August 17, 2022

అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణ

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు

అనాదిగా హిమాలయాలలోని మానస సరోవరములో కైలాస గిరి ప్రదక్షిణ అరుణాచలంలోని ( తిరువణ్ణామలై తమిళ్ నాడు) గిరిప్రదక్షిణ ఏంతో భక్తి శ్రద్దలతో చేయటము మనము చూస్తున్నాము వింటున్నాము. తిరువణ్ణామలైలో ఆలయానికన్నా ముందే యుగాల క్రిందట మహేశ్వరుడు స్వయముగా మహా పర్వత రూపములో వెలిస్తే ఆ తరువాతి కాలములో పర్వత పాదాల వద్ద ఆలయం నిర్మించినా మొట్టమొదటి ప్రాధాన్యత ఆ పర్వతానిదే. ఈ మధ్య కాలములో ఇంద్రకీలాద్రి సింహగిరి పర్వతాల చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. కానీ అన్నిటిలోకి అత్యంత పుణ్యప్రదమైనది అరుణాచల ప్రదక్షిణ. తమిళనాట ప్రచారములో ఉన్న జనావాక్యము ఏమిటి అంటే తిరువాయ్యుర్ లోజన్మించినవారు చిదంబరాన్ని దర్శించిన వారు కాశీలో మరణించినవారు మోక్షాన్ని పొందగలరు కానీ తిరువణ్ణామలై క్షేత్ర నామాన్ని స్మరించినంత మాత్రాన సకల జన్మల కర్మ ఫలము తొలగి జన్మ రాహిత్యాన్ని పొందగలరు అని. అరుణాచలం అంటే ఎర్రని కొండ పంచభూతాలలో అరుణాచలం అగ్ని క్షేత్రము మిగిలినవి కంచి-భూమి, జంబుకేశ్వరము – జలము, శ్రీకాళహస్తి- వాయువు, చిదంబరం- ఆకాశము. కృతయుగములో అగ్ని రూపములోను, త్రేతాయుగములో రత్న శిఖరము గాను, ద్వారా యుగములో కంచు మయముగా ఉన్న పర్వతము కలియుగములో ఔషధీయ మొక్కలతో నిండిన శిలా రూపము గామారింది అని చెపుతారు. అందుచేతనే ఆలయము కన్నా కొందనే కైలాస నాధునిగా కొలుస్తూ ప్రదక్షిణకు ప్రాధాన్యత ఇవ్వటం ఇక్కడ చూస్తాము.
త్రిమూర్తులలో ఎవరు గొప్ప అన్న విషయములో ముగ్గురు ఒకటే అని పరమేశ్వరుడు తెలిపి పర్వత రూపములో వెలిసాడు అని చెపుతారు. ఆలయము విషయానికి వస్తే ఆలయము పాతిక ఎకరాల స్థలము లో సువిశాలముగా నిర్మింపబడింది. ఆలయానికి తొమ్మిది గోపురాలు అయిదు ప్రాకారాలు ఉన్నాయి మాడవీధుల్లో గిరిప్రదక్షిణ మార్గముతో కలిపితే సప్త ప్రాకారాలు అన్ని కలిపితే అపర కైలాసమే ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ప్రస్తుతము అరుణాచలంలో భక్తులు చేసే గిరి ప్రదక్షిణ గురించి తెలుసుకుందాము.
ప్రదక్షిణ అనే పదములో ప్రతి అక్షరానికి ఒకో అర్ధము ఉన్నదిఅని పండితులు చెపుతారు “ప్ర”అంటే తనలోని పాపాలను నాశనము కావాలని, “ద”అంటే కోరిన కోరికలు నెరవేరాలని, “క్షి” అంటే మరో జన్మలో అయినా మంచి బుద్దిని ప్రసాదించాలని, “ణ ” అంటే అజ్ఞానాన్ని పోగొట్టి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకుంటూ చేసేదే ప్రదక్షిణ. అందుచేతనే ఆలయాల్లో తప్పనిసరిగా ప్రదక్షిణ చేయాలని పెద్దలు చెపుతారు. ఈ ప్రదక్షిణ హిందూ సంస్కృతిలో ప్రక్రుతి పరమాత్ముని ప్రతిరూపముగా భావిస్తారు కాబట్టి తులసి మొక్కకు కూడా ప్రదక్షిణము చేస్తారు పరమేశ్వరుడు కొండ రూపములో సాక్షాత్కరించిన సమయములో ముక్కోటి దేవతలు, మహర్షులు ఆనందముతో గిరి ప్రదక్షిణ చేశారు ఈ గిరి ప్రదక్షిణ యొక్క ప్రాముఖ్యాన్ని స్వయముగా పరమేశ్వరుడే గౌతమ మహర్షికి వివరించినట్లు స్కాంద పురాణము చెపుతుంది సంవత్సరములో ఈరోజుఅయిన ఈ గిరి ప్రదక్షిణ చేయవచ్చు సహజముగా పౌర్ణమి నాడు అధిక సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు.
ఈ రోజున ఒక్కో ఫలితము ఉంటుంది అని పరమేశ్వరుడు తెలిపినట్లుగాపురాణాలు చెబుతున్నాయి. సోమవారము నాడు చేసే ప్రదక్షిణాలు ఆరోగ్యాన్నిదీర్గాయువుని, మంగళవారం చేసే ప్రదక్షిణాలు ఋణబాధలనుండి విముక్తిని కలుగజేస్తాయని, బుధవారం చేసే ప్రదక్షిణాలు జ్ఞానాభి వృద్ధిని పాండిత్యాన్ని కలుగజేస్తాయని, గురువారం చేసే ప్రదక్షిణ ఆధ్యాత్మిక అవగాహనను కలుగజేస్తుంది అని, శుక్రవారం చేసే ప్రదక్షిణలు అపార సంపత్తిని ఆ తరువాత వైకుంఠ ప్రాప్తిని కలుగజేస్తుంది, శనివారం చేసే ప్రదక్షిణాలు సర్వగ్రహ దోషనివారణ అవుతుందని, ఆదివారము చేసే ప్రదక్షిణాల వల్ల శివ సాయిజ్యము పొందవచ్చని చెపుతారు. గిరి ప్రదక్షిణకు అత్యంత ప్రాధాన్యత కలుగజేసిన వారు శ్రీ రమణ మహర్షి అయన ను గిరి ప్రదక్షిణము ఎలాచేయాలి?అని అడిగినప్పుడు నిండు గర్భిణీ గర్భస్థ శిశువు క్షేమాన్ని ఆలోచిస్తూ ఎలా నడుస్తుందో అలానడవాలి అని చెప్పారు.
శుచిగా అభ్యంగన స్నానము చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి నుదిటిన విభూది కుంకుమ ధరించి పాదరక్షలు లేకుండా కాలినడకన దారికి ఎడమ వైపుగా శివనామము జపిస్తూ నడవాలి. ఈ పద్నాలుగు కిలోమీటర్ల మార్గములో ఎదురయ్యే ఆలయాలను దర్శించుకుంటూ అరుణగిరిని చూస్తూ గిరి ప్రదక్షిణ చేయాలి ఈ గిరి ప్రదక్షిణ అణ్ణామలై స్వామీ తూర్పు గోపురము నుండి ప్రారంభించాలి. ప్రదక్షిణ పూర్తి చేసుకొని అరుణా చలేశ్వరు ని దర్శించుకోవాలి. ఈ గిరి ప్రదక్షిణలో తూర్పు దిశలో ఇంద్రుడు ప్రతిష్టించిన ఇంద్రలింగము, ఆగ్నేయములో అగ్ని ప్రతిశించిన ఆగ్నేయ లింగము, దక్షిణాన యముడు ప్రతిష్టించిన యమలింగము, నైరుతి దిశలో నైరుతి లింగము, పశ్చిమాన వరుణుడు ప్రతిష్టించిన వరుణ లింగము, వాయవ్యాన వాయువు ప్రతిశించిన వాయు లింగము ఉత్తరాన కుబేరుడు ప్రతిష్టించిన కుబేర లింగము , ఈశాన్యాన ఈశానుడు ప్రతిష్టించిన ఈశాన్య లింగము లు ఉంటాయి ఈ లింగాల అధిష్టాన దేవతలు భక్తులకు మంచి ఫలితాలను కలుగజేస్తారు ఈ ఆలయాలన్నీ ఏనాడో నిర్మించినవి కావటము వలన కాలక్రమేణ శిధిలావస్థలోకి చేరటం వలన 1968లో మూపనార్ స్వామి వాటి పునరుద్దరణకు పూనుకొని భక్తుల ఆలయ అధికారుల సహకారముతో పునర్మించారు శ్రీ రమణ మహర్షికి భగవాన్ అనే నామకరణము చేసిన శ్రీమాన్ కావ్య కంఠ గణపతి ముని నైరుతి లింగము వద్దే తపస్సు చేసాడు.
ఈ ఆలయాలు కాకుండా గిరి ప్రదక్షిణ మార్గములో మరికొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రధాన ఆలయములో ఉన్నట్లే ఇక్కడ కూడా ఏడు నందులు ఎడమ పక్కన వస్తాయి అలాగే గిరి ప్రదక్షిణ లో దూర్వాస, గౌతమ, అగస్త్య మహర్షుల మందిరాలు లేదా ఆశ్రమాలు ఎదురవుతాయి. ఏపుగా పెరిగి నీడను ఇచ్చే చెట్లు చల్లని గాలి ప్రాశాంత పరిసరాలు ఇవన్నీ కలిపి నడిచేవారికి మార్గాయాసము తెలియకుండా జేస్తాయి మార్గములో యాత్రికులకు కావలసిన సౌకర్యాలు ఉంటాయి. ఈ విధముగా అరుణాచలేశ్వరుని దర్శనంతో పాటు గిరి ప్రదక్షిణ కూడా పూర్తిచేయనిదే తిరువణ్ణామలై (అరుణాచల) తీర్ధ యాత్ర పరిపూర్ణము అవదు.

2 thoughts on “అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణ

  1. అరుణాచలేశ్వర గిరి ప్రదక్షణ గురించి శ్యామసుందరరావు గారు బాగా విష్లేసించారు నేను మూడు సార్లు దర్ళంచాను. మంచి అను భూతి కలుగుతుంది. వ్రాసిన వార్కి
    ప్రచురించిన మీకు అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *