June 25, 2024

“ఇంటర్నేషనల్ కల”

రచన: కవిత బేతి

“అమ్మూ! పడుకుందాం రా” భోజనం టేబుల్ మీద పెట్టేసి, హాల్లో ఆడుకుంటున్న కూతురిని బెడ్రూములోకి లాక్కెళ్ళింది శివాని.
అక్కడే కూర్చొని లాప్టాపులో చేస్తున్న పని ఆపి, ఓసారి నిట్టూర్చి, రెండుచేతులు తలపైన పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు రవి.
రవి ఆర్కిటెక్ట్. శివాని మేనమామ కూతురే. చిన్నప్పటినుండి కాదుగాని, ఇంటర్, డిగ్రీలలో ఉన్నప్పుడు మనసులు కలిసాయి. ఇరువైపులా అంగీకారంతో ఆనందంగా పెళ్లి జరిగిపోయింది. పచ్చని పల్లెటూరంత స్వచ్ఛమైన ప్రేమ శివానిది. ఒకరంటే ఒకరికి ప్రాణం.
కొన్నేళ్లు జాబ్ చేసిన అనుభవంతో స్వంతంగా ఆఫీస్ పెట్టుకున్నాక, ఊర్లో అమ్మానాన్నతోనుండే ఆమనిని, శివానిని సంవత్సరం క్రితమే సిటీకి తీసుకొచ్చాడు. పెళ్ళైనప్పటినుండీ దూరంగా వుంటున్నామనే చింతకూడా తీరిపోయి ఆనందంగా ఉంటున్నారు. సిటీలో, అందునా, ఇంత హైసొసైటీలో ఉండటం శివానికి కలలాగుంది.
కాలనీలోని స్కూల్లో చదివే కూతుర్ని ఇంటర్నేషనల్ స్కూల్లోకి మార్చుదామనే శివాని మొండిపట్టు తెచ్చిపెట్టిందీ గొడవ. అడిగీ, అలిగీ, వాదించి చివరకు మౌనపోరాటం ప్రకటించింది. అన్ని పనులు చేస్తుంది, కానీ మాట్లాడదు, పక్కన కూర్చోదు, కలిసి తినదు.
ఒక నిర్ణయానికొచ్చినట్టుగా లేచి లోపలికెళ్ళి “శివీ, ఇళ్లైనా, జీవితమైనా, నాపనైనా, అలోచించి అందంగా తీర్చిదిద్దుకోవటం నాకిష్టం. అయిష్టంగానే నీ ఇష్టానికి ఒప్పుకుంటున్నాను. కానీ ఒక్కమాట, అంతా నీదే బాధ్యత. డబ్బులెంత, ఎక్కడ సంతకం పెట్టాలి, ఎప్పుడు నేను రావాలి లాంటివి మాత్రం చెప్పు. ఓకే?” అన్నాడు.
ఎగిరి గంతేసి ముద్దుపెట్టుకోవాలనిపించినా, “నిజంగానా? థాంక్స్”, అని మాత్రం అన్నది. రోజూ నడిచి ఆమనిని స్కూలుకి తీసుకెళ్తుంటే, గేటు దగ్గర ఇంటర్నేషనల్ స్కూల్ ఏసీ బస్సుల్లో పిల్లలకి టాటా చెపుతూ కనిపిస్తూంటారు మిగిలిన అమ్మలందరూ. చూస్తే ఎక్కడ పలకరిస్తారో అని తల దించుకుని గబగబా వెళ్లిపోయేది. ఇక ఆ బాధ ఉండదు. తను కూడా ఆమనికి టాటా చెప్తుండడం ఊహించుకుంటూ, పక్క బ్లాకులో ఉండే లీనాకి ఫోన్ చేసింది.
“హలో, లీనా… ఒప్పుకున్నారు, సారి.. పడుకున్నారా, డిస్టర్బు చేసానా?”
“ఓహ్! శివి వావ్! నిజంగానా… గుడ్ న్యూస్”
“ఔను.. కానీ, అంతా నన్నే చూసుకోమన్నారు, నువ్వే సాయం చేయాలి”
“గుడ్! కో-ఆర్డినేటరుతో మాట్లాడి అప్పాయింట్మెంట్ తీసుకుంటాను. కంగ్రాట్యులేషన్స్, స్వీట్ డ్రీమ్స్, బాయ్”
శివానికి సంతోషంతో నిద్ర పట్టలేదు. ఇంగ్లీషు కలలుకంటూ రాత్రంతా గడిపింది.
అన్నట్టుగానే లీనా, తన కొడుకు చదివే స్కూల్ లో మాట్లాడి అప్పాయింట్మెంట్ ఫిక్స్ చేసింది. ఉదయం పదిన్నరకి చక్కగా తయారయ్యి, ఆమనిని తీసుకొని, లీనా చెప్పిన జాగ్రత్తలన్నీ ఒకటికి నాలుగుసార్లు గుర్తుచేసుకుంటూ స్కూల్ చేరుకుంది. ఒక నిమిషం “స్కూలా ఇది? బావ తీసుకెళ్లిన ఫైవు స్టార్ హోటల్లాగుంది” అనుకుంది.
ఆమనితో పదోసారి “అల్లరి చేయొద్దు, ఏడవొద్దు, ఎత్తుకోమనొద్దు, మమ్మీ అనాలి, సరేనా” లాంటివి చెప్పింది.
గంట వెయిట్ చేసిన తర్వాత, మోహిని అనే అమ్మాయి వచ్చింది. స్కూల్ గురించి చాలా బాగా చెప్పింది. అమెరికాలో పదేళ్ళున్న ఒక భారతీయ భార్యాభర్తల జంట, అక్కడెంత బాగా సంపాదిస్తున్నా, భారతదేశంమీదా తెలుగురాష్ట్రం మీదా ప్రేమతో, ఇక్కడికొచ్చేసి అక్కడి స్టాండర్డ్సుతో, ఇక్కడీ స్కూల్ ఎలా మొదలుపెట్టారో, అన్నీ ఇంటర్నేషనల్ లెవెల్లోనే ఎలా తీర్చిదిద్దారో వివరించింది
లిప్‌స్టిక్ పెట్టిన పెదాలను, మేకప్ వేసి తీర్చిదిద్దినట్టున్న మోహిని మోహనరూపాన్ని చూసి “అబ్బా! మోహించేసేలా వుంది” అనుకుంది శివాని. “ఈ అమ్మాయి రోజూ ఇలాగే తయారయ్యి వస్తుందా”? అని అనుమానం కూడా వచ్చింది.
మోహిని కాసేపు ఇంగ్లీషులో మాట్లాడి, లీనా చెప్పినందువల్ల శివాని కంఫర్ట్ కోసం తెలుగులోకి మారింది. లేకపోతే అస్సలు తెలుగు మాట్లాడరట. ఆయాలతో సహా ఇంగ్లీషేనట. అమెరికా స్టాండర్డ్స్ కదా.
“పదండి మామ్, స్కూల్ చూపిస్తాను. ఈ ఫోల్డర్ తీసుకోండి, ఇందులో బ్రోషర్, అప్లికేషన్, మిగితా వివరాలున్నాయ్.”
“థాంక్యూ, ఓకే” కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడమందిగా లీనా.
మోహిని షర్టు, స్కర్టు, షూసు, పాలరాతి శిల్పంలాంటి కాళ్ళు చూస్తూ వెనకాలే, ఆమని వేలు పట్టుకొని నడిచింది.
“ఇవి క్లాసురూమ్స్ మామ్, నర్సరీ, ప్రైమరీ ఈ బ్లాక్ లోనే. ఇవన్నీ పిల్లలు ఆడుకునేవి. అక్షరాల దగ్గరి నుండి పదాలు, మాటలు అన్నీ బొమ్మల సాయంతోనే ఆటాపాటలతోనే నేర్పిస్తారు”
“టీచర్స్ అందరు అమెరికన్ టీచింగ్ స్టాండర్డ్స్ ప్రకారంగా ట్రైనయిన వారే మామ్”
“ఇటురండి మామ్, ఈ బొమ్మలన్నీ అమెరికానుండి తెప్పించినవే”
“అటురండి మామ్, అది పిల్లల ప్లే ఏరియా”
అటూ ఇటూ ఓ గంట అన్ని రూముల్లోకి తిప్పి, పెద్ద హాల్లోకి తీసుకెళ్లింది. దాన్నిండా బంతులు, ట్రైన్, ఏరోప్లేను, రకరకాల జంతువులు లాంటి, పిల్లలు దూరేంత రంగురంగుల పెద్ద ఆటవస్తవులున్నాయి. ఇలాంటివి మాల్సులో, రిసార్టులో రవితో వెళ్లి నప్పుడు చూసినవే.
“అన్నిటిచుట్టూ గొలుసులుంటాయి మామ్, పిల్లలు ఎప్పుడు బడితే అప్పుడు ఆడుకోవటానికి వీలు లేదు. టైంటేబిల్ ప్రకారం టీచర్ తీసుకొచ్చి ఆడిపించి బెల్ కొట్టగానే తీసుకువెళ్లిపోతుంది. అన్నీ టైం ప్రకారమే మామ్. మా స్కూల్లో రూల్స్ స్ట్రిక్టుగా పాటిస్తాం. పిల్లలకి ఇప్పటినుండే అన్నీ రూల్స్ నేర్పిస్తాము”.
“వాటర్ కావాలా మామ్? ఇక్కడంతా మినరల్ వాటరే” మోహిని వాటర్ కూలర్ దగ్గర నీళ్లు తాగడానికి ఆగింది.
“నో, ఓకే” జవాబిచ్చి, చుట్టూ పరికించింది శివాని. జీవితం ఊర్లో ఆనందంగానే గడిచినా, సినిమాల్లో చూసి చూసి, సిటీలైఫ్ అద్భుతమైన కలలా ఊహించుకునేది. ప్రేమ, పెళ్లి అత్తవాళ్ళింట్లో ఆప్యాయతలు, బావ వస్తూపోతూ ఇన్స్టాల్మెంట్ కాపురం, అన్నీ బానేవున్నా ‘ఎప్పటికైనా సిటికెళ్తాను’ అనే ఆశ ఉండేది. ఆమని రాకతో అందమైన జీవితం ఇంకా అద్భుతంగా అనిపిస్తూంటే, సిటీకి షిఫ్టవ్వడం రెక్కలొచ్చినట్టైంది.
డిగ్రీవరకు తెలుగు మీడియంలో ఫస్టుమార్కులతొ చదివింది. తెలివైనదైనా ఇంగ్లీష్ మాట్లాడలేకపోవటం లోపంలా తొలుస్తుండడంతో లీనా, ఇంకో ఒకరిద్దరితో తప్ప ఎవరితోనూ కలవదు. తనలాకాక కూతురు ఇంగ్లీషులో గలగలా మాట్లాడాలనే కోరిక, ఇంటర్నేషనల్ స్కూల్లో వేయాలనే కలగా మారి, బావ ఒప్పుకోకపోవడంతో పట్టుదలయ్యింది.
“హమ్మయ్యా! నెల వేధించాడు కానీ, ఓకే అన్నాడు” అనుకుంటూ ఆమనికి, ‘మెడకి తగిలించిన వాటర్ బాటిల్లో నీళ్లు తాగు’, అని సైగ చేసింది.
“హే, నో, స్టాప్”
ఇటువైపు నుండి మోహిని, అటువైపు నుండి ఇంకో జగన్మోహిని ఒక్కసారే అరిచారు, ఆమని వయసున్న ఒక బాబు చైన్ కిందనుండి దూరి బంతుల దగ్గరికి పరిగెత్తాడం చూసి. తమలాగే స్కూల్ చూడటానికి వచ్చిన వాళ్ళమ్మ చాలా అవమానంగా ఫీలయ్యినట్టు ఆమె మొఖమే చెపుతుంది. వాడిని గిల్లినట్టుంది, వాడేడుపందుకున్నాడు. వాళ్ళమ్మ ఇటునవ్వుతూ, అటువాన్ని బెదిరిస్తూ, బుజ్జగిస్తున్నట్టు తంటాలు పడుతుంది. నాన్న కారక్టరు “ఛీ! మీరిద్దరింతే, ఎక్కడికెళ్లినా నా పరువు తీస్తార”న్నట్టుగా విసుక్కున్నాడు.
మోహినీ ద్వయం ఇబ్బందికరమైన ఆ వాతావరణాన్ని తమ చిరునవ్వుతో భస్మం చేసి, చెరో దిక్కు నడిచారు.
“కం మామ్, ఐ విల్ టేక్ యు టు ది గ్రౌండ్” మోహిని అవతారన్ననుసరించింది శివాని.
బయటకెళ్ళేముందు మెడికల్ రూమూ, లైబ్రరీ, టాయిలెట్సు చూపించి, నీటుగా పెట్టడమెంత ఖర్చుతో కూడుకున్నపనో చెప్పి, “మీరిచ్చిన డబ్బులు మేమెంత సద్వినియోగం చేస్తున్నామో చూడండి మీ పిల్ల ఆరోగ్యం కోసమ”న్నట్టుగా హావభావాలు వెలిబుచ్చింది.
స్కూలంతా ఉన్న సీసీ కెమెరాలు చూపించింది. లాగిన్ అయిడీ ఇస్తారట. ఇక్కడికి పంపించి, అక్కడ ఇంట్లో కూర్చొని, ఇక్కడ పిల్లెం జేస్తుందో చూడొచ్చట.
‘విషయం వివరించిన తరవాత గ్యాప్ ఉందన్నప్పుడు మోహిని నవ్వుతుంది’ అని గమనించిన శివాని, అది మిస్సవ్వకుండా చూస్తుంది.
ఏసీ బిల్డింగునుండి బయటకి రాగానే ఒక్కసారి వేడిగాలి మొహాన్నిక్కొట్టింది.
“వెరీ హాట్” అన్నది శివాని, ‘ఆమని తలకి కాప్ తెచ్చి ఉండాల్సింది’ అనుకుంటూ.
చాలా పెద్ద గ్రౌండ్.
ఒక్క చెట్టు కూడా లేదు. అన్నిపక్కలా అందమైన చిన్న చిన్న పూలమొక్కలే, “నన్ను తాకకు, ముట్టకు, తెంపకు, దగ్గరికిరాకు, కంచె దాటకు” అనే ఇంగ్లీష్ బోర్డుల మధ్య.
“చెట్లుంటే ఆకులు రాల్తాయి. చెత్తవుతుంది, ఊడవటానికీ, శుభ్రపరచటానికీ, ఆయాలకీ, మైంటెనెన్సుకీ ఎక్కువ ఖర్చవుతుంది. ఆ భారం మీరే మోయాలి కాబట్టి, చెట్లు లేకపోవటం మీకే మంచిద”న్నట్టుగా వివరించింది.
“హాయ్ బేబీ!” అంటూ మధ్యమధ్యలో ఆమనిని పలకరిస్తుంది.
గంటనుకున్నది కాస్తా మూడు గంటలవ్వడంతో, చిన్నడబ్బాలో పెట్టుకొచ్చిన ద్రాక్షపళ్ళు పిల్లకి తినిపించటానికి వీలవుతుందేమోనని అవకాశం కోసం చూస్తూ, “కాన్ వీ గో?” అనడిగింది శివాని.
ఇంగ్లీష్ వచ్చినా, వేరేవాళ్లు మాట్లాడేది బాగానే అర్థమైనా, తిరిగి మాట్లాడటానికి జంకు. మాట్లాడుతూంటేనే వస్తుందని, రవి మాట్లాడిస్తూంటాడు అప్పుడప్పుడు. ‘ఎప్పటికి మాట్లాడతానో ఏంటో, ఆశలన్నీ పిల్లమీదే పెట్టుకున్నా’ననుకుంది. పిల్లిక్కడ జాయినయితే తనకే వొచ్చేసినట్టుగా.
“నో మామ్. ఐ విల్ షో యూ ది పూల్. వెనకాల ఉంది, మీరు అటు గేట్ నుండి వెళ్లిపోవచ్చు”
“వేర్?” పిల్లనెత్తుకోవాలన్న ఆలోచనని బలవంతంగా పక్కకు నెట్టింది
“జస్ట్ రెండునిమిషాలు, గ్రౌండుదాటి అటు నడవాలి”
గ్రౌండు చుట్టూ నడిచారు
“హియర్ ఇట్ ఈస్”
చాలా పెద్ద అందమైన స్విమ్మింగ్ పూల్. చుట్టూ కంచె ఉంది.
“వెరీ బ్యూటిఫుల్”
“ఎస్ మామ్, ఇంటర్నేషనల్ అర్చిటెక్ట్ ఒకాయన, సర్ ఫ్రెండే, డిజైన్ చేసారు, శుభ్రంగా పిల్లలకు ఇన్ఫెక్షన్ రాకుండా విదేశాల టెక్నిక్కుతో చాలా ఖర్చుపెడుతున్నారు. మీ పిల్లల ఆరోగ్యం కోసమే” అన్నట్టుగా చెప్పింది. నవ్వింది.
కాళ్ళునెప్పి, ఆకలి. ఇంక వెళ్లిపోవాలనిపిస్తుండగా చూసింది శివాని.
పూల్ చుట్టూ “డోంట్ ఎంటర్ ది పూల్”, “ప్రమాదం”, “నీళ్ల దగ్గరికి రాకూడదు”, “ప్రమాదం”, “కంచె దాటకూడదు”, “ప్రమాదం”, “మునిగిపోయే ప్రమాదముంది” “ప్రమాదం” అని, ఒకపిల్ల నీళ్లలో పడిపోయి రక్షించమనేడుస్తునట్టు, చాలా బోర్డులున్నాయి.
ఎండకి నీళ్లు తళతళా మెరుస్తున్నాయి. ఇక్కడా అంతేనట. చెట్లుంటే ఆకులు పడతాయట, పూల్ పాడౌతుందట. పూల్ మైంటైన్ చేయడం ఎంతో ఖర్చుతో కూడుకున్న పనట. అందరికోసం ప్రత్యేకంగా కోచ్ ఉంటారట. స్విమ్మింగు, స్కెటింగు, కరాటే గట్రాలాంటివి నేర్పించడానికి ఎంత శ్రద్ధ తీసుకుంటారో, వాటికెంత కట్టాలో వివరించింది. త్వరలోనే గుర్రపు స్వారీ మొదలుపెడతారట. కొంచెమెక్కువ నవ్వింది.
అన్నీ అయిపోయినై అనిపించాక, ‘ఇందాక ఇచ్చిన అప్లికేషన్ రెండువేల’ని చెపుతూండగానే కాస్త దూరంలో గేటు దగ్గర గొడవ వినిపించింది.
పెద్ద లారీలో థర్మాకోలుతో చేసిన నాలుగు వృక్షాలు, పైన రంగురంగుల పిట్టలతో, పూలతో, అందంగా ఉన్నాయి. “సేవ్ ట్రీస్” అని రాసిన బ్యానర్లు దించుతున్నారు.
“వెయిట్ మామ్, ఐ విల్ సీ” అంటూ వెళ్లి, అయిదు నిమిషాలకొచ్చి చెప్పింది.
“అడ్మిషన్స్ టైం కదా మామ్, చాలా పేరెంట్స్ వస్తారు కదా మామ్, మా స్టాండర్డ్స్ తెలియడానికి స్కూలంతా అలంకరిస్తున్నాము. బొమ్మచెట్లు తేవడానికి గేటు బయటున్న అసలు చెట్ల కొమ్మలు అడ్డొస్తున్నాయి. అక్కడే దించేస్తానంటాడు లారీవాడు. లోపలికి తెచ్చే బాధ్యత లారివాడిదేనంటాడు మేనేజర్. అరంగంటనుండి టైంవెస్ట్ చేసాడంట మామ్, డబ్బుల్లాగడానికే అంతా. సాల్వ్ అయిందిలెండి, మా మేనేజర్ ఇంటెలిజెంట్. మానేజ్మెంటుతో మాట్లాడి గార్డెనింగ్ స్టాఫుని పిలిచారు. వాళ్ళు కట్టర్లు తెచ్చి చెట్లు నరకడమో, కొమ్మలు కొట్టేయడమో చేస్తారు. లారీ లోపలికొచ్చేస్తుంది, మీరు పక్కనుండి వెళ్లొచ్చు”
“హా మామ్! ఫీజు డీటెయిల్సన్నీ ఫైల్లో ఉన్నాయి”
ఔను, విడివిడిగా వేశారు, కలిపి అయిదులక్షలన్నది ఎక్కడా లేదు, అప్పుడే లెక్కకట్టుకుంది తను.
“ఓకే మామ్?” తీయని ప్రశ్నార్థకమేసి, ఆమనిని తడుతూ “హే, స్వీటీ” అన్నది.
“మీరు డబ్బులు పట్టుకురావడమే తరువాయి, మీ పిల్ల మా చేతుల్లో మహా గొప్పగా పెరుగుతుంది” అనేలాంటి మాటలు చెప్పి, రెండువేలియ్యమంటూ రిసీప్ట్ బుక్కు తీసింది.
శివాని ఆమని మెడలోంచి బాటిల్ తీసుకొని నీళ్లన్నీ తాగేసింది.
“థాంక్యూ, సో మచ్, బాయ్” అంటూ ఫోల్డర్ మోహిని చేతులో పెట్టేసింది.
పిల్లనెత్తుకుంది. అప్పటివరకున్న నోటికట్టు విప్పినట్టుగా మాట్లాడుతూ బయటకి నడిచింది.
“కాలు నెప్పెసిందా బంగారం”
“ఆకలేస్తుందామ్మా”
“ద్రాక్ష తిందామా”
“మనూరి చెరువులో ఈత నేర్చుకున్నావు కదా”
“చిన్నాన్న నీళ్ళల్లోకి తోస్తూంటాడు కదా”
“చింతచెట్టుకి ఉయ్యాల కట్టి జోరుగా ఊపుతాడు కదా”
“నాన్న ప్రాజెక్టయ్యాక ఊరెళదామా మనం”
గేటు దాటుతుండగా శివాని “ఇంటర్నేషనల్ కల” లారీలోని చెట్టెక్కేసింది.

***************

2 thoughts on ““ఇంటర్నేషనల్ కల”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *