February 23, 2024

ట్రాఫిక్ కంట్రోల్

రచన: మణి గోవిందరాజుల

అప్పటికీ జాగ్రత్తగానే డ్రైవ్ చేస్తున్న వరుణ్ ఎదురుగా వస్తున్న కార్ ని గమనించి పక్కకు తప్పుకు పోయేలోగానే అది తన కార్ ని కొట్టినంత పని చేసి అదే స్పీడ్ తో వెళ్ళిపోయింది. కాసేపటిదాకా గుండె దడ తగ్గలేదు వరుణ్ కి. రోజూ ఇదే తంతు. ఇది వన్వే అయినా ధైర్యంగా వెళ్ళడానికి లేదు. పైనుండి ఆపోజిట్ రాంగ్ సైడ్ లో వస్తున్న వాళ్లేమో కొద్దిగా కూడా తగ్గకుండా ధైర్యంగా వస్తారు. కనీస మ్యానర్స్ లేని వీళ్లనేమి చెయ్యాలి? కోపంగా తిట్టుకున్నాడు వరుణ్.
కోపంగా లోపలికి వస్తున్న భర్తను చూసి “మళ్ళీ ఏమి జరిగింది?” అని అడిగి “ఆ! మళ్ళీ ఎవడో రాంగ్ సైడ్ లో ఎదురొచ్చి ఉంటాడు. అవునా?” అడిగింది దీపిక.
“అవును. కొద్దిలో ప్రమాదం తప్పింది. లేచిన వేళ మంచిదయింది” అన్నాడు వరుణ్. వరుణ్ దీపికలు ఈ మధ్యనే ఇండియా వచ్చారు. జన్మభూమికి వచ్చిన ఆనందం రోజూ ఆఫీసుకు వెళ్ళొచ్చేసరికి ఆవిరవుతున్నది. రూల్స్ పాటించని మనుషులను చూస్తుంటే బీపీ పెరుగుతున్నది. అక్కడ అమెరికాలో నేమో ఎవరి రూట్లల్లో వాళ్ళు కళ్ళు మూసుకుని డ్రైవ్ చేయొచ్చు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి భారతీయుల డ్రైవింగ్ తెలిసిన వాడైనా దాదాపు ఇరవై సంవత్సరాలు అక్కడ ఉండి ఆ పద్ధతికి అలవాటు పడ్డ ప్రాణం ఇక్కడి రాష్ డ్రవింగ్ ని తట్టుకోలేకపోతున్నది. తల్లీ తండ్రి “మేము పెద్దవాళ్లమయ్యాము. మా ఆఖరు జీవితాలు ఇక్కడే వెళ్ళిపోవాలి” అంటే వాళ్ళకోసం కుటుంబాన్ని ఇక్కడికి మార్చుకున్నాడు. వరుణ్ కి డ్రైవింగ్ చాలా ఇష్టం. అందుకే డ్రైవర్ని పెట్టుకోలేదు. కానీ ఈ పరిస్థితులు చూస్తుంటే ఒక డ్రైవర్ని పెట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తున్నది.
మర్నాడు డ్రైవర్ కోసం ఉన్న ఆప్ లో ఒకర్ని సెలెక్ట్ చేసుకుని నెలజీతం కింద చేర్చుకున్నాడు. దీపికా, తల్లీ, తండ్రీ సంతోష పడ్డారు. హమ్మయ్య ఇక గొడవ లేదు అని. వాడు ఒకరోజు బాగానే తీసుకెళ్ళాడు. రెండో రోజు దగ్గర అని రాంగ్ రూట్ లో వెళ్తుంటే గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు అలా అయితే అవసరం లేదని. “గట్టాంటి రూల్స్ ఫాలో అయ్యే డ్రైవింగ్ మాక్ శాత కాద్ మల్ల… అయినా మీకు అవసరంలేకపోతే నేనెందుకు చెయ్యాలె?” అంటూ వాడు ఆ మర్నాటి నుండి రావడం మానేసాడు. ఇద్దరు ముగ్గుర్ని ట్రై చేసి ఇక లాభం లేదని మళ్ళీ తన డ్రైవింగే మొదలు పెట్టుకున్నాడు. సెంటర్లో ఉన్న ఆఫీసుకు దగ్గర్లో ఇల్లు అనుకుని కూడా అమెరికాలో అలవాటైన ప్రశాంత జీవనం సిటీ రణగొణ ధ్వనుల మధ్య ఉండదని సిటీ అవుట్ స్కర్ట్స్ లో కొత్తగా కట్టిన గేటేడ్ విల్లాలో సెటిల్ అయ్యాడు. నిజానికి ఇల్లూ ఇంటి చుట్టూ వాతావరణం చాలా బాగుంది. కానీ ఆఫీసుకు వెళ్ళి రావడానికే ఒక గంట పడుతుంది. ఆ గంటలో వన్వేలో ఎదురొచ్చేవాళ్ళూ, ఓవర్ టేక్ చేసే వాళ్ళూ, వరుణ్ ని చాలా డిస్ట్రబ్ చేస్తున్నారు. కారూ, బైకూ అని తేడా లేదు. అందరూ మీది మీదికి వచ్చే వాళ్లే. చెప్పాలంటే బైక్ మీద వెళ్ళే వాళ్ళయితే హార్ట్ అటాక్ తెప్పిస్తున్నారు. రాంగ్ రూట్ లో వస్తూ కూడా ధైర్యంగా ఇంకా చెప్పాలంటే సిగ్గు లేకుండా రయ్యి రయ్యి వంకర్లు తిప్పుకుంటూ ఎదురొస్తున్న వాళ్ళను చూస్తుంటే కోపం పెరిగి పోతున్నది.
బీపీ షుగర్ లెవెల్స్ పెరిగాయనిపించి డాక్టరు చెప్పిన టెస్టులన్నీ చేయించుకుంటే తేలిందీ అదే… డాక్టరు గట్టిగా చెప్పాడు “మీరు కాస్త స్ట్రెస్ తగ్గించుకోవాలి. అయినా మనకొక్కళ్ళకేనా ఈ ప్రాబ్లం? మన దేశం లో అందరూ ఈ సమస్యని ఫేస్ చేయట్లేదా? మీరొక్కరే ఫేస్ చేస్తున్నట్లు ఆ స్ట్రెస్ అంతా తీసుకుంటారెందుకు?” అని మందలించాడు. వరుణ్ అవస్థ చూడలేని వరుణ్ తల్లీ తండ్రీ “నాయనా! మాకిక్కడ హాయిగా ఉన్నది. నీ టెన్షన్ మేము చూడలేకపోతున్నాము. మళ్లీ మీరు తిరిగి వెళ్ళండి. ఎక్కడున్నా మీరు హాయిగా ఉండడమే మాక్కావాలి” అని బ్రతిమాలసాగారు.
బంధువులతో సంప్రదిస్తే అందరూ అదే మాట అన్నారు. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ పాటించడమంటే దద్దమ్మ అని ఫీల్ అవుతారు అంటూనూ. ఫ్రెండ్స్ కూడా మేము డ్రైవ్ చేయట్లేదా అలాగే అవస్థ పడుతూ నువేదొ అమెరికా నుండి వచ్చి ఇప్పటికిప్పుడు రూల్స్ మారాలంటే ఎలా? ఆశ దోశ అప్పడం” ఒకళ్ళు టీజ్ చేసారు.
“జోక్ కాదు మిస్టర్! ఎక్కడ చూసినా ఒక పద్ధతీ పాడూ లేకుండా ట్రాఫిక్ ఉంటున్నది. ప్రభుత్వం ఏమీ పట్టించుకోదా? పనిష్మెంట్ ఇవ్వదా? ట్రాఫిక్ పోలీసులు మటుకు బాగానే కనపడుతున్నారు” అడిగాడు వరుణ్.
“కొత్తగా అడుగుతావేంటి వరుణ్? ఇక్కడ పుట్టి పెరిగావు..నీకు తెలీదా ఇక్కడ ఎలా ఉంటుందో?”
“నిజమే నా మూలాలు ఇక్కడే ఉన్నాయి. కాని ఇరవై ఏళ్ళక్రితం కంటే ఇప్పుడు బానే ఉన్నా ఇంకా పెరుగుతున్న జనాభా కి ఇది సరిపోదు కదా? చిన్నా పెద్దా తేడా లేదు. అందరూ అడ్దదిడ్డంగా నడిపేవారే. ఒక కుర్రవాడు నాకంటే చిన్నవాడే కదా అని ఆపి ఏదో చెప్పబోతే చాలా అసహ్యంగా మాట్లాడాడు. నాటి బాలలే నేటి పౌరులు, రేపటి ప్రజాపాలకులు అవుతారు కదా. ఇప్పటి యూత్ ఏమి నేర్చుకుంటున్నారు?” ఆవేదనగా అడిగాడు వరుణ్.
“అయ్యో! రామ…ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్లు కాలం గడుస్తున్నది. ఈ రోజు ఇంటికి వచ్చామా? హమ్మయ్య…అనుకోవడమే” మొత్తమ్మీద అందరూ మాట్లాడిన మాటలకు అర్థమది.
ఏమి చెయ్యాలో అర్థం కావడం లేదు వరుణ్ కి. రెండు రోజులు చాలా తీవ్రంగా ఆలోచించాడు. పరిష్కారం తట్టింది. వెంటనే కార్యాచరణలోకి దిగాడు.
తాను తిరిగే రూట్ లో తాను తిరిగే టైం లో మొత్తం వారానికి ఒక వందమంది తేలారు. వారం తర్వాత వారందరికీ కోర్టు ద్వారా సమన్లు వెళ్ళాయి. “రాంగ్ రూట్లొ వెళ్ళడం వల్ల వరుణ్ వైద్య అన్న నా క్లయింటుకి బీపీ, షుగరు రావడమే కాక గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువయ్యాయి. ఇది పూర్తిగా అటెంప్ట్ టు మర్డర్ కింద వస్తుంది కాబట్టి కోర్టులో హాజరయ్యి జవాబు చెప్పవలసినది గా హెచ్చరించడమైనది హాజరు కాని ఎడల కోర్టు ధిక్కారం కింద నాన్ బెయిలబుల్ వారంటు ఇష్యూ చేయడమైనది” అని దాని సారాంశము. వాళ్లకు ఒక్క ముక్కా అర్థం కాలేదు. కొందరు ఇది ఏదో ఆకతాయి చేసిన పని కొట్టివేశారు. కొందరేమో భయపడి కోర్టుకి హాజరవుదామని నిర్ణయించుకున్నారు.
ప్రజా వ్యాజ్యం కింద ప్రభుత్వం మీద కూడా కేసు పెట్టాడు వరుణ్. “ప్రజల సమస్యలను తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వానిది, దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం ఆ పని చేయటం లేదు. అందువల్ల నా క్లయింటుకి ముందెన్నడూ లేని విధంగా ఆరోగ్య సమస్యలు తలెత్తినాయి. దీనికి బాధ్యులు ఐనవారిలో ప్రభుత్వానిది ముఖ్య పాత్రగా భావించి కేసు పెట్టడమైనది”
ఆ తర్వాత తానున్న ఏరియా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి కూడా పైన చెప్పిన విధంగానే పంపించాడు. అలా పెట్టడమే కాకుండా ఒకరోజు పేపర్ పూర్తిగా తనకేసు వివరాలను ప్రచురించటానికే అడ్వర్టైజ్ మెంట్ తరహాలో కాలమ్స్ కొనేసాడు. ఆ రోజు సిటీ అంతా అదే ముచ్చట. అందరూ కూడా రెండు వర్గాలుగా విడిపోయి వాదించుకోవటము మొదలు పెట్టారు.
ఆరోజు కోర్టులో కేసు హియరింగ్ కి వచ్చింది. జనం ఇసుక వేస్తే రాలనంతగా వచ్చారు. అందరికీ కుతూహలమే. ఏమి చెప్తారా? ఎలా వాదిస్తారా అనే సహజ కుతూహలం అందరినీ అక్కడికి రప్పించింది.
“జడ్జి గారొస్తున్నారు. సైలెన్స్” బంట్రోతు లోపలికి వస్తూ అందరినీ హెచ్చరించాడు. అందరూ గౌరవంగా లేచి నించున్నారు. జడ్జి గారు ఆశీనులయ్యాక కేసు వివరాలు విన్నాక ప్రొసీడ్ అవడానికి అనుమతినిచ్చారు.
మొదటగా ట్రాఫిక్ పోలీస్ లాయరు లేచి నుంచుని “మి లార్డ్…సరి అయిన కారణం లేకుండా నా క్లయింటుని ఇబ్బంది పెట్టే విధంగా కేసు పెట్టి మా సమయాన్ని వృధా చేసిన మిస్టర్ వరుణ్ కి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను” అని కూర్చున్నాడు.
నా కేసు నేనే వాదించుకుంటానన్న వరుణ్ వేపు సాభిప్రాయంగా చూసారు జడ్జిగారు. “నో ఆర్గ్యుమెంట్స్ మి లార్డ్” లేచి వినయంగా చెప్పి కూర్చున్నాడు వరుణ్. ఆ తర్వాత ప్రభుత్వ తరపున వచ్చిన లాయరు కూడా పోలీసు లాయరు లానే తన అభిప్రాయం చెప్పాడు. ఇక అప్పటి నుండి ఒక్కొక్కళ్ళుగా నోటీసులు అందుకున్న బాధితుల తరపు లాయర్లందరూ కూడా అసలు అతనెవరో కూడా తమకు తెలీదనీ, ఎప్పుడూ చూడలేదని తమ మీద కేసు పెట్టటానికి కారణం కూడా లేదనీ, ఇంత సమయం తమది వ్యర్ధపరచినందుకు అతనినే శిక్షించాలనీ కోర్టుకి విన్నవించుకున్నారు.
“అందరి వాదనలూ అయిపోయాయి. ఒక్కసారి కూడా మీరు మీ వాదనను వినిపించలేదు. ఇప్పుడు వారు కాదు కోర్టు సమయం వృధాపరచినందుకు మిమ్మల్ని కోర్టు కఠినంగా శిక్షిస్తుందని” మందలింపుగా అన్నారు జడ్జిగారు.
అప్పుడు లేచాడు వరుణ్ “క్షమించాలి మి లార్డ్. నా తరపు నుంచి కూడా విన్నాక నిజంగా నేను కోర్టు సమయాన్ని వృధాపరచినట్లు మీరు భావిస్తే తప్పక శిక్షించండి. మి లార్డ్…పెరిగిన జనాభాకు అనుగుణంగా మనం అన్ని రకాల వనరులను పెంచుకుంటూ వస్తున్నాము. నిజానికి ఇరవై సంవత్సరాలక్రితం నేను అమెరికా వెళ్ళడానికి ముందు కంటే కూడా ఇప్పుడు మనదేశం అన్ని రకాలుగానూ అభివృద్ధి పథం లో నడుస్తున్నది. అక్షరాస్యత పెరిగింది. వాహన వినియోగం పెరిగింది. సిటీ చుట్టూ వేయి చేతులతో విస్తరిస్తున్నది. పెరిగిన వాహన వినియోగానికి అనుగుణంగానే రోడ్లను విశాలం చేస్తున్నారు. అనుకోని ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ నియంత్రణకు చట్టాలను పెట్టి అతిక్రమించిన వారిని కఠినంగా శిక్షిస్తామని చాల రకాల చట్టాలను పెట్టారు. చాలా సంతోషం. అందులో సిగ్నల్ క్రాస్ చేయకూడదు, వన్వే లో ఎదురుగుండా రాకూడదు, ఫ్రీ లెఫ్ట్ ఉన్నవారికి వారు వెళ్లే విధంగా దారి వదలాలి అనేవి కొన్ని. నేను ఉన్న చోటునుండి ఆఫీసుకు రోజూ ఒక గంట ప్రయాణించి చేరుకుంటాను. ఆ వెళ్లే దారిలో ప్రభుత్వం వారు వాహనాల రద్దీ తగ్గించడానికిగాను పెట్టిన వన్ వే దారిలో నేను ప్రయాణించవలసి ఉంటుంది. వన్వే అంటే నీ ఎదురుగా ఏ వాహనమూ వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టదు. నువు సౌకర్యంగా ప్రయణించవచ్చు అని వాహనదారుడికి ఒక రక్షణ ఇవ్వడం లాంటిది. అదే విధంగా నేను ఒకచోట ఎడమవైపుకి స్వేచ్చగా వెళ్ళొచ్చు. అలాగే రెండు చోట్ల సిగ్నల్స్ వస్తాయి. అందరూ నిజంగా అలానే ఫాలో అవుతే నేను ఏ ఇబ్బందీ లేకుండా సమయానికి నా ఆఫీసుకు చేరుకుంటాను…కాని జరుగుతున్నది ఏమిటంటే నేను నా దోవన వెళ్తుంటే రాకూడని దారిలో వీరందరూ ఎదురుగుండా చాలా వేగంగా వచ్చి నా గుండె దడ పెరగడానికి కారణమవుతున్నారు. నిజానికి ఇంకా చాలా వేలమందే అలా వెళ్తుండవచ్చు కాని నేను నాకు అడ్డు వచ్చిన వారి ఫొటోలు మాత్రమే తీయగలిగాను. మళ్ళీ విషయానికి వస్తే వారు అనుకోని విధంగా అలా ఎదురు రావడం వల్ల నేను సక్రమంగా డ్రైవ్ చేయలేక పోతున్నాను. ప్రతి క్షణం భయంతో కారు నడుపుతున్నంత సేపూ టెన్షన్ తో ఉంటున్నాను. అందువల్ల రక్తపోటు వచ్చి నేను మందులు వాదవలసి వస్తున్నది. అదే విధంగా ఈ రకమైన వత్తిడి వల్ల నాకు షుగర్ వ్యాధి కూడా వచ్చింది. దానికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ కూడా సమర్పించడమైనది. అందులో నేను అమెరికా నుండి ఇక్కడికి వచ్చే ముందు రోజు చేయించుకున్న రిపోర్ట్స్ ఉన్నాయి. అందులో నాకు ఒక్క కంప్లైంట్ కూడా లేదు మరియు ఇక్కడికి వచ్చాక ఈ సంవత్సరం లో నేను పడ్ద ఆందోళనకి ఫలితంగా వచ్చిన జబ్బుల వివరాలు, గత నెల చేయించుకున్న రిపోర్ట్స్ ఉన్నాయి”
“బాగుంది. మరి నేనేమి చేసాను? నాకు వాహనం కూడా లేదే?” ఒక స్త్రీ లేచి కోపంగా అడిగింది.
ఆమె వరుణ్ రోజూ వెళ్తున్న దారిలోని ఒక సూపర్ మార్కెట్ లో పని చేస్తున్నది.
“అమ్మా! అదే చెప్తున్నాను. నా కారు వేగంగా వస్తున్నప్పుడు ఎత్తుగా ఉన్న డివైడర్ ని ఎక్కి నా కారుకి ఎదురుగా దూకుతున్నారు. మీకేమన్నా అయితే అన్న కంగారుతో నాకు ప్రతిసారీ బీపీ పెరుగుతున్నది. మీకు ఎన్నో సార్లు చెప్పాను అలా దూకవద్దని. మీరు వినిపించుకోలేదు. నాకు తప్పలేదు. మీరే కాదు అదిగో అక్కడ కూర్చున్నారే ఆ నలుగురు యువకులూ అదే పని చేస్తున్నారు”
“మి లార్డ్! మీ సమయం కాదు వృధా అవుతున్నది. నాది కూడాను. ఎందుకంటే వీరి వాహనాల నేం ప్లేట్ ఫొటో తీసుకుని, అంటే (ఏదైతే ట్రాఫిక్ పోలీసు చెయ్యాలో అది నేను చేసి) ఆ ఫొటోల ఆధారంగా ఆర్టీవో ఆఫీసుకు వెళ్ళి వారి వివరాలు కనుక్కుని వారి అడ్రెస్ లకు నోటీసు పంపడానికి (ఏదైతే ప్రభుత్వం వారు చేయాలో అది) ఒక లాయర్ని మాట్లాడుకుని వారికి పంపేవరకు గత పదిహేను రోజులుగా ఈ కార్యక్రమానికి తిరుగుతున్న నేను జీతము నష్టము మీద పని చేయవలసి వచ్చింది. మి లార్డ్ వీరంతా ప్రభుత్వం వారు ప్రజా సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన చట్టాలను అతిక్రమించి నా అనారోగ్యానికి కారణమయ్యారు. వారంతా చట్టాన్ని అతిక్రమించడాన్ని చూసీ చూడనట్లు ఉండి ట్రాఫిక్ పోలీసులు, ప్రభుత్వం వారు నా అనారోగ్యానికి కారణమయ్యారు. ఇక డివైడర్ ని ఇష్టం వచ్చిన చోటల్లా క్రాస్ చేస్తూ వీరు కూడా నా అనారోగ్యానికి కారణమయ్యారు. కొన్ని రోజులు ఇది ఇలాగే కొన సాగితే నేను మరణించడం ఖాయం మి లార్డ్ అందుకే వీరిమీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టవలసి వచ్చింది. వీరంతా చదువుకున్నవారు. కారుల్లో వెళ్ళేవారే కాబట్టి రూల్స్ తెలిసిన వారే. వీరు చేసిన తప్పులకు మళ్ళీ ఏ వాహనదారుడు ఇబ్బంది పడకూడని విధంగా కఠిన శిక్ష విధించావలసినదిగా కోర్టు వారిని కోరడమైనది” తన వాదన ముగించి కూర్చున్నాడు.
జడ్జిగారు కొద్దిసేపు మౌనంగా కూర్చున్నారు. అతని వాదనలో నిజం ఉందనిపించింది. ఎందుకంటే రోజూ తాను అదే ఇబ్బంది పడుతూ తిట్టుకుంటూ వస్తున్నాడు ఆఫీసుకు. “మీరేమి అన్న చెప్తారా? అన్నట్లు ప్రతివాదుల లాయర్ల వేపు చూసాడు జడ్జి…
“మి లార్డ్! ప్రభుత్వం వారు చట్టాలను పెడుతున్నారు. అమలు చేయని వారిని శిక్షిస్తామంటున్నారు. కాని చూసి చూదనట్లు వదిలేస్తున్నారు. అందువల్ల మేము కూడా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం వారు కఠినంగా ఉన్నట్లయితే మాకు భయం ఉండేది. ఆ భయం మాలో కలిగించలేకపోవడం ప్రభుత్వం వారి తప్పిదం. ఇందులో మా తప్పేమీ లేదు కాబట్టి మమ్మల్ని నిర్దోషులుగా విడుదల చేయవలసిందిగా మనవి. అదే విధంగా మా తప్పు లేకపోయినా మమ్మల్ని కోర్టుకు లాగి మా పరువుపోవడానికి కారణమైన వరుణ్ వైద్య మీద పరువు నష్టం దావా ఎందుకు వేయకూడదొ కారణాలు చెప్పవలసిందిగా మిస్టర్ వరుణ్ వైద్యను అడుగుతున్నాము” చెప్పి కూర్చున్నాడు ప్రజల తరపు లాయరు.

“ప్రజలు చట్టాలను గౌరవించనంత కాలమూ పరిస్థితులు ఇలానే ఉంటాయి. అందుకని బాధ్యులు ప్రజలే మి లార్డ్” తాను కూడా లేచి చెప్పాడు ప్రభుత్వం తరపు లాయరు.
“ట్రాఫిక్ కంట్రోల్ కొరకు నియమించబడ్ద అధికారి తన విధి సమంగా నిర్వహించలేదు. చట్టాన్ని అతిక్రమిస్తూ ప్రజలు తమ బాధ్యత మర్చిపోతున్నారు. విధి నిర్వర్తించని అధికారినీ, రూల్స్ అతిక్రమించిన ప్రజలనూ చూసీ చూడనట్లు వదిలేసి ప్రభుత్వం తప్పు చేస్తున్నది. అయితే ఇప్పుడు వీరందరినీ ప్రధమ తప్పిదముగా మన్నించి జైలు శిక్ష వేయకపోయినా తప్పు తప్పే. అందుకని నేను చెప్పబోతున్న తీర్పు ఏమిటంటే వీరంతా నష్ట పరిహారం కింద ఒక్కొక్కరు లక్షరూపాయలు మిస్టర్ వరుణ్ వైద్యకు చెల్లించడమే కాకుండా ప్రతీ సిగ్నల్ దగ్గరా, వన్వే ఎంట్రన్స్ దగ్గరా వారం రోజులు రోజూ ఒక పాతిక గుంజిళ్ళు తీయాలి. ఇంకా పట్టుబడిన ప్రతీ పౌరుడూ తక్షణమే ట్రాఫిక్ పోలీస్ గా విధి నిర్వహించాలి. తన విధిని సరిగా నిర్వహించని అధికారి పట్టుబడితే వంద గుంజీళ్ళు తీయాలి. ఇంత వైఫల్యానికి కారణమైన ప్రభుత్వం మిస్టర్ వరుణ్ వైద్యకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి” తీర్పు ఇచ్చి లేచారు జడ్జిగారు.
కోర్టులో హాహా కారాలు మిన్ను ముట్టాయి. “ఉట్టిగా ఎదురొచ్చి డ్రైవ్ చేసినందుకు మాకింత శిక్ష వేస్తావా? నీ సంగతి ఇప్పుడే తేలుస్తాము. రండిరా అందరూ. వాహనం సరిగా నడపలేదని కదా కేసు పెట్టింది? ఇప్పుడీ వాహనాలతోనే అతని పని పడదాము” అంటూ అందరూ అరుణ్ వైద్య బయటికి రాగానే కార్లతో, బైకులతో వెంటాడసాగారు.
“వద్దూ!! వద్దూ!! ఇంకా మీ జోలికి రాను” గట్టిగా అరవసాగాడు వరుణ్. “వరుణ్! లే…లే…ఏంటీ పీడకలేదన్నా వచ్చిందా?” గట్టిగా కుదపసాగింది దీపిక.
లేచి చుట్టూ చూసి “హమ్మయ్య! కలే కదా?” అనుకుని గ్లాస్ మంచి నీళ్ళు తాగి పడుకున్నాడు వరుణ్ తన దేశ పౌరుల నిర్లక్ష్యాన్ని తలుచుకుంటూ
******************

1 thought on “ట్రాఫిక్ కంట్రోల్

  1. Ha ha! The fear of retaliation is so much that no one can take an action freely to change – it has to be the government. Nice story!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *