April 22, 2024

మనసు ఖాతా

రచన: శైలజా విస్సంశెట్టి

‘ఏమో వసంతక్క నాకేమీ అర్ధం కావటం లేదు జరుగుతున్నదంతా కల అయితే బాగుండు అనిపిస్తోందక్కా’. నేను చిత్రా వాళింటికి వచ్చిన ఈ గంట సేపటినుంచి పది సార్లు అయినా అని ఉంటుంది. చిత్ర మా పెద్దమ్మ కూతురు. ఇద్దరం ప్రైమరీ నుంచి డిగ్రీ వరకు కలిసే చదువుకున్నాం. ఇద్దరి అత్తవారి ఊరు కూడా ఒక్కటే కావటం మూలంగా మా చుట్టరికం, స్నేహం అలాగే నిలిచి ఉన్నాయ్ పిల్లలు పెళ్లీడుకు వచ్చినా కూడా. చిత్రని మా మేనమామ కొడుక్కి ఇవ్వటంతో మా మధ్య చుట్టరికం ఇంకా దగ్గరగా చుట్టుకుంది. ఇప్పుడు చిత్ర కొడుకు ప్రణయ్ పెళ్ళి చిత్రని కదిపి కుదిపి పారేసింది. ‘ఏమో వసంతక్క’ అని చిత్ర మొదలుపెట్టేసరికి నా ఆలోచనల నుండి బయట పడ్డాను. నన్ను నేను సర్దుకుని నా ఆలోచనలు పొందు పరచుకుని ‘నేనొక మాట చెపుతాను చిత్రా’ అని గొంతు సవరించుకుంటుండగా ‘వసంతక్కా నువ్వు సాయంత్రం ప్రణయ్ ఆఫీస్ నుంచి వచ్చేవరకు ఉండి వాడికి చెప్పే మాటలు చెప్పి వాడి ప్రేమ అనే పిచ్చి వదిలించి వెళ్ళు. నాకు ఉపకారం చేసినదానవు అవుతావు’ అంది.
‘అది ఎలాగూ జరుగుతుంది చిత్రా. నువ్వు చెప్పు – అమ్మాయి చదువు, ఉద్యోగం, అందం నీకు నచ్చలేదా ఏమిటి?’ అని అడుగుతుండగానే ‘అన్ని బాగానే ఉన్నాయ్ అక్కా కానీ పెద్దలం మనం ఉండగా వాడు పెళ్ళి విషయంలో సొంత నిర్ణయం తీసుకోవటం ఏమి బాగోలేదు, ఆ ఆలోచనే నాకు తిండి, నిద్ర సహించకుండా చేస్తోంది’ అన్నది చిత్ర. అప్పటివరకు అర్ధం అయ్యీ అవనట్లు ఉన్న సమస్య అవగతమైంది నాకు. ‘చిత్రా చిన్నప్పటి నుంచి ప్రణయ్ ని నువ్వు ఎలా పెంచావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నీ పెంపకాన్ని వాడు ఎన్నడూ ఎవరూ ప్రశ్నించే విధంగా ప్రవర్తించలేదు. వాడు అటు చదువులోనూ, ఇటు ప్రవర్తనలోను ఎవరితో వేలెత్తి చూపే విధంగా లేడు. ఇప్పుడు కూడా వాడితో మళ్ళీ కూడా సావకాశంగా మాట్లాడు. ఆ అమ్మాయి కుటుంబ వివరాలు పూర్తిగా తెలుసుకో. ప్రణయ్ తో మరొక్కసారి కూలంకషంగా విషయం చర్చించు. చిన్నపటి నుంచి నీ పిల్లలు పల్లవి, ప్రణయ్ – నా పిల్లలు శాంతి, సాగర్ కలిసి మెలిసి పెరిగారు అందరిలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ తెలివితేటలు, జీవితం పట్ల అవగాహన ఉన్నవాడు ప్రణయ్ ఒక్కడే. చిన్నపటినుంచి వాడు ఏమి కోరినా నువ్వు మంచి చెడు విశ్లేషించి చెప్పి వాడు కోరిన కోరికలు తీర్చేదానివి. అంతెందుకు వాడు ఇంటర్ అయ్యాకా బైక్ అడిగితే ఇప్పుడు కాదు అని ఇంజినీరింగ్ మూడవ సంవత్సరంలో కొనిచ్చారు మీరు. వాడు కూడా మీరు చెప్పిన మాట విని ఓపికతో మీరు కొనిచ్చేవరకు ఎదురు చూసాడే కానీ ఈ కాలం పిల్లల్లాగా అలక వహించి మిమ్మల్ని సతాయించలేదు. ఇంజినీరింగ్ కూడా మంచి మార్కులతో పాస్ అవుతూనే ఉద్యోగస్తుడయ్యాడు. వాడు ఇష్ట పడ్డాడు అంటే ఆ అమ్మాయి కూడా ప్రత్యేకతలు కలిగే ఉంటుంది. నీకు ప్రణయ్ ప్రేమించటం పట్ల అయిష్టత లేదు వాడు పెళ్లి మనం పెద్దవాళ్ళం ఉండగా తనకి ఇష్టమైన అమ్మాయిని చేసుకోవటం నీ అసలు సమస్య. నీ బాధను కూడా తప్పు పట్టలేం చిత్రా. ఎందుకంటే మనం కొన్ని విషయాల్లో ఇంకా మారలేదు. మార్పుని కోరుకుంటాం కానీ మార్పుని స్వీకరించటానికి మనకి చాలా సమయం పడుతుంది. నేను ప్రణయ్ ని వాడు చేసిన పనిని సమర్ధిస్తున్నానని అనుకోకు. మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్లకు నచ్చిన బొమ్మలు, వాళ్లకు నచ్చిన బట్టలు కొని ఇస్తాము. మనకి తెలియకుండానే వాళ్ళ కోరినది ఏదైనా తల్లి తండ్రులుగా మనం తీరుస్తాము అనే ఒక నమ్మకాన్ని మనమే వాళ్లకి కలిపిస్తున్నాము. కానీ పెళ్లి విషయం వచ్చేసరికి మనం పెద్దవాళ్ళం మన మాటే పిల్లలు వినాలి, మనం మన జీవిత అనుభవంతో చెపుతున్నాము అని, మన చుట్టు ప్రక్కల వాళ్ళు, మన బంధువులు హేళన చేస్తారేమో అనే అనుమానంతో మనం పిల్లల ఆలోచనలను ఖండించి వాళ్ళను బాధ పెట్టి మనం బాధ పడుతున్నాము అనిపిస్తోంది’.
‘వసంతక్కా నువ్వు చెప్పేది నాకు కొంచం అర్ధం అవుతోంది ఇంకా కొంచం వివరంగా చెప్పగలవా’ అన్నది చిత్ర. చిత్ర నా మాటలు అపార్ధం చేసుకోకుండా అడిగిన తీరుకు నా మనస్సు తేలిక అయ్యింది, చిత్రా ఇంకా వివరంగా అంటే ‘ముందు ప్రణయ్ తో మాట్లాడు. ఆ అమ్మాయి వాడికి ఎందుకు నచ్చిందో కనుక్కో. పెళ్ళి అనేది జీవితంలో వచ్చే అతి ముఖ్యమైన మలుపు అని పెళ్ళి వల్ల జీవితంలో వచ్చే మార్పులు, దానివల్ల వచ్చే భాద్యతలు, కుటుంబ గౌరవాలు అన్ని కూడా వివరించి చెప్పు. ప్రణయ్ వైపు నుంచి ఆలోచిస్తే వాడు నిన్ను ఒప్పించి, సమాధానపరిచి పెళ్ళి చేసుకోవాలి అని చూస్తున్నాడు. అంతేకాని నువ్వు బాధపడి అభ్యంతరం పెట్టేసరికి ఆవేశపడి ఏ గుళ్ళోనో, రిజిస్ట్రార్ ఆఫీసులోనో పెళ్లి చేసుకుని రాలేదు. నీ పట్ల ఉన్న ప్రేమ, వాళ్ళ నాన్నగారి పట్ల ఉన్న గౌరవంతో మీకు తెలియపరచి, ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఎంచిన పిల్లని వాడు చేసుకోవటంలేదు వాడు ఎంచుకున్న పిల్లతో సంతోషంగా ఉంటాడు అనే భావనకు రా చిత్రా. ప్రణయ్ పెళ్ళి అనే మార్పు మీ ఇంటి లోని అనుబంధాలకు అడ్డుగోడ కట్టకూడదు. ప్రణయ్ ఎంచుకున్న అమ్మాయిని మీ పెద్దరికంతో, హుందాగా, ప్రేమగా అంగీకరిస్తే వాళ్ళు, మీరు కూడా జీవితమంతా ఏ అరమరికలు లేకుండా సంతోషంగా ఉండగలరు అనిపిస్తోంది చిత్రా. నేను ప్రణయ్ చేసిన పనిని సమర్ధిస్తున్నానని అనుకోకు చిత్రా. ఇవాళ్టి రోజున మనం ఎన్నో ప్రేమ వివాహాలు విడాకుల దాకా వెళుతున్నాయి అని వింటూనే ఉన్నాము. మనం పెద్దలం, పిల్లల అభిప్రాయానికి విలువ నివ్వటం కాక ఆ బంధాన్ని ఎలా కాపాడుకోవాలో, వైవాహిక బంధాన్ని శాశ్వతంగా ఎలా నిలుపుకోవాలి వాళ్లకి సూచనలిస్తూ మార్గదర్శకంగా ఉంటే నేటి సమాజం, ఆ సమాజం లోని వ్యక్తులు ఎదుర్కొంటున్న చాలా సమస్యలు అసలు తలెత్తవ్వు అనిపిస్తోంది చిత్రా’ అంటూ ముగించాను.
‘ప్రణయ్ ప్రేమ పెళ్లి సంగతి మన బంధువులలో ఎవరితోను చర్చించక నీతోనే మాత్రమే చర్చించినందుకు మంచి సలహాలు ఇచ్చావు. నీ మేలు, నీ మాటలు ఎప్పుడూ మరువను అక్కా’ అంటున్న చిత్రకి ‘ఇంకొక్క మాట చెప్పి ఈ చర్చ ముగిస్తాను చిత్రా అంటూ నీకు వచ్చే కోడలి మనసు అనే బ్యాంకు అకౌంట్ లో నీ ప్రేమ అనే నగదు డిపాజిట్ చెయ్యి చిత్రా. తరువాత తరువాత నీవు ఆ డిపాజిట్ నుంచి నీకు అంటే నీ వృధాప్యంలో ఆ ప్రేమను డ్రా చేసుకోవచ్చు. మన ఇంటికి వచ్చే కోడలిని మనం మన ఇంటిని నిలబెట్టే వ్యక్తిగా స్వాగతం చెపితే మన ఇంటి అనుబంధాలు, కొత్తగా వచ్చే భాండాలు అన్ని సుఖ సంతోషాలతో బలోపేతమౌతాయి. ఇక నేను బయలుదేరతాను. శాంతి, సాగర్ కాలేజీ నుంచి వచ్చే టైమ్ అయ్యింది. ప్రణయ్ వచ్చేవరకు మరి నేను ఉండక్కరలేదుగా’ అంటూ హ్యాండ్ బాగ్ తీసుకుని వీధి గుమ్మం వైపు అడుగు వేసాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *