September 23, 2023

వారధి

రచన: ప్రభావతి పూసపాటి

“ రావులపాలెం దిగేవాళ్లెవరో ముందుకిరండి” కండక్టర్ అరుపు తో బస్సులో నిద్దరోతున్నవాళ్ళుఅంతా ఉలిక్కిపడి సర్దుకొని కూర్చున్నారు. నెమ్మదిగా తెల్లవారుతోంది. కిటికీలోనుంచి పచ్చని పంటపొలాలని చూస్తూ రవి పుణ్యమా అని ఇన్నాళ్ళకి మళ్ళి ఇలా సొంతవూరు రాగలిగాను స్వగతంగా అనుకొంది జానకి.
“నువ్వే అమ్మకి నచ్చచెప్పగలవు అత్తయ్య ” రవి పదే పదే పోరుపెట్టి ప్రయాణం చేయించాడు. రావులపాలెం దగ్గర చిన్న పల్లెటూరు లో వుంటున్నారు మా అన్నయ్య, వదిన..
రవి మా అన్నయ్య వాళ్ల ఒక్కగానొక్క కొడుకు. నా పెళ్లి అయ్యేంతవరకు నా కొంగు పట్టుకొని నా వెంటే తిరుగుతుండే వాడు. నా దగ్గర బాగా చేరిక. ఏయే విషయమైనా నా తో సంప్రదించి నా సలహా సంప్రదింపులు తీసుకోవటం వాడికి చాలా అలవాటు. ఈ సారి పెద్దభారమే నామీద వేసాడు.
ఆలోచనలకి బ్రేక్ వేస్తూ బస్సు రావులపాలెం బ్రిడ్జిమీద ఆగింది. కిందకి దిగి రిక్షా చేయించుకొని ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళుతుంటే మనసు పాతికేళ్ల వెనక్కి పరుగు తీసింది.
” చదువుకొన్న అమ్మాయి, పైగా పట్నం లో హాస్టల్ లో ఉండి మరి చదువుకొందిఅంటున్నారు మనతో కలిసి ఉండగలుగుతుందా” అమ్మ తన మనసులోని మాట బయట పెట్టింది.
” అబ్బాయ్ ఇష్టపడ్డాడు పైగా వాళ్ళు మనతో కలిసి ఇక్కడ ఊళ్ళో కాపురం వుండరు కదా. మంచి సంప్రదాయం కలవాళ్ళ అమ్మాయి. ఎలాంటి సందేహాలు పెట్టుకోకు”. నాన్న అమ్మకి సర్ది చెప్పారు.
మాది వూళ్ళో మంచి పేరున్న కుటుంబం, మా ఇంటిని పంటపొలాల మధ్య విశాలంగా అన్ని వసతులతో కట్టించ్చారు. వొదిన సౌజన్య పేరుకి తగ్గట్టుగా చాల అందంగా, నాజూగ్గా వుంది. నాతొ చాలా స్నేహం గా కలిసిపోయింది. అన్న వదినల్ని చూసి అంతా ముచ్చట పడ్డారు.
” ఈ వాటర్ బండ్ల వలన దారులు ఇరుకు అయిపోతున్నాయి” అంటూ ఎదురుగ వస్తున్న వాటర్ టాంకర్ కి దారి ఇవ్వడానికి పక్కకి జరిగిన రిక్షా కుదుపుతో ” ఏమైంది ?” అడిగింది జానకి.
ఊళ్ళో ఇప్పుడు అందరు ఈ వాటర్ బండ్ల నీళ్ళే తాగుతున్నారు కాదమ్మా…. చెరువులు, బావుల నీళ్ల్లు తాగడం మానేశారు కందా…. రిక్షా ని రోడ్డు ఎక్కిస్తూ చెప్పాడు.
నిజమే ఇప్పుడంటే “రక్షితమంచి నీటి పధకం పేరున మంచి నీరు ఇంటింటికి సరఫరా చేస్తున్నారు కానీ అప్పట్లో అందరు బావి నీరు గాని, చెరువుల్లోని నీరు గాని తాగేవారు. ” ఈ మంచినీళ్లు చాలా చప్పగా వున్నాయి, తాగినా దాహం తీరటం లేదు. ఇక్కడ పంపు నీళ్లు దొరుకుతాయా ?” నెమ్మదిగా నాతొ చెప్పటంవెనకనించి విన్నది అమ్మ… “ఇదియేమి చోద్యం…. మంచినీళ్లు చప్పగావుండటం ఏమిటి… మేమంతా తాగటం లేదా ఏమిటి. ?? మా బావి నీళ్లు ఎంత కమ్మగా వుంటాయో, పిదప కాలం పిదప బుద్ధులు…. అమ్మ తన ధోరణి లో విసురుగా మాట్లేడేస్తోంది.. కొత్త కాబట్టి భయం భయం గా వింటూ నిలబడిపోయింది వదిన. “మాకు పంపులో నీళ్లు మాత్రమే తాగడం అలవాటు, అవి పంచదార నీళ్లలా ఉంటాయి”. నెమ్మదిగా గొణిగింది నా చెవిలో… నా పెళ్లఅయ్యాక హైదరాబాద్ వెళ్ళాక కానీ వదిన అన్నది ఎంత నిజమో… అక్కడ ఊళ్ళోబావి నీళ్లు తాగడానికి ఎందుకు అంత ఇబ్బంది పడిందో అర్థం అయ్యింది ఇక్కడ ఉన్నన్నాళ్ళు సర్దుకు పోయింది తప్పఎప్పుడు అమ్మకి ఎదురు సమాధానం ఇవ్వలేదు.
” ఎవరింటికమ్మ ” రిక్షా అబ్బాయ్ మాటలు మళ్ళి ఆలోచనలకి బ్రేక్ వేసాయి, రిక్షా ఊళ్లోకి వచ్చేసింది. వూరు చాలా మారిపోయింది.. పూరిగుడెసెలు స్తానం లో పక్క ఇళ్లు వచ్చేసాయి ప్రతి ఇంటిలోనూ టాయిలెట్స్ కనపడుతున్నాయి. వాటిని చూసాక వదిన పెళ్ళైన కొత్త రోజులు గుర్తుకు వచ్చాయి
మణుగుడుపుల తెల్లవారిన రోజే వదిన పడిన అవస్థ అన్నయ్యని కూడా ఇబ్బందికి గురి చేసింది, నాన్నగారు ఇంటి ఆడవాళ్ళ గురించి టాయిలెట్స్ కట్టించారు కానీ ఇంటికి చాలా దూరం గా ఓపెన్ టాయిలెట్స్పొ ఉండేవి. పోద్దున్నే చేతిలో చెంబు తో వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడింది. ” బాగుంది సంబడం మాకు ఎప్పటినుంచో ఇదే అలవాటు. ఈ మాత్రం కూడా సర్దుకోలేదా. చెంబుతో వెళ్లడం లో నామోషీ ఏమిటిటా.. చోద్యం కాకపోతే “అమ్మ సన్నాయి నొక్కులు వదినకి నాకు వినపడ్డాయి, ఆ మాట వదినకి కళ్లనీళ్లు తెప్పించేశాయి… ” కానీ మౌనంగా భరించింది. వదిన ఆ పరిస్థితిచూసి నాకు చాల జాలి వేసింది. తన ఇంట్లో అట్టచేడ్బాత్రూమ్స్ అలవాటు వున్న తనకి ఇలా ఆరుబయట వెళ్ళాలి అంటే ఇబ్బందే… కానీ అమ్మకి ఇవన్నీ పట్నం షోకుల్లా అనిపించేవి.
రిక్షా అయ్యరు హోటల్ సందులోకి తిరిగింది. అయ్యరు హోటల్ లోంచి మసాలాదోసా ఘుఘుమలు ముక్కుపుటాలను అదరగోట్టాయి…. వదినకి ఈ అయ్యేరు హోటల్ దోస తినాలని తెగ మోజుగా ఉండేది… అక్కడికి వెళ్ళటం తినటం అసలు సాధ్యం కాదు, ఒక రోజు రుచి చూస్తుందని ఇంటికి తెప్పిస్తే “మా ఇంట వంటా లేవు ఇలాంటి పాడు అలవాట్లు, మడి ఆచారం లేని ఈ తిళ్ళు, ఇలాంటి చోద్యం నేనెక్కడ చూడలేదు”అని అమ్మ చిన్న రాధంతంచేసింది. ఆ మాటలువిన్న వదినకి దోస గొంతు దిగలేదు. చిన్న చిన్న విషయాలు ఐన అమ్మ తన పంతం, తన మాటే నెగ్గాలి అని ప్రతి దానికి ఎదో ఒక పుల్లవిరుపు మాట అంటూ తన అధికారం, పెత్తనం చెలాయిస్తూ ఉండేది.
చెప్పటానికి చూడటానికి చిన్న విషయాల్లాగే వున్న ఇలాంటి ఎన్నో విషయాలు పెళ్ళైన కొత్తల్లో వదిన ఎదుర్కోవాల్సి వచ్చింది. అమ్మ మీద గౌరవము వలనో ఎక్కువ ఇక్కడ వీళ్ళతో కలిసి ఉందనుకదా ఎందుకు వాదన అనో, ఘర్షణ వల్లసంబంధ బాంధవ్యాలు చెడిపోతాయనో వదిన ఎప్పుడు తన అభిప్రాయాలూ చెప్పలేదు. అమ్మవాళ్ళు ఎప్పుడైనా అన్నయ్య దగ్గరికి వెళ్లినా అక్కడ కూడా అమ్మ ఏఏ విషయములోను సర్దుకొనేదికాదు. తనుఒక్కత్తె మనిషి అన్నట్టు, తనకే ఇష్టాయిష్టాలు వ్యక్తపరిచే అధికారం వుంది అన్నట్టు ప్రవర్స్తిస్తు ఉండేది. ఇలా ఒకటా రెండా చాల విషయాలలో అమ్మవదిన ని తన మాటలతో గాయపరుస్తూ ఉండేది,. వదిన తన దగ్గర చాలాసార్లు చెప్పుకొని బాధ పడేది. కానీ అమ్మ పెద్దరికాన్ని గౌరవించి అణుకువగా మసలేది.
కాలచక్రం గిర్రున తిరిగి కోడలి స్తానం లో వున్న వదిన ఇప్పుడు అత్త స్థానంలోకి వచ్చింది. తన పెళ్ళైన కొత్తల్లో అమ్మ మాటల వలన, ప్రవర్తన వలన ఎలాంటి భాదపడిందో ఇప్పుడు కోడలి విషయము లో తన మాటల వలన ఆలా జరగకూడదు అని అనుకొందో కానీ ఇప్పుడు కోడలి తో కూడాఅల్లాంటి పరిస్థితే ఎదుర్కోవాల్సి వచ్చింది.
రవి ఇష్టపడ్డాడని వాడు కోరుకున్న అమ్మాయి తోనే పెళ్లి జరిపించారు. పెళ్లి ఐన రెండో రోజున ఇంకా ఇంట్లో చుట్టాలు చాలా మంది వున్నారు. వదిన పొద్దున్న పూట కదా ఆ నైటీవేసుకోకుండా చీర వేసుకొమ్మన్నదని “మా ఇంట ఎలాంటి ఆంక్షలు లేవు, ఆ బరువు చీరలు కట్టలేను” అని విసురుగా చెప్పింది. వదినపెద్దమనసుతో అర్థం చేసుకొని సరే నీఇష్టం అని ఆ విషయాన్ని తేలికగా తీసుకొంది. వారం లో కనీసం రెండు మూడుసార్లు హోటల్ నుంచి భోజనం తెప్పిస్తావు ఎందుకు ఇంట్లో వండుకోవచ్చు కదా అంటే “మొదటినుంచి ఇంతే, మాకు బయట తిళ్ళు తినటం అలవాటు, మేము ఇలాగే పెరిగాము” అని తలబిరుసుగా అన్నదానికి కూడా వదిన పోనిలే పిల్లలు ఇంకా చిన్నవాళ్ళేకదా, ఇదే కదా వయసు ఎంజాయ్ చేస్తున్నారులే అని తనకి తానె సర్దిచెప్పుకొంది. జీతం లో సగభాగం బట్టల మీదే ఖర్చు పెడుతోందని గుర్తు చేస్తే “నా ఇష్టం, నేను ఇంతే, నేను ఎవరి మాట వినను “అని జవాబు ఇస్తే పోనిలే ఇంకా పిల్లల భాద్యత లేదుకదా, రేపు పిల్లలు పుట్టి ఖర్చులు పెరిగితే వాళ్లే పొదుపు చేసుకొంటారు అని సరిపెట్టుకొన్నది. ఇలా ప్రతి చిన్న విషయములోను వదిన తనకుతానే సమాధాన పడుతూ తనకి రవి భార్యకి మధ్య దూరం పెరగ కుండా తనవంతు కృషి చేసింది.
కానీ రవి భార్య ఆ మర్యాద, ఆ గౌరవం నిలుపుకోలేకపోయింది. ప్రతివిషయములోను తన మాటే నెగ్గాలి, తను అనుకున్నదే జరగాలి అన్నభావం తప్ప వదిన లాంటి సర్దుకుపోయే మనస్తత్వం కానీ, వదిన మంచితనం కానీ గుర్తించలేకపోయింది. ఘర్షణ ఎందుకు అని ఎంత వొదిగి వున్న ఆత్మాభిమానం దెబ్బతినేలా ప్రవర్తించటం వదిన సహించలేక పోయింది. వదిన పెద్దరికాన్ని అవహేళన చేసింది, తన మనసు గాయపడేలా ప్రవర్తించింది.. తన ప్రేమ ఆప్యాయత తెలుసుకొని తన ప్రవర్తన మార్చుకునేంతవరకు కొన్నాళ్ళు కోడలి ఇంట కాలు పెట్టను అంటూ ఇక్కడికి వచ్చేసింది. తల్లి వ్యవహారం తో కంగారుపడి ఎవరికీ నచ్చచెప్పాలో తెలియక నా దగ్గరికి వచ్చిఇవన్నీ చెప్పి తల్లి కి నచ్చచెప్పి తీసుకురమ్మని నన్ను పంపించాడు.
“ఇదే ఇళ్ళమ్మ” రిక్షా అబ్బాయ్ పిలుపుతో ఆలోచనలు తెగి వాడికి డబ్బు ఇచ్చి పంపేసి గేట్ తీసుకొని లోనికి వస్తున్న నన్ను చూసి “ఇదేంటి ఉరుము, మెరుపు లేకుండా ఇలా ఊడి పడ్డావు. అంటూ హత్తుకొని లోపలి తీసుకొని వెళ్ళింది.
భోజనాలయ్యాక మనసులోని భాద తెలుసుకొందామని ” అసలు ఇక్కడికి ఎందుకు వచ్చేసావు? ఏమి జరిగింది? ఏమి తెలియనట్టు అడిగాను”
ఛాలనాళ్ళనుంచి ఉగ్గపెట్టుకొని ఉందేమో ప్రేమగా అడిగేటప్పటికీ కళ్ళలో నీళ్లుతిరుగుతుండగా మెల్లగా చెప్పటం ప్రారంభించింది.
“జరిగినవాటిల్లో నా తప్పుకాని.. నాకోడలి తప్పుగాని ఎత్తి చూపించేంత పెద్దవి కావు జానకి…. మా కోడలు నేటితరం అమ్మాయిల్లాగే ప్రవర్తించింది… కానీ నేను పాతతరం అత్తగారిలా రియాక్ట్ అవ్వకూడదు అనుకొన్నాను అంతే… నా పెళ్ళైన కొత్తల్లో నేను మీ అమ్మగారికి గౌరవం ఇచ్చి ఎదురు సమాధానం చెప్పలేక పోయాను…. తరం మారింది కదా ఈ కాలం అమ్మాయి కాబట్టి మాటకి మాట బదులు ఇచ్చింది… అప్పట్లో మంచి కోడలిలా వుండాలని అత్తయ్యగారికి ఎదురు చెప్పకుండా సర్దుకొనిపోయాను, ఇప్పుడు మంచి అత్తగారిలా ఉండాలని ఎదురు సమాధానం ఇస్తున్న కోడలిని తప్పుపట్టడం ఇష్టం లేక దూరంగా వచ్చేసాను అంతే…. పాత తరం లోని వాళ్ళు తమ మాటే నెగ్గాలని ఎలా అనుకొనేవారో, ఈ తరం వాళ్ళుకూడాఅంతే తమ మాటే నెగ్గాలని అనుకొంటున్నారు.. మధ్యలో వున్న మన తరం వాళ్లే ఇరు తరాలవారికి మధ్య వారధిలా వుంటూ ఇంకా మానవీయ సంబంధాలు నిలబడటానికి తమవంతు కృషి చేస్తున్నాము.. అటు మన ముందుతరం వాళ్ల వయసుకి, అనుభవానికి గౌరవం ఇచ్చి సర్దుకొన్నాము, ఇప్పుడు ఈ తరం వాళ్ళ టెంపరితనాన్ని, పొగరుమోతనాన్నికూడా ప్రేమ అనే భావం తో కప్పిపుచ్చి సర్దుకొంటున్నాము. చూసావా ఎప్పుడు మన తరమే ఇరు వైపులా ఎవరి మనసు నొప్పించకుండా మసలుకునేలా ప్రవర్తించింది. కానీ ఆ మంచితనాన్ని ఆ తరం పట్టించుకోలేదు, ఈ తరం అసలు గుర్తించటమే లేదు… గుక్కతిప్పుకోకుండా మనసులోని విషయం బయట పెట్టింది.
“అవును వదిన నువ్వు చెప్పింది అక్షరాలా నిజం, మన తరం చాల ప్రత్యేకమని చెప్పాలి. అటు పెద్దల మనసు నొప్పికలిగించకుండా మసిలాము. ఇటు పిల్లల మనసు తెలుసుకొని వాళ్ళకి అనుగుణంగా మనల్ని మనం మార్చుకొంటున్నాము. కానీ భాద కలిగించే విషయము ఏమిటంటే అటు ఆ తరం కానీ ఇటు ఈ తరం కానీ మన తరాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. నిన్న రవి నా వద్దకు వచ్చి అమ్మకి నచ్చచెప్పి తీసుకొని రమ్మని చెప్పి ఇక్కడికి పంపించాడు. నేను కూడా ముందుగా నీతోకూడా మాట్లాడి అప్పుడు రవి భార్య తో మాట్లాడదామనుకొన్నాను, కానీ నీ మానసిక సంఘర్షణ చూసాక చెప్పవలసింది, తెలియపరచవలసింది నీకు కాదు రవి భార్యకి అని బలంగా అనిపిస్తోంది. అప్పట్లో అమ్మకి చెప్పేంత ధైర్యం లేకపోయింది, కానీ ఇప్పుడు రవి భార్యకి తెలిసివచ్చేలా చెప్పే తెగువ వచ్చింది. రెండు నదులు ఎంత ముఖ్యమో వాటిని కలిపే వారధి కూడా అంతకన్నా ముఖ్యం అని తెలిసేలా చేస్తాను వదిన “సాయంత్రం బస్సుకి టికెట్స్ తెప్పించమని ఇప్పుడే అన్నయ్యకి చెప్పివస్తాను. అని ధృడ నిశ్చయంతో వెళుతున్న జానకి ని చూసి రామసేతు నిర్మాణం లో తనవంతు సాయం అందించదానికి ఆత్రుత పడుతున్న ఉడుత లా తరాల మధ్య వారధి బలపడటానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నట్టు అనిపించింది సౌజన్యకి. .

1 thought on “వారధి

  1. ఇదిఅనేటితరం కధ ఇదే సమస్యలని చాలామంది పాతతరంవారు ఎదుర్కోంటున్నారు. కధ నేచురల్ గా ఉంది.

Leave a Reply to M N A R MOHANRAO Cancel reply

Your email address will not be published. Required fields are marked *