March 29, 2024

చీకటైన జీవితం

రచన: కస్తల పద్మావతి

“అక్కా, అక్కా ఆకలి అంటూ స్కూల్ నించి వచ్చి బ్యాగులు పక్కన పెట్టి, సుశీలను వెతుకుతూ ఇల్లంతా కలియ తిరుగుతున్నారు సుశీల చెల్లి, తమ్ముడు.
సుశీలది మధ్య తరగతి కుటుంబం. తల్లి చనిపోవడంతో స్కూల్ ఫైనల్ అయిపోయిన సుశీల ఇంట్లోనే ఉంటోంది.
చెల్లిని తమ్ముడిని చూసుకుంటూ, ఇంటిపని, వంటపని చేసుకుంటూ , కాలక్షేపానికి నవలలు చదువుతూ ఉంటుంది.
ఒక చిన్న ఫాక్టరీలో పని చేసే సుశీల తండ్రిది షిఫ్ట్ డ్యూటీ . ఒక వారం పగలు డ్యూటీ ఉంటే, ఒక వారం అర్ధరాత్రి పన్నెండుకి వస్తాడాయన. ఫాక్టరీ వాళ్ళు ఇచ్చిన క్వార్టర్స్ లో నివాసం ఉంటారు.
సుశీల తండ్రిగారు చాలా నెమ్మదస్తుడు. సంప్రదాయాలకు విలువనిచ్చేవాడు. బంధువులంతా కూడా, భార్య పోయాక రెండో పెళ్లి చేసుకోమని ఎంత పోరినా, వినలేదు.
పిల్లలకోసమైనా చేసుకోమంటే, లేదు, నేనే కష్టపడి పెంచుకుంటా అని పెళ్ళి మాటెత్తలేదు.
రోజు రాత్రి తొమ్మిదికల్లా తమ్ముడికి, చెల్లికి అన్నం పెట్టి, వాళ్ళను నిద్ర పుచ్చి, తనూ తినేసి, ఏదో ఒక నవల చదువుతూ కూర్చుంటుంది సుశీల. అప్పటికి వాళ్ళ ఊర్లో కరెంటు సదుపాయం లేదు.
చిన్న లాంతరు వెలుగులోనే అన్ని పనులు చేసుకోవాలి.
వరండాలో కటకటాల తలుపు గడియవేసి, పుస్తకం చదువుతూ, ఉండి తండ్రి రాగానే అన్నం పెట్టి పడుకునేది.
ఇలా, ఆ పిల్లలని తల్లిలా చూసుకునే అక్క స్కూల్ నించి రాగానే కనపడకపోయేసరికి, దిగులుగా చూస్తుంటే ఓ మూలన నక్కి కూర్చున్న సుశీల కనపడింది.
“ఏంటక్కా, ఇక్కడ కూర్చున్నావు. “అడిగారు పిల్లలు.
ఏమీలేదు , అంటూ, కళ్ళలో భయం కదలాడుతూండగా, వాళ్ళిద్దరి చేతులు పట్టుకుని, వంట గది లోకి తీసుకెళ్లి, తినడానికి పెట్టి, వాళ్ళను హోమ్‌వర్క్ రాసుకోమని చెప్పి, వంటకుపక్రమించింది.
తండ్రితో కూడా అన్యమనస్కంగానే మాట్లాడటం, ఏదో యాంత్రికంగానే ఇంటిపని చేయటం, గమనించి ఒకరోజు తండ్రి అడిగాడు, ఏమ్మా ఏమైంది తల్లీ, డల్‌గా ఉంటున్నావు అని.
ఏమీ లేదు నాన్నా అనిందే కానీ, ఎవరితో చెప్పాలి తన బాధ, తల్లి లేదు, చెల్లి తమ్ముడు చిన్నవారు.

తండ్రితో చెప్పాలంటే ఏమి చెప్తుంది.
ఇలా ఆలోచించి, ఆలోచించి, మనసు బాగా వీక్ అయిపోయింది .
నవలలు చదవడం మూలాన, ఆ డైలాగులు పదేపదే గుర్తు వస్తూ ఉంటాయి తనకి.
ఒకరోజు ఉదయమే టిఫిన్ తింటున్న తండ్రిని పట్టుకుని ఒక మాట అడిగేసింది.
ఆ వాక్యం విన్న ఆ తండ్రి చెవులలో ఒక్కసారి సీసం పోసినట్టు, వెయ్యి డైనమైట్లు పేలినట్లు, భూమి బద్దలై తాను ఆ భూమిలోకి కూరుకుపోతున్నట్లుగా అయి, స్థాణువై పోయాడు.
నా శీ. . . న్ని బలిగొన్న నీవూ ఒక తండ్రివేనా. .
ఇది ఎవ్వరూ ఊహించని, ఏ తండ్రికి ఎదురు కాని, కాకూడని పరిస్థితి.
ఈ పరిస్థితి రావడానికి కారణం.
ఒకరోజు నైట్ డ్యూటీ చేసి ఇంటికి బయలుదేరబోయిన సుశీల తండ్రిని, సార్, నాకు కాస్త ఒంట్లో బాగా లేదు. కాస్త ఆలస్యంగా వస్తాను. అప్పటివరకు నా డ్యూటీ మీరు చేయండి అని అభ్యర్ధించటంతో, ఆయన డ్యూటీలో ఉండిపోయాడు.
సుశీలకి తండ్రి రావటం ఆలస్యమయ్యేసరికి మాగన్నుగా నిద్ర పట్టింది.
తండ్రి స్నేహితుడు, సుశీల ఇంటికి వచ్చి, పడుకుని ఉన్న సుశీల నోటిని చేతితో మూసి అసభ్యంగా ప్రవర్తించడం చేయసాగాడు.
ఆ చీకట్లో వచ్చింది తండ్రి అనుకుని, తండ్రిని నిలదీసి అడగలేక, తనలో తనే కుమిలిపోయి, మతి స్తిమితం తప్పిన ఆ కూతురికి తన తండ్రి నిర్దోషి అని, తన శీలాన్ని బలిగొన్నది తన తండ్రి స్నేహితుడు అనే విషయం ఎప్పటికీ తెలియదు

*****

1 thought on “చీకటైన జీవితం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *