April 16, 2024

అమ్మమ్మ – 24

రచన: గిరిజ పీసపాటి

వారం రోజులు ఉన్నాక తిరిగి విశాఖపట్నం వెళ్ళి, అక్కడి నుండి హైదరాబాదు వెళిపోయింది అమ్మమ్మ. తరువాత రెండు సంవత్సరాల పాటు మళ్ళీ నాగను, మనవలను చూడడానికి వెళ్ళలేకపోయింది.
మూడవ సంవత్సరం సంక్రాంతికి ‘నాగను పిల్లలనీ తీసుకుని తెనాలి రమ్మని, అక్కడ అందరూ ముఖ్యంగా పెద్దన్నయ్య కుటుంబం నాగను చూడాలని ఉందని తనకు ఉత్తరాలు రాసున్నారని, ఈ సంవత్సరం పండుగ తెనాలిలో జరుపుకుందామ’ని పెదబాబుకి ఉత్తరం రాసింది అమ్మమ్మ.
‘ఆ విషయం మా నాన్నని అడగండి’ అంటూ పెదబాబు ఇచ్చిన జవాబుకి మనసులో నొచ్చుకున్నా, తిరిగి వియ్యంకుడికి ఉత్తరం రాసింది.
‘తన కొడుకుకి ఇష్టమైతే తనకేమీ అభ్యంతరం లేదంటూ’ ఆయన రాసిన ఉత్తరాన్ని జత చేస్తూ అల్లుడికి మరో ఉత్తరం రాసింది. అప్పుడు తప్పకుండా వస్తామని తిరిగి ఉత్తరం రాసాడు అల్లుడు.
సంక్రాంతికి వారం రోజుల ముందే రాముడువలస వెళ్ళి గిరిజను వైజాగ్ తీసుకొచ్చింది నాగ. అనుకున్న రోజుకి పిల్లలతో సహా ట్రైన్ ఎక్కి, తెనాలికి ప్రయాణమయ్యారు. పిల్లలు ముగ్గురూ మొదటిసారి రైలు ప్రయాణం చేస్తుండడంతో చాలా సరదా పడసాగారు.
పల్లెటూరు తప్ప పట్నం ఎరుగని గిరిజకి, ఆఖరి వాడైన నానికి వేగంగా వెనక్కి వళిపోతున్న చెట్లను చూపిస్తూ సందడి చెయ్యసాగింది నాగ పెద్ద కూతురు వసంత.
తెనాలి స్టేషన్ లో ట్రైన్ ఆగాక, హడావుడిగా దిగుతున్న వాళ్ళని దిగనిచ్చి, ఆఖరున తమ లగేజి తీసుకుని వీళ్ళు దిగేసరికి, వీరి కోసం వెతుక్కుంటూ వీళ్ళున్న కంపార్ట్మెంట్ దగ్గరకు వచ్చింది అమ్మమ్మ.
ట్రైన్ దిగుతూనే తల్లిని కౌగలించుకుని, మళ్ళీ ఎన్నో సంవత్సరాలకి పుట్టిన ఊరు చేరిన సంతోషంతో కళ్ళ నుండి కారుతున్న ఆనందభాష్పాలను తుడుచుకుంది నాగ.
మనవరాళ్ళను, మనవడిని ముద్దాడి, “జాగ్రత్తగా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నడవండి” అని చెబుతూ స్టేషన్ బయటకు దారితీసి, రెండు రిక్షాలలో ఇంటికి బయలుదేరారు.
అంతకు వారం రోజుల ముందే అమ్మమ్మ హైదరాబాదు నుండి తెనాలి వచ్చి, నాజర్ పేటలో చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని, పిల్లలు తింటారని ఎన్నో రకాల తినుబండారాలు తయారుచేసి ఉంచింది.
స్టేషన్ నుండి ఇంటికి రాగానే అందరికీ వేడి నీళ్ళు పెట్టిచ్చి, వారి స్నానాలు పూర్తయ్యేలోపు తను కూడా ఇంటి ముందున్న నేల బావి నీళ్ళతో స్నానం చేసి, గబగబా వంట పనిలో పడింది ‘పాపం పిల్లలు ఎప్పుడనగా తిన్నారో, ఎంత ఆకలితో ఉన్నారో ఎంటో’ అనుకుంటూ…
స్నానాలవగానే నిద్రకి జోగుతున్న పిల్లలను మాటలలో పెట్టి, వాళ్ళతో మాట్లాడుతూనే మిగిలిన వంట కానిచ్చింది. ఈలోగా పెద్దన్నయ్య కుటుంబం అంతా వచ్చి, వీళ్ళను పలకరించి కాసేపు కబుర్లు చెప్పి వెళ్ళారు.
భోజనాల వేళ అవడంతో “ముందు పిల్లలకు, ఆయనకి పెట్టెయ్యమ్మా! వాళ్ళు తిన్నాక మనిద్దరం తిందాం” అని నాగ చెప్పడంతో ముందు అల్లుడికి పిల్లలకు వడ్డించారు. “నానికి నువ్వు కలిపి పెట్టమ్మా! చంటివాడు వాడేం కలుపుకు తింటాడు?” అంది అమ్మమ్మ.
“మా అత్తవారింట్లో ఏడాది నిండినప్పటి నుండి పిల్లలు వాళ్ళ చేత్తోనే కలుపుకుని తినడం అలవాటు చేస్తారమ్మా! నానికి ఈ సంక్రాంతికి‌ మూడు నిండి, నాలుగు వస్తాయి. వాడు గత రెండు సంవత్సరాలుగా వాడి చేత్తోనే తింటున్నాడు. నేను కలిపి పెట్టక్కర్లేదమ్మా!” అంది నాగ.
“అదేమిటే! మరీ అంత పసి పిల్లలు ఎలా తినగలరు? అయినా అదీ మంచి అలవాటేలే. నువ్వు చూడు గర్భవతివి అయ్యాక కూడా మీ నాన్న కలిపి పెడితే కాని తినేదానివి కాదు. అంత గారాబం చేసేవాడాయన. ఆ గారాబం అస్సలు మంచిది కాదు” అన్న తల్లి మాటలకు ఉడుక్కుంది నాగ.
అల్లుడు, పిల్లలు ముగ్గురూ భోజనాలకు కూర్చోగానే మొదటిసారి తన ఇంటికి కూతురు, అల్లుడు, మనవలు వచ్చినందుకు మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుండగా తాను వండిన వంటకాలను కొసరి కొసరి వడ్డించి, వాళ్ళు తింటుంటే తృప్తిగా చూసుకుంది. వాళ్ళ భోజనాలు అవగానే తల్లీ కూతుళ్ళు కూడా తినేసి, వంట గది శుభ్రం చేసి వచ్చారు.
ప్రయాణ బడలిక వల్ల‌ అల్లుడు, పిల్లలు వెంటనే నిద్ర పోయారు. వీళ్ళిద్దరూ మాత్రం పడుకునే ఒకరి మీద ఒకరు చెయ్యి వేసుకుని ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. సాయంత్రం మళ్ళీ నాగను చూడడానికి వచ్చిన వాళ్ళతో ఇల్లు సందడిగా మారిపోయింది.
సాయంత్రం పక్కింటి వాళ్ళ పనమ్మాయితో ఇంటి ముందు పేడ నీళ్ళతో కళ్ళాపి జల్లించి, నాగ పెట్టిన ముగ్గు మీద మనవరాళ్ళిద్దరి చేత గొబ్బెమ్మలు పెట్టించింది అమ్మమ్మ.
బొబ్బిలి వైపు గొబ్బెమ్మలు పెట్టే సంప్రదాయం లేకపోవడంతో, పిల్లలిద్దరూ వాటి గురించి అడిగి తెలుసుకుని, గొబ్బెమ్మలు పెట్టి, ఇరుగు పొరుగు ఆడపిల్లలతో కలిసి ఉత్సాహంతో గొబ్బి తట్టారు.
భోగి పండుగ రోజున తను హైదరాబాదు నుండి తెచ్చిన బట్టలు కూతురికి, అల్లుడికి, మనవలకి పెట్టింది. సాయంత్రం మనవరాళ్ళిద్దరికీ పూల జడలు వేసింది. ఇంతలో నాగ చిన్ననాటి స్నేహితురాళ్ళు భ్రమరాంబ, జయశ్రీ వచ్చి నాగతో కబుర్లలో పడ్డారు.
కబుర్ల మధ్యలో తాను చిన్నప్పుడు తిరిగిన ఊరు, వీధులు ఇప్పుడెలా ఉన్నాయో చూసుకోవాలనే కోరికను నాగ వెలిబుచ్చగా, అందరూ కలిసి ఊరు చూడడానికి బయలుదేరారు.
మర్నాడు నాని పుట్టిన రోజని, సాయంత్రం పేరంటం చెయ్యాలి కనుక తప్పకుండా రమ్మని వాళ్ళను ఆహ్వానించింది అమ్మమ్మ. వాళ్ళు కూడా తప్పకుండా వస్తామని చెప్పి వెళ్ళారు.
మర్నాడు సాయంత్రం అందరూ కొత్త బట్టలు కట్టుకున్నాక, మళ్ళీ ఆడపిల్లలిద్దరికీ పూల జడలు వేసింది అమ్మమ్మ. అందరూ వచ్చాక నానికి బొట్టు పెట్టి, హారతి ఇచ్చి, అందరికీ అక్షతలు ఇచ్చి దీవించమని చెప్పింది నాగ. తరువాత అందరికీ తాంబూలం ఇచ్చింది.
అందరూ వెళ్ళిపోయాక గిరిజ తోటకూర కాడలా వేలాడిపోసాగింది. “ఇదేమిటే నాగేంద్రుడూ! పిల్ల ఇలా నీరసపడిపోయిందీ…” అంటూ మనవరాలి‌ నుదుటిపై చెయ్యి వేసి చూసి “ఒళ్ళు కాలుతోందే! జ్వరం వచ్చినట్లుంది. దిష్టి గానీ కొట్టిందో ఏమిటో” అంటూ కుంపటి రాజేసి, ఉప్పు, ఎండు మిరపకాయలు దిగదుడిచి కుంపట్లో పడేసింది.
అయినా మనసాగక, వీధి తలుపు దగ్గరకెళ్ళి, రోడ్డు మీద వెళుతున్న వాళ్ళతో పదడుగుల అవతల ఇంటిలో ఉంటున్న ఆచారి గారిని వెంటనే రమ్మని కబురు చేసింది.
ఆయన రాగానే గిరిజను చూసి “మరేం పరవాలేదు. ఈ గుళికలు మూడు రోజులు వేయండి. రేపటికల్లా జ్వరం తగ్గిపోతుంది. నేను మళ్ళీ రేపు వచ్చి చూస్తాను” అని చెప్పి వెళ్ళారు.
ఆయన చెప్పినట్లే మర్నాడు సాయంత్రానికి జ్వరం తగ్గింది గిరిజకి. ఆ రాత్రి భోజనం చేస్తూ “రేపు నేను బయలుదేరతాను. మీరు నాగను, పిల్లలను ఎప్పుడు తీసికెళ్ళమంటే అప్పుడు మళ్ళీ వస్తాను” అన్నాడు అల్లుడు.
“అదేంటి బాబూ! నువ్వు కూడా ఉంటే పొన్నూరు, గుంటూరు, విజయవాడ మొదలైన ఊర్లలో ఉన్న బంధువుల ఇళ్ళకు తీసుకెళ్ళాలనుకున్నాను” అంది అమ్మమ్మ బాధగా.
“నేను వీళ్ళను తీసుకెళ్ళడానికి‌ వచ్చినపుడు వాళ్ళ ఇళ్ళకు వెళ్దామండీ. ఈలోగా మీరు చూడాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను చూసేయండి” అన్నాడు పెద బాబు.

****** సశేషం ******

1 thought on “అమ్మమ్మ – 24

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *