April 24, 2024

అమ్మమ్మ – 23

రచన: గిరిజ పీసపాటి

‘పున్నామ నరకం నుండి తప్పించేవాడు కొడుకు మాత్రమే’ అనుకునే రోజులవి. తనకు కొడుకు పుట్టినా దక్కలేదు. కనుక, వియ్యంకుడికైనా మనవడు పుడితే బాగుండునని అమ్మమ్మ ఆరాటం. అంతే తప్ప ఆడపిల్లల పట్ల చిన్నచూపు ఎంత మాత్రమూ కాదు.
నాగ తోడికోడలికి కూతురు పుట్టిన ఏడు నెలలకు నాగ మళ్ళీ గర్భవతి అయిందని వియ్యంకుడి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది అమ్మమ్మకి. మళ్ళీ అమ్మమ్మకి హడావుడి మొదలైంది.
ఈసారి తొమ్మిదవ నెలలో రాముడువలస వెళ్ళి, సీమంతం జరిపించి, నాగ పురుడు పోసుకునే వరకు రాముడువలసలోనే ఉండిపోయింది అమ్మమ్మ. వెళ్ళి మళ్ళీ రావడం అంటే శ్రమ, డబ్బు వ్యర్ధమని.
1975 వ సంవత్సరం సరిగ్గా సంక్రాంతి పండుగ రోజున ఉదయం ఏడు గంటలకు ధనిష్ఠ నక్షత్రంలో నాగ పండంటి మగ పిల్లాడికి జన్మనిచ్చింది. నాగ జన్మ నక్షత్రం కూడా ధనిష్టే కావడంతో, ఒక వేళ ఆడపిల్ల ధనిష్ఠ నక్షత్రంలో పుడితే నాగకు ప్రాణ గండమని తెలిసిన పీసపాటి తాతయ్య, టెన్షన్ భరించలేక పొలానికి వెళ్ళిపోయి, పొలం గట్టు మీద పచార్లు చేయసాగారు.
ఇంతలో పెద్ద పాలేరు వచ్చి “బుగతా! నాగమ్మలుకి కొడుకు పుట్టినాడట. మిమ్మల్ని ఎమ్మటే రమ్మనమని అమ్మగారు కబురు సేసేరు” అని చెప్పగానే పీసపాటి తాతయ్య ఆనందంగా ఇంటికి వచ్చారు.
పదకొండవ రోజున ఘనంగా బారసాల జరిపించి, ఇంటి ఇలవేల్పుల పేర్లతో పాటు ఇద్దరి తాతయ్యల పేర్లు, రాయగడ మధ్య గౌరమ్మ పేరు కలిపి ‘పీసపాటి వెంకట నాగ నరసింహ గౌరీ వర ప్రసాద్ శాస్త్రి’ అని పిల్లవాడికి నామకరణం చేశారు. అమ్మమ్మ తను పెట్టాల్సిన బట్టలు, పిల్లాడికి వెండి గ్లాసు చదివించింది. పిల్లాడిని ముద్దుగా అందరూ ‘నాని’ అని పిలవసాగారు.
మరికొన్ని రోజులు ఉన్నాక, తన పనులు పోతాయంటూ హైదరాబాదుకి ప్రయాణమై వెళ్ళింది. మళ్ళీ కొన్ని సంవత్సరాల వరకూ రాముడువలస వెళ్ళలేకపోయింది. నాగను చూసి చాలా కాలమయ్యింది. క్షేమంగా ఉన్నామని వియ్యంకుడు రాసిన ఉత్తరాలలోనే నాగ క్షేమ సమాచారం తెలిసేది.
అప్పుడప్పుడు రాజేశ్వరమ్మ గారిని కలిసి, కాసేపు ఉండి వస్తోంది. వియ్యంకుడు నాటకాల రీత్యా హైదరాబాదు వస్తే, ఆ నాటకం జరిగే ప్రదేశానికి వెళ్లి (తాతగారి నాటకాలు ఎక్కువగా రవీంద్రభారతి, త్యాగరాయ గానసభ లో జరిగేవి) నాగ, పిల్లల క్షేమ సమాచారం తెలుసుకునేది.
ఒకరోజు వియ్యంకుడి దగ్గర నుండి ఉత్తరం అందుకున్న అమ్మమ్మ, అందులో ఉన్న వార్తకు ఆనందించాలో లేక బాధపడాలో అర్ధం కాని అయోమయానికి గురయింది.
‘పెద్ద బాబుకి విశాఖపట్నంలోని AVN కళాశాల హై స్కూల్ లో గుమస్తా ఉద్యోగం వచ్చిందనీ, గిరిజను మా దగ్గర ఉంచి, పెద్ద పాపని, నానిని తీసుకుని వెళ్ళి, విశాఖపట్నంలో పెద్ద బాబు, నాగ కాపురం పెట్టారని’ ఆ ఉత్తరం సారాంశం.
తెనాలిలో తమ దగ్గర ఉండి, మెట్రిక్యులేషన్ పూర్తి చేసి‌న పెద్ద బాబు చేత ఐటిఐ చేయించి, తెలిసిన వాళ్ళకు చెప్పి, మంచి ఉద్యోగం వేయించాలని అప్పుడు నాగ వాళ్ళ నాన్నగారు ఎంత ప్రయత్నించినా “మాకు ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం లేదు. ఉద్యోగం చేస్తే తప్ప జరుగుబాటు కాని కుటుంబం కాదు మాది” అని అన్నారు.
‘ఇప్పుడు పెళ్ళయి పిల్లలు పుట్టేసరికి ₹75/- జీతానికి ఉద్యోగంలో చేరాడు. ఆ కొద్ది మొత్తంతో నెలంతా గడపాలంటే ఎంతో కష్టపడాలి. అపురూపంగా పెరిగిన పిల్లకు ఆఖరికి ఈ గతి పట్టించి వెళ్ళిపోయాడాయన’ అని అనుకుంది చనిపోయిన భర్తను తలచుకుని.
వాళ్ళు అడగకపోయినా అప్పుడప్పుడు నాగ పేరున ఎంతో కొంత మనియార్డర్ చేసేది. అలాగే నాగ పుట్టిన రోజుకు, పెళ్ళి రోజుకి బట్టలు కొనుక్కోమని డబ్బు పంపేది. పంట బియ్యం రాముడువలస నుండి తెచ్చుకుంటూ, జీతం, అమ్మమ్మ పంపించే డబ్బులతో హాయిగా గడిచిపోసాగింది నాగ సంసారం.
ఒకసారి నాగను, పిల్లలను చూసి మూడు సంవత్సరాలు అయ్యాయని, వైజాగ్ వచ్చింది అమ్మమ్మ. ఐదు రోజులు గడిచాక “నాగేంద్రుడూ! నిన్ను, బాబును, వసంతని, నానిని చూసాను కానీ గిరిజను చూడలేదు. ఒకసారి దాన్ని కూడా చూడాలనుంది” అని అడిగింది.
“సరేనమ్మా! ఈయనతో చెప్పి ఒకసారి రాముడువలస వెళ్ళి, గిరిజను చూసి వద్దాం. నేను కూడా చూసి మూడు నెలలు దాటింది” అంది నాగ. అందరూ కలిసి రాముడువలస వెళ్ళారు. గిరిజను అమ్మమ్మ ప్రేమగా దగ్గరకు తీసుకోబోతే, ఎవరో అనుకుని, భయపడి, మామ్మ వెనక దాక్కుంది గిరిజ.
అప్పుడు మామ్మ “తప్పమ్మా! ఆవిడ మీ అమ్మమ్మ గారు. పరాయి వ్యక్తి కారు” అని చెప్పి, గిరిజ చెయ్యి పట్టుకుని, మెల్లిగా అమ్మమ్మ దగ్గరకు తీసుకుని వెళ్ళింది. “అమ్మమ్మ అంటే!?” ఐదేళ్ల గిరిజ అమాయకంగా ప్రశ్నించింది.
“నేను మీ నాన్నకు ఎలాగైతే అమ్మనో, అలాగే ఆవిడ మీ అమ్మకు అమ్మ. అంటే నీకు అమ్మమ్మ” అన్న మామ్మ మాటలకు కాస్త ధైర్యం వచ్చినా, బిడియం తగ్గలేదు గిరిజకు. రెండు రోజులకు అమ్మమ్మకు కాస్త చేరికయ్యాక “నీకేం పాఠాలు వచ్చు” అని అడిగిన అమ్మమ్మకు అన్ని పాఠాలు గబగబా అప్పచెప్పేసింది.
“ఇంకేం వచ్చు నీకు?” అనడిగిన అమ్మమ్మతో “నాకు పాట పాడుతూ డాన్స్ చెయ్యడం వచ్చు” అంది గిరిజ. “ఏదీ! చెయ్యు చూస్తాను” అనగానే… “కలియుగ కాలమండోయ్! మీరిది గమనించి చూడరండోయ్”, “ఎండెద్దు పమిడెద్దు ఉయ్యాలో… మా అన్నలు తెచ్చారు ఉయ్యాలో…” అనే రెండు పాటలు పాడుతూ, ఆ పాటలకు తగ్గ హావభావాలను ప్రదర్శిస్తూ, డాన్స్ చేసింది గిరిజ.
“చాలా బాగా చేసావమ్మా! నువ్వెళ్ళి ఆడుకో!” అని అమ్మమ్మ అనగానే, అక్కడే ఉన్న తన పుస్తకాల సంచీ లోంచి ‘తెలుగు వాచకం’ పుస్తకం తీసి అమ్మమ్మ పక్కనే కూర్చుని చదువుకోసాగింది.
“ఏమిటే అమ్మాయ్!? పిల్ల ఇలా తయారవుతోంది. మిగిలిన ఇద్దరు పిల్లలూ బాగానే ఉన్నారు. గిరిజ మాత్రం బాగా బిడియంతో కొత్తవాళ్ళను చూస్తేనే ముడుచుకుపోతోంది. అందరితో సరదాగా కలసిపోయే మనస్తత్వం లేదు.
“పైగా ఆ పాటలు, వాటికి అది వేసిన పిచ్చి గెంతులు చూస్తే నాకే బాధ అనిపిస్తోంది. కన్నతల్లివి మరి నీకేం అనిపించట్లేదూ! ఆ ఇద్దరు పిల్లలతో పాటు దీన్నీ మీతో తీసుకెళ్ళి మంచి స్కూల్ లో జాయిన్ చెయ్యండి. చాలా తెలివైన పిల్ల. బాగా రాణిస్తుంది” అని ఎంతో చెప్పి చూసింది.
అమ్మమ్మ ఎన్ని చెప్పినా, నాగ సమాధానం ఒకటే “నాకూ నా పిల్లలు ముగ్గురూ నాతో ఉండాలనే ఉంటుంది. కానీ, అత్తయ్య గారు, మామయ్య గారు దీనిని పంపడానికి ఇష్టపడరు. వాళ్ళను కాదని ఈయన తీసుకురాలేరు. కనుక నా చేతుల్లో ఏమీ లేదు” అంటూ తన నిస్సహాయతను తెలియజేసింది.
“ఏమిటో! అక్కడ హైదరాబాదులో చిన్న చిన్న పిల్లలు యూనిఫామ్ వేసుకుని, టై కట్టుకుని, బెల్టు పెట్టుకుని, షూ వేసుకుని, ఉదయాన్నే ఏడు గంటలకల్లా తయారైపోయి, స్కూల్ బస్సు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. పిల్లలు నీట్ గా, కడిగిన ముత్యాల్లా ఉంటారు. నా మనవరాళ్ళని, మనవడిని కూడా అలా చూసుకోవాలని నా కోరిక. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు నాకు.”
“మీ నాన్నే బతికి ఉంటే వీళ్ళని ఎంత బాగా చూసుకునేవారో… మనవలను చూసుకునే అదృష్టం ఆయనకి, ఆయన ఒడిలో పెరిగే భాగ్యం వీళ్ళకీ లేదు. ఏం చేస్తాం. అంతా విధి రాత” అని పెద్దగా నిట్టూరుస్తూ, పెరట్లో ఉన్న వియ్యపురాలి దగ్గరకు వెళ్ళింది అమ్మమ్మ.

***** సశేషం ******

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *