విశ్లేషణ: టేకుమళ్ళ వెంకటప్పయ్య

కీర్తన:
పల్లవి: జీవుఁడ నేనొకఁడను సృష్టికిఁ గర్తవు నీవు
యీవల ధర్మపుణ్యములివివో నీచేతివి॥పల్లవి॥
చ.1.పుట్టినయట్టి దోషాలు పురుషోత్తమా నీవు
పట్టి తెంచివేయక పాయనేరవు
గట్టిగా సంసారములోఁ గలిగిన లంపటాలు
ముట్టి నీ వల్లనేకాని మోయరావు ॥జీవుఁ॥
చ.2.పంచభూత వికారాలు పరమాత్ముఁడా నీవే
కొంచక నీయాజ్ఞఁగాని కొద్ది నుండవు
అంచెల జగములోని ఆయా సహజములు
వంచుక నీవల్లఁగాని వైపుగావు ॥జీవుఁ॥
చ.3.చిత్తములో విజ్ఞానము శ్రీవేంకటేశ నీవె
హత్తించి చూపినఁగాని యంకెకురాదు
సత్తుగా నిన్నిటికి నీశరణుచొచ్చితి మిదె
నిత్తెముఁ గావఁ బ్రోవ నీయిచ్చే యిఁకను ॥జీవుఁ॥
(రాగం: భైరవి; సం: 3-275- రాగిరేకు – 248-4)

విశ్లేషణ:
పల్లవి: జీవుఁడ నేనొకఁడను సృష్టికిఁ గర్తవు నీవు
యీవల ధర్మపుణ్యములివివో నీచేతివి

నేను నీవు సృష్టించిన నిమిత్తమాత్రుడైన జీవిని. మేము చేసే ధర్మ, పుణ్య కార్యాలన్నీ మీ ప్రేరితాలే! మీ చేతలే! లేకుంటే మేము చేయగలమా? అంటున్నాడు అన్నమయ్య.

చ.1. .పుట్టినయట్టి దోషాలు పురుషోత్తమా నీవు
పట్టి తెంచివేయక పాయనేరవు
గట్టిగా సంసారములోఁ గలిగిన లంపటాలు
ముట్టి నీ వల్లనేకాని మోయరావు
మాకు జన్మత: వచ్చినవి అంత తేలికగా పోవు కదా! నీవు పూనుకుని వాటిని పట్టి తెగదెంపితే తప్ప మాకు ఆ ఆలోచనలు ఎన్నటికి నశించవు. ఈ సంసార జంజాటకంలో సంక్రమించినవన్నీ వాటిని నువ్వు ముట్టి తీస్తే గానీ తొందరగా సమసిపోవు.

చ.2.పంచభూత వికారాలు పరమాత్ముఁడా నీవే
కొంచక నీయాజ్ఞఁగాని కొద్ది నుండవు
అంచెల జగములోని ఆయా సహజములు
వంచుక నీవల్లఁగాని వైపుగావు
పంచభూతాలుగా అనబడే వాయువు, అగ్ని, నీరు, భూమి, ఆకాశాలు మమ్మలను ప్రకృతి శక్తులుగా లొంగదీసుకొన్నవి. ఓ శ్రీనివాసా! విచిత్రం ఏమిటంటే ఈ ప్రకృతి శక్తులన్ని కూడా నీ ఆధీనమే! కాబట్టి నీవు పూనుకొని మాపై నీ కరుణా రసాన్ని కురిపిస్తే గానీ ఏమాత్రం ఉపయోగముండదు. ఇలా జనన మరణ చక్రంలో పడి తిరగడమే మా పని, కావున నీవే దిక్కు! శరణు!

చ.3.చిత్తములో విజ్ఞానము శ్రీవేంకటేశ నీవె
హత్తించి చూపినఁగాని యంకెకురాదు
సత్తుగా నిన్నిటికి నీశరణుచొచ్చితి మిదె
నిత్తెముఁ గావఁ బ్రోవ నీయిచ్చే యిఁకను
ఓ సర్వేశ్వరా! నీవు పూనుకొని మాకు జ్ఞానాజ్ఞాలను తెలియపరచవలసి ఉన్నది. ఆ విషయం నీకూ మాకు నిత్య సత్యమని తెలుసు. అందుకే నీ శరణు జొచ్చాను. నిత్యము మమ్ము బ్రోవుటకు మీకే సాధ్యం స్వామీ! కాపాడమంటూ వేడుకుంటున్నాడు అన్నమయ్య.

ముఖ్యమైన అర్ధములు:
నీ చేతివి = నీ చేతులతో సంకల్పించి చేసే కార్యాలు; తెంచివేయక = తొలగించక; పాయనేరవు = సమసిపోవు; లంపటము = సంసార దు:ఖములు, జంజాటములు; వంచుక = వంచుటకు, తీసివేయుటకు; చిత్తము = మనస్సు; హత్తించి = కలిగించి; సత్తు = సత్యము; నిత్తెము = ప్రతిసారి; కావబ్రోవ = పాలించి బ్రోచుటకు, రక్షణ చేయుటకు.
-0o0-

By Editor

One thought on “అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 57”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *