April 20, 2024

మగువ మరో కోణం

రచన: రాజ్యలక్ష్మి బి

రాజ్యం, లక్ష్మి కలిసి ఒకే బళ్లో హైస్కూల్ దాకా చదువుకున్నారు. పక్క పక్క యిళ్ళు. యిద్దరూ అన్యోన్యంగా వుండేవాళ్లు. రాజ్యానికి చదువంటే యిష్టం. ముఖ్యంగా గణితం అంటే బాగా యిష్టం.. పెద్దయ్యాక గణిత ఉపాధ్యాయినిగా స్థిరపడాలని నిర్ణయించుకుంది. యింట్లో వాళ్లకు చెప్పేసింది కూడా. లక్ష్మికి చదువు మీద పెద్ద మోజు లేదు. ఏదో చదవాలి కాబట్టి చదువుకుంటున్నది. సంగీతం అంటే ప్రాణం. అందుకు తోడు గాత్రం కూడా బాగుంటుంది. కాలం పరుగెత్తింది. రాజ్యం గణిత లెక్చరర్ గా కాలేజీలో స్థిరపడింది. లక్ష్మి డిగ్రీ అయ్యాక సంగీతంలో ప్రావీణ్యం పొందింది. యిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. జీవితంలో ముఖ్యమైన మలుపు. రాజ్యం భర్త సైంటిస్ట్. రాజ్యం ఉత్తర భారతంలో. స్థిరపడింది. రాజ్యం కాలేజీ. లో గౌరవం. మంచి పేరు సంపాదించింది, విద్యార్థులకు అవసరమైతే ఆర్ధిక సాయం చేసేది. లక్ష్మి భర్త కాలేజీ లెక్చరర్. అతను లక్ష్మిని యిష్టపడి పెళ్లి చేసుకున్నాడు.. అతనికి సంగీతం యిష్టం. కాలేజీ అవగానే నేరుగా యింటికి వస్తాడు. ప్రతిరోజూ లక్ష్మి ఒక లలితగీతం పాడాల్సిందే. అన్యోన్య దాంపత్యం. లక్ష్మి హైదరాబాద్ లో స్థిరపడింది. జీవితం హాయిగా సాగుతున్నది. జీవితంలో యిద్దరికీ యెన్నో మలుపులు. గృహిణులుగా బాధ్యతలు పెరిగాయి. కలుసుకోవడం తగ్గింది. కానీ వాళ్ల మనసులు యెప్పుడూ కబుర్లు చెప్పుకుంటాయి. బాధలూ, సంతోషాలూ పంచుకుంటూనే వున్నాయి. మానసికంగా దగ్గరగా వున్నారు. అందుకనే ఒకరు యీ లోకం నించి తప్పుకున్నా మరొకరిలో ఆ స్ఫూర్తి స్థిరంగా వుంది.
రాజ్యం ఒక రోజు కాలేజీలో బోర్డు మీద ప్రాబ్లెమ్ చేస్తూ చేస్తూ మరోలోకానికి పయనమయ్యింది.
విషయం తెలియగానే లక్ష్మి కన్నీళ్ల పర్యంతమయ్యింది. కానీ తన కుటుంబ సమస్యలతో వెళ్లలేకపోయింది. నాలుగునెలల తర్వాత లక్ష్మి రాజ్యం కూతురు సుధను చూడాలని మహారాష్ట్రకు బయలుదేరింది. రాజ్యం కూతురు సుధ భర్త వ్యాపారవేత్త.
“ఇదిగో యిలా నువ్వు దుఃఖపడుతుంటే నాకు బాధగా వుంది. నువ్వు రాజ్యం బిడ్డవు. రాజ్యం చాలా స్థిత ప్రజ్ఞనురాలు. మీ అమ్మా నేనూ యెన్నో అనుభవాలూ యెన్నో భావాలనూ పంచుకున్నాం. రాజ్యం పరిపూర్ణ మహిళగా గృహిణిగా, గురువుగా, మానవతావాదిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చుకుని వెళ్లిపోయింది. రాజ్యం మానసికం గా మనతోనే వుంది “అంటూ లక్ష్మి సుధను తలనిమురుతూ ఓదార్చింది. సుధ లక్ష్మిని చూడగానే కన్నీళ్ల పర్యంతమయ్యి వొళ్లో పసిపాపలాగా వాలిపోయింది.
“లక్ష్మి పిన్నీ! నిన్ను చూస్తుంటే అమ్మతో మాట్లాడినట్టుంది. నువ్వూ, అమ్మా మనసుతో మాట్లాడుకునే వాళ్లని అమ్మ యెప్పుడూ చెప్తూ వుండేది. ” సుధకు కన్నీళ్లు ఆగడం లేదు.
“సుధా…. యేడవకు… నీకు యిప్పుడు పసిపాపాయి వుంది. నీ చుట్టూ అల్లుకున్న నీ భర్తా నీ అత్తవారూ నీ బిడ్డ. నాన్నను కూడా చూసుకోవాలి కదా “ ధైర్యం చెప్పింది లక్ష్మి.
“ పిన్నీ…… నా భర్తకు నేనున్నాను, నా బిడ్డకు నేనున్నాను. మరి నన్ను చిన్నపిల్ల లాగా చూసేందుకు పలకరించేందుకు నాకెవరున్నారు ?ఆకాశమంత అండ గా వుండే అమ్మ నా సుఖం దుఃఖం భావాలూ మనస్పూర్తి గా పంచుకోవడానికి అమ్మ. లేదుగా “ అంటూ మళ్లీ వెక్కి వెక్కి యేడ్చింది సుధ.
లక్ష్మి ఓదారుస్తున్న కొద్దీ సుధకు కన్నీళ్లు ఆగడం లేదు.
అందుకని లక్ష్మి మరో గదిలోకి వెళ్లి “సుధా కొంచెం వేడి వేడి aకాఫీ యిస్తావా” సుధను అడిగింది.
సుధ” పిన్నీ యిస్తాను” అంటూ వంటిట్లోకి వెళ్లింది.
సుధ భర్త పొలం పనిమీద వాళ్ల వూరెళ్ళాడు. ప్రస్తుతం సుధ, బిడ్డ రేఖ వున్నారు.
లక్ష్మి సుధ ను. పరామర్శించడానికి వచ్చింది. కానీ వచ్చినప్పటినించీ ఆ అమ్మాయి బాధ, కన్నీళ్లు చూస్తుంటే లక్ష్మి మనసు కలుక్కుమంటున్నది. సుధ యిచ్చిన వేడి కాఫీ తాగుతూ పడక్కుర్చీ లో వాలింది.
సుధ “పిన్నీ యిప్పుడే వస్తాను, పాపాయి నిద్ర పొతొంది.” అంటూ బజారెళ్లింది.
ఒంటరిగా కూచున్న లక్ష్మికి రాజ్యం జ్ఞాపకాలు తెరలు తెరలుగా మనోయవనిక ముందు కదిలాయి.
రాజ్యం చాలా మంచిది అలాగని సాధువుగా వుండేది కాదు. అన్యాయం అనిపిస్తే సానుకూల దృక్పథంతో అన్యాయాన్ని ఖండించేది. చాతుర్యం, హాస్యం, సమయస్ఫూర్తి, ముఖ్యంగా సమస్య పైన పూర్తి అవగాహన. రాజ్యాన్ని తల్చుకున్న కొద్దీ యెన్నో యెన్నో జ్ఞాపకాలు.
ఒకసారి రాజ్యం లక్ష్మి దగ్గరకు వచ్చింది. అప్పుడు “చూడవే రాజ్యం. వెధవ పిల్లి వేడి వేడి పాలన్నీ పారబోసింది. మళ్లీ పాలు కాచాలి “అంటూ లక్ష్మి విసుగ్గా అన్నది.
“బాగుందే…… గిన్నెలో వేడిపాలు యెలా తాగుతుందనుకున్నావు? దానికి తాగాలనిపించింది. అడగలేదుగా. మనం దాని సంగతి పట్టించుకోము. మంచిపని చేసింది. ”అన్నది రాజ్యం.
———
ఇంకోరోజు “చూడవే రాజ్యం! పువ్వులన్నీ కోసేస్తున్నారు, దేవుడికి ఒక్క పువ్వు వుంచలేదు” అన్నది లక్ష్మి. “ఇది మరీ బాగుంది, దేవుళ్లందరూ పువ్వుల్లోనే పుట్టారుగా. మళ్లీ వాళ్లకు పువ్వులెందుకు”తమాషాగా కనుబొమ్మలెగరేస్తూ నవ్వుతూ రాజ్యం చూసింది.
———
“రాజ్యం! మొన్న మార్కెట్ లో పర్సు పోయిందికదా. నీకు బాధ అనిపించలేదా ? “అడిగింది లక్ష్మి. “ఎందుకు బాధ ?? నాలాంటి అజాగ్రత్త మనిషికి యిలాగే కావాలి. పాపం యెవరికి దొరికిందో. హాయిగా వాళ్లు పళ్లు కొనుక్కుని తింటారులే. అయినా అందులో యెక్కువ లేదులే. ”అన్నది రాజ్యం.
ఒకసారి బళ్లో మాస్టారు ఒక అమ్మాయిని పద్యం సరిగా చెప్పలేదని యెండలో నించోబెట్టారు. అప్పుడు రాజ్యం “మాస్టారూ అందరూ ఒకేలా నేర్చుకోలేరు, రాధకు ఇంట్లో అమ్మకు జ్వరం. అంతా పనీ తనిచేసుకు వస్తుంది అందుకని తనకు కొంచెం సమయం యివ్వండి మాస్టారూ యిప్పుడు దీనికీ జ్వరం వస్తే కష్టం “అంటూ వాదించి రాధను యెండలో నించోబెట్టకుండా మాష్టారుని వారించింది.
యిలా యెన్నో యెన్నో తీపి జ్ఞాపకాలు..
జీవితం అందంగా దిద్దుకున్న వాళ్లకు మరణం కూడా అందం గా వుంటుందేమో. కడిగిన ముత్యం లాగా జీవితం, ఆఖరి వూపిరి కూడా అందం గా నవ్వుతూ ఆగిపోయింది. .
అన్నీ సర్దుకుని ప్రయాణానికి వెళ్లినట్టు అందంగా మరోలోకానికి మరలిరాని మరోప్రపంచంలో తన వునికిని మల్లెతావిలా తెలియచేసింది రాజ్యం.
రెండేళ్ల కిందట రాజ్యాన్ని కలిసినప్పుడు జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది.
ఆ రాజ్యం ఇంటిముందుకి బత్తాయిపళ్ళు బుట్టలో చంకలో చిన్నిబిడ్డతో మంచి యెండలో ఒక అమ్మి అమ్మడానికి వచ్చింది. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు..
రాజ్యం చూపు చంకలోని బిడ్డమీద పడింది.
“నీకు మతి వుందా లేదా నీకేక కన్నా బిడ్డ యేడుపు యెక్కువ గా వుంది. యింట్లో వుంచక పోయావా “అంటూ రాజ్యం అమ్మిని కోప్పడింది.
” ఏం చెప్పనమ్మా మూసిన కన్ను తెరవడం లేదు నాలుగురోజులయ్యింది పళ్లమ్ముకుంటే కానీ ఇల్లుగడవదు. ఇది నా చంక దిగడం లేదు “అమ్మి కన్నీళ్లతో రాజ్యాన్ని చూసింది.
“ముందు లోపలికి వచ్చి అరుగుమీద కూర్చో “గేటు తీసి అమ్మిని లోపల కూచోబెట్టింది.
గబగబా లోపలికివెళ్ళి వెళ్లి కొన్ని మాత్రలు ఒక కవరులో, పెట్టి యిచ్చింది.
“రోజూ యీ మాత్రలు పూటకొకటి చొప్పున మూడు పూటలు వెయ్యి “ అంటూ అమ్మికి యిచ్చింది. అంతే కాకుండా బియ్యం, పప్పులు, కూరలు ఐదువందలు యిచ్చింది.
“ ఒసేయ్, రెండు రోజులు తిరుగుడు అపి యింటిపట్టున వుండు, పసిబిడ్డను చూసుకో “అన్నది. ఆ అమ్మి కళ్లల్లో నీళ్లు, మొహంలో సంతోషం.
“యెంత చల్లని తల్లివి యే మహాతల్లి కన్నదో.. కొన్ని బత్తాయిలు తీసుకో అమ్మా” అంటూ రాజ్యానికి పళ్లు యివ్వబోయింది.
“ నాకొద్దు నువ్వే వుంచుకో “ అంటూ ఆ అమ్మిని పంపింది రాజ్యం.
రాజ్యంలో మానవత్వం, మంచితనం, అర్ధం చేసుకునే గుణం చిన్నప్పటినించీ వున్నాయి. బళ్లో కూడా యెవరైనా లెక్కలు చెప్పమంటే విసుక్కోకుండా చెప్పేది. ఘర్షణ అసలు వుండేదే కాదు.
“పిన్నీ” అన్న సుధ పిలుపుతో లక్ష్మి. ఆలోచనలు ఆగాయి
“సుధా రాజ్యం పెంపకం క్రమశిక్షణ, నిన్ను నీ అత్తవారింట్లో ఉన్నతంగా నిలబెట్టాయి. ” అన్నది లక్ష్మి. “పిన్నీ నన్ను ఒక విషయం బాగా బాధపెడుతున్నది నీకన్నా నాకు ఆప్తులు యెవరూ లేరు. అమ్మ తన నగలన్నీ అమ్మవారి పేరు మీద. దేవాలయానికి యిచ్చింది. నాన్నకు కూడా తెలియదు. అది నాకు బాధనిపిస్తుంది. అమ్మ జ్ఞాపకం కదా నగలు “ కన్నీళ్లతో సుధ లక్ష్మి తో అన్నది. .
“ పిచ్చితల్లీ మీ అమ్మ. యేది చేసిన యేదో ఆలోచించే చేస్తుంది. అందరూ బాగుండాలనే తపన. అమ్మవారికి యిస్తే నలుగురికి అన్నదానం జరిగితే ఆ పుణ్యం నీకేగా. నగలను మించిన సంపద అది. కలకాలం అమ్మ దీవెనలు అమ్మవారి ఆశీస్సులు నీకు శ్రీ రామరక్ష కదా. సుధా. అంత మంచిగుణం అందరికీ అబ్బదమ్మా, పిచ్చి. పిల్లా, నగలకన్నా విలువైన తరగని గుర్తింపు రాజ్యం నీకిచ్చి వెళ్ళింది “ లక్ష్మి జీవితసత్యం చెప్పింది. సుధలో చీకటి కోణం తొలగి వెలుగుకిరణం ప్రభవించినది.
గోడమీద రాజ్యం ఫోటో వాళ్లను చూసి నవ్వింది
సుధ మనసు పరిమళించింది…..

1 thought on “మగువ మరో కోణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *