిగిన సకల లేని ఇంటికి రావాలనిపించడం లేదు తెలుసా? బుజ్జి గొంతులో దిగులు.
“. అవునమ్మా నేనూ ” నేనూ నీ పెళ్ళయ్యాక నిన్ను మొదటిసారి అల్లుడిగారి దగ్గర దింపడానికి తీసుకు వెళ్ళినప్పుడు ఇలాగే దిగులు పడ్డాను. నువ్వేమో అప్పుడే మీ ఆయనను చూసుకుని మురిసి పోవడం మొదలు పెట్టేసావు. ” అన్నారు మంగమ్మగారు.
“ మీ ఆయన తెచ్చి పెట్టిన వంట సరుకులు మనం తెచ్చిన స్టెయిన్ లెస్ స్టీలు డబ్బాలు నా ముందు పెట్టి నువ్వు ఆ పొట్లాలు విప్పి డబ్బాల్లో పోసి, కాగితం మీద పేర్లు రాసి అతికించు అని కూర్చోబెట్టి, నువ్వు ఇల్లు సర్దడం మొదలు పెట్టేసావు. ఇల్లు అందంగా వుంచడం నీకు చిన్నప్పటి నుండి అలవాటే అనుకో. కూరగాయలు ముందేసుకుని చక చక తరిగి బీన్స్ కూర, మామిడి కాయ పప్పు, టొమేటో రసం చేసేసావు. మనింటిలో వున్నప్పుడు నీకు ఇష్టమైన బంగాళా దుంపల వేపుడు, రవ కేసరి తప్ప మరేమీ చేసేదానివి కాదు.అవురా ఆడపిల్లలు తన ఇంటికి వస్తే ఎంత బాధ్యత తెలుసుకుంటారు అని ఆశ్చర్యపోవడం నా వంతు అయింది.
” సరే ఇరవై ఏళ్ళ క్రిందటి సంగతి వదిలేయ్ అమ్మా. అమ్మాయి వెళ్ళింది అత్తవారింటికి కాదు అమ్మా. యూనివర్సిటీ లో గ్రాడ్యుఏషన్ చేయడానికి. యూనివర్సిటీ కేంపస్ లో లో హాస్టల్ గదికి వచ్చింది.మరచి పోకు. నీ మనుమరాలికి తను దిగిన డార్మిటరీ చాలా నచ్చేసింది. శాండియాగో యూనివర్సిటీ అంటే కాలిఫోర్నియా లో వన్ ఆఫ్ ది బెస్ట్ యునివర్సిటీస్ అమ్మా. కాంపస్ ఎంత అందంగా వుంది తెలుసా ? దగ్గరే బీచ్. మీరు తప్పక చూడాలి. ఈ సారి అందరం కలిసి వచ్చి వదిలి పెడదాము. తన గది వున్న నాలుగో అంతస్థులో స్వీట్ లో అయిదు గదులు వున్నాయి. ఇద్దరు వుండగలిగిన గది అయినా కరోనా సమయం కనుక ఒక్కొక్కరే వుంటున్నారు. అందరూ మాస్కులు వేసుకుంటున్నారు. ఫుల్ సెక్యూరిటీ వుంది. కరోనా భయం వలన డైనింగ్ హాల్ నుండి భోజనం డబ్బాలలో తమ గదిలోకే తెచ్చుకుంటారు. అదొక రెస్టారెంట్లా వుంది. థాయ్, చైనీస్, మెక్సికన్, అమెరికన్ అన్నిరకాల తిండి దొరుకుతుంది.నీ మనవరాలి భోజనం గురించి దిగులు పడనక్కరలేదు. శని, ఆదివారాలు కాస్త బియ్యం కడిగి మిక్రో వేవ్ ఒవెన్ లో పెట్టుకుంటే మన పచ్చళ్ళు, పొడులు వేసుకుని తినొచ్చు.
సకల చాలా ఎక్సైటెడ్ గా వుంది. అప్పుడే తన వస్తువులన్నీ గదిలో తానే చక్కగా సర్దేసుకుంది. పక్కగది అమ్మాయితో స్నేహం కలిపింది. మొదటి టెర్మ్ నుండి ఇక్కడ వున్నవాళ్ళు రేపు సకలను కేంపస్ టూర్ తీసుకు వెడతారట. ఇక్కడ కూడా ఆన్ లైన్ క్లాసులే. అయినా ఈ వాతావరణం వేరు కదా. ఏడాది నుండి ఇంట్లోనే కూచుని ఆన్ లైన్ క్లాస్సులు విని విసిగి పోయింది పాపం. ఎంతో ఎదురు చూసిన స్కూల్ గ్రాడుయేషన్ కూడా ఆన్ లైన్ లోనే. గొప్పగా జరగాల్సిన పార్టీ అసలుకే లేకండా పోయింది. ఇప్పుడైనా ఈ వయసులో బైటి ప్రపంచాన్ని చూసి నేర్చుకోవడం, స్వతంత్రంగా తన పనులు చేసుకోవడం రావాలంటే ఇలా హాస్టల్ లో వుండి నలుగురితో కలవాలి కదమ్మా.”
” ఇంక బయలుదేరండి, అమ్మమ్మ, తమ్ముడూ ఎదురు చూస్తుంటారు” అని మమ్మల్ని తొందర పెట్టింది కూడా. సరే మేము రాత్రికల్లా ఇంటికి వచ్చేస్తాము.” ఫోను పెట్టేసింది బుజ్జి.
” తరం తరం నిరంతరం ఈ బంధాలు, అనుబంధాలు సాగుతూనే వుంటాయి.” అనుకున్నారు అనుభవంతో తల పండిపోయిన మంగమ్మగారు.

——————- ———————- ——————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *