April 20, 2024

దైవంతో నా అనుభవాలు పుస్తకం మీద ఒక అభిప్రాయం

రచన: డా. లక్ష్మీ రాఘవ.

ఒక పుస్తకం కొనడానికి కానీ చదవడానికి కానీ మొదట పాఠకుడిని ఆకర్షించేది శీర్షిక, ఆపైన ముఖచిత్రం. తరువాత మనసులో నిలిచిపోయేది పుస్తకంలోని విషయాలు. అవి మన జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తుచేస్తే, అది కలకాలం మనసులో నిలిచిపొయే పుస్తకం.
అలాటిదే వెంకట వినోద్ పరిమిగారి ” దైవంతో నా అనుభవాలు”
ఇందులో ఆయన అనుభవాల మాలలు! నిజంగా అందులోని ప్రతిపూవూ ఆఘ్రాణించ తగినదే!
దేవుడి మీద నమ్మకం వుంటే మనకు జీవితంలో అడుగడుగునా తారసపడే దృశ్యాలే కనిపిస్తాయి.
చాలా విషయాలు కలలు ద్వారా తెలిపి అవే జరిగినట్టు ఆయన వివరిస్తారు. ఇది అందరికీ అనుభవంలోకి రాదు. అయినా నమ్మబలికేలా జరగడం అబద్దం కాదు అన్నది అలౌకిక స్థితిని కలగజేస్తుంది..
వినోద్ గారు ఈ పుస్తకం అందించడానికి కారణం భగవంతుని సంకల్పం అంటారు. అది చదవడానికి మనదాకా వస్తే అది అదృష్టం అని నేనంటాను.
గణపతి దర్శనంతో మొదలై, కష్టాల కడలిని తన భక్తుని దాటించడానికి దేవుడు ఎంత ప్రయత్నం చేస్తాడు అని ఆశ్చర్యం వేస్తుంది. వెంకటేశ్వరుడి ఉంగరం, దత్రాత్రేయ గుడిలో రుద్రాక్ష వీటికి నిదర్శనం.
సైన్సును నమ్మే ఈ కాలంలో దీనికి అతీతంగా కడుపులో బిడ్డ కాలు సరిపోవడం ఒక అంతుపట్టని శక్తి వుంది అన్నది నిరూపణ కావడమే అనిపించక మానదు.
ఉజ్జయిని జ్యోతిర్లింగంకు జరిగే చితాభస్మ అభిషేకం అందరికీ తెలియకపోవచ్చు. ఎన్నో పుణ్యక్షేత్రాల విశేషాలను మనకు పరిచయం చేస్తూనే అక్కడ జరిగిన అనుభవాల్ని తెలుపుతూ ఉత్కంఠను కలిగిస్తుంది
అలాగే అహంకారం చూపిస్తే దైవం హెచ్చరిస్తాడు. సృష్టికర్త లీలా విన్యాసాలను దృవీకరించే సంఘటనలు, మాతృదేవోభవలో పరీక్షలు, మానవరూపంలో సహాయపడి “దైవం మానుష రూపేణా..” అన్న అనుభూతిని మిగులుస్తూ, తిరుమల దేవుడి దగ్గర జరిగిన అనేక అద్భుతాలు ఆసక్తిని, నమ్మకాన్ని పెంచి అవిరామంగా చదవడం జరుగుతుంది.
జాతకాలను నమ్మనివారికి కూడా ఏది ఎలా జరగాలో అలాగే జరిగేలా తెలియజెప్పే జ్యోతిష శాస్త్రం వుందని తెలియజెపుతుంది.
ఈ పుస్తకంలో ఏదీ కల్పనలా అనిపించదు. దైవభక్తితోబాటు సేవాగుణం కలిగి వుంటే, ఆ దైవమే మన వెంట వుండి మనల్ని నడిపిస్తాడు అన్నది సత్యం !
దైవభక్తిని ప్రేరేపించి, నమ్మకాన్ని పెంచే ఈ పుస్తకం ఎంతో సంతృప్తిని ఇస్తుంది అనటంలో సందేహం లేదు.
ఈ పుస్తకం పై నా అభిప్రాయాన్ని తెలుపగలగే అవకాశం ఆ పరమాత్మ కల్పించాడని నమ్ముతున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *