March 28, 2024

తామసి – 5

రచన: మాలతి దేచిరాజు

మొహమ్మద్ ముష్తాక్ షాదీ ఖానా – (ముస్లిముల పెళ్ళి మండపం )

ఎలాంటి అలంకరణ లేదు భవనానికి. మెయిన్ గేట్ నుంచి భవనం లోపలికి వెళ్ళే దారి మాత్రం రంగురంగుల కర్టెన్లతో, పూలతో, చెమ్కీలతో (మెరుపుల మాలలు) అలంకరించి ఉంది. కింద పచ్చరంగు తివాచి పరిచి దానిపై పచ్చగడ్డి చల్లారు. బంధువుల హడావిడి, సమయం పగలు తొమ్మిది… మగ పెళ్ళివారు వచ్చి అప్పటికే అరగంట అయ్యింది.
“ఆపా (అక్కా) ఛోటూ కో బులా ..రసం కర్నా” ఆజ్ఞాపించినట్టు చెప్పింది పెళ్ళి కూతురి పిన్ని. క్షణాల్లో వచ్చాడు ఛోటూ. ఇరవై ఏళ్ల కుర్రాడతను.
వచ్చి పెళ్ళి కొడుకుకి సలాం చేసాడు..అతడు ప్రతినమస్కారం చేసాడు.
ముందుగా బేసిన్(పెద్ద గిన్నె) లో ఉన్న చెంబు తీసుకుని అందులో సగం మునిగి సగం పైకి ఉన్న వేప పుల్ల అందుకున్నాడు. దానికి ఒక వైపు ఎర్రటి గుడ్డ చుట్టి ఉంది. గుడ్డ చుట్టి ఉన్న వైపు పట్టుకుని పెళ్ళి కొడుక్కి పళ్ళు తోమించాడు. కుడి వైపు రెండు తిప్పుళ్ళు. ఎడమ వైపు రెండు తిప్పుళ్ళు. చుట్టూ చుట్టాలు. ఆడవాళ్ళంతా ఒక వైపు మగవాళ్ళంతా ఒక వైపు. వీడియో గ్రాఫర్ తన పని తాను చేసుకుపోతున్నాడు… ఎవరికీ ఏ ఇబ్బంది కలగకుండా, ముఖ్యంగా తనకూ తన కెమెరాకి ఏ ఇబ్బంది కలగకుండా…
చెంబులో నీళ్ళు అరచేతిలో తీసుకుని పెళ్ళి కొడుకు నోటికి పట్టించాడు ఛోటూ. వరుడు
నీళ్ళు పుక్కిలించి బేసిన్ లో ఊసాడు ఇది కూడా రెండు సార్లు చెయ్యాలి.
చిన్న గిన్నెలో ఉన్న చోబా (తురిమిన కొబ్బరిలో పంచదార కలిపిన మిశ్రమం) అందుకుని స్పూన్ తో తినిపించాడు. రెండో స్పూన్ తినిపించబోయి లటుక్కున నోట్లో వేసుకుని, తను తినేసాడు. (ముస్లిం పెళ్ళిలో ఇదో సరదా… దీనినే రసం అంటారు. ఇది మొత్తం మూడు సందర్భాల్లో వేరే వేరే విధంగా ఉంటుంది.)
గ్లాసులో పాలని స్పూన్ తో తాగించాడు.రెండో స్పూన్ తాగించబోయి తను తాగేసాడు. ఈ సారి పెళ్ళి కొడుకు రెండో స్పూన్ కూడా తాగడానికి ప్రయత్నించాడు కానీ, ఛోటూ ఆ అవకాశం ఇవ్వలేదు.
అరచేతికి మల్లెపుల్ల గుత్తి చుట్టాడు,మెడలో రెండున్నర మూరల మల్లెదండ వేసాడు. పెళ్ళికొడుకు ఇక లేవబోతుంటే అంతా అరుస్తున్నారు నవ్వుతూ. అతన్ని లేవనివ్వట్లేదు.
ఓ పక్క పెళ్ళి కొడుకు కూర్చున్న కుర్చీ వెనక నిలబడ్డ తన బంధుమిత్రులు ‘లేచి వచ్చేయ్’ అని ప్రేరేపిస్తున్నారు. ఆడ పెళ్ళి వాళ్ళు కదలనివ్వట్లేదు. ఇక చేసేది లేక అతను జేబులో నుంచి అయిదు వందల నోటు తీసి ఛోటూ చేతిలో పెట్టాడు. రసం ముగిసింది. అందరి మొహాల్లో సరదా నవ్వులు.
పెళ్ళికొడుకు లేచి “సబ్ కో ఏకూచ్ సలాం (అందరికీ ఒక్కటే సలాం)” అన్నాడు.
“వాలేకుం అస్సలాం” ఎవరికి వాళ్ళు బదులు చెప్పారు అతనికి.
ఇక పెళ్ళికొడుకు తనకి కేటాయించిన రూమ్ లోకి వెళ్ళిపోయాడు.
“భైజాన్ నాస్టా …” (బావగారూ, బ్రేక్ ఫాస్ట్.)
“కలీజీ కా సాల్ల (లివర్ కర్రి) దాలో..”
“జర్ర దాలో… బస్..”
“క్యావ్ రే ఓ …దరిందర్ మరా …”(ఏవిట్రా అది..దరిద్రపుగొట్టు వెధవ.) ఓ తల్లి తన ఆరేళ్ళ పిల్లాడ్ని తిడుతోంది.
ఇలా రకరకాల మాటలు,నవ్వుల మధ్య అందరి ఫలహారం ముగిసింది.
సమయం పదిన్నర కావొస్తుంది. ఎండ నెమ్మదిగా వేడి ఎక్కుతోంది, ఆహ్వానితులంతా అప్పుడప్పుడే వస్తున్నారు.
పెద్ద హాల్ లో సుమారు రెండు వందల యాభై కి పైగా కుర్చీలు వేసి ఉన్నాయి.కొన్ని జనంతో నిండి ఉన్నాయి, కొన్ని ఖాళీగా ఉన్నాయి. స్టేజ్ పైన నాలుగు వైపులా పిల్లర్స్ పెట్టి వాటికి తెలుపు, ఎరుపు రంగుల్లో ఉన్న కర్టెన్లు చుట్టారు. ప్రతి పిల్లర్ పైభాగాన పుష్ప గుచ్ఛాలు అమర్చారు. పిల్లర్స్ మధ్య ఉన్న స్థలంలో రెండు పెద్ద పెద్ద పరుపులు వేసి దానిపై దుప్పట్లు కప్పి, నాలుగు గుండ్రటి దిండ్లు ఉంచారు.
మౌలానా (ముస్లింల పెళ్ళి చేసే పెద్ద) వచ్చి ఒక పెద్ద పుస్తకాన్ని తీసి పెళ్ళికొడుకు పేరు తల్లిదండ్రుల పేరు వ్రాసుకున్నారు. అలాగే, పెళ్ళి కూతురి వివరాలు కూడా.
ఇంతలో పెళ్ళికొడుకుని తీసుకురాసాగారు,
ఓ నలుగురు మగవాళ్ళు. ముఖం కనపడకుండా పూలతో కప్పేసారు. పెళ్ళికొడుకు వచ్చి స్టేజ్ పై పరుపుల మీద కూర్చున్నాడు. కొంత మంది పెద్దమనుషులు, మౌలానా, పెళ్ళికొడుకు, వధూవరుల తండ్రులు అంతే. మిగతావారంతా స్టేజ్ కి ఎదురుగా వేసున్న కుర్చీల్లో కూర్చున్నారు.
“అలహందులిల్లా… అలహందులిల్లా… లాయి లాహ్ ఇల్లల్లా మొహమ్మదర్ రసూలుల్లా” అంటూ ముందుగా బయాన్ (ముస్లింల ప్రార్థన) మొదలుపెట్టాడు. అందరూ తలపైన తెల్లటి టోపీలు ధరించారు. ఆడవాళ్ళు చెంగును తలపై కప్పుకున్నారు.
ఇరవై నిమిషాల ప్రార్థన తర్వాత వధూవరుల తండ్రుల చేతులు కలుపుతూ,
“మొహమ్మద్ అజీం సాబ్ కే బేటీ కో ఆప్ కీ బహూ (కోడలు) బనానేకీ మంజూర్ హే?” అడిగాడు మౌలానా.
“మంజూర్ హే.” మూడు సార్లు చెప్పాడు పెళ్ళికొడుకు తండ్రి.
“మొహమ్మద్ గఫార్ ఖాన్ కే బేటే కో ఆప్ కే దమాద్ (అల్లుడు) బనానే కీ మంజూర్ హే?”
“మంజూర్ హే..” అతను కూడా మూడు సార్లు.
“మొహమ్మద్ అజీం సాబ్ కే బేటి నసీమా సే నిఖా ఖుబుల్ హే?” పెళ్ళికొడుకుని అడిగాడు
“ఖుబుల్ హే..” మూడు సార్లు చెప్పాడతడు. పుస్తక లో సంతకం చేసాడు.
పుస్తకం పట్టుకుని పెళ్ళి కూతురి దగ్గరికి వెళ్ళాడు మౌలానా. అక్కడ కూడా పెళ్ళి కూతుర్ని ఇలాగే అడిగి సంతకం తీసుకుని వచ్చాడు. నిఖా అయిపోయింది ఇక.
(ఒకవేళ మౌలానా ఇలా అడిగిన సమయంలో “ఖుబుల్ నహీ” (ఇష్టం లేదు) అంటే తక్షణమే ఆ నిఖాను రద్దు చేసే సంప్రదాయం ఉంది ముస్లిం పెళ్ళిళ్ళలో.)
ముందుగా మౌలానాకి ఆలింగనం ఇచ్చాడు పెళ్ళికొడుకు. కుడిభుజం, ఎడమ భుజం మళ్ళీ కుడి భుజం మూడు సార్లు ఇచ్చాడు. తర్వాత పెళ్ళికూతురి తండ్రికి, తర్వాత తన తండ్రికి, ఇలా పెద్దలందరికీ.
బంధుమిత్రులంతా విందు చేస్తున్నారు..మటన్ బిర్యాని వాసన ఘుప్ ఘుప్ మని వస్తోంది. సమయం సాయంత్రం నాలుగున్నర కావొస్తుంది.
“జల్దీ జిల్వా కరో నికల్ జాయేంగే” అన్నారెవరో పెళ్ళికొడుకు తరుపు వాళ్ళు.
అమ్మలక్కంతా చీరలు మార్చేసారు. మగవాళ్ళకి ఆ ఆవకాశం లేదు, ఎందుకంటే ‘జిల్వా’ పూర్తిగా ఆడవాళ్ళ తతంగం.
పెళ్ళికూతుర్ని , పెళ్ళి కొడుకును ఎదురెదురుగా కూర్చోబెట్టారు. నసీమా ఘూంఘట్ కప్పుకుని ఉంది. పెళ్ళికూతురి మొహం చూడకూడదు పెళ్ళికొడుకు.
ఇద్దరి మధ్య ఒక ప్లేట్ పెట్టారు. అందులో పటికబెల్లం, అద్దం, చోబా, పాలు ఉన్నాయి.
పెళ్ళికూతురికి కుడి వైపు, పెళ్ళికొడుకు వదిన వరస అయిన ఎవరో ఒకరు కూర్చోవాలి.
ఒకావిడ కూర్చుంది.
ముందుగా పటికీబెల్లం అమ్మాయి కుడి భుజం పై పెట్టి, “మిషిరి (పటికిబెల్లం) మిట్టి? ఆరస్ (పెళ్ళి కూతురు) మిట్టి (బెల్లం తియ్యనిదా, పెళ్ళాం తియ్యనిదా?)” అనడిగింది.
(పెళ్ళాం తియ్యనిది అని చెబితే బెల్లం ఇచ్చేయాలి..బెల్లం తియ్యనిది అంటే ఇవ్వకూడదు.)
“మిషిరి మిట్టి..” (బెల్లం తియ్యనిది)అని టక్కున లాక్కున్నాడు పెళ్ళికొడుకు.
అందరూ గోల చేసారు… నవ్వులు, సందడి.
రెండో సారి ఎడమ భుజం పై పెట్టి అడిగింది.
“మిషిరి మిట్టి.” అని లాక్కోబోయాడు, ఆమె ఈసారి గట్టిగానే పట్టుకుంది బెల్లం ముక్కని
లాక్కోటానికి చూస్తున్నాడు, ఆమె ఇవ్వట్లేదు.
మళ్ళీ ప్రయత్నించాడు..ఊహు లాభం లేదు
మళ్ళీ..మళ్ళీ..మళ్ళీ.. అయినా సరే ఇవ్వలేదు… ఆవిడ ఏమరుపాటుగా ఉండటం గమనించి చటుక్కున లాగాడు..బెల్లం దొరికింది. నవ్వులు.. గోల!
ఈసారి పెళ్ళి కూతురి అరచేతిలో పెట్టి అడిగింది… ఇదో టాస్క్… అరచేతిలో పెట్టి అడిగితే నోటితో తీసుకోవాలి.
“మిషిరి మిట్టి” అని తీసుకోబోయాడు, దొరకట్లేదు… పెళ్ళికూతురి అరచేతికి చక్కిలిగింతలు పుడుతున్నాయి అతనలా నోటితో అందుకోడానికి ప్రయత్నిస్తుంటే. బెల్లం పట్టుకున్న ఆవిడ ఈసారి అస్సలు ఇవ్వకూడదు అని విశ్వ ప్రయత్నం చేసింది.
ఇక తప్పక… “ఆరస్ మిట్టి” అన్నాడు పెళ్ళికొడుకు. ఈసారి పెళ్ళి కూతురి తరుపు వాళ్లు గోల చేసారు. బెల్లం ఇచ్చేసింది ఆవిడ.
పళ్ళెంలో ఉన్న అద్దం తీసుకుని పెళ్ళి కూతురి మొహాన్ని అద్దంలో చూపించారు పెళ్ళి కొడుక్కి. తర్వాత చోబా తీసుకుని పెళ్ళికూతురు,పెళ్ళి కొడుక్కి తినిపించింది. పొద్దున్నలాగే సరదా సరదాగా జరిగింది ఆ తంతు కూడా. కాకపోతే పొద్దున్న బామ్మరిదితో గాని ఆ వరస ఉన్న వాళ్ళతో గాని… ఇప్పుడు మాత్రం పెళ్ళికూతురితోనే. రసం (జిల్వా రసం) ముగిసింది.
“బాబుల్ కి దువా యే లేకే జా ..” ఆలపిస్తున్నారెవరో మెల్లిగా ఒక్కొక్కరు అందుకున్నారు ఆడాళ్ళంతా. అమ్మాయిని అత్తారింటికి పంపుతూ పాడే పాట ఇది… హృదయ విదారకంగా ఉంటుంది. పాట సాగుతున్నంత సేపూ అందరి కళ్ళలో కన్నీటి సుడులు. తాము ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న అమ్మాయి తమని వదిలి వెళ్ళి పోతుందనే దుఃఖం అది.
పాట ముగిసింది, అప్పగింతలు జరిగాయి. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.

********

రాత్రి! మంచం అలంకరించి ఉంది, పూలతో! పక్కన పళ్ళు, స్వీట్లు కూడా ఉన్నాయి. ముస్లిం సంప్రదాయంలో శోభనానికి ప్రత్యేకంగా ముహూర్తం ఉండదు. వివాహం జరిగిన రోజు రాత్రే కార్యం కూడా…అమ్మాయి, అబ్బాయి మాత్రమే ఉన్నారు. ఘూంఘట్ తీసి కూర్చుంది నసీమా.అతను షర్ట్, ప్యాంట్ తీసి లుంగీ కట్టుకుని వచ్చి మంచం పై వాలాడు. టక్కున ఆమెని తనపై లాక్కున్నాడు ఉలిక్కిపడింది. కంగారు పడింది, రెప్పపాటులో ఆమెపై అతనున్నాడు. విస్మయంగా చూస్తోంది తను, అతను ఏదో సాధించినట్టు నవ్వుతుంటే.
ఒక మాట లేదు, ఒక పలకరింపు లేదు, కబుర్లు కాకరకాయ సంగతి సరేసరి. స్త్రీ అంటే అందులోనూ భార్య అంటే కేవలం పడక సుఖమేనా? అనుకుంటుండగానే ఆమె అర్థ
వివస్త్ర అయిపోయింది. తన తనువు తన ఆధీనంలో లేదు, అతని స్పర్శకు హాయి కలిగే చోట కూడా ఇబ్బంది కలుగుతోంది. అతని స్పర్శలో అనుభూతి లేదు, అతని ముద్దులో ప్రేమ లేదు, అతని కౌగిలిలో సొంతమనే భావన లేదు, అతని ఒత్తిడిలో ఆశావాదం లేదు… మొత్తంగా ఆ శృంగారంలో రసజ్ఞత లేనే లేదు.
ఆ రాత్రి అతడు కరిగిన మేఘం, ఆమె తడిసిన నేల అంతే!

***

రెండు నెలలు గడిచాయి. నసీమా ఆ ఇంటి వాతావరణానికి దాదాపు అలవాటు పడిపోయింది. పొద్దున్నే లేవడం, ఇంటి పని, వంట పని… అత్తగారు ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టదు, పెట్టలేదు. ఆవిడకి పక్షవాతం వచ్చి నెల రోజులైంది. మామగారు రిటైర్ అయ్యారు. సమయానికి తినడం, పడుకోవడం, అయిదు పూటలా నమాజు తప్ప మరేమీ చేయడు. ఇద్దరు మరుదులు చదువుకుంటున్నారు. ఒకరు డిగ్రీ సెకండ్ ఇయర్, ఇంకొకరు ఇంటర్ సెకండ్ ఇయర్.
ఉదయం ఆరు నుంచి తొమ్మిదిన్నర దాకా ఆమె యంత్రంలా ఆ ఇంట్లో తిరుగుతుంటుంది. పది నుంచి పన్నెండు దాకా వంటపని, బట్టలు ఉతికే పని. ఒంటి గంటకి అత్తగారికి అన్నం తినిపించి మందులిస్తుంది. మధ్యాహ్నం నమాజు నుంచి వచ్చాక తింటాడు మామగారు. ఒక్కోసారి అప్పటికే తన పని అంతా అయిపోయి తను తినేస్తే, హాల్ లోనే అలా నడుం వాలుస్తుంది. లేదంటే మామగారు తిన్నాక తనూ తిని ఒక గంట కునుకు తీస్తుంది. అది కూడా నిద్ర పడితే, అత్తగారు కాళ్ళకి నూనె రాయమని అనకుండా ఉంటే…
ఇహ సాయంత్రం నాలుగు నుంచి మళ్ళీ అంట్లు కడుక్కోవడం టీలు, కాఫీలు, ఉతికారేసిన బట్టల ఇస్త్రీ… ఇలా ఆరు, ఆరున్నర వరకు ఉంటుంది. ఆరున్నర నుంచి ఏడున్నర దాకా రాత్రి వంట ముగించి, స్నానం చేసి వచ్చి, అత్తగారికి అన్నం తినిపించి మందులిస్తుంది. తొమ్మిది ,తొమ్మిదిన్నర వరకు ఇంట్లో అందరి భోజనాలు అయిపోతాయి. అన్ని సర్దుకుని తన బెడ్ రూమ్ లోకి వెళ్లేసరికి పదవుతుంది.
ఎప్పుడైనా మరుసటి రోజుకి ఏ ఇడ్లీనో, దోశలో చెయ్యాల్సి వస్తే ముందు రోజు రాత్రే పిండి రుబ్బి పెడుతుంది ఫ్రిడ్జ్ లో. అలా చేసిన రోజు పదకొండు కూడా అవుతుంది తను పడుకునేసరికి. అప్పటికే ఒళ్ళు హూనమైపోయి ఉంటుంది తనకి. అయినా సరే తన భర్త తనని తాకితే ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. అలా అని మనస్ఫూర్తిగానూ దగ్గర చేరదు. ఇంట్లో ఇన్ని పనుల్లో, అది కూడా అప్పుడప్పుడూ ఉండే కాస్త పెద్ద పని అనుకుంటుంది అంతే…
ఇంతా చేసి చూస్తే తనేమీ పల్లెటూరి బైతు కాదు. లోకం తెలియని అమాయకురాలూ కాదు. ‘ఎం.ఏ తెలుగు లిటరేచర్.’
ఇజాక్ అబ్బుర పడ్డాడు. నసీమాకి మనసులోనే సలాం కొట్టాడు. ఆత్రంగా పేజీ తిప్పాడు.
ఒకరోజు స్నానం చేస్తుంది తను. ఉన్నట్టుండి ఎందుకో తలుపు వైపు చూసింది. ఎవరో తనని చూస్తున్న భావం కలిగింది తనకి. ‘ఏమీలేదులే’ అనుకుని స్నానం ముగించింది.
బయటకు వచ్చి తన బెడ్ రూమ్ కి వెళ్లి చీర కట్టుకుంటోంది.. మళ్ళీ అదే భావన.. తలతిప్పి చూసింది, చీర కప్పుకుంది తలుపు కింది భాగం దగ్గర కాళ్ళ వేళ్ళను చూసి.
“కౌన్ (ఎవరు?)” అంది. ఆ మాటకి గుమ్మం దగ్గర కాళ్ళు మాయం అయ్యాయి.
గబగబా చీర కట్టుకుని తలుపు తీసి హాల్ లోకి వచ్చి చూస్తే రసూల్ సోఫాలో కూర్చుని చదువుకుంటున్నాడు.
“ఎవరైనా వచ్చారా?” అడిగింది ఉర్దూలో.
“లేదు, ఏం వదినా?” అమాయకంగా అడిగాడు అతను.
తల అడ్డంగా ఊపింది ఏం లేదన్నట్టు. సరాసరి వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఇలా రెండు మూడు సార్లు జరిగింది. ఏదో పిచ్చి ఆలోచన అనుకుని అంతగా పట్టించుకోలేదు తను.
అవి పిచ్చి ఆలోచనలు కావని తెలుసుకునే రోజు తొందర్లోనే రాబోతోంది.

********

చాలా కాలం తర్వాత ఆ ఊరికి వచ్చాడు గౌతమ్ కృష్ణ. చిన్నప్పుడే అమ్మ,నాన్న చనిపోవడంతో అమ్మమ్మ తాతయ్యల దగ్గరే పెరిగాడు. పదో తరగతి దాకా అక్కడే చదువుకున్నాడు. తర్వాత పై చదువులకి హైదరాబాద్ వెళ్ళిపోయాడు.
కొత్తలో అప్పుడప్పుడు వస్తుండే వాడు ఆ ఊరికి. చదువు పూర్తయ్యి ఉద్యోగం వచ్చాక తీరిక దొరకలేదు తనకి. ఇన్నాళ్ళకి మళ్ళీ వచ్చాడు. వచ్చీ రాగానే ముందుగా స్కూల్ వైపు వెళ్ళాడు. గేట్ బయటే నిలుచుని జ్ఞాపకాల్ని నెమరేసుకున్నాడు…

కాలన్ని వెనక్కి తిప్పే ఆవకాశం ఉంటే అతను సరిగ్గా తన బాల్యానికి, ముఖ్యంగా ఆ బడిలో గడిపిన క్షణాల దగ్గరకి తెచ్చి ఆపేస్తాడు… అవును మరి అతని ఒంటరితనం దూరమైంది అక్కడే, అతనికి జీవితం పట్ల ఆశ కలిగింది అక్కడే, అతనికి తనదని చెప్పుకోటానికి ఒక తోడు దొరికిందీ అక్కడే. ఆ తోడు పేరే నసీమా!
చిన్నప్పటి నుంచి ఇద్దరూ మంచి స్నేహితులు. అమ్మా, నాన్న లేని గౌతమ్ కి నసీమా స్నేహం చాలా బలంగా నిలబడింది. అయిదో తరగతి వరకు గౌతమ్ చదువులో పూర్ .
ఆటలు, పాటలు ఎందులోనూ చురుకుదనం ఉండేది కాదు. ఎప్పుడూ ముద్ద పప్పులా ఉండేవాడు. అలాంటి గౌతమ్ ఈ రోజు – పెద్ద చదువు, సాఫ్ట్ వేర్ ఉద్యోగం! ఇదంతా నసీమా చలవే… నసీమాకి కూడా గౌతమ్ అంటే అభిమానమే. అలా సాగిన వారి స్నేహం పదో తరగతిలో ప్రేమగా మారింది. కానీ ఇద్దరూ ఎప్పుడూ పైకి చెప్పుకోలేదు.
అలా చెప్పుకోలేదు కాబట్టే ఎవరి ప్రేమ వాళ్ళ మనసులోనే ఉండిపోయింది.
నసీమాకి తనంటే ఇష్టం అని గౌతమ్ కి తెలుసు, నసీమాకి కూడా తెలుసు గౌతమ్ కి తనంటే ఇష్టమని… కానీ అది కేవలం ఇష్టమేనా, అంతకు మించా? అని తేల్చుకునే ధైర్యం చేయలేదు ఇద్దరూ. ఒక వయసొచ్చాక ధైర్యం చేయాలనుకున్నా, వయసుతో పాటు తెలివి కూడా వచ్చింది. ప్రాక్టికల్ గా ఆలోచించే వయసొచ్చాక, ప్రేమనేది జ్ఞాపకాలకి దగ్గరగా, వాస్తవికతకి దూరంగా ఉంటుందని అర్థం అయింది. అందుకే ఒకరంటే ఒకరికి ప్రాణం ఇచ్చే ప్రేమ ఉందని తెలిసినా, ఒకటయ్యే దారి లేకపోవడంతో వాళ్ళ ప్రేమని బయట పెట్టలేదు. కాబట్టి వాళ్ళ ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు.
నసీమాని చూడాలనే ఆశతో ఆమె ఇంటి వైపు కదిలాడు. పది నిమిషాల నడక తర్వాత అతను ఆమె ఇంటికి చేరుకున్నాడు.
“ఎవరూ?” అడిగాడు నసీమా తండ్రి గౌతమ్ ని చూసి, చాలా కాలం అయ్యింది కదా,
బహుశా ఆయన గుర్తు పట్టలేదు కాబోలు అనుకుని, “నేను గౌతమ్. నసీమాతో టెన్త్ వరకు చదువుకున్నాను” చెప్పాడు. ఆయన ఇంకా గుర్తుపట్టలేక ఎవరా అన్నట్టు చూస్తున్నాడు.
“దశరథ రామయ్య గారి మనవడ్ని…” అనగానే
“ఓహ్ నువ్వా బేటా, బావున్నావా? చూసి చాలా రోజులైంది కదా, గుర్తు పట్టలేదు..” నవ్వుతూ చెప్పాడాయన.
“ఫర్లేదు అంకుల్… మీరెలా ఉన్నారు?”
“బానే ఉన్నా బేటా …”
“నసీమా ఉందా అంకుల్?” క్షణం ఆలస్యం చేయకుండా అడిగాడు.
“నసీమాకి షాదీ అయిపోయింది బేటా..”
గుండెకీ, ఒంటికీ మధ్య తెలియని నొప్పి కలిగినప్పటికీ అతని మొహంలో భావం మారలేదు.
“అవునా… ఇప్పుడు ఎక్కడ ఉంటుంది అంకుల్ ?”
“విజయవాడ..” అన్నాడాయన.
“ఓహ్…” ఇంకేం మాట్లాడలేకపోయాడు.
“ఇంకేంటి బేటా…?” అడిగాడు ఆయన ఆప్యాయంగా..
అతని గొంతులో నుంచి మాటలు రావడానికి చాలా కష్టపడుతున్నాయి…
కాసేపటికి, “సరే అంకుల్ …నేను బయల్దేరుతా..”అని వీడ్కోలు పలికి కదిలాడతను..
మనసంతా బరువుగా ఉంది గౌతమ్ కి…”సబ్ మిలా దిల్ నషీ..ఏక్ తూ హీ నహీ..” అన్న గుల్జార్ పాట అతని గుండెలో మోగుతోంది. తొలిప్రేమ అనేది ఎవరికైనా ..తియ్యని గాయం, రాయని గేయం. పక్కన లేనితనాన్ని గాయంగా… కలిసున్న క్షణాల్ని గేయంగా అనుకుంటూ ముందుకు సాగిపోవడమే మనం చేయగలిగింది… అతనికి దుఃఖం వస్తోంది. కన్నీళ్లు రావట్లేదు. బాధ వేస్తోంది. ఆందోళన కలగట్లేదు. తన జీవితంలో నసీమా ఒక మైలు రాయి… అంతే కాదు. ఆమె తన ఉనికి.
తన జీవితానికి మార్గదర్శి.
అలాంటి ఆమె సాన్నిధ్యం కలకాలం ఉంటే అది వరమే కదా! కానీ వరాలు అంత సులువుగా దొరికేవా? ఘోర తపస్సు చేయాలి. అయినా కూడా అనుగ్రహించవు కొన్ని సార్లు…
నిజానికి అతను నసీమాని పెళ్ళి చేసుకోవడానికి రాలేదు. ఆ ఆవకాశం లేదన్న సంగతి అతనికి ఎప్పుడో తెలుసు… కానీ,
ఇప్పటికీ నసీమా తనని ప్రేమిస్తుందా, ఒకవేళ అలా ప్రేమిస్తే మాత్రం ఆమెని తన జీవితంలోకి ఆహ్వానించాల్సిందే అనే ఆలోచనతో వచ్చాడతను…
ఈ ..బై ఛాన్స్ ఫార్ములాని చాలా మంది అనుసరించి ఫెయిల్ అవుతుంటారు చాలా మంది ప్రేమికులు..
అమ్మాయిల జీవితాలు వాళ్ళ చేతుల్లో కన్నా చుట్టాల చూపుల్లో, ఇరుగుపొరుగోళ్ళ నోళ్ళల్లో ఎక్కువ నానుతుంటాయి. అందుకే అమ్మాయిలు త్వరగా మూవ్ ఆన్ అయిపోతారు. దాన్ని కొందరు అబ్బాయిలు మోసం అని ఆడిపోసుకుంటూ ఉంటారు.
కొంతమంది అర్థం చేసుకుని ఆశీర్వదిస్తారు. గౌతమ్ కూడా అదే చేసాడు.
నసీమా తన జీవితంలో లేకపోయినా, ఆమె ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాడు, అందరి ప్రేమికుల్లా.
ఆ సంతోషంగా ఉన్న ముఖాన్ని చూడాలని, వీలయితే మాట్లాడాలని అతని మనసు ఉవ్విళ్ళూరుతోంది… ఎందుకంటే..
ప్రేమించిన అమ్మాయితో ఏమైనా ఆశువుగా మాట్లాడగలం… ఒక్క ప్రేమిస్తున్నామనే విషయం తప్ప.
విజయవాడ వెళ్ళబోతున్న బస్ ఎక్కి కూర్చున్నాడు గౌతమ్… బస్ కదిలింది. బస్సు ఊరు దాటుతుంటే అతనికి తన గతాన్ని, తన ప్రేమని, అక్కడే వదిలి వెళుతున్నట్టు అనిపిస్తోంది…
వీస్తున్న గాలిలో కొత్త పరిమళం, రాలిపోయిన పూలగంధాన్ని గాలి అద్దుకోదు కాబోలు… పారుతున్న ఏరులో జాడలేని కాగితపు పడవల్ని వెతకసాగాడతను…
ఊగుతున్న మర్రి ఊడల్లో, చిన్ననాటి చెలి చేతివేళ్ళ గురుతులు అతనికింకా గురుతే… రేగుతున్న మట్టి వాసనలో పారేసుకున్న అడుగు జాడల ఆనవాళ్ళు… ఇప్పుడతనికి వీడ్కోలు చెబుతున్నాయి.
సాగుతున్న కాలం, రాలుతున్న జ్ఞాపకాల్ని దోసిట్లో నింపుకుని, వెళుతోంది… ఆడుతున్న ప్రాణం… రాయలేని ప్రేమలేఖని చదువుతూ మూగబోయి మిగిలింది…
అతని మనసులో సుడులు తిరుగుతున్న ఆలోచనలకి చెక్ పెట్టినట్టు అరిచాడు కండక్టర్…
“విజయవాడ… విజయవాడ… విజయవాడ… ” అంటూ…
కళ్ళు విప్పాడు గౌతమ్. జనం దిగుతున్నారు. అక్కడి వరకు ధైర్యంగా వచ్చినవాడు, నసీమా ఇంటికి వెళ్ళాలా, వద్దా అనే సందిగ్ధంలో పడ్డాడు.
మనం అనుకున్నట్టు జీవితం ఉండదు. జీవితం చెప్పినట్టు మనం నడుచుకోలేము. ఈ డోలాయమానంలోనే మనిషి ఎప్పుడు ఊగుతుంటాడు. తను అనుకున్నట్టు నసీమా సంసార జీవితం సుఖంగా సాగుతుందో, లేదో తెలుసుకోవడానికి గౌతమ్ కి ఇంకా కొన్ని నిమిషాల కాలం పడుతుంది… కాలమే అన్నిటికీ మార్గము, సమాధానము!

***

1 thought on “తామసి – 5

Leave a Reply to మాలిక పత్రిక మార్చ్ 2021 సంచికకు స్వాగతం.. – మాలిక పత్రిక Cancel reply

Your email address will not be published. Required fields are marked *