August 17, 2022

లోకులు

రచన: తంగిరాల.మీరాసుబ్రహ్మణ్యం

“ఏమైంది సరళా! పొద్దున్న హడావిడిగా బయలుదేరి వెళ్ళావు. ముఖం వడలిపోయి నీరసంగా కనబడుతున్నావు.” మూడువందల పదో నంబరు ఇంటి ఇల్లాలిని పలుకరించింది అదే అంతస్థులో మూడువందల అయిదులో వుంటున్న కావేరి.
“ఇదే అంతస్థులో లిఫ్ట్ పక్కన వున్న ఇంట్లో పదేళ్ళు వుండి, స్వంత ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయిన కమల వాళ్ళింటికి వెళ్ళి వస్తున్నా. పాపం. చిన్న వయసులోనే ఘోరం జరిగిపోయింది. పచ్చగా వున్న దంపతులను చూసి ఆ దేవుడికి కన్ను కుట్టిందేమో. నలభై అయిదేళ్ళకే కమలా వాళ్ళాయనకు నూరేళ్ళు నిడిపోయాయి“ చీరకొంగుతో కళ్ళు ఒత్తుకుంది సరళ.
తాళం తీసి లోపలికి నడుస్తున్న సరళ వెంటే తానూ లోపలికి వచ్చింది కావేరి.
“అయ్యో ఎంతపని జరిగింది. ఏమయ్యింది? గుండె పోటా? ఈ మధ్యన నడివయసులో వాళ్ళకు గుండెపోటు రావడం గురించి ఎక్కువగా వింటున్నాము. మేము ఈ అపార్ట్మెంట్ కు వచ్చిన సంవత్సరానికే కమల వాళ్ళు వెళ్ళిపోయారు. కట్టు, బొట్టు, తీరు అన్నిట్లో ఆమె ప్రత్యేకంగా కనబడేది పాపం.” సానుభూతిగా అంది కావేరి.
“రోజూ కసరత్తు చేసి, మైళ్ళకొద్దీ పరిగెత్తేవాడు కమల వాళ్ళాయన సూర్యారావు. గుండెపోటు ఎందుకొస్తుందీ? నిన్న పొద్దున్న స్కూటర్ మీద వస్తుంటే వెనక నుండి లారీ కొట్టిందట. అక్కడికక్కడే ప్రాణం పోయిందిట. సాయంకాలానికి అంతా అయిపొయింది.మనిషి జీవితం అంతేకదా. నిన్న పోతే ఇవాళకి రెండు.
ఏడ్చి ఏడ్చి మంచానికి అంటుకుపోయింది కమల.
“ఆయన లేకుండా నేను ఎలా బ్రతుకుతాను సరళా. నాకు బయటి ప్రపంచం తెలియదు. నా అంతట నేను బాంక్ నుండి డబ్బు తెచ్చుకోవడం కూడా రాదు నాకు. అన్నీ ఆయనే చూసుకునే వారు. పిల్లల స్కూలు ఫీజులు, కరెంటు బిల్లు, ఇంటిపన్ను కట్టడం సమస్తము ఆయనే చేసేవారు. ఈ పిల్లలు, సంసారం ఎలా ఈదుతానని నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయారు? ” అంటూ ఒకటే ఏడుపు. నా గుండె తరుక్కు పోయిందనుకో.” చెబుతున్న సరళ గొంతు జీరబోయింది.
“కమల పద్ధతైన మనిషి. అంత చదువుకున్నా సాధారణ ఇల్లాలిలాగా సింపుల్ గా వుండేది. ఒక్కత్తీ ఎప్పుడు బయటకు వెళ్ళి కూడా ఎరుగదు. ఈ కాలంలో ఒంటరిగా ఆడది బ్రతకడం అంటే కత్తిమీద సాము వంటిదే. దేవుడే కమలకు ధైర్యం ఇచ్చి కాపాడాలి.” మళ్ళీ అంది సరళ.
“అయ్యో! కళకళలాడుతూ వుండే ఇల్లాలు. ఎంతకష్టం వచ్చింది? నేనూ వెళ్ళి మాట్లాడించివస్తాను రేపో మాపో. నువ్వు లేచి స్నానం చేసి ఎంగిలిపడు.” అని చెప్పి వెళ్ళింది కావేరి.
కమల ఇక్కడ వున్నరోజుల్లో పరమేశ్వరితో స్నేహంగా వుండేది.
సుర్యారావుకు జరిగిన ప్రమాదం గురించి వినగానే విలవిలలాడి పోయింది ఆమె.
“ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద కష్టం వచ్చింది కమలకు. పిల్లలు ఇద్దరూ చిన్నవాళ్ళు. వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు ఇన్ని బాధ్యతలు ఎలా మోస్తుందో ఏమిటో!” అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది పరమేశ్వరి.
” ఇప్పుడు బయలుదేరినా అక్కడికి వెళ్ళెసరికి దీపాలు వేసేవేళ అవుతుంది. అప్పుడు చూడకూడదని అంటారు పెద్దవాళ్ళు.. రేపు వెళ్ళి గుండె దిటవు చేసుకోమని చెప్పి, ఓదార్చి వస్తాను.” అంది
మరునాడు మధ్యాన్నం క్రింది అంతస్థులో వుంటున్న పరమేశ్వరి ఇంటికి వెళ్ళింది కావేరి . ఆమెతో కలిసి వెళ్ళి పరామర్శించి రావాలనుకుంది.
“నేను పొద్దున్నేవెళ్ళి చూసొచ్చాను కావేరీ. ఎలా పలుకరించాలా అని భయపడుతూ వెళ్ళానా? ఇంటి నిండా కమల అక్క చెల్లెళ్ళు , మరిది, తోటికోడలు, వాళ్ళ పిల్లలు గోల గోలగా వుంది”.
“మగవాళ్ళంతా ముందుగదిలో చేరి క్రికెట్ చూస్తూ సిక్స్, ఫోర్ అంటూ అరుపులు. ఆడవాళ్ళంతా లోపలి గదిలో జంధ్యాల గారి పాత సినిమా పెట్టుకుని శ్రీలక్ష్మి హాస్యం చూసి నవ్వుతున్నారు”.
“ కమల నన్ను చూసి లేచి వచ్చింది. నేను వెళ్ళి పనిగట్టుకుని ఏడిపించినట్టయ్యింది. రాత్రి నిద్రపోలేదో ఏమో పాపం కమల బాగా డీలాపడినట్టు కనబడింది. సూర్యారావు గారు చాలా సరదా అయిన మనిషి. మంచివాడు. భార్య అంటే ప్రాణం. పిల్లలను అల్లారుముద్దుగా చూసుకునేవాడు. అటువంటి మనిషిని దేవుడు అల్పాయిష్కుడిని చేసి కమలకు తీరని అన్యాయం చేసాడు. ఎప్పటికి కోలుకుని మామూలు మనుషుల్లో పడుతుందో పాపం.”
“ఇంటిపనికి వంటమనిషిని పెట్టినట్టుంది. ఆవిడ అందరికీ కాఫీలు, జూసులూ అందిస్తోంది. ఇక కూర్చోబుద్ధి కాక లేచి వచ్చేసాను” అందామె.
ఇంకోరోజు కావేరి మరొక ఇల్లాలితో కలిసి వెళ్ళి కమలను చూసి వచ్చింది.
“మమ్మల్ని చూడగానే భోరున ఏడుస్తుందేమో ఎలా ఓదార్చాలో, ధైర్యం చెప్పాలో అనుకుంటూ వెళ్ళానా సరళా! ఆ అవసరం లేకుండా కమల మామూలుగానే పలుకరించింది.”
” ఎంతో అందంగా అలంకరించుకునే కమల బోసిపోయి కనబడింది. మామూలుగా కళ్ళనిండా కాటుక, చేతుల నిండా బంగారుగాజులు, జరీఅంచు చీరలో వుండే మనిషి, నలిగి పోయిన నూలు చీరలో లోతుకు పోయి ఎర్రబడిన కళ్ళు, రేగిన జుట్టుతో కనబడితే గుండె పిండేసినట్టు అయ్యింది నాకు.” అంటూ అక్కడి విశేషాలు సరళకు చెప్పింది కావేరి.
ఆ కాంప్లెక్స్ ఆడవాళ్ళ క్లబ్ సెక్రెటరీ శ్యామల తన వంతుగా నలుగురిని వెంటేసుకుని వెళ్ళి కమలను పలుకరించి వచ్చింది.
“ కమల వాళ్ళాయన పనిచేసే ఆఫీసు మేనేజర్ అట. సుర్యారావు గారి వయసే వుంటుంది. మరి అంత చనువు వుందో ఏమో తిన్నగా వాళ్ళ పడకగదిలోకి వెళ్ళి కూర్చుని కమలతో మాట్లాడుతున్నాడు.. నన్ను చూడగానే బయటకు వచ్చింది కమల” .
“మావారికి రావలసిన డబ్బు, ప్రావిడెంట్ ఫండ్ గురించి చెబుతున్నారు” అని మేము అడగక ముందే చెప్పింది.” అంటూ కొత్త విశేషాలు అందించారు అందరికీ.
ఆ గృహ సముదాయంలో చాలాకాలం వుండి వెళ్ళడం వలన బాగా పరిచయం వున్నవారిని పదమూడోరోజు శుభస్వీకారం రోజు భోజనాలకు పిలిచింది కమల.
శ్యామల,కావేరి, పరమేశ్వరి, సరళతో బాటు ఇంకొంతమంది వెళ్ళారు.
భోజనాలకు సూర్యారావు గారి ఆఫీసు
వాళ్ళను కూడా పిలిచింది కమల. అందరినీ తాను స్వయంగా పలుకరించి “నిదానంగా తినండి” అంటూ ఆ హాలు అంతా కలయ తిరుగుతూ, ఒక్కొక్క భోజనాల బల్ల దగ్గర ఆగి చెప్తోంది .
దానిమ్మ పువ్వు రంగు పట్టుచీరలో, చెవిలో మెరుస్తున్న వజ్రాల కమ్మలు, మెడలో
కెంపుల నెక్లేసుతో అందమైన కమల మరింత అందంగా కనబడుతుంటే ఒకరినొకరు అర్థవంతంగా చూసుకున్నారు అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నుండి వచ్చిన ఒకప్పటి కమల సహవాసులు.
“కమల నేను కట్టుకున్న గద్వాల చీర చాలా బాగుందని మెచ్చుకుంది. గద్వాల నుండి చీరలు తెచ్చి అమ్మే అతను ఇంకా వస్తున్నాడా? అని అడిగింది. ఈసారి నేను కట్టుకున్న నెమలికంఠం రంగు చీర గనుక తెస్తే తన అడ్రెస్ ఇచ్చి అక్కడకు పంపమని అంది.” అంది కావేరి.
“కమల వాళ్ళాయన భీమా డబ్బూ, ఆఫీసు నుండి రావలసిన సొమ్ము అంతా కలిపి బాగానే అందుతోంది కమలకు. ఇంక దిగులేముంది?” అనుకున్నారు ఇంటికి వస్తూ.
*. *. *
రెండు నెలలు గడిచేసరికి కమలకు సూర్యరావుగారి ఆఫీసులోనే వుద్యోగం వచ్చినట్టు తెలిసింది అందరికీ.
“కమల చీరకు మాచింగ్ బొట్టు, పెదవులకు లిప్ స్టిక్, ముఖానికి బాగా మేకప్ వేసుకుని హాండ్ బాగ్, ఎత్తుమడమల చెప్పులు వేసుకుని ఎంతో స్టైలుగా ఆఫీసుకు వస్తుందిట.” అని పరమేశ్వరిగారి వార్త.
” ఒక్కోసారి ఆఫీసు పనిగంటలు అయిపోయాక కూడా మేనేజర్ గారి గదిలో కూర్చుని వుంటుందట. పిల్లలు కూడా ఆఫీసుకే వచ్చి అంకుల్ అంటూ ఆయన గదిలోకి చనువుగా వెడతారట. వాళ్ళ స్కూలు ఫీజులు కట్టడం, ఆవిడ బాంకు పనులు ఆయనే చూస్తాడట.” అని శ్యామల గారి కబురు.
“ మేనేజర్ గారి భార్యా, పిల్లలు హైదరాబాదులో వుంటారుట. ఇక్కడ ఆయన ఒంటరిగా వుంటాడుట పాపం.అందుకే కమల ఆయన్ని తరచు భోజనానికి పిలుస్తుందట” అని సరళ మాట.
“ ఆయనే పట్టుబట్టి కమలను ఆఫీసర్స్ క్లబ్ లో మెంబరుగా చేర్పించాడట. సూర్యారావు వున్నప్పుడు ఆ క్లబ్ కి సెక్రెటరీ గా వుండేవాడట. కమల క్లబ్ కి వెళ్ళేటప్పుడు పంజాబీ డ్రెస్ వేసుకుని వెడుతుందిట షటల్ ఆడడానికి అనుకూలంగా వుంటుందని. మొగుడు పోతేనేమిలే? అభిమానంగా చూసుకునే ఆఫీసరు వున్నాడు కమలకు.” అని కావేరి వువాచ.
“ మొన్న మేము అమీర్ పేటకు వెళ్ళినప్పుడు కమల, తన కూతురుతో కలిసి చుడీదారు షాపు నుండి ఇన్ని సంచీలు మోసుకుని దిగి రావడం చూసాను. తల్లి, కూతురూ ఇద్దరూ చుడిదారులే వేసుకున్నారు.గబుక్కున చూస్తే ఇద్దరూ అక్కచెళ్ళెళ్ళు అనుకునేట్టు యంగ్ గా కనబడింది కమల. సుర్యారావు గారు పోయాక బాగా మారిపోయింది కమల.” అంది శ్యామల
“చిన్న తమ్ముడికి ఈ కోవిడ్ దెబ్బతో ప్రైవేటు స్కూలులో వుద్యోగం వూడిపోయింది. కమలకు వాళ్ళ ఆఫీసరు గారి దగ్గర మంచి పరపతి వుందికదా ఏదేనా కాళీ ఉంటే వేయించమని అడగాలి.”
మనసులో అనుకుంది సరళ.
. ————. ————— —————

1 thought on “లోకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *