March 29, 2024

రాజీపడిన బంధం –13

రచన: కోసూరి ఉమాభారతి

కార్ పార్క్ చేసి, “పదమ్మా” అంటూ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డ్ వైపు నడిచారు ఆనంద్. గజిబిజిగా అయిపోయిన మనస్సు, తడబడుతున్న కాళ్ళు, నీరసించిపోతున్న ఆలోచనలని కూడదీసుకొని పరుగులాంటి నడకతో అనుసరించాను.
మా కోసమే ఎదురు చూస్తున్న శ్యాం, చిత్ర మమ్మల్ని వెంటనే డాక్టర్ ఆఫీస్ లోకి తీసుకొని వెళ్లారు. అందరం ఆదుర్దాగా డాక్టర్ ఎదురుగా కూర్చున్నాము.
డా. విద్య ఎక్సరేలని తదేకంగా చూస్తుంది. ఇక ఉండలేక, “నా సందీప్ కి ఏమయ్యిందో చెప్పండి ప్లీజ్” ఆపుకోలేక ఎడ్చేసాను. పక్కనే ఉన్న చిత్ర నన్ను పొదవి పట్టుకొంది.
డా. విద్య వచ్చి మాకెదురుగా కూర్చుంది. నా వంక సానుభూతిగా చూసింది. “మీ ఆవేదన అర్ధం చేసుకోగలను. కానీ బాబుకి తగిలిన దెబ్బలు మామూలివి కావమ్మా” టేబిల్ పైనున్న నా చేతిపై తట్టింది ధైర్యం చెబుతున్నట్టు….
ఆ తరువాత నేను విన్న సంగతులు నన్ను పాతాళంలోకి తోసేసాయి……
“అంత ఎత్తు నుండి అదాట్టుగా పడిపోవడంతో, బయటకి కనబడే దానికన్నా తల లోపల ఏర్పడిన అఘాతం వల్ల, అపస్మారక స్థితిలో ఉన్నాడు పేషంట్. చేయవలసిన పరీక్షలన్నీ చేస్తున్నాము. రిపోర్ట్లు రావడానికి కొద్ది సమయం పడుతుంది. పైగా బాబు స్పృహలోకి రావడం గురించి కూడా వేచి చూస్తున్నాము” అని ముగించింది డాక్టర్.
నేను విసురుగా లేచాను. బాబుని చూడాలన్న ఆలోచనతో బయటికి వచ్చి ఐ.సి.యు వైపు పరిగెత్తాను.
చిత్ర నా వెంటే వచ్చి, “నువ్విలా ఆవేశంగా ఉంటే బాబుకి ఏమీ లాభం లేదు. పైగా బాబు క్షేమం రీత్యా, నిన్ను దూరం నుంచే చూడనిస్తారు. కాస్త నెమ్మదిగా ఉండడానికి ప్రయత్నించు. వెళ్లి సందీప్ ని చూద్దాము” అని నా భుజాల చుట్టూ చేతులు వేసి ఐ.సి.యు కి తీసుకెళ్ళింది.
**
అక్కడ బెడ్ మీద నా బాబు చేతికి ట్యూబులు, ముఖానికి మాస్క్ వేసి ఉన్నాయి. అలా వాడిని చూసిన నాకు, వొళ్ళు తెలియని దుఃఖంతో గుండెలు అవిసిపోయి కాళ్ళు చేతులు చల్లబడ్డాయి.
వణుకుతూ తూలి కుప్పకూలి పోవడం మినహా, అటు పైన ఏమయిందో తెలియదు.
**
కళ్ళు తెరిచేప్పటికి హాస్పిటల్లోనే బెడ్ మీద ఉన్నాను. పక్కన అత్తయ్య, అమ్మ, వినోద్ ఉన్నారు. అమ్మ లేచి దగ్గరగా వచ్చింది. “ఎలా ఉందమ్మా వొంట్లో” అమ్మ అడిగినా ఏమీ మాట్లాడక కళ్ళు మూసుకున్నాను.
చిత్ర వచ్చి, నా తల మీద చేయి వేసింది. “నీ కేమీ అవ్వలేదు. ఇప్పుడు బాగానే ఉన్నావు. నిన్న సొమ్మసిల్లి పోయావు. విశ్రాంతిగా ఉండాలని నీకు మందులు, ఇంజక్షన్ ఇచ్చి ఇక్కడే ఉంచాము” అంది.
“ఇంతకీ వేద ఎలా ఉంది? ఎవరు చూసుకుంటున్నారు” ఆదుర్దాగా అడిగాను.
“నీవేమీ బెంగపెట్టుకోవద్దు. అత్తమ్మా వాళ్లకి ఇబ్బంది ఉండకూడదని, మీ అమ్మావాళ్ళతో పాటు వేదని మా ఇంట్లోనే ఉంచాము. వేదని చూసుకోడానికి విశాల కూడా ఉంది. పాప క్షేమంగా ఉంది. మా వంటమనిషి కూడా ఉందిగా..ఏం పర్వాలేదు.
”మంచిది… సందీప్ ని చూడాలి చిత్రా” అని పైకి లేచాను.
“సరే ఇలా రా” అని పక్కనే ఉన్న ఆఫీస్ రూములోకి నడిపించుకు వెళ్ళింది చిత్ర. నా వెనుకే అంతా వచ్చారు. నన్ను కూర్చోబెట్టి చిత్ర నా ఎదురుగుండా కూర్చుంది.
**
“చూడు నీల, బాబువి కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. ఇంకాసేపట్లో, అంటే తొమ్మిదికల్లా రిపోర్ట్స్ చూసే డా. విద్య ఇక్కడికి వస్తారు. అన్ని సంగతులు వివరిస్తారు. ఆ తరువాత జరగవలసినది చేద్దాము” చిత్ర నాతో అంటుండగానే గదిలోకి డా. విద్య, వెంట మామయ్య, శ్యాం వచ్చారు.
అప్పటివరకు అందిన రిపోర్ట్స్ చదివి, ఎక్స్రేలు చూసారు ఆమె.
ఊపిరి బిగబెట్టి ఆమెనే చూస్తున్నాను..
కొద్దిక్షణాలకి నా వంక చూసారామే…
“రిపోర్టులని బట్టి, సందీప్ అపస్మారక స్థితిలోనే ఉన్నాడని అర్ధమయింది. పేషంట్ పరిస్థితిలో మార్పు లేదు. వైటల్స్ తో పాటు మిగతా ప్రమేయాలన్నీ నిలకడగా అయితే ఉన్నాయి” అన్నారు విద్య.
“యేదైనా, రావల్సిన మరిన్ని రిపోర్ట్స్ ని కూడా న్యురాలజిస్ట్ పరిశీలించాకే, అసలు పరిస్థితి తెలుస్తుందమ్మా” వివరించారు డా. విద్య.
**
ఎవరితో ఏమీ అనకుండా లేచి, ఐ.సి.యు కి వెళ్లి సందీప్ ని బయట నుండే చూసాను. ‘నన్ను క్షమించు బాబు, నా కడుపు విషం రా. జన్మ నైతే ఇచ్చి, నిన్ను కంటికి రెప్పలా చూసుకున్నానని అనుకున్నానే గాని, నిజానికి నేనే నీ జీవితానికి ముప్పునిరా..కన్నా’, ‘నన్ను క్షమించు బాబు’ అని మనుసులోనే వాడిని వేడుకున్నాను. ఆగని కన్నీటిని తుడుచుకొని బయలుదేరాను.
నా కోసం ఆమడ దూరంలో నిలబడి చూస్తున్న వినోద్, చిత్ర, ఆనంద్ ల వద్దకు వెళ్లాను. చిత్ర నడిగి కాస్త నగదు తీసుకొని బయలుదేరాను.
“ఆగమ్మా, ఎక్కడికి? నేను తీసుకెళతానుగా! ఒక్కదానివి వెళ్ళద్దు” అంటూ నన్ను అనుసరించారు ఆనంద్, చిత్ర.. ఆనంద్ ని హాస్పిటల్లోనే ఉండమంది చిత్ర.
ఎక్కడికి వెళ్ళాలో చెప్పి కార్ లో జారిగిల పడ్డాను. వెనక సీట్లో వినోద్ కూర్చున్నాక, తానే కార్ డ్రైవ్ చేయసాగింది.
**
లాయర్ గారి ఆఫీసు…..
పొద్దున్న పదకొండు అయింది. వినోద్, చిత్రలతో పాటుగా సీనియర్ అడ్వకేట్ రాఘవ శర్మ గారి ఆఫీస్ వెయిటింగ్ రూములో మౌనంగా కూర్చున్నాను.. లోపల మరో క్లైంట్ తో బిజీగా ఉన్నారాయన.
**
అరగంట తరువాతగాని ఆయన్ని కలవలేక పోయాము.
నన్ను చూస్తూనే, “ఏమిటమ్మా? ఫోన్ కూడా లేకుండా వచ్చావు? ఏమి సంగతి? నీ ఆరోగ్యం బాగుందా?” అన్నారాయన నా వంక నిశితంగా చూస్తూ.
చేసుకున్న నిర్ణయాలతో గుండె బండబారి పోయింది. ఓ క్షణం మనసు కూడదీసుకొని, “శర్మ గారు, మీకు నా పరిస్థితి ఇదివరలోనే చెప్పాను. మీ సలహా ప్రకారం అన్నీ స్థిమితంగా ఆలోచించాను. వారం క్రితమే మా ఇంట్లో వాళ్లకి సంగతి వివరించి, ‘లీగల్ సెపరేషన్’ గురించి చెప్పాను” అంటూ ఆగాను. “ఆ మేరకు అవసరమైన కాగితాలు తయారు చేయండి” గట్టిగా ఊపిరి తీసుకున్నాను.
“సరే నీలవేణి…అలాగే చేద్దాం. కానైతే నీవిప్పుడు ఇంత హైరానాగా ఉన్న కారణం చెప్పు… మళ్ళీ కొత్తగా ఏదన్నా సమస్య తలెత్తిందా?” ఆరా తీసారు రాఘవ గారు.
“మా బాబు సందీప్ మళ్ళీ గాయపడ్డాడు. నా భర్త వల్ల. ప్రతిసారి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పసివాడి చావుదెబ్బలకి కారణమౌతున్నది వాడి తండ్రే. విచక్షణ లేకుండా పసివాణ్ణి పదేపదే అలివికాని వాటికి నెడుతుంటారు. ఈసారైతే, వాడు హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు. బతుకుతాడో లేదో కూడా తెలియదు. నాకు, నా బిడ్డలకి నా భర్త నుండి పూర్తి విముక్తి వెంటనే కావాలి సార్” అంటూ చేతులు జోడించి వేడుకున్నాను.
**
శర్మగారు అంతా విన్నారు. పక్కనే కూర్చున్న చిత్రని, దూరంగా వెనకాల కూర్చున్న వినోద్ ని చూసి, “వీరెవరు?” అని అడిగారు.
“ఈమె నా ఫ్రెండ్ డా. చిత్ర. వీడు నా తమ్ముడు వినోద్. నేను మీకు చెప్పిన కొన్ని సంఘటనలకి వీడు ప్రత్యక్ష్య సాక్ష్యం కూడా. వీళ్ళ నుండి నా విషయం దాచవలసిన అవసరం ఇక లేదు, శర్మ గారు” అన్నాను.
“సరే అయితే, వెంటనే డాకుమెంట్స్ తయారు చేద్దాం. ఆ నివేదికలో అన్ని విషయాలు నమోదు చేయవచ్చు. మళ్ళీ ప్రత్యేకించి నీ భర్త నుండి పిల్లలకి విడిగా బధ్రత కోరడం అనవసరం” వివరించారు శర్మ గారు..
ఓ క్షణం ఆగి, సెక్రెటరీని పిలిచారు…
నా వంక చూస్తూ, “చూడు నీల, పక్కన కాన్ఫెరెన్స్ రూములో కూర్చుని, మొదటినుంచి నీవు నాకు చెప్పిన విషయాలన్నీ డాక్యుమెంట్ చేయించు. నాకు కావలిసిన మిగతా వివరాలు నేనే తీసుకుంటాను.
ఈ కేసు విషయంగా ఈలోగా నీ పరిస్థితులు మారి, నీ ఆలోచనలో మార్పు వస్తే కూడా నాకు చెప్పవచ్చు. నీ విషయమై ఓ పోలిస్ అధికారిని కూడా సంప్రదిస్తాను. సరేనా?” అన్నారాయన ఫోన్ అందుకుంటూ.
**
మేమంతా కాన్ఫెరెన్స్ రూములో కూర్చున్నాము. చిత్ర వంక చూసాను. దాని ముఖాన ఎన్నో ప్రశ్నలు, మరెన్నో అనుమానాలు. నేను ఔనన్నట్టు తలాడించాను. ఇంతలో, సందీప్ విషయంగా చిత్రకి ఫోన్ వచ్చింది. మరునాడు పొద్దున్నే ఎనిమిదింటికి న్యూరోసర్జన్ తో మీటింగ్ అని తెలియజేశారు.
రాఘవ గారి సెక్రెటరీ ల్యాప్టాప్ తో వచ్చి మా ఎదురుగా కూర్చున్నాడు.
పదేళ్ళగా నా జీవితాన జరిగిన సంఘటనలని అవసరమైన వివరాలతో ఒక్కోటి చెప్పవలసినంత చెప్పాను. సందీప్ గాయపడ్డ సంఘటనలని ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వినోద్ చేత చెప్పించాను.
**
అంతా అయ్యాక, నా వంక తిరిగాడు వాడు. “పోతే అక్కా, పతంగీలు ఎగర వేస్తూ, అందరం అక్కడే ఉన్నాము. అప్పటికే ముందంజలో ఉన్న మన సందీప్ టీమ్ గెలవాలని, వాడితో పాటు బావ కూడా పట్టుదలగా ఉన్నారు. పోటీ ఆఖరి విడతగా..,ఎత్తైన కట్టడం మీదకి సందీప్ కూడా వెళ్లారు బావ. కిందనుండి ఫాలో అవుతూ మేమంతా కూడా ఉత్సాహంగా ఉన్నాము…. ఉన్నట్టుండి అందరికంటే ముందుకి, కట్టడం అంచులవరకు పరిగెత్తాడు సందీప్. అక్కడున్న గార్డ్స్, బావగారు కూడా ఆగమని చెబుతున్నా, పతంగీ ఎగరవేస్తూ మరింతగా ముందుకు పరిగెత్తాడు. అంచున ఉన్న రాయి తగిలి ముందుకు తూలాడేమో, త్రుటిలో ఎవరూ అనుకోని విధంగా వాడు పైనుండి పడిపోయాడు. ప్రమాదవశాత్తు జరిగిందక్కా” అంటూ బాధపడ్డాడు. కాసేపు మౌనంగా ఉండిపోయాము.
అక్కడి నుంచి మిగతా విషయమంతా చిత్ర కి కూడా తెలుసునన్నాడు.
నీరు నిండిన కళ్ళతో చిత్ర వంక చూసాను. తను కూడా అదే పరిస్థితిలో ఉంది.
కళ్ళు తుడుచుకుని నీరసించిన గొంతుతో ”కాంటీన్ నుండి పిల్లలకి స్నాక్స్, డ్రింక్స్ తీసుకుని వస్తున్న నాకు, వినోద్ ఫోన్ చేసి సంగతి చెప్పాడు. బాబు పరిస్థితి చూసి ఆంబులెన్స్ పిలిపించాము. ఎలాగూ ముందు బాబుకి వైద్యం అవసరం కాబట్టి, వాడితో మేమంతా హాస్పిటల్ కి వెళ్ళాము. మీ నాన్నగారు, మామయ్యగారు కూడా వెనకాలే వచ్చారు” వివరించింది చిత్ర. “అదే సమయంలో హాస్పిటల్ కి వెళ్లి వస్తూన్న ఆనంద్ కి విషయం చెప్పి .. నిన్ను హాస్పిటల్ కి తీసుకురమ్మనన్నాను. ఇదిరా జరిగింది, చాలా బాధగా ఉంది నీలా” అంటూ చిత్ర వాపోయింది.
పిల్లవాడి వయసు, సామర్ధ్యతతో సంబంధం లేకుండా, కేవలం ఆటల్లో గెలవాలన్న కాంక్ష మాత్రమే ఉంది శ్యాంలో. అసలా పసివాణ్ణి అతిగా ప్రోత్సహించడం, అదీ వాడి బలాబలాలు తెలిసి కూడా అంతగా నెట్టడం సరికాదు అని తలుచుకుంటే వొళ్ళు మండిపోతుంది.
**
లాయర్ గారికి కావలసిన డాక్యుమెంటేషన్ ముగించి, సెక్రెటరీ లోనికి వెళ్ళాడు. భుజం మీద చేయి వేసింది చిత్ర.. “నీలా ఇదంతా నిజమా నీలా? నీ జీవితం అగ్నిగుండంలా ఉంది. చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు” అంది.

“ఇన్నాళ్ళగా రాజీ పడి జీవితాన్ని నెట్టుకొస్తున్నందువల్లనే …ఇప్పుడిక అర్ధంలేని విధంగా తయారయింది…” అన్నాను నిర్లిప్తంగా.
ఇంతలో సెక్రెటరీ వచ్చి, మేమింక వెళ్లవచ్చని, లాయర్ గారు ఫోన్ చేస్తారని చెప్పాడు.
“నన్ను ఆసుపత్రిలోనే దిగబెట్టండి. బాబు వద్ద ఉంటాను. మీరు ఇళ్లకి వెళ్లి పొద్దున్నే మాత్రం వచ్చేయండి” అంటూ కారు వద్దకి నడిచాను.
**
మరునాడు పొద్దుట ఎనిమిదింటికి అందరం డా. నిఖిల్ ఇనాందార్ ఆఫీసులో కలిసాము .
కాసేపటికి చేతిలో రిపోర్ట్స్ తో వచ్చారు డాక్టర్ గారు. ప్రశాంతంగానే ఉన్నారాయన. ఎదురుగా కూర్చుంటూ మా వంక నిశితంగా చూసారు.
బాబుది సర్జరీతో బాగవ్వగల పరిస్థితేనని ఆయన అభిప్రాయపడ్డారు. తీవ్రమైన కుదుపుకి తల లోపలి భాగంలో ఏర్పడ్డ రక్తస్రావం (సెరబ్రెల్ హెమరేజ్) అన్నారు. గట్టెక్కే అవకాశం మెరుగ్గానే ఉందని అన్నారు…
బ్రెయిన్ మడతల నడుమ రక్తస్రావాన్ని ఆపగలిగితే, అందున్న వాపు తగ్గి, బాబు ఇప్పుడున్న గడ్డు పరిస్థితి నుండి తేరుకునే అవకాశం ఉందన్నారు.
తక్షణమే సర్జరీకి సమయం కేటాయించారు.
వేయి ఉద్యానవనాలు ఒకేసారి విరగబూసినంత ఆనందం నిండింది గుండెల్లో. సంతోషంతో పిచ్చిదాన్నయ్యాను. సర్జన్ కి ధన్యవాదాలు తెలిపి, మామయ్య, శ్యాం సర్జరీకి ఏర్పాట్లు చేయడానికి వెళ్ళారు. నేను అక్కడి నుండి లేచి బాబుని చూడ్డానికి ఐ.సి.యు దిశగా అడుగులు వేశాను.
**
ఈ సారి బాబుని చూసిన క్షణం, వేయి ఏనుగుల బలంతో ముందుకు సాగిపోతాను అనిపించింది.
“నేను బాగయి పోతాను మమ్మీ” అని సందీప్ అంటునట్టుగానే తోచింది.
శ్యాం, మామయ్య కూడా లోనికొచ్చి వాడిని చూసాక, సందీప్ ని ఆపరేషన్ థియేటర్ వైపు తీసుకెళ్ళారు…
**
దేవుని మీదే భారం వేసి, ఐ.సి.యు బయటకి నడిచాను. కాస్త దూరంలో నిలబడున్న ఆనంద్, చిత్రలని కలిసాను.
“చూడమ్మా, మేమిద్దరం ఇవాళ నీ అందుబాటులోనే ఉన్నాము” అన్నారు ఆనంద్ నా వంక చూస్తూ.
నాతో పాటే ఉన్న మామయ్య కలగజేసుకున్నారు.
“సందీప్ సర్జరీకి కొన్ని గంటలు పడుతుందన్నారు. నీవు కాసేపు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా” అన్నారాయన నాతో.
“ఇంటి నుండి కూడా అందరు మధ్యాహ్నం వస్తారు.. ఇప్పుడు వెళ్ళి, వాళ్ళతో రావచ్చు” అన్నాడు శ్యాం నన్నుద్దేశించి..
“లేదు మామయ్య, నేనిక్కడే ఉంటాను. చిత్రతో ఓ సారి గుడికి వెళ్ళి వచ్చేస్తాను. మీరు ఇంట్లో వాళ్ళందరికీ చెప్పండి సందీప్ బాగయిపోతాడని” అన్నాను…
**
నన్ను, చిత్రని ముందుగా హాస్పిటల్లోని కాంటీన్ కి తీసుకువెళ్ళారు ఆనంద్. దూరంగా ఉన్న ఓ టేబిల్ వద్ద కూర్చున్నాము.
ఆర్డర్ చెప్పి వచ్చి ఎదురుగా కూర్చున్నారు ఆనంద్. చిత్ర ద్వారా నా విషయం అంతా తెలిసిందదన్నారు. మౌనంగా ఉండిపోయాను. “బాగా అలోచించి, లాయర్ గారితో కూలంకుషంగా సంప్రదించి మరీ అడుగువేయాలి నీలా” అని సలహా ఇచ్చారు. అవసరమయితే లాయర్ వద్దకు తామూ వస్తామన్నారు..
ఇంతలో ఆర్డర్ చేసిన ఫుడ్, కాఫీ తెచ్చి టేబిల్ మీద సర్డాడు బేరర్. కాఫీ మాత్రం తాగి రౌండ్స్ చేయడానికి వెళ్ళిపోయారు ఆనంద్.
టిఫిన్ చేస్తూ నేను, చిత్ర మిగిలాము. “వేద మిమ్మల్ని రాత్రిళ్ళు మేలుకోబెట్టడం లేదు కదా! విశాల అన్నీ సరిగ్గా చూసుకుంటుందా?” అడిగాను.
“వేద గురించి నువ్వు ఆనంద్ ని అడగవలసింది. వర్క్ నుండి ఇంటికెళ్ళడం ఆలస్యం…పాపని తనే చూసుకుంటున్నారు” అంది చిత్ర.
“మీకు నేనెలా థాంక్స్ చెప్పుకోవాలో తెలీదు చిత్రా. ఇటువంటి క్లిష్ట సమయంలో అమ్మావాళ్ళతో పాటు వేద నీవద్ద ఉండబట్టి, నేను సందీప్ ని చూసుకోగలుగుతున్నాను” అన్నాను కృతజ్ఞతగా…
“నీవు నాకు థాంక్స్ చెప్పాలా? వేదతో గడుపుతున్న సమయం మాకు చాలా ఆనందాన్నిస్తుంది. ఇకపోతే, హాస్పిటల్కి మా అపార్ట్మెంట్ బాగా దగ్గర కదా! అందుకని అమ్మవాళ్ళు మావద్ద ఉండడమే వీలు కూడా… ” అంది చిత్ర.
మారో సారి కాఫీ ఆర్డర్ చేసి, అక్కడే కాసేపు కూర్చుండిపోయాము
“ఇప్పుడు ఇంత తెలిసాక, నా దగ్గర ఏదీ దాచకుండా ఇంకా ఏమన్నా ఉంటే చెప్పు,” అంది సూటిగా చిత్ర.
క్షణం మౌనంగా ఉన్నాను. గట్టిగా ఓ సారి ఊపిరి తీసి, చిత్ర వంక చూసాను.
“అయితే, నేను చెప్పేది ఓపిగ్గా విను. నీవు ఊహించినది నిజమే.. శారీరకంగా, మానసికంగా నేను ‘శ్యాం బాధితురాలినే. పైశాచికం, శాడిజం నా భర్త శ్యాంప్రసాద్ నైజం అన్నది నేను నమ్మిన నిజం. మా కుటుంబాల పరువుప్రతిష్టలు దెబ్బ తింటాయేమో అన్న భయంతోనే, ఇన్నాళ్ళూ సంసారమనే నరకం నుండి బయటపడే సాహసం చేయలేదు” అంటూ నిట్టూర్చాను.
శ్యాం మొరటు ప్రవర్తన, నా పట్ల అతని దౌర్జన్య వైఖరి, గర్భవతినైన నేను గాయాలతో హాస్పిటల్లో జేరడం వెనుక అసలు నిజం పూస గుచ్చినట్టు చెప్పాను చిత్రకి. అతని మూలంగా మాటిమాటికి సందీప్ గాయపడిన వైనం, మానసికంగా నేనెంత అలజడికి గురయిందీ వివరించాను.
అంతా విని, మౌనంగా ఉండిపోయింది చిత్ర……కొంతసేపటికి తేరుకొని నోరు విప్పింది చిత్ర. “ఎంతటి దుస్థితి అనుభవించావు నీలా? ఇంతటి దావాగ్ని నీలో నివురుగప్పి ఉందని మాత్రం నేనస్సలు ఊహించలేదు తెలుసా” అని కన్నీళ్లు పెట్టుకొంది.
“మా పట్ల శ్యాం ప్రవర్తన ఏ కోవకి చెందిన ‘మానసిక ప్రవృత్తి’ అనేది, నువ్వే నాకంటే బాగా చెప్పగలవు” అన్నాను చిత్రతో.
… తానేదో అనబోయేలోగా చిత్ర సెల్ ఫొన్ మోగింది.
“హలో, రమణీనా? ఓ నిముషం ఆగు” అని నా వంక చూసింది..
“రమణి చాలా సార్లు నీ కోసం ఫోన్ చేసింది” అంటూ ఫోన్ నాకందించింది.
రమణి నాకు ధైర్యం చెప్పింది……నన్ను చూడ్డానికి, ఈ సారి తన ఇద్దరి పిల్లలతో ఢిల్లీ వస్తానంది.
“అవును, చిత్ర ద్వారా విషయం తెలిసింది..కవలలు పుట్టబోతున్నరటగా! చాలా సంతోషం. నీకు పిల్లలకి దేవుని అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటాను రమణి” అన్నాను.
**
సందీప్ కి సర్జరీ అయ్యి నాలుగు రోజులయింది. ఆపద నుండి వాడు బయట పడ్డట్టేనన్నారు డాక్టర్లు. ఇక వాడు క్షేమంగా ఉన్నట్టే….
ప్రతిపూట మామయ్య, శ్యాం డాక్టర్ని కలిసి వాడి పరిస్థితి తెలుసుకుంటున్నారు.
సందీప్ సంతృప్తికరంగా కోలుకుంటున్నాడని, రెండు రోజుల్లో డిస్చార్జ్ చేస్తామన్నారు డాక్టర్లు…
**
సందీప్ హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చి కూడా నాలుగు రోజులయింది.
కొద్దికాలం వాడి కోసం నర్స్ ని ఉంచాము. డాక్టర్ గారి ఆదేశాలు పాటిస్తూ సవ్యంగా కోలుకుంటున్నాడు.
ఇప్పటి వరకు నాకు సాయంగా ఉన్న అమ్మావాళ్ళు తిరుగు ప్రయాణమయ్యారు. మరి రెండు గంటల్లో వారి ట్రైన్. వెళ్లేముందు నాకు జాగ్రత్తలు చెప్పారు అమ్మావాళ్ళు..
పిల్లల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రేయస్కరమైన నిర్ణయాలు తీసుకోబోతున్నానని, బెంగ పెట్టుకోవద్దని వాళ్ళకి చెప్పాను.
అత్తయ్య కూడా గేటు వరకు వచ్చి వాళ్ళని సాగనంపారు..
“మళ్ళీ వస్తానక్కా” అని వెడుతూ, కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు వినోద్.
**
కారు కదిలిపోయాక వెనుతిరిగి ఇంట్లోకి వస్తుండగా నా సెల్ ఫోన్ రింగ్ అయింది. లాయర్ గారి నుండే. ఆదుర్దాగా తీసాను.
డాకుమెంట్లు రెడీ అని, మరునాడు పొద్దున్నే కలవమన్నారు.
**
ఆనంద్, చిత్రలతో, శర్మగారి వద్దకు వెళ్లాను. వాళ్ళని నా శ్రేయోభిలాషులుగా పరిచయం చేసాను.
నేను కోర్టులో వేయబోయే పిటీషన్ గురించి శర్మ గారు మాకు వివరించారు. ఫామిలీ కోర్ట్ లో దాఖలయ్యే ‘లీగల్ సేపెరేషన్’ పిటీషన్ ల పై సంతకాలు పెట్టాను. ‘రిస్ట్రైనింగ్ ‘ ఆర్డర్ అవసరం లేదని నిర్ధారించారు.
నా తరఫున ఆనంద్ అడిగిన కొన్ని ప్రశ్నలకి బదులుగా, “శ్యాం నుండి ఈ పిటీషన్ కి వ్యతిరేకత ఉండదని నా అభిప్రాయం. అతను ఏ విధంగానూ ప్రతిఘటించే విధంగా కౌంటర్ వేసే అవకాశం లేదు…” అన్నారు శర్మ గారు.
లీగల్ నోటిసులు శ్యాంకి సోమవారమే వెళతాయట. డాక్యుమెంట్ కాపీలు నాకు అందజేశారు. ఆయనకి ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకొని, అక్కడి నుండి బయటకొచ్చాము.
**
నన్ను ఇంటి వద్ద దిగబెట్టి, చిత్ర వాళ్ళు గార్గావ్ గ్రామం దిశగా వెళ్ళారు. ఈ మధ్యనే అక్కడ ఎకరాల భూమిని కొనుగోలు చేసారు ఆనంద్..
..’ఆనందా కుటీర్’ అన్న పేరుతో ఆ భూముల్ని అభివృద్ధి పరుస్తారట.
**

2 thoughts on “రాజీపడిన బంధం –13

  1. కధ సరిగా అర్దంకాలేదు లీగల్ గా విడిపోవడానికి అన్ని శిద్దమైన తరవాత ఏ భందంతో రాజి పడ్డారో అవగాహనకాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *