April 25, 2024

చంద్రోదయం 13

రచన: మన్నెం శారద

అతని కళ్ళు మసకబారుతున్నాయి. చీకటిని మింగుతోన్న సముద్రం నల్లగా మారుతోంది.
అతని కళ్లనుంచి రెండు వేడి కన్నీటి బొట్లు జారిపడ్డాయి.
ఇప్పటికే శేఖర్‌కి తానన్ని విభాగాలుగా రుణపడిపోయి వున్నాడు.
ఇంకా అతన్ని స్నేహం పేరుతో దోచలేడు.
శేఖర్ మనస్ఫూర్తిగా స్వాతిని ఇష్టపడుతున్నాడు. పెళ్ళికూతుర్ని చూసి వచ్చిన దగ్గర నుంచి ఊహాలోకంలో తేలిపోతున్నాడు.
అలాంటి శేఖర్‌కి నిజాన్ని చెప్పి అఘాధంలోకి త్రోయలేడు.
ఈ రోజు తను, తన వాళ్ళు ఇలా సుఖంగా బ్రతకటానికి అతనే కారణం.
అతని కోసం తన మనసుని రాయిగా చేసుకుని అతని పెళ్ళి జరిగేట్టుగా చూడాలి. అతని సుఖం కోసం త్యాగం చేయగల్గాలి. తప్పదు.
దూరంగా బైక్ ఆపి మెట్లు దిగి బీచ్‌కి వస్తున్న శేఖర్‌ని చూసేడు సారధి.
గబగబా కళ్లు తుడుచుకుని లేచి నిలబడ్డాడు.
“ఇదేవిట్రా నువ్విక్కడ దేవదాసులా కూర్చున్నావు. ఆ శంకరంగారు క్షణానికో కబురు చేస్తున్నారు. ఏం చేయాలో నాకు తెలియదు. నీకు తెలుసు కనుక అన్నీ నువ్వు చూసుకుంటావని నేను ధైర్యంగా వుంటే నువ్విలా తప్పించుకు తిరుగుతున్నావు. నేను పెళ్లి చేసుకోవడం నీకిష్టం ఏదా?” శేఖర్ సీరియస్‌గా అడిగేడు.
“చ అదేవిట్రా. ఊరికే చల్లగాలికొచ్చేను. నీ తర్వాతే నా గురించి ఆలోచిస్తాను నేను.” సారధి మనసుని దాచుకుని బైక్ వెనకాల ఎక్కి కూర్చున్నాడు.
స్వాతి, శేఖర్‌ల వివాహం జరిగిపోయింది.
సారధే దగ్గరుండి అన్నింటికీ పెద్దగా వ్యవహరించేడు.
శుభలేఖ పంపినా శేఖర్ తల్లిదండ్రులు రాలేదు.
రారన్న విషయం అందరికీ తెలిసినదే అయినా, అలా జరిగినందుకు శంకరంగారు ఎంతగానో నొచ్చుకున్నారు.
“ఇంతకూ పిల్ల అదృష్తవంతురాలు.” అన్నారు కొంతమంది పెద్దలు. శేఖర్ చాలా సామాన్యంగా స్వాతిని తన ఇంటికి తీసుకొచ్చేసేడు. అయితే సారధికి అసలు యిబ్బంది యిప్పుడే మొదలయింది. స్వాతిని తనేమని పిలవాలి. ఒంటరిగా ఎదురయితే ఏం మాట్లాడాలి? తన మనోభావాలు శేఖర్ పసిగడితే ఏం చెయ్యాలి?
అందుకే సారధి ఆఖరికి రూం ఖాళీ చేసి వెళ్లిపోటానికి నిర్ణయించుకున్నాడు.
సామాను సర్దుకుంటున్న సారధిని ఆశ్చర్యంగా చూసేడు శేఖర్.
“ఎక్కడికి ప్రయాణం?”
“ఎల్లమ్మ తోటలో ఓ చిన్న రూం దొరికింది. ఇది మీకు చాలదుగా అందుకని” తల వంచుకునే చెప్పేడు సారధి.
శేఖర్ ఆశ్చర్యంగా చూసేడు.
“చాలదని నేను చెప్పానా?”
“వేరే చెప్పాలా? నేనామాత్రం గ్రహించలేనా. ఇదివరకంటే మనమిద్దరం మగవాళ్లం. ఎలాగైనా గడిపేసేం. మరో మగవాడు యింట్లో తిరుగుతుంటే ఆడవళ్లకు ఎంత యిబ్బందో నీకు తెలీదు.”
“స్వాతీ!”శేఖర్ కేకకి పరుగెత్తుకొచ్చింది స్వాతి.
“ఇల్లు చాలదని వీణ్ని పొమ్మన్నావా?”
స్వాతి అయోమయంగా చూసింది.
“అదేవిట్రా ఆవిణ్ని బెదిరిస్తావు? ఆవిడేమీ అన్లేదు. ఇది నా నిర్ణయం” సారధి సమర్ధింపుగా అన్నాడు.
“అంటే ఈ తెలివంతా నీదొక్కడిదే నన్నమాట “శేఖర్ నిష్టూరంగా అన్నాడు.
“దేనికిరా అంతగా బాధపడ్తావు? నేనెక్కడికే పోతున్నాను. మరో రెండు వీధులవతలికి. కేవలం పడక మాత్రమే అక్కడ. మిగతా కాలమంతా యిక్కడే, సరేనా!” అన్నాడు అనునయంగా సారధి.
“పోనీ యింకాస్త పెద్దిల్లు తీసుకొని అందరం అక్కడికే వెళ్లిపోతే పోలా?” శేఖర్ అన్నాడు.
ఆ మాటలు విని స్వాతి లోపలికెళ్లిపోయింది.
సారధి స్వరం తగ్గించి “నీకెలా చెప్పాలో తెలియటం లేదు. నువ్వింత వాజెమ్మవనుకోలేదు. పెళ్లి చేసుకున్నావు గానీ, బుర్రలో సరుకు లేదు.”అన్నాడు చిరాగ్గా.
“అంటే?”
“మీ యిద్దరి మధ్య నేనుండకూడదు. అది అంతే!” సారధి నిశ్చయంగా అన్నాడు.
శేఖర్ నవ్వుతూ “ఏవిటో అనుకున్నాను. నువ్వు ఘటికుడివే!” అన్నాడు.
విషయం యింత తేలిగ్గా విడిపోయినందుకు తేలిగ్గా నిట్టూర్చాడు సారధి.
ఆ రోజు నుంచి సారధి మకాం రెండు వీధుల కవతలికి మార్చబడింది. అయినా శేఖర్ సారధిని ఓ పట్టాన వదిలేవాడు కాదు. సినిమాలకు, షికార్లకు అతను వెంట వుండాల్సిందే.
స్వాతిని చూసినప్పుడల్ల ఆతని గాయం రేగుతూనే వుండేది.
“స్వాతి కూడా తనని ప్రేమించిందా? తనలాగా బాధ దిగమింగుతోందా?” అని జవాబు దొరకని ప్రశ్నలు.
అడగాలని మనసులో ఉన్నా అడగలేని స్థితి.
ఆ రోజు సారధి సడన్‌గా చూపించిన ట్రాన్స్‌ఫర్ ఆర్డర్స్ చూడగానే శేఖర్‌కి మతిపోయింది.
“నో. నెవ్వర్. నేనిప్పుడే కాన్సిల్ చేయిస్తాను” అన్నాడు తీవ్రంగా.
“వద్దురా! నాకు కూడా వెళ్ళాలనే వుంది. నేనింకా మద్రాసు చూడనేలేదు. కొంతకాలం యిలాగయినా పరాయి ప్రదేశాలు చూడాలని వుంది”
“అంటే నువ్వు ఈ ఊరు విడిచి వెళ్లిపోవడానికే నిశ్చయించుకున్నావన్నమాట” శేఖర్ నిష్టూరంగా అడిగేడు.
“అవున్రా. అంతమాత్రాన మిమ్మల్ని మరచిపోతానని అనుకోకు. త్వరలోనే తిరిగి వచ్చేయడానికి ప్రయత్నిస్తాను. పోతే నువ్వు కూడా గవర్నమెంటు వుద్యోగస్తుడివే. నీకు కూడా ఈ ఊరు స్థిరమా?” అన్నాడు సారధి.
సారధి కావాలనే ఈ ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడని తెలియని శేఖర్ మరేం మాట్లాడలేకపోయాడు.
సారధి వారం రోజుల్లో మద్రాసు వెళ్లడానికి అన్ని విధాలా సిద్ధమయ్యేడు. పల్లెటూళ్లో వున్న పెంకుటిల్లు అమ్మేసి, తల్లిని, చిన్న చెల్లెలు సుహాసినిని కూడా తీసికెళ్లడానికి నిశ్చయించుకున్నాడు.
ఆ అనుకున్న రోజు రానే వచ్చింది.
స్వాతి, శేఖర్‌లతో పాటు, స్వాతి పెద్ద చెల్లెలు సునంద ఆమె భర్త భార్గవ స్టేషన్‌కి వీడ్కోలిచ్చేందుకు వచ్చేరు.
రైలు భారంగా కదిలింది.
శేఖర్ సారధి చేయి గట్టిగా పట్టుకొని నొక్కేడు.
అతని కళ్లలోంచి నీళ్లు వుబికేయి.
అర్ధం కాని వారిద్దరి అభిమానం చుట్టూ ఉన్నవారికి వింతగా అనిపించింది. రైలు ప్లాట్‌ఫారంకి దూరం అవుతోంది.
స్వాతి చిత్తరువులా నిలబడి చూస్తోంది.
సారధి ఆఖరిసారిగా ఆమెని కన్పించినంతవరకూ చూస్తూనే వున్నాడు. చూస్తుండగానే రైలు చిన్న బిందువులా మారి శూన్యంలోకి కలిసి పోయింది.

ఇంకా వుంది..

1 thought on “చంద్రోదయం 13

Leave a Reply to మాలిక పత్రిక మార్చ్ 2021 సంచికకు స్వాగతం.. – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *